జిల్లాలో పోలీస్ కంట్రోల్ రూం ఏర్పాటు
నగరంపాలెం: దిత్వా తుఫాన్ దృష్ట్యా జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ సబ్ డివిజన్లల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో గుంటూరు తూర్పు సబ్ డివిజన్ –0863–2223353, గుంటూరు పశ్చిమ సబ్ డివిజన్ – 0863–2241152 / 0863–2259301, ఉత్తర సబ్ డివిజన్– 08645–237099, దక్షిణ సబ్ డివిజన్ – 0863–2320136, తెనాలి సబ్ డివిజన్– 08644–225829, తుళ్లూరు సబ్ డివిజన్– 08645–243265, జిల్లా పోలీస్ కంట్రోల్ రూం నంబర్ 0863–2230100 అని అన్నారు. ప్రతి కంట్రోల్ రూంకు సీఐలను, నోడల్ అధికారులుగా ఎస్‌ఐలను నియమించామని చెప్పారు. సీఐల పర్యవేక్షణలో ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది నిరంతరం విధుల్లో ఉంటారని పేర్కొన్నారు. ఎటువంటి ప్రాణనష్టం వాటిల్లకుండా ప్రమాదకరమైన వంతెనలు, బ్రిడ్జిలు, కల్వర్టుల వద్ద పోలీస్ సిబ్బంది బందోబస్త్ నిర్వహిస్తారని పేర్కొన్నారు. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు అత్యవసర స్పందన బృందాలను అందుబాటులో ఉంటాయని అన్నారు. ప్రజలు అత్యవసరమైతే మినహా గృహాల నుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సహాయక చర్యలు అందించేందుకు అన్నివేళల సిద్ధమని పేర్కొన్నారు.


