ఒక తీర్పు – ఒక నమ్మకం

Vardelli Murali Article On Ayodhya Verdict - Sakshi

జనతంత్రం

శ్రీరాముడు అనే పౌరాణిక పాత్ర భారతదేశ సాంస్కృతిక వారసత్వ సంపద. హిందూ మతం అంటే ఏమిటో కూడా తెలియని ఈ దేశంలో పుట్టి పెరిగే వందలాది జాతులు, వేలాది తెగల మనుషులకు రాము డంటే తెలుసు. రాముడు దేవుడనీ తెలుసు. యాభయ్యే ళ్లకు పూర్వం మనదేశంలో రామాలయం లేని ఊరు ఉండేదే కాదు. శ్రీరాముడు జీవించిన కాలం త్రేతాయుగ   మని చెబుతాయి మన పురాణాలు. నాటి యుగధర్మానికి విలువలకు రక్షణగా నిలబడినవాడు రాముడు. రాముని ఆదర్శాల్లో కొన్ని ఆ యుగానికి పనికివచ్చేవి మాత్రమే ఉన్నప్పటికీ సర్వకాలాలకూ పనికివచ్చేవి చాలా ఉన్నా యని మన పెద్దల నమ్మకం. ముఖ్యంగా మనిషి నడవ డిక, కుటుంబ సభ్యులతో, ప్రజలతో మెలగవలసిన తీరులో ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని చెబుతారు. శ్రీరామావతారంలో మాయలూ మంత్రాలూ వుండవు. మానవీయ విలువలు మాత్రమే ఉంటాయి. అందువల్ల రాముడు మతచిహ్నం కాదు. ఈ దేశ సాంస్కృతిక చిహ్నం మాత్రమే. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని తెగల ఉమ్మడి ఆస్తి శ్రీరామచంద్రుడు. రామాయణం ఏ కొంచెం తెలిసినవాడైనా రాముడు పుట్టింది అయోధ్య లోనే అనుకుంటాడు. మన వూళ్లో రామాలయం ఉండగా లేనిది ఆయన పుట్టిన ఊళ్లో ఉంటే తప్పేమిటి అనుకుం టాడు. ఇలా అనుకునే వాళ్లలో అన్ని జీవన ప్రవాహాలకు చెందిన వాళ్లుంటారు. ఒకరకంగా ఇది భారతీయుల సమష్టి ఇచ్ఛ. ఆ ఇచ్ఛ రామజన్మభూమి–బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులో ప్రతి ఫలించింది. తీర్పును శిరసావహించిన ముస్లిం మత పెద్దలు ఆదర్శనీయులు.

ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్టుగా భారతీయులు ఈ తీర్పును స్వాగతించారు. వందల ఏళ్ల వివాదానికి ముగింపు పలుకుతూ ఐదుగురు న్యాయమూర్తుల ధర్మా సనం ఏకగ్రీవంగా వెలువరించిన తీర్పుపై అనూ హ్యంగా దేశ ప్రజల్లో వెల్లడైన దాదాపు ఏకగ్రీవ స్పందన పెరిగిన మన సామాజిక పరిణతికి నిదర్శనం. మత విశ్వాసాలనూ, నమ్మకాలనూ, భావోద్వేగాలనూ గౌర విస్తూ, వాటి జోలికి వెళ్లకుండా, న్యాయపరమైన అంశాలు, సాక్ష్యాలు–ఆధారాలు ప్రాతిపదికన వాదోప వాదాలను బేరీజు వేసి ఎటువంటి గుంజాటన లేకుండా సర్వోన్నత  న్యాయస్థానం స్పష్టమైన తీర్పును ఇచ్చింది. మతాల మధ్య విషాన్ని చిమ్మి, మనుషుల మధ్య కల తలు రేపి, చరిత్రలో ఒక నెత్తుటి అధ్యాయాన్ని డిక్టేట్‌ చేసిన వివాదానికి ఈ తీర్పుతో ఎట్టకేలకు తెరపడిందని భావించవచ్చు. వివాదాస్పదమైన 2.77 ఎకరాల స్థలాన్ని న్యాయస్థానం ‘రాముడి’కే అప్పగించింది. మసీదు నిర్మాణంకోసం 5 ఎకరాల విలువైన భూమిని ఈ కేసులో ప్రధాన కక్షిదారైన సున్నీ వక్ఫ్‌బోర్డుకు కేటాయించాలని కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశిం చింది. మూడు మాసాల్లోగా ఒక ట్రస్టును ఏర్పాటుచేసి ఆలయ నిర్మాణ పనులను అప్పగించాలని కేంద్రానికి సూచించింది. ఈ తీర్పుపై ఎక్కడా పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అందుకు రెండు కారణాలు ఉండవచ్చు. ఒకటి–అప్పటితో పోలిస్తే విద్వేషాలు బాగా తగ్గాయి. రెండు– ఈ వివాదం దీర్ఘకాలం సాగడం మంచిది కాదన్న అభిప్రాయం అందరిలో ఏర్పడటం. ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్‌ ఒవైసీతోపాటు సీపీఎం మాత్రమే తీర్పును వ్యతిరేకించింది. ప్రధాన రాజకీయ పక్షాలన్నీ స్వాగతించాయి. ప్రధాన కక్షిదారులైన సున్నీ వక్ఫ్‌ బోర్డు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ రివ్యూ పిటీషన్‌ వేయకూడదని నిర్ణయం తీసుకుని, తన హుందాతనాన్ని చాటుకున్నది.

