జనజాగృతే ప్రజాస్వామ్యానికి రక్ష

Dr AP Vital Article On Chandrababu Naidu Political Policy - Sakshi

విశ్లేషణ 

ఈవీఎంల ట్యాంపరింగ్‌ కంటే రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియే అపభ్రంశమయ్యే ప్రమాదం పొంచి ఉంది. బాబు ఇంట్లో పిల్లి ఈనింది కనుక శాంతిభద్రతలు కాపాడాలన్న చందంగా చీటికీ మాటికీ ప్రతిపక్ష నేతలను ముందస్తు నిర్బంధం చేయడం, ప్రతిపక్షాల సభలు, ప్రచారం జరుగకుండా క్షణాల మీద 144వ సెక్షన్‌ విధించడం సాధారణమైంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని విశ్వసించి తీరిగ్గా, నిర్భయంగా ఓటు వేయవచ్చనుకోవడం అమాయకత్వమే అవుతుంది. స్వేచ్ఛాయుత వాతావరణంలో, నిష్పక్షపాతంగా ప్రజలు స్వచ్ఛందంగా ఏ ప్రలోభాలకు గురికాకుండా ఎన్నికలు జరిగితే అప్పుడు నిజంగానే ప్రజాస్వామ్యం మనుగడ సాగిస్తుంది. 

ఎప్పుడు తాను ఎన్నికల్లో గెలుపొందాలనుకున్నా, కమ్యూనిస్టులు, బీజేపీ, పవన్‌ కల్యాణ్‌ ఇలా ఎవరి భుజాలమీదో స్వారీ చేసి, ఏరుదాటిన తర్వాత తెప్పతెగలేసినట్లు 2014లో అయితే ముక్కీ మూలిగీ కేవలం 1 శాతం తేడాతో వైఎస్సార్‌ సీపీపై గెలిచారు చంద్రబాబు. ఇవ్వాళ వారెవ్వరూ తనతో పొత్తు కట్టలేని పరిస్థితి వచ్చేసింది చంద్రబాబుకి.  కాంగ్రెస్‌పై స్వారీ చేద్దామనుకుంటే ఆ గుర్రం కూడా సిద్ధంగా లేదు. పోనీలే సరిపెట్టుకుందామనుకుంటే మొన్నటి తెలంగాణలో తమ పొత్తుతో ఆ గుర్రమూ తన నడుము విరిగి కిందపడిన చందంగా అవుతుందేమోనన్న భయం పట్టుకుంది. ఇతర రాష్ట్రాల్లో అయితే కాంగ్రెస్‌ను గెలిపించాలని, రాహుల్‌ గాంధీని ప్రధానిని చెయ్యాలని ఆ నేతలతో బాబు చెబుతుంటే ఆప్, బీఎస్పీ, ఎస్పీ, టీఎంసీ వంటి పార్టీలు చాటుగా, ‘ఈయనేంటీ.. ఇక్కడికొచ్చి కోతలు కోస్తున్నారు కానీ ముందుగా ఆంధ్రప్రదేశ్‌లో గెలిచి రమ్మనండి’ అని చెవులు కొరుక్కుంటున్నారట.

