మెదళ్లలో తుఫాను

Guest Column By Vardelli Murali On Present Politics - Sakshi

మస్తిష్కంలో ఎవరో ఎమర్జెన్సీ విధించారు. ఆలోచనా తరంగాలను ఎవరో హైజాక్‌ చేస్తున్నారు. అభిప్రాయా లపై ఎవరో మంత్రజలం చల్లి దారి మళ్లిస్తున్నారు. జ్ఞాప కాల అరల్లోంచి ఎవరో కొన్ని దొంతరలను దొంగిలిస్తు న్నారు. చిన్న మెదడు పెద్ద మెదడు మధ్యనున్న విభజన రేఖ ఉష్ణోగ్రమై, భూమధ్యరేఖను తలపిస్తున్నది. సమా చార విప్లవ విపాటనం అంతరంగాల్లో కల్లోలాన్ని రేకెత్తిస్తు న్నది. మెగా బైట్స్‌లో వాస్తవాలనూ, గిగా బైట్స్‌లో వదంతులను మోసుకొస్తున్నది. ఏది సత్యం? ఏది అసత్యం?. ఇప్పుడు దేశమంతటా చర్చనీయాంశాలైన సీఏఏ, ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీలపై కేంద్ర ప్రభుత్వం చెబుతున్న విషయాలు నిజమేనా?. ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, కొందరు మేథావులూ చేస్తున్న వాదాలు వాస్తవమేనా?. ప్రభుత్వ గళం బలహీనంగా వినబడుతున్నది.

వ్యతిరేక కంఠం ఘంటారావం చేస్తున్నది. అందుకే సగటు మని షిలో భయం, అలజడి, ఉక్కపోత, ఎవరో వెంటబడి తరుముతున్న అనుభూతి. వచ్చే ఏప్రిల్‌ నుంచి జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్‌) కోసం ఇంటింటి సర్వే జరగ బోతున్నది. ఆ సర్వేలో ఇంటి యజమానితో పాటు కుటుంబ సభ్యుల వివరాలు వారి ఉద్యోగ వ్యాపకాలు, ఆదాయాది సంగతులతో పాటు కొన్ని కొత్త ప్రశ్నలు వేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. యజమాని తల్లి దండ్రుల పేర్లేమిటో చెప్పాలి. వాళ్లెక్కడ పుట్టారో, ఎక్కడి నుంచి వచ్చారో చెప్పాలి. వాళ్లు పుట్టిన తేదీలు చెప్పాలి. ఇన్ని వివరాలు కొత్తగా సర్కారుకెందుకు అన్న సందే హంపై జరుగుతున్న ప్రచారాలు ఆందోళనకరంగానే ఉన్నాయి. చిన్న విషయాలక్కూడా కలవరపడే గొర్రెతోక ఆదాయపు సగటు కుటుంబరావుల్లో సహజంగానే గాభరా మొదలైంది.

ఇంకేమి అడుగుతారో... ఏమేమి రహస్యాలు చెప్పాలో? నేను చిన్నతనం నుంచి గుండెల నిండా పీల్చుకుంటున్న గాలి తాలూకు కులమేమిటో, దాని మతమేమిటో కూడా అడుగుతారా? నేను చిన్ననాటి నుంచి తాగుతున్న మంచినీటి వర్ణమేమిటో, దాని మర్మ మేమిటో కూడా చెప్పవలసి ఉంటుందా?. ఎపుడో... పదహారేళ్ల వయసులో... ఏమో తెలియని ఒక మోహావే శపు అలజబడిలో... కళ్లలో కృష్ణావతారంలా మెరిసిన ఒక విద్యుల్లత కోసం... పదహారు సార్లు రాసి కొట్టివేసి పది హేడవ దండయాత్రతో అందంగా రాసుకున్న లేఖను ఇవ్వడానికి ధైర్యం చాలక చించేసుకొని లోలోపల దాచు కున్న గుండెకోట రహస్యాన్ని ఇప్పుడు చెప్పేయవలసి ఉంటుందా? ఎన్నడూ అడగని వివరాలు ఇప్పుడెందుకు అడుగుతున్నారు. ఎన్నడూ చూడని కళ్లు నన్నే ఎందుకు చూస్తున్నాయి?. ఇంటి గుట్టు గడప దాటకుండా కాపు రాలు నెట్టుకొచ్చే సంప్రదాయ కుటుంబాల్లోకి తలుపు చాటు నుంచి ఎందుకు తొంగిచూస్తున్నారు?

కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఇటీవలే పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ) తీసుకొని వచ్చింది. దీని ప్రకారం పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌ల నుంచి 2014 డిసెంబర్‌ 31 కంటే ముందు వచ్చిన ‘అక్రమ వలస దారుల్లో హిందూ, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, పార్శీలు ఐదేళ్ల పాటు క్రమం తప్పకుండా ఇక్కడే వున్నట్లయితే వారి కోరిక మేరకు సహజసిద్ధ ప్రాతిపదికపై వారికి భారత పౌరసత్వం లభిస్తుంది. 2004లో ఎన్డీఏ ప్రభుత్వమే చేసిన చట్ట సవరణ ప్రకారం అక్రమ వలసదారులకు ఎట్టి పరిస్థితుల్లోనూ పౌరసత్వం ఇవ్వకూడదు. దానికి విరుద్ధం ఇప్పుడు జరిగిన సవరణ. ఈ మార్పునకు కేంద్రం ఒక మానవీయ కోణాన్ని చూపుతున్నది. ఆ మూడు ముస్లిం మెజారిటీ దేశాల్లో మత విద్వేషాల కారణంగా వెలివేయ బడిన వారికి తాము కొత్తగా పౌరసత్వం ఇస్తున్నాము తప్ప ఇక్కడున్న ముస్లిముల పౌరసత్వాన్ని తాము తీసి వేయలేదనీ, ఇది పౌరసత్వం ఇచ్చే చట్టమే తప్ప తీసివేసే చట్టం కాదని కేంద్రం వాదిస్తున్నది.

ప్రతిపక్షాలు విషప్రచా రాన్ని చేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం అభియోగం మోపు తున్నది. అయితే, రాజ్యాంగ సభలో పౌరసత్వంపై జరి గిన చర్చల్లో గానీ, 1955లో పౌరసత్వ చట్టాన్ని రూపొందించినప్పుడు కానీ, తదనంతర సవరణల్లో కానీ, ఎక్కడా లేని మత ప్రస్తావన 2019 చట్ట సవరణలో వచ్చింది. మతప్రస్తావన చేయకపోతే ముషార్రఫ్‌ కూడా భారత పౌరసత్వం అడుగుతారు ఇద్దామా? అని బీజేపీ అను కూల వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. కార్గిల్‌ యుద్ధంలో వంద లాది భారత జవాన్‌ల మరణానికి కారకుడైన ముషార్రఫ్‌ పాకిస్తాన్‌కు వెళితే (అక్కడి నేరాలకు) ఉరి తీస్తారు కనుక, గేట్లు తీస్తే భారత శరణు కోరుతారని, అలాంటి అయో గ్యులు ఇంకా చాలామంది ఉంటారని వారి వాదన. ముస్లిం వర్గాలుగానే మనం భావించే అహ్మదీలు, షియా హజారాలు, బహాయిలు వగైరాలను ఈ మూడు దేశాలు ముస్లిం మతస్తులుగా గుర్తించడం లేదు.

తీవ్రమైన విద్వే షానికి వేధింపులకు కూడా వారు గురవుతున్నారు. అటు వంటి వారిని ఎందుకు ప్రస్తావించలేదు? కేవలం మత ప్రాతిపదికపైనే కాకుండా రాజకీయ, జాతి, తెగ వైరాల వలన కూడా భారతదేశాన్ని ఆశ్రయించిన వారున్నారు. బర్మా రోహింగ్యాలు, శ్రీలంక తమిళులు, చైనా నుంచి వచ్చిన టిబెటన్లు తదితరుల గురించి ఎందుకు ఆలోచన చేయలేదు? పైపెచ్చు పౌరసత్వం విషయంలో మత ప్రస్తావన తీసుకొని రావడం రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే అనేది ప్రధాన ఆరోపణ. ఈ చట్ట సవరణ ప్రకారం పేర్కొన్న మూడు దేశాల నుంచి వచ్చిన ఐదు వర్గాల ప్రజలను మినహాయిస్తే, 2004 చట్ట సవరణ ప్రకారం అక్రమ వలసదారులు ఎవ్వరూ పౌర సత్వానికి అర్హులు కారు. అక్రమ వలసదారు అంటే తన దేశం నుంచి వలసకు సంబంధించిన సరైన పత్రాలు లేకుండా మనదేశంలోకి అడుగుపెట్టినవారు అని అర్థం. ప్రాణభయంతోనో, మరే కారణంతోనే ఒక వ్యక్తి పొరు గుదేశం నుంచి భారతదేశానికి వచ్చి ఇక్కడే స్థిరపడి ఇక్కడ పౌరసత్వం ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకున్నప్పటికీ అతనికి భారత పౌరసత్వం లభించదు. అతనికే కాదు, అతని పిల్లలకూ లభించదు. 2004 చట్ట సవరణ ప్రకారం తల్లిదండ్రుల్లో ఒకరు అక్రమ వలసదారు అయితే ఆ పిల్లలు పౌరసత్వానికి అనర్హులు. 1955లో చేసిన చట్టం ప్రకారం ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డ జనన ప్రాతి పదికపై తల్లిదండ్రులతో సంబంధం లేకుండా పౌరసత్వం లభించేది.

