
కామెంట్
మన న్యాయమూర్తులకు బయటి శత్రువు లెవరూ ఉండరు. వారికి వారే శత్రువులు. ఇలా అనడం మీకు విచిత్రం కావచ్చు. కానీ నాకు అలాగే తోచింది. వారు ఒక్కోసారి తమను తాము మర్చిపోయారా అన్నట్లు అసాధారణంగా మాట్లాడుతుంటారు. అలా మాట్లాడేప్పుడు తమ మాటల పర్యవసానాలు ఎలా ఉంటాయోనన్న ఆలోచన వారిలో ఉండదా? వాటి ప్రభావం ఎలా ఉంటుందోనని ఆందోళన చెందరా? అశోకా యూనివర్సిటీలో ప్రొఫెసరైన అలీ ఖాన్ మహ్ముదాబాద్ వ్యాఖ్యల కేసులో వారు వ్యవహరించిన తీరు ఎలా ఉందో ఈ సందర్భంగా పరిశీలిద్దాం.
మొదటగా వారు ఆయన పోస్టును ‘డాగ్–విజిలింగ్’ అని నిందించారు. పదాలను ద్వంద్వార్థాలతో ఉపయోగించారని వ్యాఖ్యానించారు. ‘‘ఇతరులను అవమానించడానికి, కించపరచ డానికి లేదా అసౌకర్యం కలిగించడానికి ఉద్దేశపూర్వకంగా పదాలు ఎంపిక చేసుకున్నారు’’ అని పేర్కొన్నారు. కానీ తాము అనుకుంటున్న ఆ పదాలేమిటో చెప్పారా? చెప్పలేదు. పైగా, ‘‘ఆయన ఈ భావాలను సులభమైన, మర్యాదపూర్వకమైన, ఎంతో తటస్థమైన పదజాలం ఉపయోగిస్తూ, అతి సులభమైన భాషలోనూ వ్యక్తం చేయొచ్చు’’ అంటూ చెప్పుకుపోయారు. ఇక్కడ కూడా తాము అనుకుంటున్న ఆ భావాలేమిటో వారు చెప్పలేకపోయారు.
డాగ్–విజిల్ అంటే ఏమిటి? ఆ విజిల్ సాధారణంగా మనిషి చెవులు ఆలకించలేని శబ్దతరంగాల్లో (ఫ్రీక్వెన్సీలో) ఉంటుందని రాజ్యాంగ న్యాయశాస్త్రంలో పండితుడైన గౌతమ్ భాటియా అంటారు. మరి మహ్ముదాబాద్ ఫేస్‌బుక్ పోస్టుల్లో ఏ భాగాలను డాగ్ విజిల్స్ అని భావించాలి? ఏ ‘కుక్కల’కు ఆయన విజిల్స్ వేశారు? ఆయన ఉద్దేశించని ‘శునకేతరులు’ ఎవరు?
అసలు ఆందోళన
జడ్జీలు వీటిలో వేటినీ వేలెత్తి చూపించలేదు. ఏం... వారు అలా చేయదగిన పని కాదా అది? అందుకు బదులుగా... ‘‘అతను వాడిన పదజాల సంక్లిష్టతను సమగ్రంగా అర్థం చేసుకోవడానికి, ఈ రెండు ఆన్‌లైన్ పోస్టుల్లో ఉపయోగించిన కొన్ని వ్యక్తీకరణల స్వభావాన్ని సరైన రీతిలో గ్రహించడానికి ఒక సిట్ ఏర్పాటు చేయాలని హరియాణా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ను మేం ఆదేశిస్తున్నాం’’ అని ఉత్తర్వు జారీ చేశారు. అయితే ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్)లో పోలీసు అధికారులే ఉంటారు. శామ్యూల్ జాన్సన్, నోవా వెబ్‌స్టర్ వంటి నిఘంటుకారులు (లెక్సికోగ్రాఫర్లు) ఉండబోరు.
వాస్తవం చెప్పాలంటే, ఈ ఇద్దరు న్యాయమూర్తులు రేకెత్తించిన ఆందోళనల్లో ఇది చిన్నమెత్తు కూడా ఉండదు. తీవ్రంగా ఆందోళన కలిగించేవి ఇంకా ఉన్నాయి. వారు పేర్కొన్న ఈ వాక్యాలను చూడండి: ‘‘ప్రతి ఒక్కరూ హక్కుల గురించి మాట్లాడతారు. నాకు ఇది చేసే హక్కు ఉందని, అలా చేసే హక్కు ఉందని అంటారు. కాని దేశం పట్ల మీ బాధ్యత ఏమిటో చెప్పరు.’’
