సుప్రీం తీర్పుపై రాజీ తప్పదా?

Harbans Mukhia Writes Guest Column On  SC Judgement On Ayodhya Case - Sakshi

విశ్లేషణ

ఆలయాన్ని ధ్వంసం చేసి ఆ పునాదులపై బాబ్రీ మసీదును నిర్మించారనడానికి చారిత్రక, పురావస్తు ఆధారాలు లేవని తాము భావిస్తున్నప్పటికీ, హిందూ సోదరులు మాత్రం అది రామజన్మ స్థానమేనని నమ్ముతున్నందువల్ల దాన్ని వారికి సంతోషంగా అప్పగిస్తామని ఆనాడు ముస్లిం పక్షం చెప్పి ఉంటే తదనంతర చరిత్రలో ఏం జరిగివుండేది అనేది మన ఊహకు అందదు. అదే జరిగి ఉంటే రామాలయం, బాబ్రీమసీదు వివాదం శాశ్వత ప్రాతిపదికన శాంతియుతంగా ముగిసిపోయి ఉండేది. పైగా 1980ల నుంచి మనం దేశవ్యాప్తంగా చూస్తూ వస్తున్న మతపరమైన ఘర్షణలు తగ్గుముఖం పట్టి ఉండేవని ఘంటాపథంగా చెప్పవచ్చు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పును కూడా ముస్లిం పక్షం వ్యతిరేకిస్తే హిందుత్వ సంస్థలకు, వారి భావజాలానికి అంతకు మించిన బలం మరొకటి ఉండబోదనే చెప్పాలి.

దశాబ్దాలుగా వివాదాస్పదంగా నలుగుతున్న అయోధ్య, బాబ్రీమసీదు సమస్యపై విచారణను ముగించాక,  సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తుది తీర్పుపై పలువురు న్యాయపరమైన విమర్శలు సాగిస్తున్నారు. ప్రత్యేకించి ఈ తీర్పులో కనిపిస్తున్న కొన్ని అతి స్పష్టమైన పరస్పర విరుద్ధమైన, అసంగతమైన అంశాలు విమర్శలకు దారితీస్తున్నాయి. నాలుగు శతాబ్దాలుగా ఉనికిలో ఉంటూ వచ్చిన బాబ్రీమసీదును లేక దాని కొత్త నిర్మాణాన్ని తన మూల స్థానం నుంచి తరలించి అయోధ్యలోని ‘కీలకమైన స్థలం’లో అయిదెకరాల విస్తీర్ణంలో నిర్మించుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది.
అయితే మనం ఒకసారి 1980లలోకి మళ్లీ అడుగుపెట్టి చూసినట్లయితే సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు కొన్ని అంశాలను దాచి ఉంచినట్లు తెలుస్తుంది. రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదం జాతీయ ఎజెండాగా ఆవిర్భవించడం 1980లలోనే ప్రారంభమైంది. వివాదాస్పదమైన 2.77 ఎకరాల భూమిని తమకు అప్పగించినట్లయితే, బాబ్రీమసీదు మొత్తం నిర్మాణాన్ని చెక్కు చెదరకుండా ప్రస్తుత ప్రాంతానికి మరీ దూరంగా కాకుండా సమీపంలోని మరొక చోటికి సురక్షితంగా తరలిస్తామని ఆనాడు వివాదంలో భాగమై ఉన్న హిందూ పక్షం ప్రతిపాదించింది.

ముస్లింల వ్యతిరేకతతో మూలమలుపు
ఈజిప్టులో అస్వన్‌ డ్యామ్‌ కట్టడానికి వీలుగా ఒక పురాతన కట్టడాన్ని 1950లలో మరొక చోటికి సాంకేతిక పరిజ్ఞానంతో విజయవంతంగా తరలించారు. అయోధ్య వివాదంలో హిందూ పక్షం కూడా సరిగ్గా దీన్నే ప్రతిపాదించింది. అయితే మతపరంగా, రాజకీయపరంగా రెండురకాలుగా ముస్లిం పక్షం ఈ తిరస్కరించింది. ఒకప్పుడు అల్లా నివాసస్థలంగా భావించిన భూమిలోంచి ఒక ముక్కను తీసుకోవడం అనే అంశంపై తాము చర్చించలేమని ముస్లిం పక్షం వాదిం చింది. ఇక రెండోది ఏమిటంటే ఒకసారి హిందూ పక్షం నుంచి వస్తున్న ఈ డిమాండును అంగీకరించినట్లయితే అనేక ఇతర వివాదాస్పద ప్రాంతాల్లోనూ ఇదేరకమైన డిమాండ్లను తీసుకొచ్చే ప్రమాదం ఉంది. ప్రత్యేకించి కాశీ, మధుర ప్రాంతాలు ఈ సమస్య బారిన పడకతప్పదని ముస్లిం పక్షం భావన.

