న్యాయమూర్తులు పరిధులు దాటొచ్చా?

Mangari Rajender Article On Judges - Sakshi

విశ్లేషణ

న్యాయమూర్తులు కూడా సమాజం నుంచి వచ్చిన వ్యక్తులే. వాళ్ళ మీద కూడా ప్రభావాలు ఉంటాయి. అన్ని ప్రభావాలు చెడ్డవి అని అనడానికి వీల్లేదు. వాళ్ళు తమమీద ఉన్న ఒత్తిడి వల్ల ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. న్యాయవ్యవస్థ నుంచి కొన్ని ఒత్తిడులు ఉత్పన్నమవుతాయి. న్యాయమూర్తి సాంఘిక, సాంస్కృతిక, మతపరమైన నేపథ్యం నుంచి మరికొన్ని ఒత్తిడులు ఉత్పన్నమవుతాయి. ఇవే కాకుండా వర్గపరమైన పక్షపాత ధోరణులు కూడా ఉంటాయి. ఇంటి యజమాని వల్ల బాధితుడైన న్యాయమూర్తి కిరాయిదారుల పక్షం ఉండి యజమానులకి వ్యతిరేకంగా ఉంటాడు. వరకట్నం కేసు వల్ల బాధను అనుభవించిన వ్యక్తి, ఆ కేసుల్లో పక్షపాత ధోరణి కలిగి ఉంటాడు. ఇది ఒక ఉదాహరణ. వీటికి మంచి ఉదాహరణ భన్వారీ దేవి ఉదంతం. 

భన్వారీ దేవి ఓ ప్రభుత్వ ఉద్యోగి. ఆమె క్షేత్రస్థాయిలో పనిచేస్తూ ఉంటుంది. బాల్య వివాహాలు జరిగితే ఆ విషయాలు ప్రభుత్వానికి తెలియజేయడం ఆమె ఉద్యోగంలోని ఒక విధి. అలాంటి సంఘటన ఒకటి జరిగే అవకాశం ఉందని ఆమె ప్రభుత్వానికి సమాచారం అందిం చింది. ఆ వివాహాన్ని పోలీసులు నిరోధించటానికి ప్రయత్నించి విఫల మయ్యారు. ఆ వివాహం రహస్యంగా జరిగింది. ఆ వివాహం జరిగే విషయంలో ఆమె జోక్యం చేసుకున్న కారణంగా వివాహం అయిన కొద్ది నెలలకి ఆమె మీద దాడి జరిగింది. ఆమె భర్త సమక్షంలో ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ కేసులో ముద్దాయిలను ఆ కేసుని విచారించిన సెషన్స్‌ జడ్జి విడుదల చేశాడు. ఆ న్యాయమూర్తి ఇచ్చిన వివరణ చాలా విచిత్రంగా ఉంది. అత్యాచారాన్ని టీనేజీలో ఉన్న యువకులు చేస్తారు. ఈ కేసులో ఉన్న ముద్దాయిలు మధ్య వయ స్కులు. గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు. వాళ్లు ఈ నేరం చేయడానికి అవకాశం లేదు. అందులోనూ ఆధిపత్యæ కులానికి చెందిన వ్యక్తులు నిమ్న కులానికి చెందిన వ్యక్తితో అపవిత్రం కారు. 

ఈ తీర్పు చెప్పిన న్యాయమూర్తి ఆధిపత్య కులానికి చెందిన వ్యక్తి. కాబట్టే ఇలాంటి తీర్పు వెలువడింది. ఈ తీర్పుమీద అప్పట్లో దేశ వ్యాప్తంగా చర్చ జరిగింది. అదేవిధంగా కొంతమంది న్యాయ మూర్తులు ‘ఆమోద యోగ్యం కాని వక్రబుద్ధితో కూడిన (పర్వర్స్‌) తీర్పులని ప్రకటిస్తూ ఉంటారు. అలాంటి ఒక తీర్పుని ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులోని డివిజన్‌ బెంచ్‌ క్రిమినల్‌ అప్పీలు నెం. 1025 ఆఫ్‌ 2008 కేసులో 17.08.2012 నాడు ప్రకటించింది. ఈ తీర్పు పర్వర్స్‌ తీర్పు అని సుప్రీంకోర్టు డివిజన్‌ బెంచి 2017 ఫిబ్రవరి 9న ప్రకటించింది. కానీ ఈవిధంగా హైకోర్టు తీర్పుని పర్వర్స్‌ తీర్పు అని ప్రకటించడం సంతోషకరమైన వ్యక్తీకరణ కాదని కూడా సుప్రీంకోర్టు సి. ఏక్‌నాథ్‌ వర్సెస్‌ వై. అమరనాథ రెడ్డి కేసులో అభిప్రాయపడింది. 

