ఏడాది పాలన

Sri Ramana Article On CM YS Jagan One Year Ruling - Sakshi

అక్షర తూణీరం

పథకాలు అందరూ ప్రారంభిస్తారు. తు.చ. తప్పక అమలులో పెట్టేవారు కొందరే ఉంటారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పథకాల నడక జనరంజకంగా ఉంది. అన్నింటా మేలైంది మద్యపానానికి బిగించిన పగ్గాలు. ఎవరూ దీని జోలికి వెళ్లరు. వెళ్లినా ఆచరణలో అసాధ్యమంటారు. కానీ, ఒక మంచి ప్రయత్నానికి నాంది పలకడం పెద్ద సాహసం. బెల్ట్‌షాపులు మూత పడ్డాయ్‌. ధరలు అందని ఎత్తుకు వెళ్లాయి. కొంచెం తేడా కనిపిస్తోంది. ఇంకా కొన్నాళ్ల తర్వాత మరిన్ని సత్ఫలితాలు కనిపిస్తాయి. రాష్ట్రంలో ఏ ఒక్క మహిళ మద్యపానాన్ని అంగీ కరించదు. అది ఆర్థిక, ఆరోగ్య, సాంఘిక, నైతిక అంశాలను దెబ్బతీస్తుంది. మధ్యతరగతి దిగువ మధ్య మరియు పేద కుటుంబాలు ఇంకా చితికిపోతాయి. ఖజానాకి కాసులు వస్తాయని గత ప్రభుత్వం మందుని ప్రోత్సహించింది. దురలవాట్ల మీద ఆంక్షలు విధిగా ఉండాలి. 

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ స్త్రీ జన పక్షపాతి. కొన్ని ఆర్థిక ప్రయోజనాలను తల్లులకే నేరుగా ముట్టచెబుతున్నారు. జగన్‌ పాలనలో మహిళలకు ధైర్యం వచ్చింది. గొంతు లేచింది. జగనన్న ఆదేశిస్తే తాగే భర్తలని అలవోకగా కట్టడి చేయగలరు. పొడిగా ఉండేవారికి ప్రోత్సాహకాలు అంటే స్పందన తక్కువగా ఉండదు. ఏడాది పాలనలో మద్యం వినియోగంపై దృష్టి సారించడం నిజంగా సాహసం. చాలామంది సంస్కారవంతులకు నచ్చింది గ్రామ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చడం. మా తరం అంటే యాభై అరవై ఏళ్ల క్రితం పూరిపాకల్లో చదివాం. పశువులు, పందులు బడిపాకల్లో బడిపక్కన ఉండేవి. బ్లాక్‌ బోర్డ్‌ తెలియదు. బల్లలు తెలియవు. ఫ్యాన్లు, లైట్లు సరేసరి. మళ్లీ ఇంటికి వెళ్తేనే మంచినీళ్లు. ఇప్పుడీ తరగతి గదులు చూస్తుంటే మళ్లీ బళ్లో చేరి హాయిగా చదువుకోవాలనిపిస్తోంది.