అయితే సుప్రీంకోర్టు ఈ వివాదంపై ఇటీవలే వెలువరించిన తీర్పు... పైన పేర్కొన్న తొలి అంశాన్ని స్పష్టంగా తిరస్కరించింది. పైగా 1991లో తీసుకొచ్చిన ఒక చట్టం రెండో అంశం విషయంలో కూడా తలుపులు మూసివేసింది. అయోధ్య కాకుండా ఇతర ప్రాంతాల్లో మందిర్‌–మసీదు వంటి వివాదాలు తలెత్తకుండా 1991 నాటి చట్టం అడ్డుకట్టలు వేసింది. అయితే భవిష్యత్తు రాజకీయ మలుపులు, పరిణామాలు దాని మనుగడకు హామీ ఇవ్వలేవు. ప్రస్తుత కేంద్రప్రభుత్వం ఆర్టికల్‌ 370 కింద కశ్మీర్‌కు ఇచ్చిన పవిత్రమైన హక్కులను కూడా ఒక్క కలంపోటుతో రద్దుచేయగలిగిన స్థితిలో ఉన్నప్పుడు, 1991నాటి చట్టాన్ని దాటి ముందుకెళ్లడానికి దానికి ఎంత కాలం పడుతుంది? పైగా 1991 నాటి ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవడంపై భారీ ఎత్తున ప్రజా సమీకరణ చేపట్టడం కేంద్రానికి సాధ్యపడుతుంది కూడా.

రామాలయాన్ని కాదు కదా... మరే దేవాలయాన్ని కూడా బాబ్రీమసీదు నిర్మాణం కోసం కూల్చివేశారనడానికి ఎలాంటి చారిత్రక, పురావస్తు ఆధారాలు లేనప్పటికీ (నాతో సహా అనేకమంది చరిత్రకారులు, పురావస్తు శాస్త్రవేత్తలు, వాస్తవానికి భారత పురావస్తు శాఖ సర్వే రిపోర్టులో కూడా బాబ్రీమసీదు కోసం రామాలయాన్ని నిర్మూలించలేదనే వాదిస్తూ వచ్చారు. అయితే మసీదు ప్రాంతంలో జరిగిన తవ్వకాల్లో ఇస్లాంకు సంబంధించినది కాకుండా ఇతర చిహ్నాలు కనిపించాయని ఒక సర్వే నివేదించింది. ఇదే సుప్రీంకోర్టు తీర్పునకు గట్టి ప్రాతిపదిక కల్పించింది), హిందూ సోదరులు మాత్రం అయోధ్యలోని వివాదాస్పద ప్రాంతం రామ జన్మస్థలం అని బలంగా నమ్ముతున్నందువల్ల, ఇతర దేవాలయాల విషయంలో అలాంటి డిమాండును చేయబోమన్న ప్రాతిపదికన భారీ స్థాయి రామాలయాన్ని నిర్మించుకోవడానికి గాను వివాదాస్పద స్థలాన్ని హిందువులకు సంతోషంగా అప్పగిస్తామని లేదా కనీసం దానికి సంసిద్ధతను తెలుపుతామని చెబుతూ ఆనాడు ముస్లిం పక్షం తన ముందుకు వచ్చిన ఆ ప్రతిపాదనను ఆమోదించి ఉంటే తదనంతర భారత సామాజిక చరిత్రలో ఏం జరిగి ఉండేది లేక ఏం జరిగి ఉండదు అనేది మన ఊహకు కూడా అంది ఉండదు.

మత ఘర్షణలు దాని ఫలితమే!
అయితే ముస్లిం పక్షం ఆనాడే అలా అంగీకరించి ఉన్నట్లయితే, అయోధ్య రామాలయం, బాబ్రీమసీదు వివాదం శాశ్వత ప్రాతిపదికన శాంతియుతంగా ముగిసిపోయి ఉండేది. అంతేకాకుండా 1980ల నాటి నుంచి మనం దేశవ్యాప్తంగా చూస్తూ వస్తున్న మతపరమైన ఘర్షణలు తగ్గుముఖం పట్టి ఉండేవని ఘంటాపథంగా చెప్పవచ్చు. దీనివల్ల జరిగి ఉండే మరో ముఖ్య ఫలితం ఏదంటే, భారతీయ జనతా పార్టీ కానీ సంఘ్‌ పరివార్‌ కానీ ఈనాడు ఇంత ప్రతిష్టను సాధించి ఉండవు. భారత రాజకీయాల్లో, సమాజంలో ఇప్పుడున్నంత ప్రాధాన్యతా శక్తిగా అవి తయారై ఉండవు. 

