వీళ్లతో మామూలుగా ఉండదు! | - | Sakshi
Sakshi News home page

వీళ్లతో మామూలుగా ఉండదు!

Dec 1 2025 9:28 AM | Updated on Dec 1 2025 9:28 AM

వీళ్లతో మామూలుగా ఉండదు!

వీళ్లతో మామూలుగా ఉండదు!

సాంఘిక సంక్షేమ శాఖలో మామూళ్ల పర్వం నెహ్రూనగర్‌: సాంఘిక సంక్షేమ శాఖలో(ఎస్సీ వెల్ఫేర్‌) మామూళ్ల పర్వం నడుస్తోంది. తమను ప్రసన్నం చేసుకునే వార్డెన్లకు అగ్రతాంబూలం.. ప్రసన్నం చేసుకోని వారిని అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడంలో ఎస్సీ వెల్ఫేర్‌ అధికారులు సిద్ధహస్తులనే చెప్పుకోవచ్చు. ఉన్నతాధికారులు జిల్లాలోని హాస్టళ్లను సక్రమంగా పర్యవేక్షణ చేయకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది ఆడిందే..ఆటగా..పాడిందే..పాటగా మారిందనే చెప్పుకోవచ్చు. గుంటూరు జిల్లాలో 33 ఎస్సీ హాస్టల్స్‌ ఉండగా అందులో 2707 మంది విద్యార్థులు ఉన్నారు. ఆయా హాస్టళ్లలో విద్యార్థులకు సరైన భోజనం, సక్రమమైన వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారనే చెప్పుకోవాలి. ● నవంబర్‌ 26న ప్రత్తిపాడు ఎస్సీ బాలికల హాస్టల్‌లో అన్నంలో పురుగులు వస్తున్నాయని అడిగితే హాస్టల్‌ నుంచి వెళ్లిపోమంటున్నారంటూ ఇద్దరు విద్యార్థినులు తమ తల్లిదండ్రులతో కలిసి ప్రత్తిపాడు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐకు ఫిర్యాదు చేశారు. అక్కడ జరుగుతున్న విషయాన్ని తెలుసుకునేందుకు వెళ్లిన డీడీ చెన్నయ్యకు కూడా విద్యార్థినులు అన్నం బాగోలేదని చెప్పారు. ● గుంటూరు బీఆర్‌ స్టేడియం వద్ద ఉన్న ఎస్సీ బాలికల హాస్టల్‌లో ఓ విద్యార్థినిని తోటి విద్యార్థులు నిత్యం గోల చేయడంతో పాటు బట్టలు ఆరేసుకుంటే కింద పడేస్తున్నారని, హాస్టల్‌లో భోజనం సరిగా ఉండటంతో లేదని నవంబర్‌ 16వ తేదీ ఆదివారం విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చినప్పుడు సదరు విద్యార్థిని తనగోడు వెళ్లబోసుకుంది. తల్లిదండ్రులు హాస్టల్‌ వార్డెన్‌ను నిలదీశారు. మా పాపను ఇంత ఇబ్బందులు పెడుతుంటే మీరేం చేస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తమ వారైతే చాలు..

ఒక పక్క హాస్టళ్లకు ఇన్‌ఛార్జ్‌లు ఉండటానికి వీల్లేదని సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ పట్టాభిపురం ఎస్సీ కాలేజీ బాలికల హాస్టల్‌లో రెగ్యులర్‌ వార్డెన్‌గా విధులు నిర్వహిస్తున్నప్పటికీ పరివర్తన భవన్‌ కాలేజీ బాలికల హాస్టల్‌కు ఇన్‌ఛార్జ్‌గా గత సంవత్సరం నుంచి ఓ వార్డెన్‌ పనిచేస్తుంది. సదరు వార్డెన్‌ పరివర్తన భవన్‌లోనే విధులు నిర్వహిస్తూ రెగ్యులర్‌ హాస్టల్‌ వార్డెన్‌గా వెళ్లకుండా అక్కడ ఓ అనధికార మహిళకు హాస్టల్‌ బాధ్యతలు అప్పగించిన విషయం అందరికి తెలిసినప్పటికీ అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదే విధంగా జిల్లాలోని పలు హాస్టళ్లలో కొంతమంది తమకు మామూళ్లు అప్పజెప్పే వార్డెన్ల వైపు కన్నెత్తి చూడరని కార్యాలయ సిబ్బంది చెప్పుకోవడం గమనార్హం. జిల్లా సంక్షేమ కార్యాలయంలో ముగ్గురు వార్డెన్లు ఖాళీగా ఉన్నప్పటికీ వారికి ఎటువంటి పోస్టింగులు వేయకుండా అక్కడే ఉంచి.. తమకు మామూళ్లు అప్పగించే వారికి ఇన్‌ఛార్జ్‌ వార్డెన్లుగా పోస్టింగ్‌ కల్పిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. నగరంలోని హయ్యర్‌ హాల్‌–1 హాస్టల్‌కు మార్చి నుంచి ఇప్పటి వరకు బిల్స్‌ ఆగిపోయాయి. ఎటువంటి కారణాలు లేకుండానే బిల్స్‌ ఆపేశారు. మామూళ్లు ముట్టజేబితే ఆటోమేటిక్‌గా బిల్‌ పేమెంట్‌ అయిపోతాయని కార్యాలయ సిబ్బంది చెప్పుకోవడం గమనార్హం.

కుక్‌ని ఇవ్వమని అడిగినందుకు సస్పెన్షన్‌

గుంటూరు నగరం హయ్యర్‌ హాల్‌ 1లో వార్డెన్‌గా జూన్‌ నెలలో తిరుపతి స్వామి బాధ్యతలు స్వీకరించారు. హాస్టల్‌లో విద్యార్థులకు భోజనం వడ్డించేందుకు కుక్‌ లేకపోవడంతో కొన్ని రోజుల పాటు ఆయనే తన సొంత డబ్బులతో కుక్‌ను, కబాటీని పెట్టుకుని విద్యార్థులకు భోజనం పెట్టారు. తనకు కుక్‌ను కేటాయించాలని నెలవారీ వార్డెన్ల సమావేశంలో అధికారులను అడిగినందుకు ఆయన్ను టార్గెట్‌గా చేసుకుని పని కట్టుకుని మరి అదే పనిగా హాస్టల్‌ విజిట్స్‌ పేరుతో తనిఖీలు చేపట్టి ఆగస్టు 28న సస్పెండ్‌ చేశారు. తీరా ప్రస్తుతం అదే హాస్టల్‌కు వేరే వార్డెన్‌ను ఇన్‌ఛార్జ్‌గా వేస్తే అతనికి మాత్రం కుక్‌, కబాటీ, వాచ్‌మెన్‌లను ముగ్గురు కేటాయించారు.

సాంఘిక సంక్షేమ శాఖలో మామూళ్ల పర్వం

వార్డెన్‌ల విషయంలో

అధికారుల ద్వంద్వ వైఖరి

తమకు అనుకూలంగా ఉండే

వారికి అన్నింటా అగ్ర తాంబూలం

అనుకూలంగా లేని వారికి హాస్టళ్ల

తనిఖీల పేరుతో ఇబ్బందులు

అవసరమైతే సస్పెండ్‌ చేయడానికి

వెనుకాడని వైనం

పట్టించుకోని ఉన్నతాధికారులు

హాస్టళ్ల నిర్వహణ గాలికి...!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement