
దాసరి వీరయ్యను కోర్టులో హాజరు పరిచేందుకు తీసుకెళ్తున్న పోలీసులు
వైఎస్సార్‌సీపీ నేత వీరయ్య అక్రమ అరెస్ట్
బెల్ట్‌షాపులపై మంత్రి లోకేశ్‌కి లేఖరాసినందుకే నా భర్తను హత్యకేసులో ఇరికించారు
నా భర్తకు ఏమైనా అయితే ప్రభుత్వానిది, లోకేశ్‌దే బాధ్యత
దుగ్గిరాల జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్): బెల్టుషాపుల గురించి ప్రశ్నించటమే నేరంగా భావించిన కూటమి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ నేతను అక్రమంగా అరెస్టు చేసింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల జెడ్పీటీసీ సభ్యురాలు మేకతోటి అరుణ భర్త, వైఎస్సార్‌సీపీ నాయకుడు దాసరి వీరయ్యను 30 మంది పోలీసులు కుంచనపల్లిలోని వారి ఇంట్లోకి బుధవారం అర్ధరాత్రి అక్రమంగా చొరబడి అరెస్టు చేశారు. గుంటూరులోని పాతగుంటూరు పోలీసు స్టేషన్‌కు తీసుకొచ్చిన వీరయ్యను పోలీసులు గురువారం కోర్టులో హాజరుపరిచారు.
న్యాయాధికారి 14 రోజుల రిమాండ్ విధించడంతో వీరయ్యను రేపల్లె జైలుకు తరలించారు. పోలీస్ స్టేషన్‌లో వీరయ్యను ఎవరితోను మాట్లాడనీయలేదని, కుటుంబసభ్యులను కూడా కలవనీయలేదని తెలిసింది. తాను బెల్టుషాపులు, నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే కాబట్టి లోకేశ్‌కు లేఖరాశానని, దీంతో ఆయన కక్షపూరితంగా వ్యవహరించి తన భర్తను హత్యకేసులో ఇరికించి అరెస్టు చేయించారని అరుణ ఆరోపించారు. పాతగుంటూరు పోలీస్ స్టేషన్ వద్ద గురువారం ఆమె మీడియాతో మాట్లాడారు.
ఇటీవల గుంటూరు నగరంలోని పొన్నూరు రోడ్డులో జరిగిన కుర్రా నాగగణేష్ హత్యకేసులో తన భర్త వీరయ్య ప్రమేయం ఉందంటూ బుధవారం అర్ధరాత్రి 12 సమయంలో సుమారు 30 మంది పోలీసులు కుంచనపల్లిలోని వారి ఇంట్లోకి వచ్చి సోదా చేశారని తెలిపారు. వచ్చినవారు తాడేపల్లి పోలీసులమని చెప్పారని, తన భర్తను దుస్తులు కూడా వేసుకోనీయకుండా హడావుడిగా తీసుకెళ్లారని చెప్పారు. తన భర్తకు షుగర్ ఉందని, కనీసం బిళ్లలు ఇస్తున్నా కూడా ఆయన్ని తీసుకోనీయలేదని తెలిపారు.
ఏ కేసులో తీసుకెళుతున్నారని ప్రశ్నించినా సమాధానం చెప్పకుండా స్టేషన్‌కు రావాలంటూ బలవంతంగా లాక్కెళ్లారన్నారు. తన భర్త ఫోన్‌తోపాటు తన ఫోన్‌ను కూడా దౌర్జన్యంగా తీసుకెళ్లారని చెప్పారు. హత్యకేసులో తన భర్త ప్రమేయం ఉంటే ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తన భర్తను అన్యాయంగా హత్యకేసులో నిందితుడిగా చేర్చిందని ఆరోపించారు. తన భర్తను తీసుకెళ్లిన తరువాత అర్ధరాత్రి పూట ఒంటరిగా తాడేపల్లి పోలీసు స్టేషన్‌కు వెళ్లానన్నారు. తాము తీసుకురాలేదని చెప్పిన పోలీసులు ఉదయాన్నే రమ్మంటూ ఇష్టానుసారం మాట్లాడారని ఆరోపించారు.
లోకేశ్‌కు లేఖ రాసినందుకే..
మంగళగిరి నియోజకవర్గంలో మద్యం బెల్ట్‌షాపులు నడుస్తున్నాయని ఈ నెల 10వ తేదీన మంత్రి లోకేశ్‌కు లేఖ రాసినట్లు అరుణ చెప్పారు. ఎక్కడెక్కడ బెల్ట్‌షాపులు ఉన్నాయో వివరిస్తూ వీటిపై చర్యలు తీసుకోవాలని కోరానన్నారు. ఈ క్రమంలో జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో బెల్ట్‌షాపుల అంశాన్ని ప్రస్తావించి ఏం చేస్తున్నారంటూ అధికారుల్ని ప్రశ్నించినట్లు తెలిపారు.
ఆ తరువాత ఐదురోజుల్లోనే తన భర్త వీరయ్యను హత్యకేసులో నిందితుడిగా పేర్కొంటూ అరెస్ట్ చేశారని చెప్పారు. బెల్టుషాపులు, నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే కాబట్టి లోకేశ్‌కు లేఖరాశానని, దీంతో ఆయన కక్షపూరితంగా వ్యవహరించి తన భర్తను హత్యకేసులో నిందితుడిగా పెట్టించారని ఆరోపించారు. గుంటూరులో జరిగిన హత్యకు తన భర్తకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. తన భర్తకు ఏం జరిగినా కూటమి ప్రభుత్వం, మంత్రి లోకేశ్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు.