కథువా ఘటనలో రాజకీయ కోణం

Kadhuva Rape Issue Political Stand - Sakshi

సందర్భం

దేశంలో గతంలో మహిళలపై అత్యాచారాలు, దళితులపై హత్యాయత్నాలు జరిగాయి కానీ ఒక పథకం ప్రకారం, నిర్దిష్ట రాజకీయ లక్ష్యం కోసం, భయోత్పాత వాతావరణాన్ని కల్పించటం కోసం జరగటం ఇటీవలే చూస్తున్నాం. గతంలో సామాజిక అవలక్షణాల్లో భాగంగా ఇటువంటి దురాగతాలు జరిగేవి.

కేంద్రంలో అధికారానికి వచ్చిన కొత్తలో మోదీ హరియాణాలో జరిగిన ఒక ర్యాలీలో ఆడపిల్లలను బతికించండి, చదివించండి అన్న పథకానికి శ్రీకారం చుట్టారు. అప్పటికే హరియాణా ఖాప్‌ పంచాయత్‌ పేరుతో మహిళలపై సాగించే అకృత్యాలకు కేంద్రంగా మారిన సమయంలో ఆడపిల్ల లను రక్షించే కార్యక్రమ ప్రారంభానికి హరి యాణాను కేంద్రంగా చేసుకోవటం ద్వారా ప్రజల దృష్టినాకర్షించింది బీజేపీ. కానీ ఈ కొత్త మురిపెం ఎంతో కాలం నిలవలేదు. రానురానూ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలకు కనీస భద్రత కూడా కరువవుతూ వచ్చింది.

కథువా బాలిక ఉదంతం ప్రాధమిక హక్కులను సైతం స్వమతం అన్యమతం అని చీల్చి అమలు జరిపేబీజేపీ పరిపాలనా తీరుకు నిదర్శనంగా నిలిచిపోతుంది. జమ్ము కశ్మీర్‌ నేడు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే కథువా బాలిక అత్యాచార సంఘటనకు కేంద్రమైంది. ప్రపంచ దేశాల ముందు భారతదేశం సిగ్గుతో తలొంచుకునేలా జరిగిన కథువా బాలిక బలాత్కారం, హత్య నుండి దేశం ఇంకా కోలుకోలేదు. మరింత హేయమైన చర్య ఏమిటంటే ఈ బలాత్కారానికి, హత్యకు స్థానిక దేవాలయాన్ని కేంద్రంగా చేసుకోవటం.. చివరకు ఈ హేయమైన ఘటనకు కారణమైన వారిని చట్టం శిక్షించాలని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి కార్యాలయం కూడా డిమాండ్‌ చేసే పరిస్థితి వచ్చింది. 

దేశంలో గతంలో మహిళలపై అత్యాచారాలు, దళితులపై హత్యాయత్నాలు జరిగాయి కానీ ఒక పథకం ప్రకారం, నిర్దిష్ట రాజకీయ లక్ష్యం కోసం, భయోత్పాత వాతావరణాన్ని కల్పించటం కోసం జరగటం గత మూడు నాలుగేళ్లల్లోనే చూస్తున్నాము. గతంలో సామాజిక అవలక్షణాల్లో భాగంగా ఇటువంటి దురాగతాలు అడపాదడపా జరిగేవి. కానీ ఇప్పుడు ఒక పథకం ప్రకారం జరుగుతున్నాయి. గతంలో అటువంటి దురాగతాలకు పాల్పడిన వ్యక్తులను సమాజం చీదరించుకునేది. సాధ్యమైతే వెలివేసేది. లేదా చట్టం పరిధిలో శిక్షించేది. అటువంటి ఆగంతకులు రాజకీయ పార్టీలకు చెందిన వారైతే ప్రజల నుండి ఎక్కడ దూరమవుతామో అనే వెరపుతో బహిష్కరించేవి. కానీ ఇప్పుడు జరుగుతుంది దీనికి భిన్నం.