1987లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం దీన్ని సవరిస్తూ జనన ప్రాతిపదికతో పాటు తల్లిదండ్రుల్లో ఒక రికి భారతీయ పౌరసత్వం ఉండి తీరాలని చేర్చారు. రెండో వ్యక్తి అక్రమవలసదారై ఉండకూడదని 2004 చట్టం చెబుతున్నది.ఈ నేపథ్యంలోనే జాతీయ జనాభా పట్టిక ఎన్‌పీఆర్‌), జాతీయ పౌరపట్టిక (ఎన్‌సీఆర్‌)ల వ్యవహా రాలను పరిశీలించవలసి ఉంటుంది. 2004లో అప్పటి ఎన్డీఏ ప్రభుత్వం పౌరసత్వ చట్టానికి సవరణలు తీసుకు రావడానికి ముందు పౌరుల నమోదు, గుర్తింపు కార్డుల జారీ పేరుతో జాతీయ పౌరసత్వం నిబంధనావళి (సిటిజ న్‌షిప్‌ రూల్స్‌–2003) రూపొందించి చట్టానికి అనుబం ధంగా చేర్చింది. ఈ నిబంధనావళి ప్రకారం ముందుకు వచ్చినవే ఎన్‌పీఆర్, ఎన్‌ఆర్‌సీలు. పదేళ్లకొకసారి జరిగే జనాభా లెక్కల సేకరణకు ముందుగా జాతీయ జనాభా పట్టిక (ఎన్‌సీఆర్‌)ను రూపొందిస్తారు. ఇందుకోసం ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి వాళ్లకు కావలసిన ప్రశ్నలు వేసి సమాధానాలు పొందుతారు.

ఎవరైనా సరైన సమాధానాలు చెప్పలేకపోతే వాళ్లను ‘అనుమానితుల’ కింద మార్క్‌ చేసుకుంటారు. మరో అవకాశం ఇస్తారు. అయితే తమ పౌరసత్వాన్ని నిరూపించుకునే బాధ్యత సదరు అనుమానితునిదే. ఎన్‌పీఆర్‌లో సేకరించిన సమా చారం అధారంగా జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్‌సీ) రూపొందుతుంది. జాతీయ స్థాయి రిజిస్ట్రార్‌ నుంచి స్థానిక రిజిస్ట్రార్‌ వరకు ఈ పట్టికలను నిర్వహిస్తారు. ‘అనుమానితులు’ సరైన డాక్యుమెంట్లు తీసుకొని పౌరస త్వాన్ని రుజువు చేసుకుంటే పట్టికలోకి ఎక్కుతారు. లేక పోతే వారు పౌరులు కాలేరు. పౌరులు కాలేనివారు ఎటువంటి పౌరహక్కులను అనుభవించలేరు. ప్రభుత్వ కార్యక్రమాల లబ్ధిని పొందలేరు. రేషన్‌కార్డు తీసుకోవడానికే అధికారులకు లంచాలు ఇచ్చుకోవలసిన దేశంలో, నేను బతికే ఉన్నాను మొర్రో... అని అరిచి గీపెట్టినా అందుకు రుజువు డాక్యుమెంట్లు సమర్పించుకోలేక పెన్షన్లు పోగొట్టుకుంటున్న నిర్భాగ్యు లున్న వ్యవస్థలో... అమ్మా, నాయనల పుట్టు పూర్వో త్తరాలను సరిగ్గా చెప్పలేక ‘అనుమానితులు’గా ముద్ర పడి డాక్యుమెంట్లు సమర్పించుకోలేక పౌరసత్వాన్ని పోగొట్టుకోని ప్రజలు ఉండరని చెప్పగలమా? ‘మా అమ్మ ఎప్పుడో ఐదో ఏట తప్పిపోయిందట. వాళ్లు వీళ్లు పెంచి పెద్దజేసి పెండ్లిచేసినారట’ అని చెబుతారు. ఎన్యూమరే టర్లు ఏమని రాసుకుంటారు? ‘అనుమానితుల’ జాబి తాలో చేరుస్తారా? పెద్ద సంఖ్యలో నిరక్షరాస్యులున్న దేశంలో సమాధానాలు ఇదే వరసలో ఉంటాయి.

