చూస్తుండగానే కాలం చేసింది

 Gikor by Hovhannes Tumanyan - Sakshi

కష్టాలదేముంది నాయనా, చూసేలోపలే 
రోజులెలాగో గడిచిపోతాయంటాడు తండ్రి. 
తను అన్న మాటల పరమార్థం 
ఆయనే గ్రహించలేదు. 
పన్నెండేళ్ల కొడుకు కాలం చేశాడు.

రైతు హంబో యింట్లో ఆనాడు భేదాభిప్రాయం వచ్చింది. పన్నెండేళ్ల కొడుకు గిఖోర్‌ను పట్నంలో పనిలో పెడితే ప్రపంచంలో యెలాగో నెట్టుకొస్తాడని హంబో ఆలోచన. కానీ ముక్కుపచ్చలారని బిడ్డని నీతీ న్యాయం లేని ప్రపంచంలో తోసెయ్యడానికి అతని భార్య ఒప్పుకోలేదు. కానీ హంబో ఆమెను లెక్కచేయలేదు. ఒక విచారకరమైన ఉదయాన గిఖోర్‌ వాళ్లమ్మ, చెల్లెలు జాన్నీ, చిన్ని గల్లో వాడిని పల్లె పొలిమేర దాకా వచ్చి సాగనంపారు. వెనక్కి చూస్తూ, తండ్రి పక్కన పరుగెత్తినట్టుగా గిఖోర్‌ నడుస్తున్నాడు. కాసేపటికి కొండ వెనక్కి నక్కింది వాళ్ల ఊరు. 

ఆ రాత్రి వాళ్లు ఓ ఊళ్లో హంబో పాత స్నేహితుడుంటే అక్కడ దిగారు. గ్లాసులు గలగల్లాడిస్తూ కడిగి, ఒక చిన్నమ్మాయి టీ తయారుచేసింది. ఆమె అందమైన ఎర్రని దుస్తులు వేసుకుంది. పట్నంలో డబ్బు సంపాదించాక అటువంటి దుస్తులు జాన్నీకి కొనిపెట్టాలని గిఖోర్‌ లెక్కవేశాడు.
మరునాడు తండ్రీ కొడుకూ తిఫ్లీస్‌ పట్టణం చేరుకున్నారు. కొట్ల నిండా పండ్ల గుట్టలు. స్కూలుకు వెళ్లి వచ్చే పిల్లల గుంపులు. కూరగాయల బరువుతో గాడిదలు. నెత్తిమీద సరుకులు పెట్టుకుని అమ్ముకునేవాళ్లు.
హడావుడి, గోల.
∙∙ 
ఒక షాహుకారు కొట్లో గిఖోర్‌ పనికి కుదిరాడు. యజమాని పేరు బజాజ్‌ అర్తేం. ఇల్లు శుభ్రంగా ఉంచడం, గిన్నెలు కడగడం, జోళ్లు శుభ్రం చెయ్యడం, కొట్టుకు భోజనం తీసుకెళ్లడం మొదలైన పనులు గిఖోర్‌
సంవత్సరంపాటు చెయ్యాలి. ఆ తరువాత పిల్లాడికి కొట్టులో పని నేర్పుతాడు. ‘‘అయిదారేళ్ల దాకా జీతం మాత్రం ఏమీ యివ్వను’’ అన్నాడు. ‘‘నిజం చెప్పాలంటే, పని నేర్పుతున్నందుకు నువ్వే నాకు ఎదురివ్వాలి’’
అన్నాడు నవ్వుతూ. ఇద్దరికీ టీ, ఫలహారం పెట్టించాడు.
కొడుక్కు ఆ రాత్రి హంబో ఎన్నో జాగ్రత్తలు చెప్పాడు. ‘అక్కడా, ఇక్కడా తిరక్కు. నీ చేతికేదైనా డబ్బు వస్తే అనవసరంగా పాడు చెయ్యకు. ఇంటి దగ్గర లక్ష అవసరాలున్నాయి. రాత్రిపూట బాగా కప్పుకో, లేకపోతే జలుబు చేస్తుంది. వాళ్ల భోజనాల్లో మిగిలిన తిండి నీకు పెడతారు, నువ్వేమీ అనుకోకూడదు. చాకిరీ చేసుకునేవాళ్ల బతుకే అంత. రోజులెలాగో తెలియకుండానే గడిచిపోతాయి’. అప్పటికే హంబోను ఆనుకుని గిఖోర్‌ నిద్రపోయాడు.

