
విశ్లేషణ
మొన్న మే 4న కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దేశంలో మొదటి సారిగా జీనోమ్ ఎడిట్ చేసిన రెండు కొత్త వరి రకాలను విడుదల చేశారు: డీఆర్‌ఆర్ రైస్ 100 (కమల), పూసా డీఎస్‌టీ రైస్ 1. కమల రకాన్ని సాంబా మహసూరి (బీపీటీ 5204) ఆధారంగా ఐసీఏఆర్–ఐఐఆర్‌ఆర్ హైదరా బాద్ అభివృద్ధి చేసింది.
రెండవ రకం– పూసాను ఎంటీయూ 1010 ఆధారంగా ఐసీఏఆర్–ఐఏఆర్‌ఐ న్యూఢిల్లీ అభివృద్ధి చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో వీటి వల్ల ఈ ప్రయోజనాలు ఉన్నాయి: దిగుబడిలో 19 శాతం పెరుగుదల. గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలలో 20 శాతం తగ్గింపు. 7,500 మిలియన్ క్యూబిక్ మీటర్ల సాగునీరు ఆదా. కరువు, లవణీయత, వాతావరణ ఒత్తిళ్లను మెరుగ్గా తట్టుకోగలగడం.
ఈ ప్రకటన ప్రకారం, ఈ రకాలు పంట కాలాన్ని 20 రోజులు తగ్గిస్తాయి. తద్వారా కర్బన ఉద్గారాలను, నీటి వినియోగాన్ని తగ్గిస్తాయి. అయితే, మొత్తం సమాచారం బయటపెట్టలేదు. వీటి విడుదల ఆహారానికి, ఆహార భద్రతకు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించినది కాబట్టి తెలుసుకోవడం, ప్రతిస్పందించడం ప్రజల హక్కు.
ఇతర దిగుబడి సమస్యలో?
దాదాపు 50 ఏండ్ల క్రితం అధిక దిగుబడి వంగడాల పేరిట హైబ్రిడ్ రకాలను విడుదల చేయడం వల్ల కొనసాగుతున్న అనర్థాలు అనేకం. ఈ రెండు వరి రకాలు వాతావరణ మార్పులను తట్టుకునేవి అనుకుందాం (ఇది ఒక సందేహాస్పద వాదనగానే కనిపిస్తుంది). మరి దిగుబడి ఎట్లా పెరుగుతుంది? వరి దిగుబడిపై ప్రభావం చూపే కారణాలలో విత్తనాలతో సహ అనేకం ఉన్నాయి– సారవంతమైన నేల, సరైన పోషకాలు, నీరు, పొలంలో ఇతర జీవాల పాత్ర, వగైరా.
తీవ్ర వాతావరణ మార్పుల వల్ల పంటలకు ఉపయోగపడే ఇతర రకాల జీవులు కూడా ఒత్తిడికి గురవుతున్నాయి. వాటిలో మట్టిలో ఉండే సూక్ష్మజీవులు కూడా ఉన్నాయి. తెగుళ్లు కూడా ఉన్నాయి. కేవలం వరి ధాన్యానికి వాతావరణ మార్పు ఒత్తిడిని తట్టుకునే శక్తిని అభివృద్ధి చేసుకుంటే సరిపోతుందా? దిగుబడిని ప్రభావితం చేసే ఇతర అంశాలు కూడా ఆ విధమైన శక్తిని సంపాదించకుంటే, వరి దిగుబడి స్థిరంగా ఉంటుందా? వరి జన్యువులో ఒకటి మార్చినంత మాత్రాన దిగుబడి పెరగదు.
ప్రధానంగా, భారతదేశంలో వరి దిగుబడి సమస్య చాలా కాలంగా అనేక రూపాలలో కనిపిస్తున్నది. నిరంతరం ఒకే పంట వేయడం వల్ల, అధిక నీరు ఇవ్వడం నేల సారం పూర్తిగా పడిపోయింది. కృత్రిమ, రసాయన ఎరువులు వేయనిదే పంట రావడం లేదు. ఈ రకమైన దిగుబడి సమస్య మీద పరిశోధన చేయకుండా ఇంకేదో చేయడం సరి కాదు.
వాస్తవానికి, ప్రభుత్వ సమాచారం ప్రకారమే 2025 ఏప్రిల్ 1 నాటికి వరి నిల్వలు రికార్డు స్థాయిలో 63.09 మిలియన్ టన్నులు ఉన్నాయి. ప్రభుత్వ లక్ష్యం కంటే 13.6 మిలియన్ టన్నులు అధికం. మరింత దిగుబడి పెరిగితే రైతుకు గిట్టుబాటు కాదు. ప్రభుత్వం కొనదు! మరి ఈ రెండు కొత్త వరి విత్తన రకాల ద్వారా శాస్త్రవేత్తలు ఏ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించారు? సరళంగా చెప్పాలంటే, శాస్త్రవేత్తల అవగాహన రైతుల సమస్యలకు భిన్నంగా ఉంటున్నది.
