ఆర్థిక సంక్షోభానికి ముసుగేల?

Financial Sector Analyst Paparao Special Article On The Financial Crisis - Sakshi

సందర్భం

దేశంలోని వాహనాల అమ్మకాల పతనానికి, నగర ప్రాంత యువత ఓలా, ఉబెర్‌ వంటి సంస్థల సేవల వైపు మొగ్గుచూపడమేననీ... వారు కార్లు కొని వాటికి నెలవారీ ఇన్‌ స్టాల్‌మెంట్లు కట్టడానికి ఆసక్తి చూపడంలేదనీ  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సెలవిచ్చారు. అంటే, దేశంలో ఎటువంటి ఆర్థిక దిగజారుడు, మాంద్య స్థితులు లేవని చెప్పేందుకు ఆమె ప్రయత్నించారు. ఈ వాదన వాస్తవ పరిస్థితితో సరిపోలదు. దేశంలో కార్ల అమ్మకాలు (ఆగస్టు 2019లో 41.09% మేరకు) పతనం అవడానికి  కారణం యువతరం వాటిని కొనకపోవడమే. మరి వాణిజ్య, రవాణా వాహనాల అమ్మకాల్లో కూడా దాదాపు అదే స్థాయిలో, పతనం ఎందుకు జరిగినట్లు? కార్లకు లాగా ఈ వాణిజ్య, రవాణా వాహనాలకు ఓలా, ఉబెర్‌ల వంటి ప్రత్యామ్నాయాలు లేవన్నది గమనార్హం. మార్కెట్‌లో డిమాండ్‌ లేక  కార్ల తయారీ కంపెనీ మారుతి సంస్థ లాగానే, వాణిజ్య రవాణా వాహనాల తయారీ సంస్థ అశోక్‌ లేలాండ్‌ సంస్థ తన 5 ప్లాంట్లలో సెప్టెంబర్‌ నెలకుగాను, 5 నుంచి 18 రోజుల పాటు ఉత్పత్తిని నిలిపివేయాలని నిర్ణయించింది. ఇక, గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక ఆరోగ్యానికి కొలబద్ధలైన ట్రాక్టర్లు, బైక్‌ల అమ్మకాల పతనం దేనికి సూచిక? వాటికి కూడా వాణిజ్య వాహనాలలో లాగానే ఇతర రవాణా ప్రత్యామ్నాయాలు లేవు. అలాగే, 2019లో సెకండ్‌ హ్యాండ్‌ కార్ల అమ్మకాలు 10% మేరన పెరుగుతాయని అంచనా. మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి క్షీణించడంతో వారు సెకండ్‌ హ్యాండ్‌ కార్లను ఎంచుకొంటున్నారన్నమాట. 

నిజానికి నేడు మార్కెట్‌లోని అన్ని రంగాలలోనూ, అన్ని రకాల వస్తువులు, సరుకుల అమ్మకాలలోనూ పతనం ఉంది. ఉదా‘‘కు, మిగతా వాటితో పోలిస్తే చాలా వేగంగా, కాస్త తక్కువ ధరకు అమ్ముడుపోయే అమ్మకాలు (బిస్కెట్‌లు, తల నూనెలు, సబ్బుల వంటివి) జరిపే హిందుస్తాన్‌ లీవర్‌ అమ్మకాలు 2018 ఏప్రిల్‌ జూ¯Œ లో 12% మేరన పెరగ్గా, 2019లో అదే కాలంలో అవి కేవలం 5% పెరిగాయి. అలాగే, అదే కాలానికి గానూ డాబర్‌ ఇండియా అమ్మకాల వృద్ధి 2018 లో 21% నుంచి, 2019లో 6%కి పడిపోయింది. అలాగే, అదే కాలానికి బ్రిటానియా సంస్థ అమ్మకాల వృద్ధి 2018లో 13% నుంచి 2019లో 6%కి దిగజారింది. నిజానికి ఆగస్టు, 2019 నాటి గోల్డ్‌మన్‌ శాక్స్‌ సంస్థ అంచనాల ప్రకారం, దేశంలో వినియోగ పతనం వాహన రంగంలో 17% మేర ఉండగా, దీర్ఘకాల వస్తువులు, ఇతర సరుకులు తదితరాల అమ్మకం 36% మేరన ఉంది. అంటే, వాహనాల అమ్మకాలలో కంటే దేశంలోని ఇతర అమ్మకాలలో పతనం మరింత అధికంగా ఉంది. ఇది ఆర్థిక మాంద్యస్థితి తాలూకు సూచికే!

కాబట్టి ఓలా, ఉబెర్‌లు మాత్రమే యువజనులలో కార్ల అమ్మకాలు తగ్గడానికి కారణం కాదు. అంతకు మించిన కారణాలు మన ఆర్థిక రంగంలో ఉన్నాయి. నేడు ఆర్థిక మాంద్య స్థితి మన దేశంలో అధిక స్థాయిలో ఉన్నప్పటికీ, వాస్తవానికి ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్థితే. మన ప్రభుత్వ గణాంకాల ప్రకారమే భారతదేశంలో నిరుద్యోగం, నేడు 45 సం‘‘ల గరిష్ఠ స్థాయిలో ఉంది. ఈ కారణం చేతనే మన దేశంలో కూడా యువజనులు ఆర్థికంగా నిలదొక్కుకోలేని స్థితిలో పడిపోయారు. దేశీయంగా కార్ల అమ్మకాల పతనానికి ఇది ఒక ప్రధాన కారణం.

ఇక చివరిగా, నిన్నగాక మొన్న ‘మింట్‌ మిలీనియన్‌ సర్వే’ అధ్యయనం ప్రకారంగా, నిర్మలా సీతారామన్‌ గారు ప్రస్తావిస్తోన్న నగర ప్రాంతాలలోని ‘మిలీనియల్స్‌’లో (కొత్తతరం యువజనులు) 80% మంది  నిజానికి తమకు సొంత వాహనం కావాలనే కలను కంటున్నారు. నిజానికి, తమకంటూ సొంత వాహనం కావాలనే ఆకాంక్షలో యువజనులకూ, మధ్య వయస్సూ ఆ పైబడిన వారికీ ఎటువంటి తేడా లేదని ఈ సర్వే తేల్చింది. మరోవైపున ధనవంతుల బిడ్డలు కొనే లగ్జరీ బైక్‌ల డిమాండ్‌ 130% పెరిగింది. 2019 ఏప్రిల్‌ లోనే సాధారణ బైక్‌ల అమ్మకాలు 16% పడిపోయాయి. అంటే, ఇది కేవలం ఓలా, ఊబ ర్‌లు యువ జనుల కథే కాదు... ఈ దేశంలోని ధనిక  పేద అంతరాల కథ.. ఒకవైపు ధనికుల ఇండియా... మరోవైపున వెలవెలబోతోన్న పేదల, మధ్య తరగతి భారతం కథ ఇది..!

డి. పాపారావు 
వ్యాసకర్త ఆర్థికరంగ విశ్లేషకులు

మొబైల్‌ : 98661 79615

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top