ఉత్తర ప్రదేశ్, బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక వాళ్లు వచ్చి తమ ఓట్లతో గట్టెక్కిస్తారేమో అన్న దింపుడు కళ్లం ఆశ ఏదో బాబుగారికి ఉన్నట్లుంది. ఇక్కడ మనరాష్ట్రంలో మాత్రం ఇంట్లో ఈగల మోతగా ఉంది. టీడీపీవాళ్లకు తమ పార్టీపైనా, తమ నేత చంద్రబాబు కుటిలరాజకీయ చాణక్యంపైన కూడా విశ్వాసం సడలింది. తమనేతనే ఆదర్శంగా చేసుకుని తమ పరిధిలో దోచుకునేందుకు, దాచుకునేందుకు పదవీ అహంకారంతో జనంపై జులుం చెలాయిస్తూ పంచాయితీలు చేస్తూ, ఎప్పుడైనా రాజకీయాలు మాట్లాడాల్సివస్తే వైఎస్‌ జగన్‌ని విమర్శించడమూ మోదీ నమ్మక ద్రోహం గూర్చి ఘాటుగా విమర్శిస్తూ కాలం గడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో టీడీపీకీ, బాబుకూ నమ్మకస్తుడిగా మిగిలింది చంద్రబాబు పుత్రరత్నం లోకేశ్‌ మాత్రమే అనిపిస్తోంది. చంద్రబాబు 68 ఏళ్ల వయస్సులోనూ మనవడితో ఆడుకోకుండా అహర్నిశలూ ప్రజల గూర్చే శ్రమిస్తున్నారు అని లోకేశ్‌ తన తండ్రిని పొగడుతుంటే లోకేశ్‌ను చూసి కన్నతండ్రిగా గర్వంగా ఉంది అని బాబుగారు ఆనందపడ్తున్నారట.

అయినా స్వడబ్బా, పరడబ్బా, పరస్పర డబ్బా అని పురాణం సుబ్రహ్మణ్యం ఏదో సందర్భంగా రాసినట్లే టీడీపీ వాళ్లందరూ భజన చేసుకునే పరిస్థితికి వచ్చారు. సంక్రాంతి సమయంలో పిట్టలదొర భిక్షాటన చేసుకుంటూ వాగేటట్లుగా వాజ్‌పేయిని ప్రధానిని చేశాను, అబ్దుల్‌ కలాంని రాష్ట్రపతిని చేశాను, దేశంలోనే అత్యంత సీనియర్‌ రాజకీయనేతను, గాంధీలాగా జీవిస్తున్నాను, సరిరారు నాకెవ్వరూ వంచనలో గానీ, మందిని ముంచడంలో గానీ అంటూ తనకు తానే స్తోత్ర శ్లోకాలు వల్లించుకునే పరిస్థితి వచ్చింది. ఇవి ఇక చాలులే అన్నట్లుగా టీడీపీ ఎంపీలూ, ఎమ్మెల్యేలూ, ఇతర నేతలూ చంద్రబాబు సంకెళ్లను తెంచుకుని స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటున్నారు. వైఎస్సార్‌సీపీలో చేరుతూ, ధైర్యంగా తమకు బాబుగారి పార్టీలో జరిగిన అవమానాలు, తమ నేత కులపిచ్చి మాటల మాంత్రికత గురించి కథలుకథలుగా చెబుతున్నారు. ఇప్పుడేం చేయాలో చంద్రబాబుకు అర్థం కావడం లేదు. ఆయనలో అసహనం పెరిగిపోతోంది. న్యాయం చేయాలని తన వద్దకు వచ్చిన వారిని వారు ఏపనిమీద వచ్చారో వినేందుకు కూడా విముఖతతో ఆడవారు, మగవారు అనే తేడా కూడా లేకుండా ఏం.. తమాషాగా ఉందా, తాట వలుస్తాను అంటూ ఉగ్రరూపం దాల్చే పరిస్థితికి వచ్చారు.

