నరేంద్ర మోదీ (ప్రధాని) రాయని డైరీ

Prime Minister Narendra Modi Un Written Dairy - Sakshi

బీజింగ్‌ ఫ్లయిట్‌ ఎక్కుతుంటే ఫోన్‌ వచ్చింది! ఫ్లయిట్‌లో ఏదో టెక్నికల్‌ ప్రాబ్లమ్‌ అని!! ‘‘ముందే చూసుకోనక్కర్లేదా?’’ అన్నాను. ప్రధానికే ఇలా ఉంటే ప్రధాని కానివాళ్లకు ఇంకెలా ఉంటుందో?! ఫ్లయిట్‌ ఎక్కాక, ‘బండి ఫెయిలైంది దిగండి’ అంటారేమో మర్యాద లేకుండా.  
‘‘ఇప్పుడేంటి? ఎక్కొద్దంటావా?’’ అన్నాను. 
‘‘మీ ఫ్లయిట్‌ కాద్సార్‌ ప్రాబ్లమ్‌. రాహుల్‌ గాంధీ ఫ్లయిట్‌’’ అన్నారు అట్నుంచి. 
‘‘ఎవరయ్యా నువ్వు?’’ అన్నాను. 
‘‘కర్ణాటక నుంచి సార్‌. ట్విట్టర్‌లో మిమ్మల్ని ఫాలో అవుతుంటాను’’ అన్నాడు. 
‘‘నా నంబర్‌ ఎవరిచ్చారు నీకు?’’ అని అడిగాను. 
‘‘మీరు నాకు నంబర్‌ ఇవ్వలేద్సార్‌. నేనే మీ నంబర్‌ తీసుకున్నాను’’ అన్నాడు. 
‘‘సరే చెప్పు. రాహుల్‌ గాంధీ ఫ్లయిట్‌కి ప్రాబ్లమ్‌ వస్తే నాకెందుకు ఫోన్‌ చేస్తున్నావ్‌?’’ అని అడిగాను.
‘‘అభిమానం సార్‌’’ అన్నాడు!
‘‘ఎవరి మీద? రాహుల్‌ మీదా?’’ అన్నాను. 
ట్విట్టర్‌ ఫాలోవర్‌ నవ్వాడు. ‘‘ఇద్దరి మీదా సార్‌’’ అన్నాడు. 
‘‘ఫ్లయిట్‌ కదలబోతోంది. వచ్చాక మళ్లీ మాట్లాడతా’’ అన్నాను. 
‘‘అది కాద్సార్‌. రాహుల్‌ గాంధీ ఫ్లయిట్‌లో మీరే ఏదో నట్టు లూజ్‌ చేయించారని అందరూ అనుకుంటున్నారు ఇక్కడ’’అన్నాడు. 
‘‘అందరూ అనుకుంటే నేనేం చేసేదయ్యా?’’ అన్నాను. 
‘‘రాహుల్‌ గాంధీ కూడా అలాగే అనుకుంటున్నారు సార్‌’’ అన్నాడు. 
‘‘నేనెందుకు చేస్తానయ్యా. రాహుల్‌ నాకు పోటీగా వస్తున్నాడా ఏంటి.. చైనాలో జిన్‌పింగ్‌ని కలవడానికి?!’’ అన్నాను. 
‘‘అక్కడికి రావడం లేద్సార్‌. మా కర్ణాటకలోనే ఇక్కడినుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి తిరుగుతున్నారు’’ అన్నాడు. 
‘‘అయితే ఏం చెయ్యమంటావ్‌?’’ అన్నారు. 
‘‘ఒక్కసారి మీరు రాహుల్‌గాంధీతో మాట్లాడితే బాగుంటుంది సార్‌’’అన్నాడు. 
‘‘నేనెందుకు మాట్లాడాలి?’’ అన్నాను. 
‘‘మీరు మాట్లాడితే, ఆ ఫ్లయిట్‌లో టెక్నికల్‌ ప్రాబ్లమ్‌కి మీరు కారణం కాదని తెలుస్తుంది’’ అన్నాడు. 
ఫోన్‌ పెట్టేసి, రాహుల్‌గాంధీకి ఫోన్‌ చేశాను. రాహుల్‌ ఎత్తుకోలేదు. ఇంకెవరో ఎత్తుకున్నారు. 
‘‘హలో సార్‌. నేనే. ఇందాక కట్‌ అయింది. మీ ట్విట్టర్‌ ఫాలోవర్‌ని’’ అన్నాడు. 
‘‘నా ఫాలోవర్‌ని అని చెబ్తూ రాహుల్‌ దగ్గర ఏం చేస్తున్నావయ్యా?’’ అని అడిగాను. 
‘‘మీ ఫాలోవర్‌గా అందర్నీ ఫాలో చేస్తుంటాన్సార్‌’’ అన్నాడు!!
ఫోన్‌ కట్‌ చేసి నా ఫారిన్‌ సెక్రెటరీకి ఇచ్చాను. 
‘‘నాకో డౌట్‌ సార్‌’’ ఫారిన్‌ సెక్రెటరీ. ‘‘ఏంటి?’’ అన్నాను.
‘‘ఇప్పటివరకు మాట్లాడింది రాహులేనని’’ అన్నాడు!!
- మాధవ్‌ శింగరాజు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top