ఈ సంఘర్షణ ఇంకెంతకాలం?

Mallepalli Laxmaiah Writes Guest Column On Delhi Violence - Sakshi

కొత్త కోణం

భారతదేశంపై దండయాత్రలు చేసి, ఆక్రమించుకున్న ముస్లిం పాలకుల మీద ప్రజల్లో ఉన్న ద్వేష భావాన్ని ప్రస్తుతం ఇక్కడ ఉన్న ముస్లింల మీదికి మళ్లించడం హానికరం. దేశంలో ఉన్న కులాల అంతరాలను ప్రశ్నించకుండా కృత్రిమ ఐక్యతను ప్రదర్శించడం నిష్ప్రయోజనకరం. ముందుగా మనం మన ఇల్లును, మన ప్రజలను ఏకం చేయడానికి పూనుకోకుండా విద్వేషాన్ని ముందుకు తీసుకొస్తే అది ప్రజల మధ్య వైరాలను పెంచే, ఒక ఎడతెగని సంఘర్షణకు దారితీస్తుంది.

‘‘దేశ్‌కో గద్దరోంకో గోలీమారో సాలోంకో’’  తెల్లని టీషర్టు, తలకు ఆరెంజ్‌ రిబ్బన్‌లతో  నేటితరం, మనమంతా ఆశలు పెట్టుకున్న మన భావితరమైన యువ తరం ఓ ఉన్మాదావస్థలో పెట్టిన వెర్రికేకలవి. రెండు వారాలక్రితం ఢిల్లీలోని రాజీవ్‌ చౌక్‌ మెట్రో స్టేషన్‌లో  చేసిన ఈ విద్వేషపూరిత నినాదాల వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేసింది. ఈశాన్య ఢిల్లీలో మతకలహాల పేరుతో జరిగిన మారణహోమం మిగిల్చిన విషాదం అంతం కాకముందే మళ్ళీ అదే ద్వేషం ఈ యువతరంలో కనిపించి, మనసున్న ప్రతివారినీ కలవరపరిచింది. గతంలో దేశ మంతా అనేక చోట్ల మతకలహాలు జరిగినప్పటికీ, ఢిల్లీలో మాత్రం ఇంతవరకు హిందూ ముస్లిం ఘర్షణలు లేవు. కానీ ఈసారి జరిగిన అమానుషమైన దాడులు ఢిల్లీ జనసహనాన్ని కూడా పరీక్షించాయి. 

ఈ విధ్వంసంలో 42 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి.  200 మందికిపైగా క్షతగాత్రులయ్యారు. అనేక దుకాణాలు, ఇండ్లు, పాఠశా లలు, వాహనాలు ధ్వంసమయ్యాయి. ఒక మసీదు కూడా ఈ విద్వే షాగ్ని జ్వాలలకు కాలిబూడిదైపోయిందని వార్తలొచ్చాయి. వారం రోజుల పాటు ఢిల్లీని ఒక ఉన్మాదంలోకి నడిపించినవారెవ్వరో? అసలా మారణహోమానికి బాధ్యులెవ్వరో తేల్చాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఎందుకంటే ఏ ప్రాంతంలోనైతే దాడులు జరిగాయో, ఆ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలెవ్వరూ అందులో భాగం కాలేదు. పైగా ఒక వర్గం వారిని మరొక వర్గం రక్షించేందుకు యత్నించారు. వీలున్న ప్రతి ఇంటా మతాతీతంగా ఆశ్రయం పొందారు. ఇరు వర్గాల వారు ఉమ్మ డిగా తమను తాము రక్షించుకోవడానికి పరస్పరం సహకరించు కున్నారు. 

ఒక సంఘటన కాదు. అనేకానేక సంఘటనలు ప్రజల మధ్య వైషమ్యాలు లేవన్న విషయాన్ని తేల్చి చెపుతున్నాయి. మానవ సంబంధాలు చెక్కుచెదర్లేదని రుజువుచేస్తున్నాయి. ఢిల్లీలో ఆ రాత్రి ఓ ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయిన వృద్ధమాతను రక్షించమని ఆమె బిడ్డలు అమెరికానుంచి ఫోన్‌చేస్తే, ప్రాణాలకు తెగించి ఆమెను రక్షించింది ఎవరో కాదు. ఒక ముస్లిం. అప్పటికే కుదిరిన ఓ హిందువు వివాహాన్ని ముస్లింలంతా అండగా ఉండి జరిపించిన ఘటన స్థానికుల మధ్య సత్సంబంధాలకు ప్రత్యక్ష సాక్ష్యం. మత సామరస్యానికి మంచి ఉదాహరణ. సీలంపూర్‌లోని ముస్లింలను కాపాడడానికి అక్కడి దళి తులు ఆ ప్రాంతంలోకి గూండాలు, రౌడీలు ఎవ్వరూ రాకుండా బ్యారి కేడ్లు కట్టి రక్షణగా నిలిచారు. 