తెల్లారి హంబో కొడుకును వదిలేసి తమ ఊరికి తిరిగి వెళ్లిపోయాడు. గిఖోర్‌ వాలకం అర్తేం భార్య నత్తోకు ఏమీ నచ్చలేదు. బొత్తిగా కొండల్లోంచి వచ్చిన అడవి వాడిలా కనిపించాడామెకు. శనిగాడని తిట్టుకుంటూ కూర్చుంది. కానీ ఖర్చు లేకుండా కొన్ని సంవత్సరాలు పనిచేసే నౌకరు
దొరికాడని అర్తేం సంతోషించాడు.
∙∙ 
గిఖోర్‌ వంటింట్లో కూర్చునివున్నాడు. ఇంతలో నత్తో లోపలికి వచ్చింది. గిఖోర్‌ తను కూర్చున్న చోటు నుంచి లేవలేదు. ఆవిడ ఏదో అంది, గిఖోర్‌కు అర్థం కాలేదు. ‘‘ఒరేయ్‌ అడవి మృగమా! నీకే చెప్తున్నాను’’ అంది ఆమె. గిఖోర్‌కు వణుకు పుట్టింది. ఏమిటి చెప్పేరని తిరిగి అడగటానికి ధైర్యం చాలలేదు. నత్తో మండిపడుతూ బయటికి వెళ్లిపోయింది. అప్పుడు అర్తేం తల్లి లోపలికి వచ్చింది. ఆమెది కొంచెం మెత్తని స్వభావం. ‘‘యజమానురాలు లోపలికి వస్తే లేచి నిలబడవేంరా? ఏదైనా అడిగితే సమాధానం చెప్పాలి’ అని సుద్దులు చెప్పింది. ఏమేం పనులు ఎలా చెయ్యాలో చెప్పింది.

అన్ని పనులూ గిఖోర్‌ చేసేవాడు. ఆకలికి మాత్రం ఆగలేకపోయేవాడు. ఇంటిదగ్గర ఆకలేస్తే తనంతట తాను రొట్టో, జున్నుముక్కో తినేవాడు. ఇక్కడ సంగతి వేరు. ఎంత కడుపులో కాలుతున్నా అందరి భోజనాలన్నీ
అయ్యేదాకా ఉండి, అప్పుడు తను మొదలెట్టాలి. వాడి కడుపులో ఆకలి దహించుకుపోయేదాకా ఆ భోజనాల సమయం రాదు. అట్లా పదిసార్లు చూశాక, వంటింట్లో ఏమైనా దొరుకుతుందేమో అని వెతికేవాడు. ఓ
ఎండిపోయిన రొట్టెముక్క, సగం గీరిన ఎముక ముక్క, ఏదో ఒకటి నోట్లో పెట్టుకునేవాడు.
∙∙ 
వీధిలో ఎవరో గంట కొట్టారు. గంట వినబడగానే ఎవరో, ఎందుకు కొట్టారో చూడాలని గిఖోర్‌కు చెప్పారు. బాల్కనీలోంచి చూశాడు. ఒక పెద్దమనిషి, కొంతమంది స్త్రీలు. ‘‘ఇదుగో ఏయ్, ఎవరు?’’ అని కేక వేశాడు గిఖోర్‌. ‘‘మీ యజమానురాలు యింట్లో లేరా?’’ అని పెద్దమనిషి అడిగాడు. నత్తో ఆ మాటలు విని, బయటికి వచ్చి, ‘‘ఓరి పీనుగా, వెళ్లి తలుపు తియ్యి, పరుగెత్తు’’ అంది. అతిథులు లోపలికి వచ్చారు. గిఖోర్‌ను తొందరగా బజారుకు పంపింది. అతిథులతో నత్తో అరగంట సేపు కబుర్లు చెప్పింది. ఇంతలో గిఖోర్‌ చెమటలు కక్కుకుంటూ వచ్చాడు.  ‘‘పళ్లు పట్టుకువచ్చానమ్మగారూ!’’
‘‘సరేలే, అలా వుండనీ’’ అంది నత్తో.