రైతులు తక్కువ దిగుబడి గురించి ఫిర్యాదు చేయడం లేదు. అధిక సాగు ఖర్చులు, గిట్టుబాటు లేని ధరల గురించి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ తాజా వరి రకాల విడు దలలో భారతీయ రైతులకు ఏమి అవసరమో అది కాకుండా, కంపెనీ లకు ఉపయోగపడే శాస్త్రీయ పరిశోధన పేరుతో కొత్త రకాలను నెత్తిన రుద్దుతున్న వైనం కనబడుతోంది.
‘శుద్ధి’ చేయడం సాధ్యమా?
ఈ వరి రకాలు ఒక కొత్త సాంకేతిక విప్లవం అని ఢంకా బజాయిస్తున్నారు. గింజలను అధికంగా ఉత్పత్తి చేసే జన్యువు పని సానుకూలం చేశాము అంటున్నారు. పోషకాలు లేదా ఇతర ‘సహాయం’ లేకుండా ఒక జన్యువు అధికంగా గింజలను సాధించగలదా? గాలిలో నుంచి సాధువు భస్మం పుట్టించినట్టు వరి గింజలోని ఒక జన్యువు అధిక దిగుబడి ఇస్తుంది అంటున్నారు. పర్యవసానాలు, దీర్ఘకాలిక పరిణామాల గురించి చెప్పడం లేదు.
ఈ ఆహారం తినే మనుష్యుల మీద, జంతువుల మీద ఎలాంటి ప్రభావాలు ఉంటాయో తెలియదు. విత్తనాల జన్యుక్రమం, సహజ సంపదకు కలిగే దీర్ఘకాలిక పరిణామాల గురించి అసలే తెలియదు. ఈ రకమైన విత్తనాల వల్ల సహజ, మంచి రకం విత్తనాలు కలుషితం అయితే తిరిగి వాటిని ‘శుద్ధి’ చేయడం అసాధ్యం.
పరిశోధనలు, పరిశీలనలు, పరీక్షలను కొన్ని ఏళ్ల పాటు ప్రయోగశాలలో జరపాల్సి ఉండగా, కేంద్రం తొందర పడి ఈ రెండు రకాలను విడుదల చేయడంలో సార్వజనీన సంక్షేమ లక్ష్యం కనపడటం లేదు. విదేశీ ప్రైవేట్ కంపెనీల గుప్పిట్లో ఉన్న ఈ టెక్నాలజీకి ప్రభుత్వమే ముందుండి ప్రోత్సాహం ఇవ్వడం ఆశ్చర్యం కలిగి స్తున్నది. పేరుకే కేంద్ర ప్రభుత్వ సంస్థల పేర్లు ముందట పెడుతున్నా దీని వెనుక విదేశీ, లాభాపేక్ష శక్తులు ఉన్నట్లు అనుమానం కలుగుతోంది.
విత్తనాలు, జన్యు సంపదతో ఆడుకోవడానికి శాస్త్రవేత్తలకు క్రిస్పర్ (సీఆర్‌ఐఎస్‌పీఆర్) ఒక సాధనంగా మారింది. ఈ టెక్నాలజీ ఉపయోగించి ఇంకా 40 పంటల మీద పరిశోధనలు జరుగుతున్నా యని కేంద్రం ప్రకటించింది. వరి జన్యుక్రమంలో జన్యువులను తమ ఇష్టానుసారంగా తొలగించి, శాస్త్రవేత్తలు కోరుకున్న విధంగా ‘స్పంది స్తుందని’ మనకు విశ్వాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.
అధిక దిగుబడి, వాతావరణ ఒత్తిళ్లకు తట్టుకునే శక్తి సామాజిక–ఆర్థిక లక్ష్యాలు. ఇవి ఇప్పుడు ప్రకృతిలో చొప్పించబడ్డాయి. ప్రకృతిపై ఇటువంటి పరిశోధన నిరపాయ కరమైనది కాదు. ఈ పరిశోధన వెనుక ఉన్నతమైన ఆదర్శాలు లేవు. స్వతంత్ర పర్యవేక్షణ లేకుండా ఒక కొత్త ఉత్పత్తిని మార్కెట్లో ప్రవేశపెట్టి వ్యాపారం పెంచుకోవడానికి ప్రభుత్వం మద్దతు ఇవ్వడం ఆక్షేపించదగినది.
భారత ప్రభుత్వం ఈ రకం పరిశోధనలను నియంత్రించాలి, నిషేధించాలి. అంతగా అవసరం అనుకుంటే ప్రయోగశాలలకే పరిమితం చేయాలి. క్రిస్పర్ ఆధారిత జన్యుమార్పిడి పంటల మీద భారత సమాజంలో విస్తృత, బహిరంగ చర్చ జరగాల్సిన అవసరం ఉంది.
దొంతి నరసింహారెడ్డి
వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు