బుల్లెట్‌కి బుల్లెట్టే సమాధానమా?

Mangari Rajender writes on fake encounters - Sakshi

విశ్లేషణ

బుల్లెట్‌కి బుల్లెట్‌ ఎప్పుడూ సమాధానం కాదు. పోలీసులకి చట్టాన్ని మించిన అధికారాలు ఇస్తే జిమ్‌ ట్రైనర్‌ లాంటి వ్యక్తులు బలయ్యే అవకాశం ఉంది. మరణ శిక్షను తొలగించాలన్న వాదన బలపడుతున్న దశలో బూటకపు ఎన్‌కౌంటర్లు ఎంతవరకు సమంజసం?

గత వారం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో 18 ఎన్‌కౌంటర్లు జరిగాయి. గత సంవత్సరం మార్చి నెల నుంచి ఇప్పటివరకు దాదాపు 34 మంది ఎన్‌కౌంటర్లలో మరణించారు? ఎన్‌కౌంటర్ల రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్‌ ప్రసిద్ధి చెందుతోంది. ఎలాంటి కారణాలు లేకుండా ఇద్దరు వ్యక్తులు పోలీసు కాల్పుల్లో గాయపడ్డారు. వాళ్ల తప్పిదం ఉన్నట్టు ఎలాంటి వార్తలు ఇప్పటివరకు రాలేదు. ఒక వ్యక్తి జిమ్‌ ట్రైనర్‌. రెండవ వ్యక్తి అతని సన్నిహితుడు. ఓ వివాహానికి హాజరై ఇంటికి వెళ్తున్నప్పుడు పోలీసులు వాళ్లను ఆపి కాల్చారు. అక్కడ ఎలాంటి ఎదురు కాల్పులు లేవు. అది ఎన్‌కౌంటర్‌ అని, ఆ వ్యక్తుల బంధువులు, వ్యక్తిగత కారణాలవల్ల కాల్చారని పోలీసులు అంటున్నారు. ఈ సంఘ టనలో పాలుపంచుకున్న పోలీస్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ని అరెస్టు చేశారు. ముగ్గురు పోలీసులని సస్పెండ్‌ చేశారు.

న్యాయపాలన ఉన్న మన దేశంలో ఎన్‌కౌంటర్లు కొత్త కాదు. ఏ రాష్ట్రమూ దానికి మినహాయింపు కాదు. పోలీసుల చర్యల్లో వ్యక్తులు మరణించినప్పుడు ఆ చర్యలని ఆత్మరక్షణార్థం జరిపిన కాల్పులని పోలీసులు చెబుతారు. బూటకపు ఎన్‌కౌంటరని ప్రజాసంఘాలు అంటూ ఉంటాయి. పోలీసులు చేసే ఎన్‌కౌంటర్‌ మరణాల్లో ఆత్మరక్షణ అనేది అరుదుగా ఉంటుంది. ఎందుకంటే అవి దాదాపు కావాలని చేసినవి కావొచ్చు లేదా ప్రతీకారంతో చేసినవి కావొచ్చు.

ఆత్మరక్షణ కోసం చేసిన వాటిని, ప్రతీకారంతో చేసిన వాటిని స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఎదుటి వ్యక్తిని చంపితే తప్ప అతని నుంచి ప్రాణాన్ని రక్షించుకోలేని పరిస్థితుల్లోనే ఆత్మరక్షణ కోసం అతణ్ని చంపే అవకాశం ఉంటుంది. అంతే తప్ప మిగతా సందర్భాలలో లేదు. ఎదుటి వ్యక్తుల దగ్గర ఎలాంటి ఆయుధాలు లేనప్పుడు చంపితే అది ఆత్మరక్షణ కోసం చేసినదిగా భావించే అవకాశం లేదు.

ఎదుటి వ్యక్తులని పట్టుకునే అవకాశం ఉన్నప్పుడు కూడా కాల్పులు జరిపి చంపితే అది ప్రతీకార చర్య అవుతుంది. ఈ విషయాన్ని సుప్రీం కోర్టు ‘ఎక్స్‌ట్రా జ్యుడీషియల్‌ ఎగ్జిబిషన్‌ విక్టిమ్‌ ఫ్యామిలీస్‌ అసో సియేషన్, ఇతరులు వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (ఏ.ఐ.ఆర్‌ 2016 సుప్రీంకోర్టు 3400)’ కేసులో చెప్పింది. ఎవరిమీద అయితే దాడి జరిగిందో ఆ వ్యక్తి అవసరమైన దానికన్నా ఎక్కువ బలాన్ని ఉపయోగిస్తే ఆ వ్యక్తే దురాక్రమణదారు అవుతాడు. అతను శిక్షార్హుడవుతాడు. ఒకవేళ ‘రాజ్యం’ దాని ప్రతినిధులు అవసరమైన దానికన్నా, ఎక్కువ బలాన్ని ఉపయోగించి మొదటి దురాక్రమణదారుని చంపితే అది న్యాయేతర మరణం అవుతుంది. (ఎక్స్‌ట్రా జ్యుడీషియల్‌ కిల్లింగ్‌).