నిజం ఏమిటి? రాజ్యాంగం ఏం చెబుతోంది? పౌరులుగా మనకు సంక్రమించిన ప్రాథమిక హక్కులను మాత్రమే అది ప్రత్యేకంగా గుర్తించింది తప్ప, రాజ్యాంగబద్ధంగా అమలు చేసి తీరాల్సినవి అంటూ ఎలాంటి బాధ్యతలనూ రాజ్యాంగం గుర్తించలేదు. దేశ భక్తుడిగా ఉండాల్సిన బాధ్యత కూడా మనకు లేదు. జెండా చుట్టుకు తిరగమని రాజ్యాంగం చెప్పలేదు. దేన్నయినా సరే సందేహించ డానికి, ప్రశ్నించడానికి మనకు ప్రతి హక్కూ ఉంది. మరి ఏ ప్రాతిపదికన ఈ న్యాయమూర్తులు హక్కులను, బాధ్యతలను ఒకే గాట కట్టారు? ఆ విషయం వారు చెప్పలేదు.
ఏమైనప్పటికీ, మహ్ముదాబాద్ ప్రొఫెసర్‌గా ఉన్న అశోకా యూని వర్సిటీ విద్యార్థులను, అధ్యాపకులను ఉద్దేశించి వారు మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి అత్యంత కలవరపాటుకు గురి చేస్తున్నాయి. అవేమిటో చదవండి: ‘‘వారు ఏమైనా సరే చేయగలం అనుకుంటే మేం ఒక ఉత్తర్వు జారీ చేస్తాం... ప్రైవేటు యూనివర్సిటీలు అని చెప్పుకొనే ఇలాంటి కొన్ని సంస్థలను ప్రారంభించడం, వాటిలో నానా రకాల శక్తులూ చేరి చేతులు కలపటం, బాధ్యతారహితమైన ప్రకటనలు చేయడం మాకు సమ్మతం కాదు. ఇలాంటి వారితో ఎలా వ్యవహరించాలో మాకు తెలుసు.’’
మాటలు న్యాయసమ్మతమేనా?
ఈ భూమ్మీద ఏ శక్తి వారిని ఇందుకు పురికొల్పింది? ఎలాంటి వివరణ గానీ, న్యాయ ఔచిత్యం గానీ లేకుండా కలగాపులగంగా మాట్లాడిన అనేక విషయాల్లో అలవోకగా చేసిన ఈ వ్యాఖ్యా చేరుతుంది. తమ ఆలోచనల విపరీత పోకడ వల్లే ఒక అంశం నుంచి మరొక అంశంలోకి, అది తమకు సంబంధం లేనిదైనప్పటికీ, వారు ఇలా ఒక గెంతు గెంతినట్లు అనుకోవాలి.
న్యాయమూర్తులు ఇలా మాట్లాడేందుకు వారిని ప్రోత్సహించిందేమిటి? ఎదుటి పక్షం వాదనలను లోతుగా తరచి చూసే ‘డెవిల్స్ అడ్వకేట్’ పాత్ర పోషించేప్పుడు, వారు మాట్లాడాల్సిన విషయాలు కావివి. ఇవి వారి వ్యక్తిగత అభిప్రాయాల్లా ధ్వనిస్తున్నాయి.
రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులకు పూచీ వహించడమే వారి బాధ్యత. దానికి వారు విధేయతతో కట్టుబడి ఉండాలి. అయితే ఏం జరిగింది? అలా కాకుండా, కొందరు రాజకీయ ప్రేక్షకుల ముందు వినమ్రతతో శిరస్సు వంచుతున్నారా? ఇలా అని ఎవరైనా అనుకుంటే ఆశ్చర్య పోనవసరం లేదు. వారు ఎక్కువగా మాట్లాడారు. ఇంకా చెప్పాలంటే, ఆ మాటలు న్యాయసమ్మతం కావు.
గౌతమ్ భాటియా ఒక జాతీయ దినపత్రిక ద్వారా లేవనెత్తిన అంశం నన్ను నిజంగా దిగ్భ్రాంతికి గురిచేసింది. మహ్ముదాబాద్ మీద ప్రకటించిన గ్యాగ్ ఆర్డర్‌ను ప్రస్తావిస్తూ, ‘‘ఒకరి నోరు నొక్కే అధికారం (గ్యాగ్ ఆర్డర్ ఇవ్వడం) న్యాయవ్యవస్థకు లేదన్నది ఇక్కడ ముఖ్యమైన పాయింటు. ఒకవేళ ప్రభుత్వం ఇలా చేయాలని నిర్ణయిస్తే, అది రాజ్యాంగబద్ధమా, రాజ్యాంగ విరుద్ధమా అనేది తేల్చడానికి మాత్రమే దానికి అధికారం ఉంది’’ అని భాటియా పేర్కొన్నారు.
అంటే ఈ న్యాయమూర్తులు తమకు లేని అధికారాలను ఉపయోగించారా అని ఆయన్ను ప్రశ్నించాను. దానికి ఆయన ఎంతో వివేకంతో, ఎంతో స్పష్టంగా, ‘‘వారు తమ పరిధులను మించి పోయి’’ వ్యవహరించారని చెప్పారు. ఓహ్!
కరణ్ థాపర్
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్