ఇంతలా దిగజారాలా?!

Ramachandra Murthy Article On YS Vivekananda Reddy - Sakshi

త్రికాలమ్‌ 

మరణ వార్త చెవిన పడినప్పుడు మనస్సు చివుక్కుమంటుంది. తెలిసిన వ్యక్తి ఈ లోకం వీడినట్టు వర్తమానం రాగానే అయ్యో అంటూ మనసు మూలుగు తుంది. మరణం సహజమైనది కానప్పుడు, జరిగింది రాజకీయ హత్య అయి నప్పుడు గుండె బరువెక్కుతుంది. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తమ్ముడు  వైఎస్‌ వివేకానందరెడ్డి మరణవార్త అనేకమంది లాగానే నాకూ అశనిపాతంలాగా తాకింది. కలలో కూడా ఎవ్వరికీ అపకారం తలపెట్టని మనిషి, ప్రత్యర్థులతో సైతం స్నేహంగా, ప్రేమగా, మృదువుగా మాట్లాడే స్వభావం కలిగిన వ్యక్తి, తనకంటే వయస్సులో చిన్నవారినైనా విధిగా ‘మీరు’ అంటూ సంబోధించే సంస్కారం కలిగిన రుజువర్తనుడు, నిగర్వి, నిరాడంబరుడైన వివేకానందరెడ్డిని ఎవరైనా హత్య చేస్తారని ఊహించడం కూడా కష్టమే. వివేకానందరెడ్డి ఎన్నడూ తనకు ప్రాణహాని ఉన్నదని భావించలేదు.

అందుకే ఎక్కడికైనా అంగరక్షకులు లేకుండా ఒంటరిగానే వెళ్ళడం, కార్యక్రమాలలో పాల్గొనడం. గురువారంనాడు కూడా జమ్మలమడుగులో పర్యటించి, వైఎస్‌ఆర్‌సీపీ తరఫున ప్రచారం చేసి, దొంగ ఓట్లు చేర్చడాన్ని నిరసిస్తూ ధర్నా చేసి, పొద్దుపోయిన తర్వాత పులి వెందులలో స్వగృహానికి వెళ్ళి నిద్రపోయారు. అర్ధరాత్రికీ, ఉదయం 5 గంట లకూ మధ్య హంతకులు ఆయనపైన పదునైన ఆయుధాలతో దాడి చేసి ప్రాణాలు తీశారని కడప జిల్లా ఎస్‌పి రాహుల్‌దేవ్‌శర్మ ధ్రువీకరించారు. ఆ తర్వాత రాజకీయ దుమారం మొదలు. అధికారపార్టీ నాయకులపైన, ప్రధా నంగా జమ్మలమడుగు శాసనసభ్యుడు, మంత్రి ఆదినారాయణరెడ్డిపైన వైఎస్సా ర్‌సీపీ నాయకులు ఆరోపణలు చేశారు.

టీడీపీ ఎంఎల్‌సీ బుద్ధా వెంకన్న ప్రత్యారో పణలు చేస్తూ అనేక ప్రశ్నలు సంధించారు. అంతలో పులివెందులకు వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేరుకున్నారు. ఆయనకు ఎస్‌పీ శర్మ ఒక లేఖ చూపించారు. తొందరగా రమ్మన్నందుకు తనను తన డ్రైవర్‌  చావకొట్టాడనీ, అతడిని వదలవద్దనీ చెబుతూ వివేకానందరెడ్డి రాసినట్టు చెబుతున్న లేఖ వివా దాస్పదమైనది. ఒకవైపు గొడ్డలితో దాడి జరుగుతుంటే ఉత్తరం ఎట్లా రాస్తా రంటూ జగన్‌మోహన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు. సార్వత్రిక ఎన్ని కలలో పోలింగ్‌ మరి 25 రోజులకు ముందు ఈ హత్య జరిగింది కనుక రాజకీయ వాతావరణం అకస్మాత్తుగా వేడెక్కడం సహజం.