బాబ్రీ మసీదు ప్రాంగణంలోని రామ్‌ చబూత్రలో రామమందిరం నిర్మించుకోవడానికి అనుమతి కోరుతూ 1885వ సంవత్సరంలో మహంత్‌ రఘువరదాస్‌ ఫైజాబాద్‌ జిల్లా కోర్టులో ఒక వ్యాజ్యం వేశాడు. అప్పుడు మొదలైన న్యాయపోరాటం 134 ఏళ్లుగా అనేక మలుపులు తిరుగుతూ నేటి సుప్రీంకోర్టు తీర్పుతో న్యాయపరంగానే ముగింపు దశకు చేరుకోవడం విశేషం. కోర్టు వెలుపల పరిష్కరించుకోవాలని రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలోనే కొన్ని ప్రయత్నాలు కూడా జరిగాయి. అప్పట్లో బాబ్రీ మసీద్‌ ఉద్యమ సమ న్వయ సంఘం(బీఎంఎంసీ) కన్వీనర్‌గా వున్న సయ్యద్‌ షహాబుద్దీన్‌ రాజీవ్‌గాంధీకి ఒక లేఖ రాశారు. రామ్‌ చబూత్ర ప్రాంతంలో రామమందిరం నిర్మించుకోవ చ్చనీ, బాబ్రీ మసీదు వున్న ప్రాంతాన్ని కేంద్రం అధీనం లోకి తీసుకొని రెంటి మధ్యన ఒక అడ్డు గోడ నిర్మిం చాలని, బాబ్రీ మసీదును చారిత్రక ప్రాధాన్యం వున్న కట్టడంగా గుర్తించాలని కోరారు. అదే సమయంలో బీజేపీ అగ్రనాయకుడు అటల్‌ బిహారీ వాజ్‌పేయి, బాబ్రీ మసీదు, రామమందిరం పక్కపక్కనే ఉండేలా మరో రక మైన అభిప్రాయాన్ని ప్రకటించారు. ముస్లింలు వివా దాస్పద స్థలాన్ని సౌహార్దతా సూచకంగా హిందువు లకు అప్పగించాలి. హిందువులు మసీదును అలాగే వుంచి పక్కనే రామమందిరాన్ని నిర్మించుకోవాలి. ఈ రెండు అభిప్రాయాల్లోనూ మందిరం, మసీదు పక్క పక్కనే ఉంటాయి. ప్రభుత్వం ఆ సమయంలో కొంత క్రియాశీల కంగా వ్యవహరించి వుంటే కోర్టు బయటే ఈ వివాదంపై ఒక అంగీకారం కుదిరి ఉండేదేమో. కానీ, ప్రభుత్వం చూపిన అలక్ష్యం వల్ల తరువాతి కాలంలో దేశం భారీ మూల్యాన్ని చెల్లించుకోవలసి వచ్చింది.

