
అసలీ వరద మనది కాదు. బురద మాత్రం మనం పూసుకుంటున్నాం. ఎక్కడో పైన ఏ మహారాష్ట్రలోనో వా నలు పడితే కృష్ణమ్మ చెంగనాలు వేస్తుంది. దారి పొడుగునా జలాశయాలు నింపి, గేట్లు వదిలించుకుని దిగువకు నడుస్తుంది. మనకున్న జలాశయాలు నిండుకుండల్లా తొణికిసలాడడం ఒక పండుగ. ఇదిగో , మొన్న సర్వత్రా కురిసి న వర్షాలకు వాగులు వంకలు పొంగి వరదలొచ్చినా యి. ఎవరికి వారు లాకులు ఎత్తివేశారు. తలుపులు తెరిచారు. దాంతో కావల్సినంత కరెంటు, అక్కర్లేనన్ని నీళ్లు! కట్టలు తెంచుకున్నప్పుడు వరదలొస్తాయ్. కృష్ణమ్మకి చివ్వరి మెట్టు విజయవాడ ప్రకాశం బ్యారేజి. ఆ బ్యారేజి దిగువకు నీళ్లొదిలితే కృష్ణ వూళ్ల వీదపడుతుంది. మొన్న అదే జరిగింది. ఇళ్లు ఊళ్లు మునిగి పోయాయి. పంటలు నీళ్లలో మురిగి పోయాయి. రైతులు గగ్గోలు పెట్టారు. అక్కడ నించి అమరావతిలో వరదకు మించి రాజకీయాలు వెల్లువెత్తాయి. కరకట్ట మీదున్న మాజీ ముఖ్యమంత్రి అధికార నివాసంలోకి వరద నీరు చేరింది. ఇంకేముంది? ఆ వరద బురదైంది. ఏ చిన్న అవకాశం దొరి కినా తెలుగుదేశం వదిలిపెట్టే సహనంతో లేదు. సూదిని దూలానికి గుచ్చి టీడీపీ నాయకులంతా భుజాన వేసుకుని మీడియా వీధుల్లో వూరేగించేందుకు సిద్ధంగా వున్నారు. చంద్రబాబు నివాసంలోకి వరద నీటిని మళ్లించింది జగనేనని తెలుగుదేశం గొంతు సవరించుకుంది.
అంతేకాదు చంద్రబాబు నివాసం మీదకి డ్రోన్‌లు పంపారని, అదొక దుష్టాలోచననీ ముక్తకంఠంతో ఎండగట్టే ప్రయత్నం చేశారు. చంద్రబాబు వరద ప్రాంతాల్లో పర్యటించారు. రైతులకు అండగా వుంటానని బురదలో నిలబడి మరీ చెప్పారు. ఈ దెబ్బతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పడిపోవడం ఖాయమనే పిచ్చి వుత్సాహంతో టీడీపీ వరద బురదలో ఆటలాడింది. మునిగి పోయిన రైతులు పాతనేతల మాటలకి రెచ్చపడక పోగా, తమరి హయాంలో మీరేం చేశా రని ఎదురు ప్రశ్నించారు. ఇన్‌పుట్ సబ్సిడీ నుంచి రైతులకు చంద్రబాబు చేసిన దగాలను ఓ జాబితాగా వల్లె వేశారు వరద రైతులు. రాష్ట్రంలో యింత కల్లోలం జరిగితే, చంద్రబాబు మీదకి వరదని అమానుషంగా తోలితే కనీసం రాహుల్ గాంధీ పరామర్శ కైనా రాలేదు. మమతా బెనర్జీ పలకరించనైనా లేదు. ఇది యిట్లావుంచి, వరద బురద యింకా ఉండగానే అమరావతి క్యాపిటల్ మీదికి ద్రోణి ఆవరించింది. వరద పర్యవసానాల్ని అడ్డం పెట్టుకుని అసలిక్కడ క్యాపిటల్ తగదనీ, అసలు పెద్దాయన యీ నల్లరేగడిలో పునాదులకే చాలా ఖర్చు అవుతుందని చెప్పనే చెప్పాడనీ ఓ సీనియర్ మంత్రి కెలికాడు. ఇంకే వుంది, అసలే సందేహాలతో కొట్టుమిట్టాడుతున్న కృష్ణ గుంటూరు ప్రజల గుండెలు గుబగుబలాడసాగాయి. వరద బురద దీంతో బాగా పాకాన పడింది. చంద్రబాబు కలల క్యాపిటల్ సాకారం కావాలంటే హీనపక్షం ఒకటిన్నర లక్షల కోట్లు కావాలి. ఆయనీ కల కని ఐదేళ్లు దాటింది. మూడు పంటలు పండే సుక్షేత్రాలైన నలభై వేల ఎకరాలను చంద్రబాబు బీడు పెట్టిన మాట వాస్తవం.
ఇప్పుడు జగన్ ఇక్కడే క్యాపిటలని చెప్పినా జరిగేదేమీ లేదు. మొన్న బడ్జెట్‌లో అయిదొందల కోట్లు మాత్రమే క్యాపిటల్‌కి కేటాయించారు. ఈ లెక్కన ఈ విశ్వవిఖ్యాత నగరం పూర్తి కావడానికి చాలా ఏళ్లు పడుతుంది. పైగా అంతటి ప్రపంచ ప్రసిద్ధ నగరాన్ని చంద్ర బాబు ఎలా నిర్మిద్దామనుకున్నారో, ఆర్థిక వనరులేమిటో ఎక్కడా ఎవ్వరికీ చెప్పలేదు. లండన్, సింగపూర్‌లాంటి దేశాల నుంచి బోలెడు తమాషాలు క్యాపిటల్‌కి వస్తాయని, వాళ్లంతా ల్యాండ్ పూలింగ్‌లో వచ్చిన భూముల్ని భయంకరమైన రేట్లకు కొనేస్తారని చంద్రబాబు అనుకున్నారు. డబ్బులు ఎవరికీ అంత తేలిగ్గా రావు! కాకపోతే, చంద్రబాబు వెంకటేశ్వరస్వామికి కొన్ని ఎకరాలు సమర్పించారు క్యాపిటల్ దగ్గర్లో. టీటీడీ కొన్ని వందల కోట్లు గుడి కోసం కేటాయించింది. ఇప్పటి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆలయం నిర్మాణం జరగవచ్చు. ఎందుకంటే శ్రీవారికి నిధుల కొరత లేదు కదా! అన్నీ సవ్యంగా ఉంటే అంతవరకు జరగచ్చు. మిగతా క్యాపిటల్ నిర్మాణం బహుకష్టం.
శ్రీరమణ
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)