విరుద్ధమైన వార్తలు
ముందు గుండెపోటు అన్నారనీ, తర్వాత హత్య అన్నారనీ వార్తాకథనాలు న్యూస్‌ చానళ్ళలో, పత్రికలలో వెలువడినాయి. వివేకానందరెడ్డిని ఎవరైనా హత్య చేస్తా రని ఎన్నడూ ఊహించలేదు కనుక గుండెపోటు వచ్చి, కళ్ళు తిరిగి, మరుగుదొ డ్డిలో కమోడ్‌పైన పడి దెబ్బతగిలి మరణించారని ఆ సమయంలో అక్కడ ఉన్న వారు భావించారేమో. అదే ప్రాథమికంగా ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసుల పరిశీలనలో అది హత్య అని తెలిసింది. హత్య జరగడానికీ, పోలీసులు హత్య అని నిర్ధారించడానికీ మధ్య ఏమి జరిగిందో, ఎందుకు జరిగిందో పరిశోధనలో వెల్లడి కావాలి. హంతకులు ఎవరో, సాక్ష్యాధారాలు మార్చింది ఎవరో, వివేకానందరెడ్డి రాసినట్టు చెబుతున్న లేఖ నిజంగా రాసింది ఎవరో నిర్ధారించవలసింది దర్యాప్తు చేసే అధికారులే.

వివేకానందరెడ్డి సమీప బంధు వులు అందరూ హైదరాబాద్‌లో ఉన్నారు. బాబాయి హత్య జరిగినట్టు తెలిసినా పదకొండు గంటల వరకూ లోటస్‌పాండ్‌ నివాసంలో జగన్‌ రాజకీయాలు చేస్తూ కూర్చున్నారని ఒక టీడీపీ నాయకుడు శుక్రవారం ఉదయమే వ్యాఖ్యానించారు. ఆ రోజు ఉదయం కోర్టులో హాజరు కావలసి ఉండటంతో న్యాయమూర్తి అను మతి తీసుకొని బయలుదేరేవరకు అంత సమయం పట్టిందని పార్టీకి సంబం ధించినవారిని ఎవరిని అడిగినా చెప్పేవారు. వాస్తవాలు తెలుసుకోవాలనే అభి లాష ఉంటే అటువంటి ప్రయత్నం జరిగేది. ఆరోపించాలనే ఆత్రంలో ఉన్న వారికి వాస్తవం తెలుసుకోవాలన్న ఆలోచన రాదు. 

బుద్ధా వెంకన్న, కనకమేడల రవీంద్రకుమార్‌ వంటి టీడీపీ నాయకులు ఒక మాట ఎక్కువ మాట్లాడినా పర్వాలేదు.  ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్ర బాబునాయుడు ప్రతి అక్షరం ఆచితూచి మాట్లాడాలి. జగన్‌పైన విశాఖపట్టణం విమానాశ్రయం విఐపీ లాంజ్‌లో శ్రీనివాసరావు అనే యువకుడు దాడి చేసి నప్పుడూ ఇదే వరుస. జగన్‌ తల్లి విజయమ్మ, చెల్లెలు షర్మిల దాడి చేయించారంటూ టీడీపీ శాసనమండలి సభ్యుడు రాజేంద్ర ప్రసాద్‌ ఆరోపిం చారు.

అటువంటి అన్యాయమైన, అమానవీయమైన ఆరోపణ చేసినందుకు ఆయనను ముఖ్యమంత్రి మందలించిన దాఖలా లేదు.  లోగడ ప్రచారంలో పెట్టిన వదంతులను మరోసారి ప్రచారం చేసి ఆనందించే పనిలో కొంతమంది ఉన్నారు. వారు మాట్లాడిన స్థాయికీ చంద్రబాబు మాట్లాడిన స్థాయికీ పెద్దగా భేదం లేదు. ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడవలసినంత ఉదాత్తంగా లేదు. రాజకీయ ప్రయోజనాలకోసం ఇంత నైచ్యం అవసరమా? చంద్రబాబు ఆవేశంతోనే ప్రశ్నించాలంటే, ‘వేర్‌ ఆర్‌ వుయ్‌ గోయింగ్‌ (ఎక్కడికి పోతున్నాం)?’ 

