అరుదైన దార్శనికుడు

Ramachandra Murthy Guest Columns On YSR 69th Jayanthi Special - Sakshi

త్రికాలమ్‌

దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 69వ జయంతి ఈ రోజు. రాజకీయవాదులలో, అధికారులలో, జర్నలిస్టులలో, సాధారణ ప్రజలలో అనేకమందికి వైఎస్‌తో ఎవరి అను భవం వారికి ఉన్నది. ఒక్కసారి కలుసుకున్న వ్యక్తి తనకు ఆయనతో ప్రత్యేకమైన అనుబంధం ఉన్నట్టు భావిస్తాడు. అది వైఎస్‌ వ్యక్తిత్వంలోని విశిష్టత. చిరుమందహాసం, స్నేహశీలత, ఆపన్నులను ఆదుకునే గుణం, పేద ప్రజలకు మేలు చేయాలన్న తపన, మాటకు కట్టుబడే మనస్తత్వం, నమ్ముకున్నవారికి అండగా నిలిచేందుకు ఏ త్యాగానికైనా సిద్ధపడే తెగింపు, మతాలకూ, కులాలకూ అతీతంగా వ్యవ హరించే లౌకిక స్వభావం, నేలవిడిచి సాము చేయని ఆచర ణవాదం, ప్రేమనూ, ఆప్యాయతనూ పంచిపెట్టే ధోరణి  వైఎస్‌ను ప్రజానాయకుడిగా నిలబెట్టిన లక్షణాలు. ఈ లక్ష ణాలలో కొన్ని కానీ, అన్నీ కానీ అనుభవంలోకి వచ్చినవారు ఎందరో ఉంటారు. వారంతా  వైఎస్‌ జ్ఞాపకాలను గుండెల్లో పదిలంగా దాచుకుంటారు.  

‘ఎంత కాలం బతికామన్నది ముఖ్యం కాదు ఎట్లా బతికామన్నది ప్రధానం’ అని అనేవారు వైఎస్‌. ఆయన కంటే ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పని చేసినవారు దేశంలో చాలామంది ఉన్నారు. కానీ వైఎస్‌ అంత వేగంగా, ముమ్మరంగా, ఏకాగ్రచిత్తంతో సంక్షేమ, అభివృద్ధి కార్యక్ర మాలు అమలు చేసినవారు లేరు. ఒకే ఒక్క పదవీకాలం (5 ఏళ్ళు)లో వైద్యం, విద్య, అభివృద్ధి, సంక్షేమరంగాలలో అనేక కార్యక్రమాలు రూపొందించి, అమలు చేసిన ముఖ్య మంత్రి మరొకరు కనిపించరు. కాసు బ్రహ్మానందరెడ్డి, జలగం వెంగళరావు పరిపాలనాదక్షులుగా పేరు తెచ్చుకు న్నారు. కానీ ప్రజల సంక్షేమానికి వైఎస్‌ ఇచ్చినంత ప్రాధా న్యం వారు ఇవ్వలేదు. వైఎస్‌లో నాయకత్వ లక్షణాలు జన్మతః వచ్చినవి. గుల్బర్గాలో వైద్యవిద్య అభ్యసిస్తున్న రోజు ల్లోనే విద్యార్థి నాయకుడుగా పేరు. కాంగ్రెస్‌లో స్వయంప్ర కాశం గల నాయకుడిగా, కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల ప్రత్య ర్థిగా పాతికేళ్లపాటు మనగలగడం సామాన్యమైన విషయం కాదు. 1978 నుంచి 2009 వరకూ 31 ఏళ్ల పాటు అన్ని ఎన్ని కలలోనూ విజయం సాధించిన నాయకుడు.