రమేష్‌ పార్క్‌ ప్రాంతంలోని హిందు వులు, సిక్కులు ఆ ప్రాంతంలోని ముస్లిం సోదరుల దగ్గరికి వెళ్లి అండగా ఉండడం మరపురాని జ్ఞాపకం. మంజూపూర్‌ బజరంగబలి మొహల్లాలో బజరంగబలి దేవాలయంలో ముస్లింలకు ఆశ్రయం కల్పించిన హిందువులు తమ సోదరభావాన్ని చాటుకున్నారు. ఇవి మచ్చుకు మాత్రమే. ఇంకా ఎన్నో చోట్ల, ఎంతోమంది, మతాల కతీతంగా ఒకరికొకరు రక్షణగా ఉండి మానవత్వం ఇంకా మిగిలేవుం దని నిరూపించిన సందర్భాలెన్నో. లేకుంటే ఢిల్లీ మత ఘర్షణల్లో మర ణాల సంఖ్య మరింత పెరిగేదన్నది సత్యం.

మన దేశంలో ఉన్న 20 కోట్ల మంది ముస్లింలు పరాయిదేశం వాళ్ళేననే ప్రచారం ముమ్మరంగా సాగుతున్నది. భారతదేశం మీద దండయాత్రలు చేసి, ఆక్రమించుకున్న ముస్లిం పాలకుల మీద ఉన్న వ్యతిరేకతను, కోపాన్నీ, ద్వేషభావాన్నీ ప్రస్తుతం ఇక్కడ ఉన్న ముస్లింల మీదికి మళ్లిస్తున్నారు. దానితో కొంత మంది రాజకీయ లబ్ధిని పొందాలని చూస్తున్నారు. మరికొంతమంది హిందూ మతంలో ఉన్న కులాల అంతరాలను ప్రశ్నించకుండా ముస్లిం బూచితో కృత్రిమ ఐక్యతను ప్రదర్శిస్తున్నారు. చరిత్ర క్రమాన్ని పరిశీలిస్తే, ప్రస్తుతం మన దేశంలోనూ మన ఇరుగు పొరుగున ఉన్న ముస్లింలు మన ఆత్మబం«ధువులేనన్నది సత్యం. భారతదేశంలోని ప్రజలు ఇస్లాంలోకి మారడం మహమ్మద్‌ ప్రవక్త పుట్టకముందు నుంచే అరబ్బు ప్రాంతంలో మొదలైందని చరిత్ర కారులు చెబుతున్నారు. 

క్రీస్తు పూర్వం నుంచే భారతదేశానికి అరబ్బు దేశాలతో వ్యాపార, వాణిజ్య సంబంధాలుండేవి. చరిత్రకు అందిన సమాచారం ప్రకారం, మొదటగా ఇస్లాంలోకి మారింది కేరళలోని మష్టిలా సామాజిక వర్గం. మలబార్‌ ప్రాంతంలో విరివిగా లభించే సుగంధ ద్రవ్యాలు, అంటే మసాలాల వ్యాపారం అరబ్బులను విపరీతంగా ఆకర్షించింది. మహమ్మద్‌ ప్రవక్త ఇస్లాంకు ఒక దశ, దిశను అందించిన తర్వాత కేరళలో కులవివక్షకు గురవుతున్న అంటరాని కులాలు ఇస్లాంలోకి మారాయి. అందుకే దేశంలో ఎస్సీల సగటు జనాభా 16 శాతం ఉంటే, కేరళలో ఎస్సీల జనాభా కేవలం 9 శాతంగా ఉంది. దానర్థం చాలా మంది ఇస్లాంలోకి, క్రైస్తవంలోకి మారిపో యారు. 

ఇంకా కర్ణాటక, బెంగాల్‌ వంటి పలుప్రాంతాల్లోనూ అంట రాని కులాల ప్రజలు అవమానాలనుంచి తప్పించుకోవడానికి ఇస్లాం లోకి మారారు. మన హైదరాబాద్‌లో 1921 నుంచి 1941 మధ్యలో కూడా వేలాది మంది అంటరాని వారు, ముఖ్యంగా మాలలు హైద రాబాద్‌లో ఇస్లాంను స్వీకరించినట్టు జనాభా లెక్కలు తెలియ జేస్తు న్నాయి. 1911లో 11,37,589 మంది ఉన్న మాలలు, మహర్‌లు 1931కి వచ్చేసరికి 10,76,539కి తగ్గిపోయారు. అంటే 61,050 సంఖ్య తక్కువైనట్టు లెక్కలు చెబుతున్నాయి. చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు.

