‘నేను కూడా..’ ఉద్యమం

Gollapudi Maruthi Rao Article On MeToo Movement - Sakshi

జీవన కాలమ్‌

సృష్టిలో స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ప్రాథ మికం. సాధారణంగా పాశ వికం. సెక్స్‌ ప్రాథమిక శక్తి. మళ్లీ పాశవికం. కొలం బియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్‌ మార్గరెట్‌ మీడ్‌ అనే ఆవిడ దక్షిణాఫ్రికాలో ఆటవిక నీగ్రో జాతుల లైంగిక ఆచారాల గురించి ఒక పుస్తకం రాసింది. అతి ప్రాథమికమైన, అనూహ్యమైన పద్ధతులవి. నా వాక్యాలకు కూడా లొంగవు.

మన వివాహ వ్యవస్థ ప్రాథమిక వికారానికి సంస్కారపు టంకం. వెంకయ్యకి సీతమ్మనిచ్చి పెళ్లి చేశారు. ఆ ఘట్టానికి బంధువులెందుకు? ఊరి పెద్ద లెందుకు? వాళ్లిద్దరి ఊరేగింపు ఎందుకు? అది ఆనాటి సంప్రదాయ పరిపక్వతకి నిదర్శనం. ఓ అబ్బాయీ అమ్మాయీ భార్యాభర్తలయితే చాలదు. వారి కట్టుబాటు సమాజానికి తెలియాలి. సీతమ్మ ఎక్కడ తారసపడినా ఆవిడ ఫలానా వెంకయ్య భార్య అనే గౌరవానికి నోచుకోవాలి. సమాజానికంతటికీ తెలియాలి. ఫలానా ఇంటి కోడలని తెలియాలి. ఇవన్నీ– ప్రాథమిక ‘పాశవిక’ ప్రవృత్తికి సమాజం ఏర్పరచిన ఎల్లలు. ఆనాటి సంప్రదాయం– వివా హం పేరిట సమాజానికి నిర్దేశించిన, మహిళ రక్షణకి ఉద్దేశించిన కట్టుబాటు.

ఇప్పటి పెళ్లిళ్లకి సాక్ష్యాలు అక్కర్లేదు. ఊరేగిం పులు లేవు. అవసరం లేదు. ‘హేతువు’ సంస్కా రాన్ని అటకెక్కించిన కాలమిది. ఇప్పుడిప్పుడు– ఏకాంతంగానో, ఒంటరిగానో, పెళ్లిళ్లు అక్కర లేకుం డానో కలిసి బతికే ‘లాజిక్‌’ చోటు చేసుకుంది. న్యాయంగా ఇది సంస్కారానికి ఆవలి గట్టు కావాలి. కాలేదు. కాగా, దశాబ్దాలుగా స్త్రీ పురుషాధిక్యతకో, అతని ప్రాథమిక శక్తి పైత్యానికో గురి అవుతోంది. నేడు మహిళ ఆకాశానికి ఎగురుతోంది. దేశాల్ని పాలి స్తోంది. బ్యాంకుల్ని నిర్వహిస్తోంది. ఇదొక పార్శ్వం. భర్తకి ఇంత వండిపెట్టి, బిడ్డల్ని స్కూళ్లకి సాగనంపి, తానూ ఉద్యోగానికి బయలుదేరుతోంది. అయితే స్త్రీ ఉద్యోగం చేసే పరిస్థితులు, దగ్గరితనం, చొరవ, ఏకాంతం, సహజీవనం, వెసులుబాటు– ఇవన్నీ పురుషులచేత వెర్రితలలు వేయిస్తున్నాయి.

అకాలీ ఉద్యమంలో దౌర్జన్యకారుల ఆట కట్టించి చరిత్రని సృష్టించిన ‘సింహస్వప్నం’ కేపీఎస్‌ గిల్‌ 1988లో ఒకానొక పార్టీలో మద్యాన్ని సేవించి– చెలియలికట్టని దాటాడు. ఐఏఎస్‌ ఆఫీసర్‌ రూపన్‌ దేవల్‌ బజాజ్‌ పిర్రమీద కొట్టాడు. 18 సంవత్సరాలు కేసు నడిచింది. గిల్‌ నేరస్తుడని సుప్రీంకోర్టు సమర్థిం చింది. రాజకీయ రంగంలో అవినీతిని ఎండగట్టిన ‘తెహల్కా’ పత్రిక సంపాదకుడు తరుణ్‌ తేజ్‌పాల్‌ 2013లో తన సహోద్యోగి మీద చొరవ చేశాడు. దేశం ఆ దృశ్యాన్ని చూసింది. కేసు నడుస్తోంది.

