మృతుడికి డబ్బు చెల్లించారా?

Madabhushi Sridhar article on rti application

విశ్లేషణ
మనకు పదివేల కోట్ల రూపాయల మోసాల గురించి థ్రిల్లింగ్‌ వార్తలు చదవడం, భారతీయుడు వంటి సినిమాలు చూడడం సరదా. కానీ రోజూ ప్రభుత్వ ఆఫీసుల్లో జరుగుతున్న భారీ మోసాల గురించి పట్టింపు ఉండదు.

‘‘ఒక్క మాట చెప్పండయ్యా, నా భర్త చనిపోయిన మూడేళ్ల తరువాత మీ పోస్టాఫీసుకు వచ్చి ఎన్‌ఎస్‌సి సర్టిఫికెట్ల డబ్బు తీసుకుపోయినాడా?’’ ఇది.. భర్తను కోల్పోయి ప్రభుత్వ పింఛను పై ఆధారపడిన ఒక మహిళ టి. సుబ్బమ్మ నిలదీసి అడిగిన ప్రశ్న. కర్నూలు పోస్టాఫీసు సూపరింటెండెంట్‌ని నిరుత్తరుడిని చేసిన ప్రశ్న.  

టి. సుబ్బమ్మ భర్త చిన్న ఉద్యోగి. జీవితమంతా కష్టపడి సంపాదించిన డబ్బుతో పదివేల రూపాయల జాతీయ పొదుపు సర్టిఫికెట్లు 5 కొనుక్కున్నారు. ఆయన మరణించిన తరువాత డబ్బు ఇమ్మని కోరితే పోస్టాఫీసు జవాబివ్వలేదు. ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టుకున్నారు. సెక్షన్‌ 8(1)(జె) కింద మూడో వ్యక్తికి చెందిన సొంత సమాచారమంటూ తిరస్కరించారు. మొదటి అప్పీలు వల్ల ప్రయోజనం లేదు. ఎంబీఏ చదివిన కుమారుడు సుధాకర్‌ తాము అడిగిన వివరాలు ఇప్పించాలని కమిషన్‌కు విన్నవించారు. సర్టిఫికెట్లు కొన్న వ్యక్తి, సుబ్బమ్మగారి భర్త ఆది శేషయ్య స్వయంగా వచ్చి డబ్బు తీసుకున్నారని, సుబ్బమ్మ ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపినప్పుడు ఈ విషయం తేలిందని కమిషన్‌కు పోస్ట్‌ మాస్టర్‌ తెలియజేశారు. నివేదిక ప్రతిని కూడా సుబ్బమ్మకి ఇచ్చామని వివరించారు.

సుబ్బమ్మ: ఏ తేదీన తీసుకున్నారయ్యా?
అధికారి: 2007 జూన్‌ 27న ఒక సర్టిఫికెట్‌ డబ్బు, జూన్‌ 29న రెండు సర్టిఫికెట్ల డబ్బు, జూలై 2న మరొక సర్టిఫికెట్‌ డబ్బును మీ భర్త తానే స్వయంగా తీసుకున్నారమ్మా.

సుబ్బమ్మ: మా ఆయన 10.5.2004న  చనిపోయాడయ్యా, మూడేళ్ల తరువాత 2007లో ఆయనే వచ్చి డబ్బు ఏ విధంగా తీసుకున్నారయ్యా?
వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరిగిన విచారణలో ఆ అధికారి ఫైళ్లన్నీ వెతుకుతూ నీళ్లునములుతూ కనిపించారు.  ‘‘అయ్యా మరణ ధృవీకరణ పత్రం కూడా ఉంది సార్‌‘‘ అని సుబ్బమ్మ కుమారుడు వీడియోలో చూపించాడు. ఇప్పుడు చెప్పండి అని కమిషనర్‌ అడిగితే జవాబు లేదు. తన భర్త వచ్చి డబ్బు తీసుకున్నట్టు రామలింగయ్య అనే వ్యక్తి దొంగ క్లెయిమ్‌ పత్రాలు కల్పించారని, ఆ తరువాత ఎన్‌. బుజ్జి అనే పోస్ట్‌ మాస్టర్‌ నియమాల ప్రకారం చెక్కు ఇవ్వడానికి బదులుగా నగదు రూపంలో డబ్బు ఇచ్చారని, అదే మోసానికి తగిన సాక్ష్యమని సుబ్బమ్మ కొడుకు సుధాకర్‌ వాదించారు. చిన్న వెంకయ్య, రామలింగయ్య, తపాలా ఉద్యోగి గౌస్, దొంగ సాక్షి సుంకన విజయ కుమార్‌ ఆ డబ్బును బుజ్జితో పంచుకుని ఆ రాత్రి మందు, విందు చేసుకున్నారని కూడా సుధాకర్‌ ఆరోపించారు.

