విద్యారంగం ప్రైవేటీకరణ
●యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కళాధర్
●ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా మహాసభ ప్రారంభం
లక్ష్మీపురం: భారతదేశంలో ఆర్థిక సంస్కరణ తర్వాత ఉన్నత విద్యారంగంలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయని ఉన్నత విద్యారంగం పెద్ద ఎత్తున ప్రైవేటీకరణ జరుగుతుందని యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి కళాధర్ పేర్కొన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యాలయంలో ఆదివారం సంఘం జిల్లా 50వ మహాసభ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో 17 ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, యూనివర్సిటీలో 15 ఏళ్లగా రిక్రూట్‌మెంట్ లేకపోవడంతో అకాడమిక్ క్షీణత ప్రారంభమైందని అన్నారు. ప్రొఫెసర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు ప్రస్తుతం నాలుగు వేలకు పైగా ఖాళీగా ఉన్నాయని చెప్పారు. కొన్నిచోట్ల కాంట్రాక్ట్ గెస్ట్ ఫ్యాకల్టీ పద్ధతిలో అధ్యాపకులు పనిచేస్తున్నారని, విశ్వవిద్యాలయాల నిర్వహణ లోపభూయిష్టంగా ఉందన్నారు. వైస్ చాన్స్‌లర్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ నియామకం పూర్తి రాజకీయ కోణంలో జరగుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్ట్ అధ్యాపకులు పనిచేయటం, తగిన మౌలిక వసతులు లేకపోవడం వలన చేరే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుందని తెలిపారు. పేద విద్యార్థులు ముఖ్యంగా దళితులు, గిరిజన, బీసీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీఓ 77 రద్దుచేసి పేద విద్యార్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కె.ప్రసన్నకుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.కిరణ్, మాజీ జిల్లా కార్యదర్శి భావన్నారాయణ, డీవైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ కృష్ణకాంత్, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి షేక్ సమీర్, జిల్లా అధ్యక్షులు కె పవన్‌కుమార్, సహాయ కార్యదర్శి అన్సారీ, కిరణ్ దాసరి, అమత వర్షిని, ఉపాధ్యక్షులు సౌమ్య, రూపాస్, కమిటీ సభ్యులు యశ్వంత్, సూర్జిత్, అజయ్, అభిలాష్, అనిల్ పాల్గొన్నారు.