పైగా, ఇంగ్లిష్‌ మీడియంలో భవిష్యత్‌పై కొండంత ఆశతో. ఇది నిజంగా విప్లవాత్మకమైన నిర్ణయం. జగన్‌మోహన్‌రెడ్డి ఒక కుట్రని ఈ విధంగా భగ్నం చేశారని చెప్పవచ్చు. మన మేధావులు నోరుతెరిచి మాట్లాడరెందుకో?! నేడు ప్రపంచమంతా ఒక పందిరి కిందకు వచ్చింది. ఎవరు ఎక్కడైనా చదవవచ్చు, బతకవచ్చు. భాష విషయంలో మడి కట్టుకు కూర్చునే చైనా, జపాన్‌లు కూడా ఏబీసీడీలు దిద్దడం తప్పనిసరి అయింది. లేకుంటే వృత్తి వ్యాపారాలు నడవవు. ఆర్థిక లావాదేవీలు ఆగిపోతాయ్‌. టెక్నాలజీ మొత్తం ఆంగ్ల పునాదుల మీద నిలబడి ఉంది. మాతృభాష ఎటూ ఇంట్లో వస్తుంది. అతిగా తోమక్కర్లేదు. చిన్నయసూరి బాల వ్యాకరణంతో, అమర కోశంతో ఈ తరం నించి ఎక్కువ పని ఉండదు. ఇంగ్లిష్‌ మాత్రం చాలా ముఖ్యం. భవిష్యత్తుకి ఆక్సిజన్‌ లాంటిది లేకపోతే వెంటిలేటర్స్‌ మీద బతకాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నట్టు క్లాస్‌రూమ్‌లతో బాటు మంచి టీచర్‌లు ముఖ్యం. వారంతా శ్రద్ధాసక్తులతో ఆసక్తికరంగా బోధిం చాలి. ఆంగ్ల భాషకి ఉచ్ఛారణ కూడా ముఖ్యం. తేడా వస్తే, నలుగురిలో నవ్వుల పాలవుతారు. టీచర్స్‌ని ముందుగా తయారు చేసుకోవాలి. బీబీసీ వార్తల్లాంటివి పిల్లలకు నిత్యం వినిపించాలి. ఇప్పుడు ఆంగ్ల ఉద్యమానికి దోహదం చేసే సాఫ్ట్‌వేర్‌ కుప్పలు తెప్పలుగా వచ్చిపడింది. వాటిని అందుబాటులోకి తేవాలి. చాలామంది అనుకునేట్టు ఇంగ్లిష్‌ అంత తేలికైన భాషేమీ కాదు. అక్షరాలు తక్కువేగానీ స్పెల్లింగ్‌లు ఎక్కువ. పలుకుబడులు ఎక్కువ. మద్యపానం దశలవారీ అమలు తరువాత, ఇంగ్లిష్‌ మాధ్యమం గొప్ప నిర్ణయం. కుట్రలు భగ్నమైనప్పుడు భయస్తులు అల్లరి చేయడం సహజం. 

మళ్లీ ఒకసారి ముందుకువెళ్లి మద్యపాన నిషేధం గురించి మాట్లాడుకుందాం. ఎవరి సంగతి ఎలా ఉన్నా, మన సమాజంలో చదువుచెప్పే ఉపాధ్యాయుడు మతాతీతంగా ప్రార్థనా మందిరాల పూజారులు, లా అండ్‌ ఆర్డర్‌ పరిరక్షించే పోలీసులు, రకరకాల గౌరవాలతో ఉచిత ప్రభుత్వ పింఛన్లు పొందేవారు, ఇంకా పెద్ద మనసున్నవారు విధి వేళల్లోనే కాదు విడి వేళల్లో కూడా మద్యంమీద ఉండదారు. టీచర్‌ అంటే పిల్లలకు దేవుడితో సమానం. ఒకసారి జార్జి చక్రవర్తి కొడుకుని చూడటానికి స్కూల్‌కి వస్తానని కబురంపాడు. వెంటనే ఆ స్కూలు హెడ్మాస్టర్‌ వినయంగా కబురంపాడు. ‘చక్రవర్తీ! తమరు రావద్దు. మీరొస్తే రాచమర్యాదలో భాగంగా నేను టర్బన్‌ తీసి తమరికి వందనం చేయాలి. ఇంతవరకూ మా పిల్లలు ఈ నేలపై నన్ను మించినవారు లేరనే నమ్మకంతో ఉన్నారు. నేను టర్బన్‌ తీస్తే ఆ నమ్మకం వమ్ము అవుతుంది. తర్వాత మీ దయ’ ఇదీ కబురు సారాంశం. ఇక ఆ చక్రవర్తి ఎన్నడూ స్కూలు వైపు వెళ్లలేదు. ఇది ప్రభుత్వానికి, సమాజానికి సహకరించాలి. లేదంటే వారు వేరొక వృత్తిని ఎంచుకోవాలి. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తలపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలన్నీ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలని ప్రజలంతా ఆకాంక్షిస్తున్నారు.


శ్రీరమణ 
(వ్యాసకర్త ప్రముఖ కథకుడు)

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top