కాంగ్రెస్‌లో నాయకుడిగా నిలదొక్కుకోవాలంటే సాటి నాయకులతో పోటీ పడటమే కాకుండా అధిష్ఠాన దేవతలను ప్రసన్నం చేసుకోవాలి. అసమ్మతి నాయకులను కాచుకోవాలి. తన ఆర్థిక మూలాలను విధ్వంసం చేయడానికి ప్రయత్నించే సొంత పార్టీ ముఖ్యమంత్రులను ఎదుర్కొని నిలబడటానికి ఎంతో గుండెధైర్యం కావాలి. చాడీలు చెప్పేవారికి చెవి ఒగ్గే అధిష్ఠానం ఎప్పుడు ఆగ్రహిస్తుందో, ఎప్పుడు అనుగ్రహి స్తుందో తెలియని వాతావరణంలో మంచి రోజులకోసం, అనుకూల వాతావరణం కోసం ఏళ్ళ తరబడి ఎదురు చూడ టానికి ఎంతో ఓర్పూ, నేర్పూ అవసరం. ‘తెలుగుదేశం’ లాగానే ప్రాంతీయపార్టీ పెట్టాలని కొందరు సన్నిహితులు సలహా చెప్పినా కాంగ్రెస్‌ని వీడటానికి వైఎస్‌ అంగీకరించ లేదు.  ముప్పయ్‌ అయిదేళ్ళకే పీసీసీ అధ్యక్ష పదవి వరిస్తే పార్టీలో ప్రత్యర్థులు ఈర్ష్యపడ్డారు. చిన్నతనంలోనే ముఖ్య మంత్రి అయిపోతారేమోనని కంగారు పడ్డారు. చొక్కారావు, ద్రోణంరాజు సత్యనారాయణ వంటి సీనియర్లు వైఎస్‌కు అండగా ఉండేవారు.

పీవీ, కోట్ల విజయభాస్కరరెడ్డి వంటి వారు ఆయనను ఆణచివేయడానికి ప్రయత్నం చేశారు. 2003లో పాదయాత్ర చేసినప్పుడు కూడా పార్టీలో ప్రత్య ర్థులు ఆయనతో సహకరించలేదు. ఉడుక్కున్నారు. మండు టెండను లెక్కపెట్టకుండా నడుచుకుంటూ వచ్చి తమ యోగ క్షేమాలను విచారిస్తున్న వైఎస్‌ను ప్రజలు ఆదరించారు. పశ్చిమగోదావరి నుంచి రైల్‌–రోడ్డు బ్రిడ్జి దాటి తూర్పు గోదావరిలో ప్రవేశించే సరికి వైఎస్‌కి అనుకూలంగా ప్రభం జనం ఆరంభమైంది. పాదయాత్ర వైఎస్‌ను పూర్తిగా మార్చి వేసింది. పేదరికాన్నీ, పేద ప్రజల కష్టాలనూ స్వయంగా చూసి తెలుసుకున్నారు. పగలకూ, పంతాలకూ స్వస్తి చెప్పి ప్రజలకు హృదయపూర్వకంగా సేవ చేసి తరించాలని తీర్మా నించుకున్నారు. తన కోపం నరం తెగిపోయిందంటూ చెప్పే వారు.

2004 ఎన్నికలలో ఘనవిజయం సాధించారు.  ఎన్నో సంవత్సరాలు ఎంతో ఓపికతో వేచి చూసిన అవకాశం వచ్చిన వెంటనే విజృంభించి ఆరేళ్ళ కంటే తక్కువ వ్యవ ధిలో ఇరవై ఏళ్లలో చేయగలిగిన మేలు చేయడానికి విశ్వ ప్రయత్నం చేశారు. ఎవరో తరుముతున్నట్టు పథకాలు ప్రక టించి అమలు చేశారు. వంట గ్యాస్‌పై సబ్సిడీ ఇచ్చారు. ప్రతి కుటుంబంలో అందరికీ ఏదో ఒక విధమైన లబ్ధి చేకూ రింది. అయిదుగురు మహిళలకు కేబినెట్‌లో స్థానం కల్పిం చడమే కాకుండా మంచిశాఖలు అప్పగించారు. వారు కూడా సమర్థంగా నిర్వహించారు. మహిళలు మనసు పెట్టి పని చేస్తారనీ, వారిలో నిర్వహణ సామర్థ్యం ఉంటుందనీ ఆయన నమ్మకం. రాజకీయంగా ఎంత చతురతతో వ్యవహరిం చారో పరిపాలనా ర థాన్ని అంతే వేగంగా నడిపించారు. 
నాయకత్వ లక్షణాలు 