దీనికన్నా ముందుగా ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రస్తావించాలి. భారతదేశం అనే భావన నిజానికి ఆధునికమైంది. కానీ ఒకానొక కాలంలో ముఖ్యంగా మౌర్యుల కాలంలో ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌ నుంచి బర్మా దాకా ఒక రాజ్యం కింద పాలన సాగింది. చక్రవర్తి అనే పదం అప్పుడే వచ్చింది. చంద్రగుప్త మౌర్యుని నుంచి అశోక చక్రవర్తి దాకా ఇది మరింత విస్తరించింది. ఈ రాజ్యంలో ప్రధానంగా బౌద్ధం, జైనం, వేదాలను అనుసరించే సనాతన ధర్మం ఉండేది. దానినే మనం ఇప్పుడు హిందూ మతం అంటున్నాం. అశోకుడి మనవడు బృహద్ర దుడిని చంపి, బ్రాహ్మణ రాజు పుష్యమిత్ర శుంగురుడు పాలన చేపట్టిన తర్వాత బౌద్ధం మీద దాడులు పెరిగాయి. 

క్రీ.శ.7వ శతాబ్దం తర్వాత మరింతగా బౌద్ధులను ఊచకోత కోశారు. సరిగ్గా ఇదే సమ యంలో ఇస్లాం దండయాత్రలు జరిగాయి. వాళ్ళు కూడా హిందూ దేవాలయాలతో పాటు, బౌద్ధారామాలను ధ్వంసం చేశారు. నలందా విశ్వవిద్యాలయం భస్మీపటలం అందులో భాగమే. ఒకవైపు హిందు వులు, రెండోవైపు ముస్లింల దాడులు బౌద్ధులను నిస్సహాయులను చేశాయి. ఆప్ఘనిస్తాన్, నేటి పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లు ఆనాడు సంపూర్ణ బౌద్ధ దేశాలు. ముస్లింల దండయాత్రలకు, హిందువుల అవమానా లకు పరిష్కారంగా ఇస్లాంలోకి మారిపోయారు. వివక్షను పాటిస్తున్న, కులవ్యవస్థను అనుసరిస్తూన్న హిందూమతం కన్నా, అల్లా ముందు రాజూ పేదా సమానమనే భావనను ప్రచారం చేసిన ఇస్లాంలోకి బౌద్ధులు మారిపోయారు. బౌద్ధానికి ఇస్లాం దగ్గరగా ఉందని ఆనాడు బౌద్ధులు భావించారు. 

అందుకే ఆనాడు బౌద్ధ దేశా లన్నీ కాశ్మీర్‌తో సహా ఇస్లాం ప్రాంతాలుగా మారిపోయాయి. ఇంత వివరణ ఎందుకు అవసరమైందంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్న ముస్లిం సోదరులందరూ, మన బౌద్ధులు, హిందువుల్లోని అంటరాని కులాలేనన్నది చెప్పడానికే. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను, హిందూ ధర్మాన్ని రక్షించడానికి అనే సాకుతో వీరంతా ముస్లింలుగా ముద్రపడి ఈ రోజు నీకు టెర్రరిస్టులుగా కనపడుతున్నారు. హిందూ మతం ఏనాడూ అక్కున చేర్చుకోకపోగా వేరే మతంలోకి వెళ్ళిన నీ మతస్తులపైనే పగతీర్చుకోవడం వివేకం అనిపించుకోదు. 

ఇస్లాంలోకి, క్రైస్తవంలోకి మారుతూండడానికి కారణాలు తెలుసుకోకుండా అందుకు కారణమైన కుల వ్యవస్థను నిర్మూలించకుండా, ఇతరులను నిందించినా, ద్వేషించినా ప్రయోజనం శూన్యమే. ఒకవేళ పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ లాగా హిందువులందర్నీ ముస్లింలలాగే మారుస్తున్నట్టు, మనం ముస్లింలను హిందువులుగా మార్చాలని చూస్తే ఎలా సాధ్య మవుతుంది? ఇస్లాం నుంచి హిందూ మతంలోకి వచ్చినవారిని ఏ కులంలో చేరుస్తాం. ఎందుకంటే హిందూమతమంటేనే కులాలు. ఇది ఒక సమూహం మాత్రమే కాదు. అనేక కులాల సంఘటన. ఇది ఐక్య సంఘటన కూడా కాదు. దేనికదే ఒక సంఘటన. ముందుగా మనం మన ఇల్లును, మన ప్రజలను ఏకం చేయడానికి మన దగ్గర ఉన్న ప్రణాళిక ఏమిటో చెప్పాలి. అప్పుడే ఏ మతమైనా, ఏ ధర్మమైనా రక్షిం పబడుతుంది. లేనట్లయితే ఇది ప్రజల మధ్య వైరాలను పెంచే, ఒక ఎడతెగని సంఘర్షణకు దారితీస్తుంది.

వ్యాసకర్త: మల్లెపల్లి లక్ష్మయ్య 
సామాజిక విశ్లేషకులు
మొబైల్‌ : 81063 22077

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top