దురాక్రమణదారు తనని చంపుతాడన్న నిజమైన భయాందోళన ఉన్నప్పుడు ఆత్మరక్షణ అనేది అమల్లోకి వస్తుంది. కానీ ప్రతీకారం తీర్చు కునేందుకు కాదు. (దర్శన్‌సింగ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్, ఏ.ఐ.ఆర్‌ 2010 సుప్రీంకోర్టు 1212). చాలా ఎన్‌కౌంటర్లు ఆత్మరక్షణ కోసం చేసినవి కాదు. ప్రతీకారం కోసమో లేదా కావాలని చంపినవి మాత్రమే. వీటి విషయంలో సరైన దర్యాప్తు జరిగితే ఈ విషయాలు బయటకు వస్తాయి.

అపాయకరమైన వ్యక్తులని, తీవ్రమైన నేరాలు చేసిన వ్యక్తులని పోలీసులు చంపుతూ ఉంటారు. ఉత్తరప్రదేశ్‌లో ఆ విధంగా జరుగు తుందన్న ఆరోపణలు ఉన్నాయి. ‘ఓంప్రకాశ్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ జార్ఖండ్‌ 2012 (12) ఎన్‌.సి.సి. 72’ కేసులో సుప్రీంకోర్టు ఈ విధంగా అభిప్రా యపడింది. ‘‘అపాయకరమైన నేరస్తులన్న కారణంగా వాళ్లను పోలీ సులు మట్టుపెట్టడానికి వీల్లేదు. వాళ్లని అరెస్టు చేసి కోర్టుకి పంపిం చాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది’’.

దురాక్రమణదారు ఎవరు అన్నది తెలుసుకోవడం కోసం దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. బాధితుల అసోసియేషన్‌ దాఖలు చేసిన కేసులో ఈ విషయమే సుప్రీంకోర్టు చెప్పింది. మానవ హక్కుల జాతీయ కమిషన్‌ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ఎన్‌కౌంటర్లు జరిగిన ప్పుడు సి.బి.సి.ఐ.డి. ద్వారా గానీ వేరే ఏజెన్సీ ద్వారాగానీ దర్యాప్తు జరిపించాలి. పి.యు.సి.ఎల్‌ వర్సెస్‌ సివిల్‌ లిబర్టీస్‌ 2015 క్రిమినల్‌ జర్నల్‌ 610 కేసులో ఈ మార్గదర్శకాలు పాటించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

భారతీయ శిక్షాస్మృతిలోని ఆత్మరక్షణ నిబంధనలు ఏమి చెప్పినా, సుప్రీంకోర్టు ఎన్ని తీర్పులు చెప్పినా మానవ హక్కుల కమిషన్‌ ఎన్ని మార్గదర్శకాలు జారీ చేసినా మన దేశంలో ఎన్‌కౌంటర్ల విషయంలో ఎలాంటి గుణాత్మకమైన మార్పు కన్పించడం లేదు. బుల్లెట్‌కి బుల్లెట్‌ ఎప్పుడూ సమాధానం కాదు. పోలీసులకి చట్టాన్ని మించిన అధికారాలు ఇస్తే జిమ్‌ ట్రైనర్‌ లాంటి వ్యక్తులు బలయ్యే అవకాశం ఉంది. మరణ శిక్షను తొలగించాలన్న వాదన బలపడు తున్న దశలో బూటకపు ఎన్‌కౌంటర్లు ఎంతవరకు సమంజసం?

ఎలాంటి దర్యాప్తూ, కోర్టు విచారణలు లేకుండా క్రిమినల్స్‌కి, ఆ పేరుతో మరికొందరిని మట్టుపెట్టవచ్చు. వాళ్లలో భయాన్ని కలిగించ వచ్చు. క్రిమినల్స్‌ ఈ విధంగా పెరగడానికి కారణాలను నిరోధించడా నికి తగు చర్యలని అన్వేషించకుండా చంపడం అనేది ఎప్పుడూ సమా   ధానం కాదు. ఈ చర్యలు న్యాయపాలనకి విఘాతం కలిగిస్తాయి. మన రాజ్యాం గాన్ని, శాసనాలని లెక్క చేయకపోవడం ఎంతవరకు సమంజసం?


- మంగారి రాజేందర్‌

వ్యాసకర్త కవి, రచయిత
మొబైల్‌ : 94404 83001

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top