1986లో బాబ్రీ మసీదు తలుపులు తెరిచి హిందు వులు పూజలు చేసుకోవచ్చని ఫైజాబాద్‌ జిల్లా మేజి స్ట్రేట్‌ అనుమతులిచ్చారు. అదే సమయంలో, ఈ అంశం పార్టీ బలోపేతానికి ఉపకరించేదిగా బీజేపీ భావించి వ్యూహారచన సిద్ధం చేసింది. ముస్లిం వర్గాలు సైతం పోటీగా ఒక కార్యాచరణ కమిటీని ఏర్పాటు చేసుకు న్నాయి. 89 ఎన్నికల్లో బీజేపీ బలం గణనీయంగా పెరి గింది. ఆ ఎన్నికల్లో విశ్వనాథ్‌ ప్రతాప్‌ సింగ్‌ నాయక త్వంలో నేషనల్‌ ఫ్రంట్‌ అధికారంలోకి వచ్చి మండల్‌ సిఫార్సులను ఆమోదిస్తూ ఓబీసీలకు రిజర్వేషన్‌ బిల్లును తీసుకొచ్చింది. ఉన్నత వర్గాలకు చెందిన విద్యార్థులూ, యువకులూ ఈ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. సమాజంలో ఏర్పడిన అశాంతి వాతావరణాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ రామ మందిర నినాదాన్ని ఉద్యమ స్థాయికి బీజేపీ తీసుకొని పోయింది. మండల్‌కు విరుగుడుగానే బీజేపీ మందిర్‌ను ప్రయోగించిందని విమర్శలు కొన్ని వచ్చినా, వాస్తవానికి ఢిల్లీ గద్దె లక్ష్యంగానే ‘రామ’ బాణాన్ని బీజేపీ ప్రయోగిం చిందని చెప్పవచ్చు. 1984 ఎన్నికల్లో రెండు సీట్లు గెలి చిన పార్టీ 89లో 85 సీట్లకు, 91లో 120 సీట్లకు ఎగబా కడానికి ఆ బాణమే కారణం. రామమందిర నిర్మాణం కోసం అద్వానీ చేసిన రథయాత్ర కూడా బీజేపీ పునాదు లను విస్తృతం చేసింది. ఎన్నికల ప్రచారం మధ్యలో రాజీవ్‌ గాంధీ దారుణహత్యకు గురికాకుండా వున్నట్ల యితే, బీజేపీ బలం మరింత పెరిగి వుండేది. 1992 డిసెంబర్‌లో జరిగిన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటన, అనంతరం చెలరేగిన హింసా, రక్తపాతం దేశ లౌకిక త్వాన్ని ప్రశ్నార్థకం చేశాయి. ఇప్పుడిప్పుడే ఆ పీడకలల ప్రభావం నుంచి బయటపడి దేశం కోలుకుంటున్న దశలో న్యాయస్థానం ద్వారా సమస్యకు న్యాయపరమైన పరిష్కారం లభించడం ప్రజలకు ఊరట కలిగించే విషయం. మత విశ్వాసాల ప్రాతిపదికన కాకుండా న్యాయపరమైన అంశాల ప్రాతిపదికగానే ఈ తీర్పును ఇస్తున్నట్టు ఐదుగురు న్యాయమూర్తుల బెంచి ప్రకటిం చింది. ఆర్కియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నివేదిక ప్రకారం బాబ్రీ మసీదు నిర్మాణం, అంతకుముందే అక్కడ ఉన్న ఒక నిర్మాణం శిథిలాలపై జరిగింది. అలాగే, వివాదాస్పద స్థలం వెలుపల ప్రాంగణంలో క్రమం తప్ప కుండా పూజలు జరుగుతున్నట్టు హిందువులు సాక్ష్యాలు సమర్పించారు. కానీ, ప్రాంగణం లోపలి భాగం ముస్లింల ఆధీనంలోనే వుందనడానికి తగిన సాక్ష్యాలు సమర్పించ లేకపోయారని ధర్మాసనం అభిప్రాయపడింది.

