ఇకనైనా దారికొస్తారా? | Sakshi
Sakshi News home page

ఇకనైనా దారికొస్తారా?

Published Fri, Jul 6 2018 1:02 AM

Editorial On Present Delhi Politics  - Sakshi

ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌(ఎల్‌జీ) స్వతంత్రంగా వ్యవహరించడానికి వీల్లేదని, ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఇచ్చే సలహాలు, సూచనల మేరకే ఆయన పనిచేయాల్సి ఉంటుందని సర్వోన్నత న్యాయ స్థానం బుధవారం వెలువరించిన తీర్పు హర్షించదగ్గది. మూడేళ్లక్రితం అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృ త్వంలోని ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌) ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ అక్కడ ఎడతెగకుండా ఆధిపత్య పోరు సాగుతూనే ఉంది. లోగడ ఎల్‌జీగా ఉన్న నజీబ్‌ జంగ్‌తోనూ, ప్రస్తుత ఎల్‌జీ అనిల్‌ బైజాల్‌తోనూ కూడా కేజ్రీవాల్‌ సర్కారుకు పోరు తప్పలేదు. ఢిల్లీ ఒక కేంద్ర పాలిత ప్రాంతమే అయినా అది జాతీయ రాజధాని గనుక అక్కడొక ప్రత్యేక స్థితి ఉంది. 1992లో ఢిల్లీకి ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తూ 69వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చారు.

ఈ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చిన 239ఏఏ అధికరణపైనే ఈ వివాద పరంపర కొనసాగుతోంది. అది తమకు సర్వాధికారాలూ ఇచ్చిందని ఎల్‌జీగా ఉన్నవారి వాదనైతే...ఎక్కడైనా ప్రజా ప్రభుత్వానిదే పైచేయి అవుతుందని కేజ్రీవాల్‌ వాదిస్తూ వచ్చారు. లోగడ జంగ్‌ అయినా, ఇప్పుడు బైజాల్‌ అయినా ఈ అధికరణ ఆధారంగానే కేజ్రీవాల్‌ ప్రభుత్వ నిర్ణయాలను తోసిపుచ్చుతున్నారు. ఫైళ్లను నిరవధికంగా పెండింగ్‌ పెడుతున్నారు. రెండేళ్లక్రితం ఢిల్లీ హైకోర్టు సైతం వారి వాదనే సరైందని తీర్పునిచ్చింది. పాలనా పరమైన ప్రధానాధిపతి లెఫ్టినెంట్‌ గవర్నరేనని, ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా ఆయన సమ్మతి అవసరమని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ తీర్పు సరికాదని ఇప్పుడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తేల్చిచెప్పింది. ఎల్‌జీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడం కుదరదని, మంత్రిమండలి సలహాలు, సూచనల మేరకే ఆయన పనిచేయాలని తెలిపింది. 

రాజ్యాంగ అధికరణ ఈ విషయంలో స్పష్టంగా ఉన్నట్టయితే ఇంత చేటు సమస్యలు ఏర్పడేవి కాదు. పరిధికి మించి వ్యవహరించినప్పుడు తప్ప ఇతర విషయాల్లో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాన్ని గౌరవించాలని, దాన్ని పనిచేయనీయాలని కేంద్రంలోని ప్రభుత్వాలు అనుకున్నా వివాదాలుండేవి కాదు. లోగడ యూపీఏ ప్రభుత్వమైనా, ఇప్పుడు ఎన్‌డీఏ ప్రభుత్వమైనా ఈ విషయంలో సక్ర మంగా వ్యవహరించలేకపోయాయి. లెఫ్టినెంట్‌ గవర్నర్లుగా ఉన్నవారిని అదుపు చేయలేక పోయాయి. ప్రజలెన్నుకున్న అసెంబ్లీకి, దానిద్వారా ఏర్పడ్డ మంత్రిమండలికి నిర్ణయాధికారం లేనప్పుడు ఇక ఆ అసెంబ్లీ ఎందుకు...దానికి ఎన్నికలెందుకన్న ప్రశ్న వాటికి తట్టకపోవడం ఆశ్చర్యకరం. లోగడ ముఖ్యమంత్రులుగా పనిచేసిన మదన్‌లాల్‌ ఖురానా, సాహిబ్‌ సింగ్‌ వర్మ, సుష్మా స్వరాజ్‌(ముగ్గురూ బీజేపీ), షీలా దీక్షిత్‌(కాంగ్రెస్‌)లకు కేజ్రీవాల్‌ మాదిరి సమస్యలు ఏర్పడకపోవడానికి కారణముంది.