రాజకీయరంధి
చంద్రబాబు ఇరవై నాలుగు గంటల రాజకీయనాయకుడు. వేరే రంగాల పట్ల, అంశాల పట్ల ఆయనకు ఆసక్తి లేదు. పూర్తి సమయాన్ని రాజకీయాలకు వినియోగించడం తప్పుకాదు. ప్రతి విషయంలోనూ రాజకీయ ప్రయోజనం ఆశించడం, అందుకోసం అడ్డదారులు తొక్కడం, మానవీయ విలువలను తుంగలో తొక్కడం మాత్రం అభ్యంతరకరం. ఇటువంటి సందర్భాలలో ముఖ్య మంత్రి వ్యవహరించే తీరు విచిత్రమైనది. ఘటన జరిగిన తర్వాత కొన్ని గంటలు మౌనంగా ఉంటారు. ఆ సమయంలో పోలీసుల ద్వారా సమాచారం తెప్పిం చుకుంటారు. ఏ విధంగా ముందుకు పోవాలో పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉంటారు. ఎదురుదాడికోసం ఒక కథనం అల్లి పెట్టుకుంటారు. ఆ తర్వాత తాపీగా తనకు విధేయంగా ఉండే మీడియా ప్రతినిధులను పిలిపించుకుంటారు. గంట నుంచి రెండు గంటల సేపు మాట్లాడతారు. నోటికి వచ్చిన ఆరోపణలు చేస్తారు. బాధితులే దోషులని నిరూపించే ప్రయత్నం చేస్తారు.

టీవీ చానళ్ళు వాణిజ్య కార్యక్రమాలూ, ప్రకటనలూ రద్దు చేసుకొని విధిగా సకల ఆరోపణలూ ఆసాంతం ప్రసారం చేస్తాయి. విశాఖ విమానాశ్రయంలో జగన్‌పైన దాడి జరిగినప్పుడు జరిగింది అదే. ఆయనే కావాలని శ్రీనివాస్‌తో దాడి చేయించుకొని ప్రజల సానుభూతి సంపాదించాలని ప్రయత్నించినట్టు పదేపదే ఆరోపిస్తూ దబాయించడం, ప్రశ్నించడం, కోపగించడం చూశాం. ఇప్పుడూ అదే దృశ్యం. ఒక ముఖ్యమైన రాజకీయ కుటుంబం పెద్ద హత్య జరిగితే కొన్ని గంటల పాటు సంతాపం ప్రకటించలేదు. దిగ్భ్రాంతి వెల్లడించలేదు. రాత్రి పొద్దుపోయిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించి ముసిముసి నవ్వులు నవ్వుతూ, కళ్ళు ఎగరేస్తూ, చేతులు ఆడిస్తూ నాటకీయంగా మాట్లాడారు.

ఆరంభంలో మాట వరుసకు వివేకానందరెడ్డి హత్య పట్ల బాధ వెలిబుచ్చారు. ఆ వాక్యం తర్వాత అంతా జగన్‌పైన దాడే. అన్నీ భయంకరమైన ఆరోపణలే. తన వాదన బలంగా ఉన్నదనీ, తనకు లభించిన సాక్ష్యాధారాలను సమర్థంగా వినియోగించుకొని తిరుగులేని విధంగా దాడి చేస్తున్నాననీ, రాజకీయంగా ప్రయోజనం పొందే విధంగా వ్యవహరిస్తున్నాననే ఆనందం ముఖ్యమంత్రి కళ్ళలో కనిపించిందే కానీ ఒక సీనియర్‌ రాజకీయ నాయకుడూ, ఒక సౌమ్యుడూ, ఒక అజాతశత్రువూ నిష్కారణంగా హతుడయ్యాడనే బాధ రవ్వంతైనా కనిపించలేదు. ముఖ్యమంత్రి చేసిన సవాళ్ళు అన్నీ ఆ రోజు ఉదయం బుద్దా వెంకన్న, మధ్యాహ్నం కనకమేడల చేసినవే.