బాబ్రీమసీదు నిర్మాణం జరిగిన నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలను మూడు దశలుగా న్యాయ స్థానం అభిప్రాయపడినట్టు కనిపిస్తున్నది. 1528లో బాబ్రీ మసీదు నిర్మాణం జరిగినప్పటి నుంచి 1885 వరకు ఒక దశ. రామ్‌ చబూత్రలో పూజలు చేసుకునే అవకాశం కల్పించాలని హిందువులు ఆ సంవత్సరం కోర్టులో వ్యాజ్యం వేశారు. అప్పటినుంచి 1949 వరకు ఒకదశ. బాబ్రీ మసీదులో శ్రీరాముడు, సీతాదేవిల విగ్ర హాలను పెట్టారంటూ కేసు నమోదు చేసి ప్రాంగణానికి ఫైజాబాద్‌ జిల్లా యంత్రాంగం తాళాలు వేయించింది. నాటినుంచి నేటి వరకు ఉద్వేగాలు, ఉద్యమాలు, న్యాయపోరాటాలు తీవ్రమైన మూడవ దశ. అయోధ్య వివాదాస్పద భూమి మొత్తం రాముడికే చెందుతుం దంటూ ఐదుగురు న్యాయమూర్తులూ ఏకగ్రీవంగానే తీర్పునిచ్చారు. ఐదుగురిలో ఒక న్యాయమూర్తి  మరిన్ని ఆధారాలను తీర్పుకు మద్దతుగా నమోదు చేశారు. 1858వ సంవత్సరంలో అవ«ద్‌ ఠాణేదార్‌ శీతల్‌ దూబే ఇచ్చిన నివేదికలో మసీదును మాస్క్‌ జన్మస్థాన్‌ అని పేర్కొనడాన్ని ఒక ఆధారంగా న్యాయమూర్తి పేర్కొ న్నారు. మరో ఆధారం 1878లో సెటిల్‌మెంట్‌ అధికారి కార్నెగీ గీసిన ఫైజాబాద్‌ తాలూకా స్కెచ్‌. ముస్లింలకు మక్కా, యూదులకు జెరూసలేం ఎలాగో హిందువులకు అయోధ్య అలాంటిదని స్కెచ్‌లో కార్నెగి వ్యాఖ్యానిం చాడు. 1528లో జన్మస్థాన్‌లోనే బాబర్‌ మసీదును నిర్మిం చాడని అందులో కార్నెగీ అభిప్రాయపడ్డాడు. ఆర్కియా లాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వాయవ్య అవధ్‌ విభాగం 1889 నాటి నివేదికలో జన్మస్థాన్‌లో అద్భుతమైన ఆలయం వుండేదని, దాని స్తంభాలను కూడా ముస్లింలు తమ నిర్మాణంలో వాడుకున్నారని వుంది.

బాబర్‌ నిర్మించిన మసీదు మూడు గుమ్మటాల అడుగున శ్రీరాముని జన్మస్థలం వుందనేది అక్కడి హిందువుల ప్రగాఢ విశ్వాసం. రామజన్మస్థలం మీదనే మసీదును నిర్మించారని తరతరాలుగా వారి నమ్మిక. ఒకపక్క ఎన్ని వివాదాలు, న్యాయపోరాటాలూ ముసు రుకుంటున్నా ఇదే నమ్మకం వారిలో పరంపరాగతంగా వస్తున్నదే తప్ప ఎప్పుడూ సడలలేదు. బ్రిటీష్‌ కాలం లోనే ఆ ప్రాంగణాన్ని విభజించి హిందువులను మూడు గుమ్మటాలకు ఆవలనే ఉంచినా, అది శ్రీరాముని జన్మ స్థలమన్న నమ్మకంతోనే పక్కన వున్న రామ్‌చబూత్ర నుంచి పూజలను నిర్వహిస్తున్నారు. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పుతో వారి నమ్మకం నిలువెత్తు ఆలయంగా నిల బడిపోనున్నది.

వర్ధెల్లి మురళి
muralivardelli@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top