రాహుల్‌ గాంధీ రాయని డైరీ

Guest Column By Madhava Singa Raju Over Rahul Gandhi - Sakshi

దుబాయ్‌ రావడం ఇదే మొదటిసారి. ఈ ఇయర్‌ని ‘ఇయర్‌ ఆఫ్‌ టాలరెన్స్‌’గా జరుపుకుంటున్నారట ఇక్కడివాళ్లు. ‘ఇండియాలో మీరు యూత్‌ లీడర్‌ కదా, మా యూత్‌ని ఇన్‌స్పైర్‌ చేసే మాటలు రెండు మాట్లాడిపోగలరా’’ అని ఆహ్వానిస్తే ఇక్కడికి వచ్చాను. వీళ్లను ఇన్‌స్పైర్‌ చేసి వెళ్దామని వచ్చి, నేనే వీళ్లను చూసి ఇన్‌స్పైర్‌ అయినట్లున్నాను! కొన్నాళ్లు యు.ఎ.ఇ.లోనే ఉండిపోవాలనిపించింది. దగ్గర్లో ఎలక్షన్‌లు లేకపోతే ఆ పనే చేసి ఉండేవాడిని. బిన్‌ రషీద్‌ నవ్వుతూ చూస్తున్నారు. ఒక ప్రైమ్‌ మినిస్టర్‌ నవ్వుతున్నట్లుగా లేదు ఆ నవ్వు.  సామాన్యుడెవరో నవ్వుతున్నాడు. 

హిజ్‌ హైనెస్‌ షేక్‌ ముహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ను చూసి ఇండియా నేర్చుకోవలసింది చాలా ఉంది! బిన్‌ రషీద్‌కు దగ్గరగా వెళ్లి, ఆయన్నే నిశితంగా చూస్తూ నిలబడ్డాను. ‘‘ఏంటలా నన్నే చూస్తున్నారు నిశితంగా?’’ అని నవ్వుతూ అడిగారు బిన్‌ రషీద్‌.  ‘‘మీకు మరికాస్త దగ్గరగా రావచ్చా?’’ అని అడిగాను. ‘‘ఇండియా, యు.ఎ.ఇ. ఎప్పుడూ దగ్గరగానే ఉంటాయి కదా రాహుల్‌జీ’’ అన్నారు రషీద్‌. ‘‘దేశాలు దగ్గరగా ఉండటం కాదు రషీద్‌ జీ. మీకిప్పుడు నేను దగ్గరగా ఉన్నాను కదా. ఆ దగ్గరితనంలోని దూరం మరికాస్త తగ్గితే బాగుంటుందని నా మనసు కోరుకుంటోంది’’ అన్నాను. దూరంగా జరిగారు ఆయన! ‘‘ఏమైంది రషీద్‌ జీ? ఎందుకలా దూరంగా జరిగారు’’ అన్నాను. 

‘‘ఇప్పటికే మనం ఇద్దరు మగవాళ్ల మధ్య ఉండాల్సిన దూరం కన్నా తక్కువ దూరంలో ఉన్నాం. మీరు కోరుకుంటున్నట్లుగా నేను మీకు ఇంకా దగ్గరగా రావాలంటే, ముందు నేను కొంత దూరంగా జరిగితేనే గానీ, మీకు దగ్గరగా వచ్చే ప్రయత్నం చేసేందుకు సాధ్యపడదు’’ అన్నారు. ఇంత టాలరెన్స్‌ను నేను మరే ప్రపంచ నాయకుడి దగ్గరా చూడలేదు! ముఖ్యంగా మోదీ దగ్గర చూడలేదు. 
‘‘మగాళ్లు ఎలా ఉండాలో, మీరు అలా ఉన్నారు రషీద్‌ జీ’’అన్నాను. మళ్లీ ఆయన వెనక్కు జరిగారు! ‘‘ఇంతకు క్రితమే కదా రషీద్‌ జీ.. వెనక్కి జరిగారు. మళ్లీ వెనక్కు జరిగారెందుకు?’’ అని అడిగాను. ‘‘ముందుకు రాబోయి, వెనక్కు జరిగినట్లున్నాను రాహుల్‌ జీ’’ అన్నారు!

‘‘పర్లేదు రషీద్‌ జీ, మీ ఛాతీని దగ్గరగా చూడ్డం కోసమే నేను మీకు మరింతగా దగ్గరగా రావాలనుకున్నాను. మీరే నా దగ్గరకు రావాలనేముందీ, నేనైనా రావచ్చు కదా మీకు దగ్గరగా’’ అన్నాను. 
‘‘గుడ్‌ ఐడియా రాహుల్‌జీ, కానీ మీరు నా ఛాతీని చూడ్డంలోని ఔచిత్యాన్ని ప్రశ్నిస్తే మీరు గానీ అసహనానికి లోను కారు కదా’’ అన్నారు. అసహనానికి కాదు కానీ, దిగ్భ్రమకు లోనయ్యాను. ఒక సర్వ శక్తి సంపన్నుడైన సార్వభౌమ పాలకుడికి ఇంత టాలరెన్స్‌ ఉంటుందా! ‘‘రషీద్‌ జీ.. నేను మీ ఛాతీ చుట్టుకొలత ఎంత ఉందో అంచనా వెయ్యాలను కుంటున్నాను. అందుకే మీకు దగ్గరగా రావాలని అనుకుంటున్నాను’’ అని చెప్పాను.
 
‘‘నేనెప్పుడూ నా ఛాతీని కొలుచుకోలేదు రాహుల్‌జీ. ఊపిరి సలపనివ్వని పనుల్లో.. గట్టిగా ఊపిరి తీసుకుని ఒకసారి, ఊపిరి తీసుకోకుండా ఒకసారి ఛాతీని కొలుచుకునే తీరిక ఎవరికుంటుంది చెప్పండి?’’ అని అడిగారు. హిజ్‌ హైనెస్‌ షేక్‌ ముహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌ను చూసి ఇండియా నేర్చుకోవలసింది చాలా ఉంది. ముఖ్యంగా ఇండియాలో యాభై ఆరు అంగుళాల ఛాతీ ఉందని చెప్పుకుని తిరిగేవారు నేర్చుకోవలసింది చాలా ఉంది. 
- మాధవ్‌ శింగ రాజు

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top