ప్రభుత్వ భూముల వేలం కేసు నుంచి వైదొలగాలని ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన కేసుని పరిష్కరించాల్సిన జస్టిస్‌ రాకేశ్‌ కుమార్‌ తన పరిధిలో లేని అంశాలపై వ్యాఖ్యానించారు. ఇది ఆందోళనకరం. దేశానికి జస్టిస్‌ మురళీధర్, జస్టిస్‌ చంద్రూ వంటి న్యాయమూర్తులు అవసరం. దేశం ఇలాంటి న్యాయమూర్తులనే కోరుకుంటోంది.

ఏపీ హైకోర్టులో జస్టిస్‌ రాకేశ్‌ కుమార్, జస్టిస్‌ రమేష్‌ నేతృత్వం లోని డివిజన్‌ బెంచ్‌ 2020 డిసెంబర్‌ 30న  ఇచ్చిన తీర్పుని గమనిం చినప్పుడు ఈ విషయాలన్నీ గుర్తుకు వచ్చాయి. ఇది ఊహించని ఉత్తర్వు. ఎందుకంటే తన విచారణ పరిధిలో లేని చాలా అంశాలని కోర్టు స్పృశించి తన అసంతృప్తిని వ్యక్తపరిచింది. ఈ అసంతృప్తికి కారణం ఏమంటే ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను బదిలీ చేయడం. అంతేకాదు. వై.యస్‌. జగన్‌ మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం హైకోర్టుని తక్కువ చేస్తోందని కూడా ఈ తీర్పు అక్కసుని వెళ్లగక్కింది.

కోర్టు కేసు నుంచి ఓ న్యాయమూర్తి తప్పుకోవాలన్న దరఖాస్తుని పరిష్కరిస్తూ డివిజన్‌ బెంచ్‌ ఈ కటువైన పరిశీలనలని చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఏపీ హైకోర్టు నిర్వహణ మీద భారత ప్రధాన న్యాయమూర్తి ఎస్‌.ఏ బాబ్డేకి రాసిన లేఖల పర్యవసానంవల్లే ఇద్దరు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల బదిలీలు కూడా జరిగాయని డివిజన్‌ బెంచి అభిప్రాయపడింది. ముఖ్యమంత్రికి కావాల్సింది సుప్రీంకోర్టు కొలీజియం చేసిందన్న భావన కలిగేవిధంగా కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి తనమీద ఉన్న కేసుల విచారణలో జాప్యం జరగడానికి అలా ఆరోపణలు చేశారని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక్కడ అర్థం కాని విషయం ఏమంటే ఆ కేసు విచారణని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు చేయడం లేదు. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి ఆ కేసులని విచారిస్తు న్నారు. ఈ బదిలీల వల్ల ఆ కేసుల విచారణ ఏ విధంగా కుంటు పడుతుందో అర్థం కాని విషయం. కోర్టు ఎన్ని రోజుల్లో పరిష్కరిం చాలో హైకోర్టులు చెబుతాయి తప్ప ఏ విధంగా పరిష్కరించాలో చెప్పజాలవు. అలా చెబితే అది న్యాయవ్యవస్థ స్వతంత్రతకే భంగం వాటిల్లుతుంది. 