విశాఖ విమానాశ్రయం ఉదంతంలో వెనువెంటనే డీజీపీ ఆర్‌పీ ఠాకూర్‌ మొబైల్‌లో వచ్చిన మెసేజ్‌లు చూసుకుంటూ దాడి చేసిన వ్యక్తి జగన్‌ అభిమాని అనీ, సానుభూతి కోసం చేశాడనీ చెప్పడం ప్రజలందరికీ తెలుసు. అటువంటి డీజీపీ నాయకత్వంలోని పోలీసు వ్యవస్థపైన విశ్వాసం ఎట్లా ఉంటుంది? ఆంధ్రప్రదేశ్‌ పోలీసులపైన నమ్మకం లేదని జగన్‌ అంటే అది అపరాథం. తనపైన కానీ తన కుమారుడిపైన కానీ ఎటువంటి చర్యలకూ ఉపక్రమించని  కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)నీ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టొరేట్‌ (ఈడీ)నీ, ఆదాయపన్ను శాఖ అధికారులనూ రాష్ట్రంలో అడుగుపెట్టనీయమని హుంక రించడం మాత్రం సమాఖ్య స్పూర్తి. అక్రమార్కులైన తస్మదీయుల కంపెనీలను సోదా చేయడం  ఈ సంస్థలు చేసిన నేరం.

వారిని నాలుగేళ్ళు ఎన్‌డీఏ భాగస్వామిగా ఉండి కాపాడారు.  టీడీపీ ఎంఎల్‌ఏల ఫిరాయింపులను తెలం గాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) ప్రోత్సహిస్తే అది ఘోరం. చంద్రబాబు 23 మంది వైఎస్‌ఆర్‌సీపీ ఎంఎల్‌ఏలకు కోట్లు ముట్టజెప్పి టీడీపీ తీర్థం ఇవ్వడమే కాకుండా వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం మాత్రం రాజకీయపుటెత్తుగడ. బాలకృష్ణ ఇంట్లో జరిగిన కాల్పులలో సెక్యూరిటీ గార్డు చనిపోయిన కేసును రాజకీయంగా వినియోగించుకోవాలని వైఎస్‌ రాజ శేఖరరెడ్డి భావించి  ఉంటే ఏమయ్యేది? పరిటాల రవి హత్య జరిగినప్పుడు చంద్రబాబు అసెంబ్లీలో రాజశేఖరరెడ్డి తనయుడు జగన్‌పైన ఆరోపణలు చేసినప్పుడు అప్పటికప్పుడే సీబీఐ దర్యాప్తునకు అంగీకరించారు. ఇప్పుడు వివే కానందరెడ్డి హత్యపైన సీబీఐ దర్యాప్తు చేయించేందుకు చంద్రబాబుకి అభ్యం తరం ఎందుకు ఉండాలి? అప్పుడు చంద్రబాబు శాసనసభలో వేసిన వీరం గంతో పోల్చితే ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి డిమాండ్‌ చేసిన విధం చాలా సౌమ్యంగా ఉంది.

‘సిట్‌’ సాధించింది పూజ్యం
ఇక చంద్రబాబు వేసే ప్రత్యేక దర్యాప్తు బృందాల(సిట్‌) నిర్వాకం ప్రజలకు తెలియదా? అధికారంలోకి వచ్చిన కొత్తల్లో శేషాచలం అడవులలో ఎర్రచందనం అపహరిస్తున్నారనే ఆరోపణపైన ఒకానొక దుందుడుకు ఉన్నతాధికారి ఆదేశాల మేరకు  పోలీసులు జరిపిన కాల్పులలో 20 మంది నిరుపేద కూలీలు దర్మరణం పాలైనారు. దానిపైన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రవిశంకర్‌ అయ్యన్నార్‌ నాయ కత్వంలో ‘సిట్‌’ను నియమించారు. ఫలితం శూన్యం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనూ చక్రం తిప్పాలనే దురాశతో టీడీపీ శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డిని రూ. 50 లక్షలతో టీఆర్‌ఎస్‌ శాసనసభ్యుడు స్టీవెన్సన్‌ దగ్గరికి పంపించి, పట్టుబడి, హైదరాబాద్‌ నుంచి విజయవాడకు పలాయనం చిత్తగించి, ఆ కేసులో రాజీ చేసుకొని ఊరట పొందారు.