ఇక మాటలతో కాదని తెగించేదాకా వచ్చారు. పోలీసుశాఖలో ప్రజల మాడు పగలగొట్టేందుకు తమ కనుసన్నలలో పనిచేసి తన కులానికి చెందినవారిని కొన్ని ప్రత్యేక పదవుల్లో నియమించుకుంటున్నారు. ఆ పార్టీలోనే ఈ కులగజ్జిని భరించేసిన ఆయన కులానికి చెందిన కొందరు నేతలే బాబుగారి కుల దురహంకారం గూర్చి చెబుతున్నారు. చంద్రబాబు పోలీసుశాఖని టీడీపీకి ఆర్డర్లీగా మార్చుకుని వారిచే చేయరాని పనులను కూడా చేయించుకుంటున్నారు. టీడీపీ వ్యతిరేకులపై తప్పుడు కేసులు బనాయించి, ప్రజలను ప్రతిపక్ష నేతలను బెదిరిస్తున్నారు. అయినా చంద్రబాబు అధికార దుర్వినియోగం బయటపడుతూనే ఉంది. ఇటీవల వైఎస్సార్‌ సీపీ నేత వసంతకష్ణప్రసాద్‌పై ఒక ఎస్‌ఐ చేత తనకు లంచం ఇవ్వచూపి ఎన్నికల్లో తనకు సహకరించమని కోరినట్లు తప్పుడు కేసులు పెట్టించారు. కృష్ణప్రసాద్‌ ఈ ఉడత ఊపులకు బెదిరే రకం కాదు కనుక ఎదురుతిరిగి ఎన్నికల కమిషన్‌ను నేరుగా కలిసి ఈ అన్యాయాన్ని వివరించారు. చివరకు ఆ పోలీసు అధికారులనే ఎన్నికల కమిషన్‌ తనకు తానుగా బదలాయించింది.

ఇక ప్రింట్, టీవీ మీడియాలో తమకు అనుకూలంగా ఉండే వాళ్లతో వ్యక్తిగత భజన చేయించుకోవడం జగమెరిగిన సత్యమే. ఈ అనుకూల యాంకర్లే ప్రభుత్వంపై పక్షపాత వ్యాధితో వ్యవహరిస్తుంటారు. ఉదాహరణకు ప్రత్యేక హాదానే తీసుకుందాం. చంద్రబాబు అనుకూలుడైన ఆ యాంకర్‌ అయితే, ‘సరే, జరిగిందేదో జరిగింది. బాబు మాట మార్చారా లేదా అనేది కాదు. ప్రస్తుతం రాష్ట్రానికి హోదా కోసం అవన్నీ పక్కనబెట్టి రాజకీయ పార్టీలన్నీ కలిసి వస్తారా లేదా ఇలాగే పరస్పరం బురద జల్లుకుంటూ ఉంటారా’ అంటూ పరమ అమాయకంగా రాష్ట్ర పురోగమన వాంఛాపరుడిగా ప్రశ్నిస్తుంటాడు. ‘చంద్రబాబుకి మోదీ నమ్మకద్రోహం చేశారు అనేది వాస్తవమా కాదా’ అని దమ్మున్న ఛానల్‌ యాంకర్‌ ప్రశ్నిస్తాడు. ‘అందుకని చంద్రబాబు తెలుగుప్రజలకు నమ్మక ద్రోహం చేయవచ్చా’ అని చర్చలో పాల్గొన్నవారు ఈ నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు మోదీ భక్తిని వివరించబోతే, ‘అదంతా మనకు తెలిసిందే, అవన్నీ చాలాసార్లు చర్చించినవే. ఇప్పుడు రాజకీయాలను పక్కనబెట్టి కలిసికట్టుగా హోదా కోసం పోరాడాలా లేదా’ అని మళ్లీ మళ్లీ అడుగుతాడు. ఇలా చంద్రబాబు దోషాలను, చేసిన పాపాలను చర్చకు రాకుండా చేయడం జరుగుతోంది. సాక్షి దినపత్రిక ఛానల్‌ లేకపోయినట్లయితే, ఇంతమాత్రంగానైనా ప్రజలకు ఆ చంద్రబాబు వందిమాగధుల అసత్య ప్రచారంలో మోసపోకుండా వాస్తవాలు తెలిసే అవకాశం వచ్చి ఉండేది కాదు. తాము నిర్భయులమని, తాము ప్రచారం చేసే వార్తల్లో నిజాయితీ ఉంటుందని, తమకు ఏ పార్టీపట్లా పక్షపాతం లేదని బుకాయించేస్తూంటుంది బాబు ముసుగు మీడియా. ఇటీవల రెండు మూడు ఛానళ్లు కొంచెం ధైర్యం చేసి తమ స్వతంత్రతను చాటుకుంటున్నాయి. అందుకు వారికి అభినందనలు.