సుబ్బమ్మ పోస్టాఫీసులో పనిచేసిన అధికారులపైన ఆరోపణలు చేశారని, ఆ ఆరోపణల సమాచారం లేదా పత్రాలు, విచారణ సాక్ష్యాలు, ఆ అధికారి వ్యక్తిగత సమాచారం అవుతుందని అధికారులు వాదించారు. దీన్ని మొదటి అప్పీలు అధికారి కూడా ఆమోదించడం మరీ ఆశ్చర్యకరం. ఇది దారుణమైన నిరాకరణ. ఒక భర్తలేని మహిళ డబ్బు కాజేయడానికి తోటి అధికారులు చేసిన మోసాన్ని, అవినీతిని రక్షించడానికి సమాచార అధికారులు సెక్షన్‌ 8(1)(జె)ను, సుప్రీంకోర్టు గిరీశ్‌ రామచంద్ర దేశ్‌పాండే కేసులో ఇచ్చిన ఒక తీర్పును ఉటంకిస్తూ ఇటువంటి ఫిర్యాదులు.. మోసం చేసిన అధికారుల వ్యక్తిగత సమాచారం కనుక ఇవ్వబోమని తిరస్కరించారు.  గోప్యతా అనే పదాన్ని దానికి సంబంధించిన మినహాయింపును దుర్వినియోగం చేసి మోసాలు చేయడానికి వీల్లేదని కమిషన్‌ విమర్శించింది. పోస్టాఫీసు వాదాన్ని తిరస్కరిస్తూ అడిగిన వివరాలన్నీ ఇవ్వాలని, మొత్తం సంఘటనలపై విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని కమిషన్‌ ఆదేశించింది.

ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే చిన్న అవినీతి ఇది. దీన్ని పత్రికలు పట్టించుకోవు, విజిలెన్సు వారికి కూడా చిన్నదనిపిస్తుంది. ఇవి ఏసీబీ, సీబీఐ దాకా వెళ్లవు. చదువురాని సుబ్బమ్మకు ఏం చేయాలో తోచదు. చదువుకున్న కొడుకు సాయం చేస్తున్నాడు. కోర్టులో పోరాడాలంటే బోలెడంత డబ్బు ఖర్చు. గెలుస్తారో లేదో? లాయర్ల ఫీజులకే డబ్బు ఒడుస్తుంది. మోసం జరిగిందని పోస్టాఫీసులో అందరికీ తెలుసు. బుజ్జి తరువాత వచ్చిన పోస్ట్‌మాస్టర్లంతా ఈ ఫైలు కప్పిపుచ్చారే తప్ప సుబ్బమ్మకు న్యాయం చేయాలనుకోలేదు. మధ్యలో ఒక పోస్ట్‌మాస్టర్‌ మాత్రం అన్యాయాన్ని గుర్తించి విచారణకు ఆదేశించారు. చనిపోయిన వ్యక్తే వచ్చి డబ్బు తీసుకున్నాడని విచారణాధికారి నిర్ణయించారు. సమాచార చట్టం కింద సవాలు చేస్తే ధైర్యంగా విచారణ నివేదిక ప్రతి ఇచ్చారు. కానీ ఇతర వివరాలు నిరాకరించారు.

రోజూ ఇటువంటి దాపరికాలు ప్రతి కార్యాలయంలో ఒకటో రెండో జరుగుతూనే ఉన్నాయి. ఈ రెండో అప్పీలు తీర్పులో మానవాసక్తికరమైన వార్త ఉంది. కాని ఒకటి రెండు పత్రికలకు తప్ప మరెవరికీ పట్టదు. పోస్టాఫీసు మోసం ఒక చిన్న సంఘటన. కానీ ఈ మోసాలను వెలికి తీయకుండా ఆర్టీఐని అడ్డుకుంటున్నది గిరీశ్‌పై తీర్పు. ప్రభుత్వ అధికారులు పన్నిన కుట్రలు, మోసాలు, లంచగొండితనం ఫిర్యాదులు వారి వ్యక్తిగత సమాచారం అంటూ ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్‌ ఇచ్చిన గిరీశ్‌పై తీర్పు అవినీతి అధికారుల ‘సొంత’ సమాచారానికి దాపరికపు తెర. మన పౌరుల కుంభకర్ణ నిద్రకు దోమతెర. (టి సుబ్బమ్మ వర్సెస్‌ పోస్టాఫీసు  CIC/POST S/A-/2017/123421 కేసులో 29.9.2017న ఇచ్చిన తీర్పు ఆధారంగా).


మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్‌
professorsridhar@gmail.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top