అప్పుడు వారి పార్టీవారే కేంద్రంలో ఇంచుమించుగా అధి కారంలో ఉన్నారు. కేంద్రంలో యూపీఏ సర్కారున్నా షీలా దీక్షిత్‌కు ఒకటి రెండు అంశాల్లో సమ స్యలు రాకతప్పలేదు. కానీ తన రాజకీయానుభవం, పలుకుబడితో వాటిని ఆమె అవలీలగా అధి గమించారు. కానీ కేజ్రీవాల్‌ వీరికి భిన్నమైన నాయకుడు. చెప్పాలంటే పూర్తిగా ‘బయటి వ్యక్తి’. అందుకే ఆయన పాలనాపరంగా విఫలమైతే బాగుణ్ణని బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ బలంగా కోరుకున్నాయి. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆప్‌ సర్కారు నిర్ణయాలను తోసిపుచ్చడం లేదా వాటిపై నాన్చుడు ధోరణి అవలంబించడం ద్వారా దాన్ని నెరవేర్చారు. 

అయితే ఇప్పుడు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు సందేహాతీతంగా సమస్యను పరిష్కరించిందనుకోవడానికి లేదు. ప్రతి నిర్ణయానికీ ఎల్‌జీ సమ్మతి తప్పనిసరి అనడాన్ని అది తోసిపుచ్చింది. అలాగే కేబినెట్‌ నిర్ణయాలకు ఎల్‌జీ బద్ధుడై ఉండాలని కూడా చెప్పింది. కానీ ఏ నిర్ణయాన్ని అయినా ఎల్‌జీ తనకున్న రాజ్యాంగదత్తమైన అధికారాలతో వ్యతి రేకించడానికి, తుది నిర్ణయం కోసం రాష్ట్రపతికి నివేదించడానికి రాజ్యాంగ ధర్మాసనం అడ్డు చెప్ప లేదు. అయితే ఎల్‌జీ ఈ నిర్ణయాధికారాన్ని యాంత్రికంగా వినియోగించరాదని స్పష్టం చేసింది. ఏ ఏ అంశాల్లో ఎల్‌జీ విభేదించవచ్చునో కూడా వివరించింది. సున్నితమైన అంశాలు ఇమిడి ఉన్నవి, ప్రభుత్వ స్థోమతకు మించి ఆర్థిక భారం పడేవి, కేంద్రంతో లేదా ఇతర రాష్ట్రాలతో రాజకీయ పరమైన సమస్యలు తలెత్తడానికి ఆస్కారమిచ్చేవి ఆయన రాష్ట్రపతికి నివేదించవచ్చునని సుప్రీం కోర్టు వివరించింది.

మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం ఈ జాబితాలోని ఫలానా అంశం కింది కొస్తుందని ఎల్‌జీ అనుకుంటే ఆప్‌ ప్రభుత్వం చేయగలిగేదేమీ లేదు. ఇక పోలీసు, శాంతిభద్రతలు, భూ ఆదాయం అంశాలు ఎల్‌జీ పరిధిలోనివేనని ధర్మాసనం స్పష్టం చేసింది. కొంతమంది అధికారులను బదిలీ చేస్తూ గురువారం ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడం సాధ్య పడదని సర్వీసెస్‌ కార్యదర్శి జవాబివ్వడాన్నిబట్టి తాజా తీర్పు తర్వాత కూడా పరిస్థితి మెరుగుప డిన దాఖలాలు కనబడటం లేదు. ఢిల్లీలో పేద ప్రజలకు ఎంతో ఉపయోగపడే మొహల్లాలు(బస్తీ క్లినిక్‌లు) 1000 ఏర్పాటు చేస్తామని ఆప్‌ ఎన్నికల ప్రణాళిక హామీ ఇచ్చింది. ప్రజారోగ్య వ్యవస్థను వికేంద్రీకృతం చేసే ఈ పథకానికి ఇంకా ఎల్‌జీ ఆమోదం లభించలేదు.

ఢిల్లీ బడుల్లో ఉపాధ్యా యుల నియామకం వ్యవహారమూ ఇంతే. ఖాళీగా ఉన్న 40 శాతం ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయ డానికి, కొందరు టీచర్లకు పదోన్నతులివ్వడానికి తీసుకున్న నిర్ణయాలు పెండింగ్‌లో పడ్డాయి. గెస్ట్‌ టీచర్లను, కాంట్రాక్టు టీచర్లను క్రమబద్ధీకరించాలన్న నిర్ణయమూ అంతే. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఇవి కొలిక్కి వస్తాయని చెప్పలేం. ఈ నిర్ణయాలు ఆర్థికభారమవుతాయని ఎల్‌జీ భావిస్తే ఆప్‌ సర్కారు చేయగలిగేదేమీ ఉండదు. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవారు చిత్తశుద్ధితో, జవాబు దారీతనంతో, ప్రజల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తే తప్ప ఇలాంటి వివాదాలు తేలవు. అంతిమంగా ప్రజలకు మెరుగైన పాలన అందాలన్నదే సర్వోన్నత న్యాయస్థానం తీర్పులోని సారాంశం. దాన్ని అర్ధం చేసుకుని అందరూ ప్రవర్తిస్తారని ఆశించాలి.
 

Advertisement
Advertisement