శ్రామిక జన కేతనం ‘మే డే’ | Sakshi
Sakshi News home page

శ్రామిక జన కేతనం ‘మే డే’

Published Tue, May 1 2018 2:07 AM

May Day Communist Ideas In America - Sakshi

ప్రపంచంలో ఉన్న వింతల్లో కల్లా పెద్ద వింత ఏనాడో అమెరికాలో జరిగింది. ‘‘కమ్యూనిస్టు భూతాన్ని’’ నిర్మూలించటానికి కంకణం కట్టుకున్న అమెరికాలోనే ప్ర పంచ కార్మిక విజయాలకు అంకురార్పణ జరగటమే ఆ వింత. పారిశ్రామిక విప్లవం ఆవిర్భావంతో పెట్టుబడిదారీ వర్గం–కార్మిక వర్గం అనే రెండు ప్రత్యర్ధి వర్గాలు ఏర్పడ్డాయి. కార్మికులను బానిసల్లా చూసేవారు. రోజుకు 16  నుంచి 20 గంటల దాకా పనిచేయాల్సిన దుస్థితికి కార్మికులు నెట్టబడ్డారు. 10 గంటలే పని చేస్తామనే డిమాండ్తో ఆందోళనలు , సమ్మెలు చేయటం ప్రారంభమైంది. దీంతో అమెరికాలో 1827లో తొలిసారిగా 10 గంటల పనిదినాన్ని ఆమోదిస్తూ శాసనం చేశారు.

1884లో అమెరికన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ లేబర్‌ ఎనిమిది గంటల పనిదినానికి తీర్మానించింది. ఈ డిమాండ్‌ను సాధించడానికి 1886 మే 1న ఉద్యమించాలని పిలుపునిచ్చింది. దీనికి స్పందించిన చికాగో నగర కార్మికులు మే 1న సమ్మె ప్రారంభించారు. శాంతియుతంగా సాగుతున్న నిరసనపై పోలీసులు కాల్పులు జరగ్గా ఆరుగురు కార్మికులు మరణించారు. కాల్పులకు నిరసనగా హే మార్కెట్లో జరిపిన సభపై మళ్లీ పోలీసులు విరుచుకుపడ్డారు. ఈ ఘర్షణలో నలుగురు కార్మికులు, ఏడుగురు పోలీసులు చనిపోయారు. ఈ ఘర్షణ సాకుగా చూపి ఒక తప్పుడు కేసు బనాయించి నలుగురు కార్మిక నాయకుల్ని 11–11.1887న ఉరితీశారు. అమెరికాలోని ఇతర ప్రాంతాల్లోనూ దమనకాండ కొనసాగింది.

1890లో మొదటి మేడే జరిగింది. ఇన్ని బలిదానాలో సాధించుకున్న హక్కులు, సౌకర్యాలు మరింత మెరుగు పడాల్సిన ఆధునిక యుగంలో ముఖ్యంగా మనదేశంలో ఇవి రోజు రోజుకూ మృగ్యమవుతున్నాయి. విద్యావంతులే అధికంగా పనిచేసే అనేక కార్పొరెట్‌ రంగాల్లో 10–12 గంటలు పని చేయిస్తున్నారు. ఉద్యోగ భద్రత లేకుండా ఉంది. సెజ్‌ లోనే కాక అనేక పరిశ్రమల్లో కార్మిక చట్టాలు అమలుకు నోచుకోవడం లేదు. అసంఘటిత రంగంలో ఆధునిక బానిస వ్యవస్థ యధేచ్చగా కొనసాగుతోంది. బాలకార్మికుల్ని గూర్చి చెప్పుకోకపోవటమే ఉత్తమం. పని ప్రదేశాల్లో మహిళ పరిస్థితి మరీ దారుణం.చికాగోలో ఉరితీసిన కార్మిక వీరుడు స్విస్‌ ‘‘మమ్మల్ని ఉరితీయటం ద్వారా కార్మికుల్ని ఆపలేరు, మీరు రగిలించిన నిప్పురవ్వ జ్వాలలై లేస్తాయి. దాన్ని మీరు ఆపలేరు’’ అన్న మాటల్ని కార్మికులు నిజం చేయాలి.

(నేడు మేడే సందర్భంగా)
చెరుకూరి సత్యనారాయణ, న్యాయవాది, గుంటూరు 
మొబైల్‌ ః 98486 64587 

Advertisement
Advertisement