ప్రభుత్వ భూముల వేలం కేసునుంచి న్యాయమూర్తి రాకేశ్‌ కుమార్‌ వైదొలగాలని ప్రభుత్వం దాఖలు చేసిన కేసుని పరిష్కరించా ల్సిన కోర్టు తన పరిధిలో లేని అంశాల గురించి వ్యాఖ్యానించడం ఆశ్చర్యాన్ని కాదు ఆందోళనని కల్గిస్తుంది. పైగా లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌ మీద ప్రభుత్వం దాడి చేసింది. ఆ తరువాత ఎలక్షన్‌ కమిషన్‌ మీద దాడి చేసింది. ఇప్పుడు హైకోర్టు, సుప్రీంకోర్టుల మీద అధికారంలో ఉన్న వ్యక్తులు దాడి చేస్తున్నారని కోర్టు తన ఆందోళనని వ్యక్తం చేసింది. అక్కడితో ఊరుకోలేదు. 2011 నుంచి విచారణలో ఉన్న కేసుల్లో ఇంతవరకు విచారణాంశాలను నిర్ధారించకపోవడం అపహాస్యం కాదా అని డివిజన్‌ బెంచ్‌ ప్రశ్నించింది. కోర్టుల్లో జాప్యానికి కారణాలు అనేకం. దానికి సమాధానాన్ని సంబం ధిత కోర్టు వివరిస్తుంది. మరొకరు వివరించలేరు.

సీబీఐ ఏర్పాటు న్యాయబద్ధం కాదని అస్సాం హైకోర్టు ఇచ్చిన తీర్పు దాదాపు ఎని మిదేళ్లుగా సుప్రీంకోర్టు పరిశీలనలో ఉంది. ఈ జాప్యానికి కారణం ఏమిటి? సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చలమేశ్వర్‌ ఇటీవల ఇదే విషయాన్ని ప్రస్తావించారు కూడా. న్యాయమూర్తి రాకేశ్‌ కుమార్‌ విచారణ అంశం కానీ చాలా విష యాలను తన ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. అందులో ముఖ్యమైంది గూగుల్‌లో ముఖ్యమంత్రి గురించిన ప్రస్తావన. కోర్టు విచారణలో ఉన్న అంశం ఏమిటి? న్యాయమూర్తి ప్రస్తావించిన అంశాలు ఏమిటి?
విచిత్రమైన అంశం ఏమంటే మనదేశ జ్యురిస్‌ప్రుడెన్స్‌ ప్రకారం నేర నిరూపణ జరిగేవరకు ముద్దాయిలను అమాయకులుగా పరిగణిం చాలి. ఇది ప్రాథమిక సూత్రం. ఈ విషయాన్ని ఎవరూ విస్మరించ కూడదు. తప్పుచేసిన వ్యక్తికి శిక్ష పడటం ఎంత అవసరమో, అమాయ కులకి శిక్ష పడకుండా చూడాల్సిన బాధ్యత కూడా కోర్టుల మీద ఉంటుంది. అంతేకాని కోర్టు విచారణలో లేని అంశాల మీద మాట్లా డటం పరిశీలనలు చేయడంలోని ఔచిత్యం బోధపడటం లేదు.

కోర్టుల మీద విశ్వసనీయత పెరగాలంటే కోర్టులు జారీచేసే ఉత్త ర్వులు, తీర్పులు తగు కోణాలతో ఉండాలి. అంతేకాదు అవి వెంటనే పార్టీలకు అందుబాటులో ఉండాలి. తీర్పులు నిష్పక్షపాతంగా ఉండా లంటే అవి తగు కారణాలతో ఉండాలి. కోర్టు పరిధిలో ఉన్న అంశాల మీదే చర్చ జరగాలి. వాటి గురించి విశ్లేషణ ఉండాలి. అదేవిధంగా కోర్టు ఒక నిర్ణయానికి రావడానికి కారణాలనేవి ఎలాంటి పూర్వ భావ నలు, పక్షపాతం లేకుండా ఉండాలి. విచారించాల్సిన దరఖాస్తులో కానీ కేసులో గానీ లేని విషయాలని ప్రస్తావిస్తే అది తగు కారణాలతో చెప్పిన ఉత్తర్వుగా గానీ తీర్పుగా కానీ పరిగణించ బడదు. పార్టీలు లేవనెత్తిన అంశాలన్నింటిపైనా సమాధానాలు కోర్టు ఉత్తర్వుల్లో ఉండాలి. అలా లేనప్పుడు ఆ  కోర్టు మీద విశ్వసనీయత ఏర్పడదు. అనవసర కామెంట్స్, తగు కారణాలు లేనప్పుడు ఆ వ్యాఖ్యానాలని తొలగించుకోవడానికి, సరైన కోణాలలో తీర్పు కోసం పార్టీలు పై కోర్టులకి వెళ్లాల్సి వస్తుంది. దానివల్ల కోర్టులమీద అనవసర భారం పడుతుంది. తగు కారణాలతో తీర్పులు ప్రకటించడంవల్ల కోర్టుల మీద భారం తగ్గుతుంది.