నిజమైన ప్రజానాయకుడికి ఉండవలసిన లక్షణాలేమిటి?  ‘మీకు అండగా నేనున్నాను’ అన్న భరోసా ప్రజలకివ్వడం. సహచరులూ, అనుచరులూ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేనికీ వెనకాడకుండా లేకుండా ఆదుకోవడం. వాగ్దానాలను అమ లుచేయడానికి మనస్పూర్తిగా, నిజాయతీగా, నిబద్ధతతో కృషి చేయడం. ప్రజల ప్రగతి పట్ల, వారి అవసరాల పట్ల సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండటం. దృఢమైన నిర్ణ యాలు తీసుకోవడం, వాటికి కట్టుబడి ఉండటం. ప్రజా సంక్షేమం కోసం ఎటువంటి త్యాగానికైనా సిద్ధపడటం. సంక్షేమ, ప్రగతి లక్ష్యాలను నిర్దేశించుకోవడంలో, వాటిని సాధించడంలో క్షేత్రవాస్తవికతను దృష్టిలో పెట్టుకొని, సాహ సోపేతమైన, సృజనాత్మకమైన కార్యక్రమాలు రూపొందిం చుకొని భవిష్యత్‌ చిత్రపటాన్ని నిర్ణయించుకోవడం.

దూర దృష్టితో అభివృద్ధికి ప్రణాళికా రచన చేసిన రాజకీయవాదే రాజనీతిజ్ఞుడిగా చరిత్రలో నిలిచిపోతారు. కొత్తబాటలో మేలు చేయాలని ప్రయత్నించిన నాయకులను చరిత్రకా రులు నిశ్చయంగా గుర్తిస్తారు. వైఎస్‌ ప్రభావం ఆయన కుటుంబం మొత్తంపైన ఉన్నది. ఆయన కుటుంబంలోని నలుగురు సభ్యులలో ముగ్గురు (ఆయనా, కుమార్తె షర్మిల, కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి) వేల కిలోమీటర్లు పాద యాత్ర చేయడం, ప్రజలతో మమేకం కావడం ప్రపంచం లోనే అపూర్వమైన విషయం. దళితులకూ, వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వేయడానికి ఇందిరాగాంధీ, ఎన్‌టిఆర్, పీవీ చేసిన ప్రయత్నాన్ని ఎవ్వరూ కాదనలేరు. దళితులలో ఆత్మవిశ్వాసం ప్రోదిచేయడానికి ఇందిరాగాంధీ చేసిన చట్టాలూ, చేపట్టిన కార్యక్రమాలూ చరిత్రాత్మకమైనవి.

వెను కబడిన కులాలకు ఎన్‌టి రామారావు విశేషంగా రాజకీ యంగా గుర్తింపు ఇచ్చారు. భూసంస్కరణల అమలుకూ, 1972 ఎన్నికలలో బీసీలకు అత్యధికంగా కాంగ్రెస్‌ టిక్కెట్లు  కేటాయించేందుకూ, ప్రధానిగా ఆర్థిక సంస్కరణలు అమలు చేసేందుకూ పీవీ ప్రదర్శించిన తెగువను వర్తమాన రాజకీ యవాదులు పరిగణనలోకి తీసుకోకపోవచ్చును. కానీ చరిత్ర ఎప్పటికైనా నమోదు చేస్తుంది. అలాగే ఈ దేశంలో నక్సలైట్లతో చర్చలు జరిపిన ఒకే ఒక రాష్ట్రప్రభుత్వంగా వైఎస్‌ నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ నిలుస్తుంది.