ఓటుకు కోట్ల కేసు కొనసాగింపుగా ‘యూ హేవ్‌ పోలీస్‌. ఐ హేవ్‌ పోలీస్‌. యూ హేవ్‌ ఏసీబీ. ఐ హేవ్‌ ఏసీబీ’ అంటూ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపైన నియమించిన ‘సిట్‌’ సైతం ఒరగబెట్టింది ఏమీ లేదు. గోదావరి పుష్కరాల సందర్భంగా రాజమహేంద్రవరంలో తాను షూటింగ్‌లో పాల్గొన్న సమయంలో విధించిన నిబంధనల ఫలితంగా తొక్కిసలాట జరిగి 29 మంది దుర్మరణం పాలైతే దాని విచారణకు పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి సోమయాజులును నియమిస్తే మీడియాదీ, భక్తులదే అపరాధమంటూ ఆయన తేల్చారు. చంద్రబాబుకి ‘క్లీన్‌చిట్‌’ ఇచ్చారు.

నాటి దృశ్యాలను టీవీ చానళ్ళలో చూసిన ప్రజలు మాత్రం ముఖ్యమంత్రిని దోషిగా నిలబెట్టారు. విశాఖ భూకుం భకోణంపైనా, కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌పైనా, విజయవాడలో టీడీపీ శాసనస భ్యుడు బోండా ఉమామహేశ్వరరావుపైన వచ్చిన భూకబ్జా ఆరోపణలపైనా, విశాఖ మన్యంలో పోలీసులు చేసిన జంట హత్యలపైనా దర్యాప్తునకు నియ మించిన ‘సిట్‌’లు సాధించిన ఫలితం ఏమిటి? వివేకానందరెడ్డి హత్యపైన దర్యాప్తు చేసేందుకు వేసిన ‘సిట్‌’ ఏమి చేస్తుందో, ఏమని నిర్ణయిస్తుందో ఊహిం చడం కష్టమా?

ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రికీ, డీజీపీకీ జవాబుదారీ కాని కేంద్ర సంస్థతో దర్యాప్తు చేయించాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరడం అసమంజసం ఎట్లా అవుతుంది? సీబీఐ దర్యాప్తునకు అంగీకరించకపోగా, ‘సొంత చిన్నాన్న హత్య జరిగితే సాక్ష్యాధారాలు మార్చివేశారు,’ అంటూ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా సాక్ష్యాధారాలు మార్చినట్టు శనివారం సాయంత్రం ఎన్నికల శంఖారావం సభలో  చంద్రబాబునాయుడు నిస్సంకోచంగా ఆరోపించడం దిగజారుడు రాజకీయాలకి ప్రబల నిదర్శనం. ‘సిట్‌’ దర్యాప్తులో ఏమి తేల్చాలో అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడే చెప్పారు. వారి నిర్ణయం భిన్నంగా ఎందుకు ఉంటుంది? నాలుగు దశాబ్దాలకుపైగా రాజకీయం చేసి, పద్నాలుగు సంవత్సరాలు ముఖ్య మంత్రిగా పని చేసి తెలుగు రాష్ట్రాలలో రికార్డు సృష్టించిన సీనియర్‌ నాయకుడికి కాస్త మనసు కూడా ఉండాలనీ, యంత్రంలాగా స్పందించరాదనీ ఆశించడం అత్యాశ కాదు కదా!

కె. రామచంద్రమూర్తి 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top