మంత్రులు, ప్రజలెన్నుకున్న ప్రజా ప్రతినిధులు, చట్టాన్ని కాపాడాల్సిన న్యాయవాదులు మొత్తంగా రేపిస్టులకు అండగా నిలుస్తున్నారు. కథువా సంఘటనలో దోషులైన వారికి అండగా నిలవటానికి ఏకంగా సంకీర్ణ ప్రభుత్వం నుండి బయటకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఎందువల్ల?ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఆరెస్సెస్‌ అవగాహనలో, విస్తరణ వ్యూహంలో, ప్రజలను నిట్టనిలువునా చీల్చటంలో మహిళలపై అత్యాచారం కూడా ఒక సాధనంగా ఎలా మారిందో తెలుసుకోవాలి. కథువా సమీప గ్రామాల్లో సంచార తెగలకు చెందిన ముస్లింలు నివశిస్తున్నారు. వీరిని ఆ ప్రాంతం నుండి శాశ్వతంగా పారదోలటానికి, ఈ గ్రామాలన్నీ ఆక్రమించుకోవటానికి అభం శుభం తెలీని పాప తేలికైన లక్ష్యంగా మారిందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి.

ఖలేజా సినిమా కథకు కథువా ఘటన వెనకున్న లక్ష్యానికి మధ్య తేడా లేదు. ‘భారతదేశ చరిత్రలో ఆరు మహత్తర అధ్యాయాలు’ అన్న సావర్కార్‌ రచనను చూస్తే ఒక విషయం తేటతెల్లమవుతుంది. ముస్లిం రాజులు ఆ రోజుల్లో హిందూ మహిళల మానప్రాణాలు తీశారు. ‘‘హిందువులు పూర్తి స్థాయి అధికారాన్ని సంపాదిస్తే ముస్లిం మహిళలకు కూడా అదే శాస్తి జరుగుతుందని వారికి అర్థం అవ్వాలి. అప్పుడు కానీ హిందు మహిళల జోలికి రాకుండా ఉండరు’’ అని అందులో ఆయన వివరిస్తారు. ఆరెస్సెస్‌ కార్యకర్తలు సావర్కార్‌ మాట జవదాటరన్న విషయం తెలిసిందే.

కథువా అఘాయిత్యాన్ని ఈ కోణంలో చూస్తే తప్ప దేశంలో ముస్లింలపై పెరుగుతున్న దాడులు, అత్యాచారాలు, చీకటి జీవితాల్లోకి నెట్టడం వంటి పరిణామాల లక్ష్యం ఏమిటో అర్థం కాదు. అంతేకాదు. హిందూ రాజులు నాటి నుంచీ ఇటువంటి వ్యూహాన్ని అనుసరించి ఉంటే ముస్లింలు హిందూ మహిళలవైపు కన్నెల్తైనా చూసేవారు కాదు అని కూడా నిర్ధారణకొచ్చాడు. ముస్లిం మహిళల పట్ల ఏ రకమైన సౌభ్రాతృత్వాన్నయినా సరే ప్రదర్శించాలని ప్రయత్నించి వారిపై అత్యాచారాలకు పాల్పడకుండా వదిలేస్తే అది ఇస్లాం మతం స్వీకరిం చినంత పాపం అని కూడా హెచ్చరిస్తాడు సావర్కార్‌. లవ్‌ జీహాద్‌ అసలు లక్ష్యం ఏమిటో ఈ వాక్యాలు చదివితే అర్థమవుతుంది.

సావర్కారే ఆరాధ్యదేవుడుగా మారిన ఆరెస్సెస్‌ కార్యకర్తల చేతుల్లో గుజరాత్‌లో, ముజఫర్‌నగర్‌లో ఎంత మంది మహిళలు మాన ప్రాణాలు కోల్పోయారో తేల్చేందుకు కేంద్రం సాహసిస్తుందా? సావర్కార్‌ను, ఆయన ఆలోచనలను, వాటిని ఆచరించేవారిని ఈ దేశం నుండి బహిష్కరించకుండా, వారికి చట్టబద్ధత కల్పించే రాజ్యాధికారం నుండి దూరం చేయకుండా దేశంలో హిందూయేతర మహిళల మానప్రాణాల భద్రతకు హామీ ఇవ్వటం సాధ్యం కాదు. వేరుకు పుట్టిన చెదలు కొమ్మలు నరికితే పోదు. వేళ్లతో సహా చెట్టును పీకేస్తేనే పోతుంది.

కొండూరి వీరయ్య 
వ్యాసకర్త ఆర్థికరంగ నిపుణులు ‘ 98717 94037

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top