సాచ్యురేషన్‌ విధానం 
అందరికీ వైద్య హామీ ఇచ్చే ఉద్దేశంతో ‘ఆరోగ్యశ్రీ’, విద్యా వకాశాలు కల్పించేందుకు ఫీజు చెల్లింపు పథకం (ఫీజు రీయింబర్స్‌మెంట్‌), పేదలకూ, దళితులకూ భూపంపిణీ వంటి కార్యక్రమాలను పార్టీలకూ, ప్రాంతాలకూ, కులా లకూ, మతాలకూ అతీతంగా అమలు చేసిన ఘనత వైఎస్‌ది. ఎవరికి సంక్షేమ పథకం వర్తింపజేయాలో, ఎవరికి చేయకూడదో నిర్ణయించే జన్మభూమి కమిటీల వంటి దుర్మా ర్గపు వ్యవస్థ వైఎస్‌ హయాంలో లేదు. అన్ని సంక్షేమపథకాల అమలులో ‘సాచ్యురేషన్‌’ (అవసరం ఉన్న అందరికీ నూటికి నూరుపాళ్ళూ అనుభవంలోకి రావాలి) అనేది వైఎస్‌ అమలు చేసిన విధానం. నిరుపేద ముస్లిం యువతకు విద్యా ఉద్యోగావకాశాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఈ దేశానికి వ్యవసాయం వెన్నెముక అనే స్పష్టమైన అవగాహన ఉన్న నాయకుడు కనుకనే వ్యవసాయానికి సాగునీరు ప్రధా నమని గుర్తించి జలయజ్ఞం ఆరంభించారు. పదవీ కాలాన్ని మృత్యువు కాటేసిన కారణంగా వైఎస్‌ తలపెట్టిన పెద్ద ప్రాజెక్టులు పూర్తి కాలేదు.

ఈ రంగంలో ఏ ప్రభుత్వం ఏమి చేసినా వైఎస్‌ స్వప్నం కొనసాగింపే. ఆంధ్రప్రదేశ్‌లో పోల వరం బహుళార్థసాధక ప్రాజెక్టు అయినా, తెలంగాణలో కాళేశ్వరం లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు అయినా వైఎస్‌ సంకల్పిం చిన జలయజ్ఞంలో భాగమే. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రీఇంజనీరింగ్‌ ద్వారా ప్రాజెక్టు పరిణామాన్నీ, విస్తృతినీ పెంచారు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ పాటికి పూర్తి కావలసిన పోలవరం ప్రాజెక్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఊపిరాడక చాలా కాలం అచేతనంగా ఉంది. ఈ మధ్యనే పనులు జరుగుతున్నాయి. వైఎస్‌ అకాల మరణం చెందకుండా ఉంటే 2014 నాటికే జలయజ్ఞంలో సింహభాగం పూర్తి అయ్యేది. వైఎస్‌ మొట్టమొదట ముఖ్య మంత్రిగా ప్రమాణం స్వీకరించిన వెంటనే సంతకం చేసిన ఫైలు ఉచిత విద్యుత్‌ రైతులకు సంబంధించింది కావడం విశేషం.

అలాగే రైతు రుణమాఫీ అమలుచేశారు. ఆహారధా న్యాలకు కేంద్రం నిర్ణయించిన సబ్సిడీకి మరికొంత జోడిం చారు. దళితులకు సబ్‌ప్లాన్‌ ఉండాలనే ప్రతిపాదనను మన స్ఫూర్తిగా ప్రోత్సహించారు. నేను సంపాదకుడిగా ఉండగా ‘వార్త’ లో 2001లో మల్లెపల్లి లక్ష్మయ్య సబ్‌ప్లాన్‌పై రాసిన వ్యాసాన్ని ప్రతిపక్ష నేత హోదాలో శాసనసభలో పూర్తిగా చదివి వినిపించారు. బిట్స్‌ పిలానీ, ఐఐటీ వంటి ప్రతి ష్ఠాత్మకమైన విద్యా సంస్థలను తీసుకురావడంలో వైఎస్‌ పాత్ర అద్వితీయమైనది. వైఎస్‌ హయాంలో వర్షాలు దండిగా కురిసేవి. సమాచార సాంకేతిక (ఐటీ) రంగం వృద్ధితో ఆర్థిక వ్యవస్థ బలపడింది.  