ఇప్పుడిప్పుడు మహిళ ధైర్యంగా గొంతు విప్పు తోంది. మొట్టమొదట హాలీవుడ్‌ ప్రముఖుడు హార్వీ ఐన్‌స్టీన్‌ శృంగార లీలలు వీధికెక్కాయి. మహిళల వెన్నులో ధైర్యం వచ్చింది. తమకు జరిగిన అప ఖ్యాతిని బయటపెట్టడానికి జంకనక్కర లేదని గ్రహించారు. ఎందరో పెద్దల గోత్రాలు రోడ్డున పడు తున్నాయి. ప్రఖ్యాత గాయని చిన్మయి– పద్మశ్రీ వైర ముత్తు చాపల్యాన్ని బట్టబయలు చేసింది. మహా నటుడు నానా పటేకర్‌ తనుశ్రీ దత్తా అనే నటీమ ణితో లైంగికమైన చొరవ తీసుకున్నారట. ప్రముఖ దర్శకుడు సుభాష్‌ ఘయ్‌ తనని ముద్దు పెట్టుకున్నా డని ఒక నటీమణి చెప్పింది. ప్రస్తుతం కేంద్ర మంత్రి ఎమ్‌జే అక్బర్‌గారి లీలలు ప్రియా రమణి అనే మహిళ బయట పెట్టింది. నిర్మాత సాజిద్‌ ఖాన్‌ వేధింపులు బయటపడ్డాయి. ఆయన తను దర్శ కత్వం వహిస్తున్న ‘హౌస్‌ఫుల్‌ 4’  సినిమా నుంచి తొలగాడు. నేరస్తుల్ని శిక్షిస్తే తప్ప నేను నటించన న్నారు హీరో అక్షయ్‌ కుమార్‌.

సమాజంలో అపఖ్యాతికో, కుటుంబంలో కల్లో లానికో, ఉపాధి చెడిపోయే ప్రమాదానికో– అవమా నాన్ని భరించి, కన్నీరు దాచుకుని నోరు కట్టుకున్న మహిళలు ఇప్పుడిప్పుడు నోరు విప్పుతున్నారు. ఏమైనా సమాజ సంస్కారాన్ని అటకెక్కించి, మారిన వ్యవస్థలో ‘వ్యక్తి సంస్కారాన్ని’ నమ్ముకోవలసిన రోజులొచ్చాయి. ఉద్యోగ కార్యాలయాలలో స్థిరమైన సామీప్యం, సహచర్యం, తప్పనిసరైన ఏకాంతం, సమాజంలో నిలదొక్కుకున్న ‘మగ పుంగవుల’ పర పతి కొంత సాహసాన్ని ఇస్తుంది.

అయితే ఈ కథల్లో నిజమైన అవినీతి పాలెంత? కొందరి ‘అక్కసు’ మాత్రమే ఉన్నదా? వీధినపడ్డ మహానుభావులు– ‘వీర నిజాయితీ’ పరులుగా బోర విరుచుకోవడం ఎంత నిజం? ప్రతీ కథకీ 18 ఏళ్ల కోర్టు కేసులు కావాలా? ఇదీ తేలాల్సిన విషయం.

ఈనాడు సీతమ్మకి పెళ్లి ఊరేగింపు లేకపో వచ్చు. కానీ వ్యక్తి అవినీతిని ‘ఊరేగించే’ మాధ్యమం మరింత పదునైంది. ఆ ఊరేగింపు విజ్ఞప్తి. ఈ ఊరే గింపు హెచ్చరిక. ఆనాటి సంప్రదాయం ఊతం. నియతి. ఈనాడు– మారిన వ్యవస్థలో అది చాలదు. ‘పరపతి’ అనే ముసుగును ఛేదించే ‘మాధ్యమం’ అనే ఆయుధం, దాని గొంతును గుర్తించి, కొరడా ఝళిపించే వ్యవస్థ కావాలి. నేటి ‘‘నేను కూడా...’’ ఉద్యమం కాదు. ఉప్పెన.


గొల్లపూడి మారుతీరావు 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top