‘‘అయ్యగారు చెర్రీపళ్లు చాలా ఖరీదు. అవి పట్టుకెళ్లకపోయినా ఫర్వాలేదులే అన్నారండి.’’
అతిథులకు నవ్వొచ్చింది. నత్తో సిగ్గుపడింది. ‘‘ఆయన ఏమన్నారో, యీ బుర్ర తక్కువ వెధవ ఏం వినిపించుకున్నాడో!’’ అని సర్దిచెప్పుకుంది.
‘‘నే నబద్ధం చెపితే ఒట్టండి’’ అన్నాడు గిఖోర్‌.
స్నేహితులు వెళ్లిపోయాక, పళ్లు బల్లమీంచి తీసేస్తూ భర్తనీ గిఖోర్‌నీ కలిపి తిట్టింది నత్తో. ‘అందరిమధ్యా నా తల వంచుకునేలా చేశాడు’ అంటూ వచ్చాక భర్తకు ఫిర్యాదు చేసింది.
అర్తేం రమ్మని అరిచాడు. బిక్కుబిక్కుమంటూ వచ్చాడు గిఖోర్‌. బజాజ్‌ ముఖం చూసి వాడి పైప్రాణం పైకిపోయింది. ‘మట్టిబుర్రా, చచ్చువెధవా’ అంటూ చెంప ఛెడేలుమంది. తలవెళ్లి గోడకు కొట్టుకుంది. కళ్లు తిరిగి నేలమీద పడ్డాడు. ముసలమ్మ గిఖోర్‌ను లాగడానికి ప్రయత్నించింది. అప్పటికే చెట్టుకింద పడ్డ ఆకులా వణికిపోతూ, ‘అమ్మా, అమ్మా’ అని మూలుగుతున్నాడు.
∙∙ 
గిఖోర్‌ ఇంటిపనులకు పనికిరాడని నిశ్చయించి, షాపులోకి తీసుకువెళ్లారు. షాపు శుభ్రం చేయడం, బట్టలు తానులుగా చుట్టడం, కొనుక్కునేవాళ్లకు సరుకు అందించడం, ఏమీ లేనప్పుడు కొట్టులోకి కొత్తవాళ్లు వచ్చేలాగా పిలిచి ఆకర్షించడం– ఇదీ వాడి పని.
ఒకనాడు ఇంటినుండి కొట్టుకు భోజనం తెస్తూ, మధ్యలో ఒక ఫార్శీమనిషి కోతిని ఆడిస్తూ పాడుతుంటే అక్కడే నిలిచిపోయాడు. ఆలస్యమైనందుకు, ‘క్లబ్బుకు వెళ్లావా? గవర్నరుగారితో పనిమీద వెళ్లావా?’ అంటూ మళ్లీ దెబ్బలు పడ్డాయి. బుగ్గనిండా ఎర్రని నెత్తురు చారలు. ఇంటికి వచ్చాక వాడికి అన్నం పెట్టవద్దని అర్తేం ఆజ్ఞాపించాడు. వాడికి ఆకలంటే అర్థం తెలియాలిట. ఆ రోజంతా వాడేమీ తినలేదు. ఒళ్లంతా దెబ్బలతో కదుము కట్టింది. కళ్లు వాచేలా ఏడ్చాడు. వాడి మనసు ఇంటిమీదకు పోయింది. ‘రోజులెలాగో తెలియకుండానే గడిచిపోతాయి’ అని తండ్రి చెప్పిన మాట గుర్తొచ్చింది.
∙∙ 
చలికాలం వచ్చింది. మంచు తుపానుతో ఝమ్‌ అని మోగిపోతోంది. అనాథ పిల్లల్ని కబళించడం కోసం మూలమూలలూ గాలిస్తోంది. వలగుడ్డలాంటి చొక్కా వేసుకుని, కొట్టుగుమ్మంలో నిలుచుని, ‘అయ్యా రండి’ అని పిలుస్తున్న గిఖోర్‌ తుఫానుకు దొరికాడు. చలి వాడి ఎముకల్లోంచి కత్తిలా లోపలికి దూరింది. నీరసంగా వున్న వాడి ప్రాణానికిది చాలు. మంచానపడ్డాడు. హంబోని రమ్మని అర్తేం కబురు పంపాడు. గిఖోర్‌ను పట్నం ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ బోలెడుమంది రోగులు వరుసగా పడివున్నారు. ఎవరి కళ్లల్లోనూ జీవం లేదు. గిఖోర్‌ను హంబో అక్కడే చూశాడు. అంత జ్వరంలో తండ్రిని వాడు గుర్తించలేదు. ‘అమ్మా, నాన్నా, జాన్నీ’ అంటూ సంధిలో నవ్వుతున్నాడు. రెండ్రోజుల తర్వాత హంబో గ్రామానికి బయల్దేరాడు. గిఖోర్‌ను పాతిపెట్టడం అయిపోయింది. హంబో చంక కింద గిఖోర్‌ బట్టలు పెట్టుకుని తల్లి చూసుకుని ఏడవడానికి తీసుకు వెడుతున్నాడు. వాడి జేబులో మెరుస్తున్న బొత్తాలూ, రంగు రంగు కాగితం ముక్కలూ, పిన్ను సూదులూ, బట్టల తాన్ల పీలికలూ ఉన్నాయి. ఇవన్నీ జాన్నీ కోసం పోగుచేశాడు.


హొవనేస్‌ తుమన్యాన్‌
హొవనేస్‌ తుమన్యాన్‌(1869–1923) కథ ‘గిఖోర్‌’ సారాంశం ఇది. దీన్ని చిరంజీవినీ కుమారి అనువదించారు. అర్మేనియా జాతీయ కవిగా తుమన్యాన్‌ను కీర్తిస్తారు. ప్రతి కవీ తన జాతి జనుల ఆత్మగా ఉండాలంటాడాయన.

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top