నిజానికి ఆనాడు ముస్లింలు ఆ పని చేసి ఉంటే.. త్యాగాన్ని, సహనాన్ని ప్రబోధించే భారతీయ నీతి సూత్రాలను గౌరవించిన వారుగా వారు ప్రశంసలు అందుకుని ఉండేవారు. ఇతరులకు ఇవ్వడం అనే గుణాన్ని ప్రదర్శించడం ద్వారా ముస్లింలు విజేతలై ఉండేవారు. ఆ రోజు వారు ఆ పని చేసి ఉంటే కనీసం రెండింట్లో ఒకటైనా మంచి ఫలితాన్ని తీసుకుని వచ్చి ఉండేది. కానీ ఇప్పుడు అందుకు అవకాశమే  లేకుండా పోయింది. చరిత్రను మలుపు తిప్పే శిఖరాలవైపు గొప్ప దార్శనికత కలిగిన నాయకులు మాత్రమే తమ సామాజిక వర్గాలను నడిపించగలరు.

కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు సరిగా కానీ తప్పుగా కానీ రాజీకి సంబంధించి మతపరమైన, రాజకీయపరమైన భూమికలను తోసిపుచ్చడమే కాకుండా తనుకు తానుగా మరొక రాజీ మార్గాన్ని ప్రతిపాదించింది. బాబ్రీమసీదును కూల్చివేయడం చట్టవిరుద్దం అని నొక్కిచెబుతూ, అయోధ్య పట్టణంలోనే మసీదుకోసం కీలక ప్రాంతంలో అయిదు ఎకరాల స్థలం ఇవ్వాలన్నది సుప్రీంకోర్టు సూచించిన కొత్త రాజీ. అయితే ముస్లిం కమ్యూనిటీ నాయకత్వం ఈ రాజీ ప్రతిపాదనను ఆమోదించవచ్చు, లేక తిరస్కరించవచ్చు అని కూడా సుప్రీం కోర్టు సూచించింది.

ఒక మతాన్ని వేరుచేయడం ప్రమాదకరం
ఆ ప్రకారంగానే అయోధ్య వివాదం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు సమీక్ష కోరనున్నట్లు తెలిపింది. ఇది దాని రాజ్యాంగ హక్కు కూడా. కానీ అదే సమయంలో సుప్రీంకోర్టు అయోధ్య కేసులో ముస్లిం పక్షానికి ప్రతిపాదించిన అయిదు ఎకరాల భూమిని ముస్లిం లాబోర్డు తిరస్కరించడానికి కూడా వీలుంది.అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు భారతదేశంలోని ముస్లింలందరికీ ఏకైక సంరక్షక వ్యవస్థగా తన్ను తాను ప్రకటించుకుంటున్నట్లు కనిపిస్తుంది. పైగా షరియత్‌ వ్యవస్థపై దాని అజమాయిషీ అనేది భారత రాజ్యాంగం నుంచి దానికి ఒక విధమైన స్వతంత్రతను కలిగించింది. 

అందుకే షా బానో కేసు వంటి అంశాల్లో ఇది ముస్లిం కమ్యూనిటీపై భారం మోపింది. దేశంలో హిందుత్వ భావనలు అసాధారణంగా పెరిగిపోవడానికి కూడా ఇదే మూలం అని కూడా చెప్పాలి. ‘ముస్లిం’లు సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకించడం కంటే హిందుత్వ సంస్థలకు, వారి భావజాలానికి మించిన బలం మరొకటి ఉండబోదనే చెప్పాలి. వీరి భావజాలానికి కీలకమైన అంశం ఏదంటే ముస్లిం కమ్యూనిటీని ఇతరుల నుంచి వేరుపర్చడమే. హిందువులు, ముస్లింల మధ్య  విభేదాలు ఈ దేశంలో క్రియాశీలకమైన పరిష్కారం కాని శత్రుత్వంగా మారిపోయాయి. 

ఈ సందర్భంలో సుప్రీంకోర్టు ప్రతిపాదించిన కొత్త రాజీ మార్గాన్ని ముస్లింలు తిరస్కరించడం అంటే మేము వర్సెస్‌ వారు అనే ప్రస్తుతం బలపడిన భావాన్ని మరింతగా పెంచి పోషించడానికే ఉపయోగపడుతుంది. ఈ మేము వర్సెస్‌ వారు భావజాలం వల్ల బాధితులైనవారు ఉభయపక్షాల్లోనూ ఉంటున్నారు. కానీ ఇలాంటి ప్రతి సందర్భంలోనూ ఒక పక్షమే అధిక మూల్యాన్ని చెల్లిస్తూ వచ్చిందని తప్పక గమనించాలి.

వ్యాసకర్త: హర్బన్స్‌ ముఖియా
ప్రొఫెసర్, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top