రాయని డైరీ... రంజన్‌ గొగోయ్‌ (మాజీ సీజేఐ)

Madhav Singaraju Rayani Dairy On Ranjan Gogoi - Sakshi

నిందితుడు దోషిగా నిర్ధారణ కాకుండానే దోషిలా కోర్టు బోనులో నిలుచోవడం ఎలా ఉంటుందో నా నలభై రెండేళ్ల ‘లా’ కెరీర్‌లో నేనెప్పుడూ ఆలోచించలేదు. 
చట్టమే న్యాయం తరఫున ఆలోచనలు చేసి, ఆ ఆలోచనల్ని ఒక పుస్తకంగా కుట్టి, ఆ పుస్తకాన్ని న్యాయమూర్తి చేతిలో పెట్టినప్పుడు పుస్తకంలోని పేజీలు తిప్పుతూ పోవడం తప్ప, పుస్తకంలో లేని ఆలోచనలతో కోర్టు హాల్లో తలెత్తిగానీ, తలతిప్పిగానీ చూడవలసిన అవసరం న్యాయమూర్తికి ఏముంటుంది కనుక?!
గురువారం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం చేస్తున్నప్పుడు గతంలో నా ఎదుట కోర్టు బోనులో నిలబడి ‘అంతా నిజమే చెబుతాను’ అని ఎందరో నిందితులు ప్రమాణం చేసిన దృశ్యం నా కళ్ల ముందుకొచ్చింది! రాజ్యసభలో నేను ప్రమాణ స్వీకారం చేస్తుండగా ‘షేమ్‌ షేమ్‌’ అని అరిచిన అపోజిషన్‌ సభ్యులు.. కోర్టు హాలులో నిందితుడి వైపు వేలెత్తి చూపుతూ ‘దోషి, దోషి’ అని కేకలు వేస్తున్నవారిలా, వారిని వారిస్తూ ‘ఆర్డర్‌ ఆర్డర్‌’ అంటున్న రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ప్రత్యేక ధర్మాసనానికి వచ్చి కూర్చున్న న్యాయమూర్తిలా నాకు కనిపించారు.
ప్రమాణ స్వీకారానికి ముందు వెంకయ్యనాయుడికి నమస్కారం చేశాను. ‘ఇదిగో ఇలా నమస్కారాలు పెట్టే, రాజ్యసభ సీటు సంపాదించాడు. షేమ్‌ షేమ్‌’ అని సభలో అరుపులు! రాజ్యసభ కన్నా కోర్టు హాలే నయం అనిపించింది. అక్కడ నిందితుడైన వ్యక్తి ప్రమాణం చేస్తాడు. ఇక్కడ నేను ప్రమాణం చేస్తున్నందుకు నిందితుడినయ్యాను.
‘షేమ్‌ షేమ్‌ అంటున్న గౌరవ సభ్యులారా వినండి’ అన్నాను. 
‘వినేందుకు ఏముంటుంది రంజన్‌ గొగోయ్‌! మోదీకి మీరు రామ జన్మభూమిని ఇచ్చారు. మోదీ మీకు రాజ్యసభను ఇచ్చారు. ఇచ్చిపుచ్చుకోవడం అయిపోయింది కదా..’ అంటున్నారు. అంటూ వాకౌట్‌ చేస్తున్నారు. 
‘దిస్‌ ఈజ్‌ అన్‌ఫెయిర్‌’ అంటున్నారు వెంకయ్యనాయుడు. ఆ మాటను కూడా వాళ్లు వినడం లేదు. సుప్రీంకోర్టులో ఉండగా నేనొక్కడినే చీఫ్‌ జస్టిస్‌ని. రాజ్యసభలో పార్టీకొక రాజ్యసభ ఛైర్మన్‌ ఉన్నట్లున్నారు! కాంగ్రెస్, సీపీఎం, ఎండీఎంకే, ముస్లిం లీగ్, బీఎస్పీల ఎంపీలు నేను రాజ్యసభ సభ్యత్వానికి చెయ్యి చాచడంలో నీతి లేదని, రీతి లేదని తీర్పులు ఇచ్చేస్తున్నారు. ఇదంతా గ్యాలరీలోంచి నా భార్య, నా కూతురు, నా అల్లుడు చూస్తున్నారు.
‘గౌరవ సభ్యులారా.. నన్నూ చెప్పనివ్వండి’’ అన్నాను. 
‘ఏముంటుంది చెప్పడానికి!’’ అని అరిచారు. 
‘ఎవరేమనుకున్నా నేను భయపడే రకం కాదు. గతంలో భయపడలేదు. వర్తమానంలో భయపడటం లేదు. భవిష్యత్తులోనూ భయపడను. భూత, వర్తమాన, భవిష్యత్‌ కాలాల్లో ఒక్క నా భార్య అభిప్రాయానికి తప్ప నేనెవరికీ విలువ ఇవ్వలేదు, ఇవ్వడం లేదు, ఇవ్వను’ అన్నాను. 
సభ ఒక్కసారిగా స్తంభించిపోయింది. వెంకయ్యనాయుడు నా వైపు అభినందనగా చూశారు. సభ ముగిసింది. 
‘‘సభలో అలా అనేశారేంటీ.. నా మాటకు తప్ప ఎవరికీ విలువ ఇవ్వనని’’ అంది రూప.. ఇంటికి రాగానే. ‘‘అవును నాన్నగారూ అలా అనేశారేంటి’’ అంది నా కూతురు. ‘అవును మామగారూ అలా అనేశారేంటి’’ అన్నాడు నా అల్లుడు. 
‘‘ఆరేళ్లు మాట పడుతూ పదవీ కాలం పూర్తి చేయడమా, పదవీకాలం ప్రారంభమైన రోజే మాటకు మాట చెప్పి దీటుగా నిలబడటమా అని ఆలోచించాను. దీటుగా నిలబడటమే నాకు, నన్ను నామినేట్‌ చేసిన రాష్ట్రపతికీ గౌరవం అనిపించింది. అందుకే నేను ఏమిటో చెప్పాను’’ అన్నాను. 
- మాధవ్‌ శింగరాజు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top