ఈ ప్రక్రియలో అనుమానితులుగా ముద్రపడే ప్రమాదం దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకే ఎక్కువ. సంచార జీవుల దగ్గర ఏం డాక్యుమెంట్లుంటాయి? వలస కార్మి కులు ఏం పత్రాలు చూపగలరు?. అందుకే ప్రజల్లో ఈ వ్యవహారం పట్ల ఇన్ని అనుమానాలు, సందేహాలు. ఇప్ప టికే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాము ఎన్‌ఆర్‌సీని అమలు చేయబోవడం లేదని ప్రకటించారు. పౌరసత్వ చట్టసవరణను కూడా కేవలం ఆ మూడు దేశాలకు సంబంధించిన ఒక ‘పరిమిత’ వ్యవహారంగానే పరిగణిస్తామని చెప్పారు. ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీ గురించి కొద్దిగా చెప్పుకోవాలి. జనన ప్రాతిపదికపై అందరికీ లభించే పౌరసత్వాన్ని తొలి సవరణ ద్వారా తల్లిదండ్రుల్లో ఒకరికి పౌరసత్వం ఉండాలంటూ పరిమితి విధించింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే. ఎన్‌పీఆర్‌ తయారీ కోసం 2010లో మొదటిసారిగా డేటా సేకరించిందీ కాంగ్రెస్‌ నాయకత్వం లోని యూపీఏ ప్రభుత్వమే. అందువల్ల, ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత ఆందోళనల్లో అది పాలుపంచుకోవ డాన్ని కేవలం రాజకీయంగానే భావించవలసి ఉంటుంది. ప్రధాని చేసిన ప్రకటనలకు భిన్నంగా కొందరు బీజేపీ నేతలు చేసిన ప్రసంగాల పరిస్థితిని దిగజార్చాయి.

ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వ విస్పష్టమైన వైఖరి రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ సమావేశాల్లో వెలు వడాలని ప్రజలు ఆశిస్తారు. ప్రధాని ఇచ్చిన హామీలకు భిన్నంగా బీజేపీ ప్రభుత్వ వైఖరి ఉండే పక్షంలో జీవ న్మృత్యువు స్థితిలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ కాయానికి సంజీ వనీ మూలికను తాకించినట్లవుతుంది. జాతీయ స్థాయిలో ఎదురు లేని రాజకీయ పరిస్థితిని చేజేతులా వదులుకోవ లసి వస్తుంది. భారత్‌ను ఒక అజేయ ఆర్థికశక్తిగా మలిచే అద్భుత అవకాశం బీజేపీకి లభించింది. కాలానుగుణ మైన విధానాల మార్పులతో అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా కాలం చెల్లిన మూల సిద్ధాం తాలవైపు తిరోగమిస్తే భంగపాటు ఎదురుకాక తప్పదు. మెదళ్లను మెసపుటేమియా నాగరికత కాలపు ఆలోచ నల గడపను దాటించకపోతే వాస్తవ పరిస్థితులతో జరిగే ఘర్షణలో తుపాను చెలరేగక తప్పదు. ఆ తుపాను కార ణంగా కురిసేవి నీటి చుక్కలు కాదు నెత్తురు చుక్కలు. మొన్న ఢిల్లీలో కురిసిన నెత్తురు చుక్కల జన్మవృత్తాంతా లను ముందు సేకరిస్తే మంచిది. ఎన్‌పీఆర్‌ వివరాల సంగతి తర్వాత ఆలోచించవచ్చు.
muralivardelli@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top