న్యాయమూర్తి ఏ స్థాయిలో ఉన్నప్పటికీ అతను స్వేచ్ఛగా, స్వతంత్రంగా తీర్పులను ప్రకటించాలి. తన మనఃసాక్షిగా, చట్టానికి అనుగుణంగా తీర్పులను ఇవ్వాలి తప్ప, కోర్టు విచారణలో లేని అంశాలను ప్రస్తావించకూడదు. నిష్పక్షపాతం గురించి  సుప్రీంకోర్టు ఎస్‌.పి గుప్తా కేసులో వివరించింది. అది ఇప్పటికీ ఓ గీటురాయి. కేసు విచారణ గురించి సుప్రీంకోర్టు ఆ తీర్పుని ప్రకటించినప్పటికీ అది అన్ని ఉత్తర్వులకి, తీర్పులకి వర్తిస్తుంది. ఓ న్యాయమూర్తి నిష్పక్ష పాతాన్ని, అతని ఉత్తర్వులు ఎలాంటి పక్షపాతంలో లేవని అనుకోవ డానికి రెండు పరీక్షలు ఉన్నాయి. అవి– వ్యక్తిగత పరీక్ష: న్యాయమూర్తికి కేసులో ఎలాంటి వ్యక్తిగత ఆసక్తి ఉండకూడదు. తన విశ్వాసాల వల్ల ఎదుటి వ్యక్తికి హాని జరుగకూడదు. తటస్థ పరీక్ష (ఆబ్జెక్టివ్‌ టెస్ట్‌):  తన నిష్పక్షపాతం మీద ఎలాంటి సంశయం రాకుండా ఉండే విధంగా విచారణ జరపాలి.

చాలాసార్లు సుప్రీంకోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. పార్టీలకు విశ్వాసం లేనప్పుడు న్యాయమూర్తి ఆ కేసుని నిష్పక్ష పాతంగా పరిష్కరించినా అలాంటి భావన పార్టీలకు కలగదు. అలాం టప్పుడు ఆ కేసులని పరిష్కరించడం ఎందుకు? అనవసర విషయాల ప్రస్తావన మరెందుకు? ఇలాంటి వాటివల్ల కోర్టులపై గౌరవం తగ్గే అవకాశం లేదా? చివరగా ఇద్దరు న్యాయమూర్తులు గుర్తుకొస్తున్నారు. ఒకరు జస్టిస్‌ మురళీధర్‌. రెండవవారు జస్టిస్‌ చంద్రూ. మొదటి న్యాయమూర్తి ఢిల్లీ హైకోర్టు నుంచి పంజాబ్‌/హరియాణాకి బదిలీ అయినప్పుడు చండీగఢ్‌లో న్యాయమూర్తులు దారి పొడవునా నిల్చొని ఆహ్వానం పలికారు. అదే విధంగా జస్టిస్‌ చంద్రూ నిరాడంబరంగా తన పదవీ విరమణ చేశారు. ప్రజల న్యాయమూర్తిగా ఆయనను కొని యాడారు. దేశం ఇలాంటి న్యాయ మూర్తులనే కోరుకుంటుంది.

మంగారి రాజేందర్‌ 
(వ్యాసకర్త గతంలో జిల్లా జడ్జిగా, తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యులుగా పనిచేశారు)
ఈ–మెయిల్‌ : rajenderzimbo@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top