కాంగ్రెస్‌కు తీరని లోటు 
వైఎస్‌ అస్తమయం తెలుగువారి రాజకీయాలలో పెనుమా ర్పులు సృష్టించింది. వైఎస్‌ ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బలహీనమై ఉండేదని ఇప్పటికీ కొందరు వాదిస్తారు. అక్కడ కూడా అభివృద్ధికి బాటలు వేస్తే ప్రత్యేకవాదం బలహీనపడుతుందని ఆయన భావించేవారు. రాజకీయ ఎత్తుగడలతో పాటు ప్రగతి పథ కాల ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఎదుర్కోవాలని ప్రయ త్నించారు.  వైఎస్‌ సజీవంగా ఉంటే  కాంగ్రెస్‌ ఇంతటి దీనా వస్థలో ఉండేది కాదు. ముగ్గురు మిత్రులు–వైఎస్, రాజేశ్‌ పైలెట్, మాధవరావ్‌ సింధియా– ఈ రోజున మన మధ్య ఉంటే కాంగ్రెస్‌ ప్రతిపక్ష హోదాకు సైతం నోచుకోని దుస్థితి దాపురించేది కాదు.

దురదృష్టవశాత్తు ముగ్గురూ ప్రమాదా లలో మృతి చెందారు. 2000 జూన్‌ 11న దౌసా నుంచి జైపూ ర్‌కు వస్తూ తాను నడుపుతున్న జీపు ఆర్టీసీ బస్సును ఢీకొ నడంతో పైలట్‌ మరణించారు. 2001 సెప్టెంబర్‌ 30న కాన్పూర్‌ వెడుతున్న ప్రత్యేక విమానం ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి దగ్గర కూలి సింధియా దుర్మరణం పాలైనారు. 2009 సెప్టెంబర్‌ రెండున హెలికాప్టర్‌ ప్రమాదంలో వైఎస్‌ చనిపోయారు. ముగ్గురూ జనబలం ఉన్న నేతలే. సోని యాకు అండదండలు సమకూర్చగల చేవ ఉన్న నాయకులే. అటువంటి శక్తిమంతులు ఇప్పుడు కాంగ్రెస్‌లో లేరు. దేశం అంతటా వెతికితే వారితో ఎంతోకొంత పోల్చదగిన నాయ కుడు పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరేందర్‌సింగ్‌ ఒక్కరే కనిపిస్తారు.     

కాంగ్రెస్‌ అధిష్ఠానం అభీష్టానికి భిన్నంగా  2009 నాటి ఎన్నికలలో టీఆర్‌ఎస్‌తో పొత్తుపెట్టుకోకుండా ఒంటరిగా పోరాడి 33 మంది లోక్‌సభ సభ్యులను గెలిపించిన డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన వాదనలో నిజంగానే పస ఉన్నట్టు నిరూపించారు. సమాజం, పేద ప్రజలు, రైతులు, గ్రామ సీమలు, రచ్చబండ గురించి మనసు పెట్టి ఆలోచించే పాత తరానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుల పరంపరలో వైఎస్‌ చిట్టచివరి నేత. అటువంటి దార్శనికుడూ, జనరంజకుడూ, సమర్థుడెన రాజకీయ నాయకుడూ, పరిపాలనాదక్షుడూ, సిసలైన ప్రజానాయకుడూ చరిత్రలో అత్యంత అరుదుగా మాత్రమే కనిపిస్తారు.


కె. రామచంద్రమూర్తి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top