ఎలాగోలా ఈ ఎన్నికల గండం గడిచి బయటపడితే చాలన్నట్లు కల్ల బొల్లి వాగ్దానాలు చేస్తున్నారు బాబు. పదవీకాలం అస్తమించే సమయం ఆసన్నమైనప్పుడు ఇంకా మోసపూరిత వైఖరిని విడనాడకుండా ఇన్నాళ్లూ తాను వంచించిన రైతులు, మహిళలు, నిరుద్యోగులు, బీసీలు, కాపులూ ఇలా ఒకరేమిటి? అందరికీ కొత్త కొత్త తాయిలాలు పంచిపెడతా నని అదీ ఎన్నికల అనంతరం చెల్లుబాటు అయ్యే చెక్కుల ద్వారా అంటే తన ప్రభుత్వం గద్దె దిగిన తర్వాత చెల్లించే పద్ధతిలో ఊదరగొట్టే ఊకదంపుడు ప్రచారం చేసుకుంటున్నారు. వాటన్నింటినీ కొంత సొంత పొగడ్తలతో ఆయన బినామీ మీడియా ఈ పథకాలతో ఒక్కసారిగా ప్రజాభిప్రాయం బాబుకు అనుకూలంగా మారినట్లు, చివరి దశలో తులసితీర్థం పోయక తప్పదన్నట్లు వండి వారుస్తున్నాయి. అయితే దశాబ్దం పాటు ముఖ్యమంత్రిగా, దశాబ్దం పాటు ప్రతిపక్ష నేతగా బాబును గమనించిన ప్రజలు ఆయన తప్పుడు వాగ్దానాలను గ్రహించి అదను చూసి తనకు తిరుగులేని పాఠం చెప్పాలని నిశ్చయించుకున్నారు. మరోవైపు మొక్కవోని పట్టుదలతో, నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ ప్రత్యేకహోదా విషయంలో తొలినుంచి మాట మార్చని మడమతిప్పని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని అక్కున చేర్చుకుంటున్నారు. కీలెరిగి వాత పెట్టే అదను కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు ప్రజలు.

ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ప్రజల ఆశ నెరవేరేందుకు, చంద్రబాబు దుష్టపాలన వదిలించుకుని వైఎస్‌ జగన్‌ నేతృత్వాన తమ పాలనను ప్రజలు పొందడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఇకపై ఎన్నికల ఫలితాలు వెలువడేవరకు, తమ కోర్కె నెరవేరేవరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముందుగా ఈ ఎన్నికలు సజావుగా జరిగేటట్టు ఏ చిన్న అవరోధమూ అడ్డు రాకుండా వైఎస్సార్‌ సీపీ నేతలు, కార్యకర్తలు నిరంతర జాగరూకతతో మెలగాలి. ఇప్పటికే దొంగ ఓట్లు, తమ పార్టీ వారి ఓట్ల తొలగింపు, పోలీసు యంత్రాంగం పాలకవర్గపార్టీ పని మనుషులుగా వ్యవహరిస్తున్న తీరును వైఎస్సార్‌సీపీ ఎండగట్టింది. రెవెన్యూ వంటి శాఖల్లో అధికారులు బాబు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న తీరును సంబంధిత సంస్థలకు, ఉన్నతాధికారులకు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేస్తుండటం సత్ఫలితాలను ఇస్తున్నట్లు కనబడుతోంది. కానీ ఇవి మాత్రమే సరిపోవు. ఓట్ల జాబితా నుండి లెక్కింపు ఫలితాల ప్రకటన దాకా అన్నింటా అక్రమాలకు అవకాశం పెరుగుతోంది. ముఖ్యంగా ఈవీఎంల ట్యాంపరింగ్‌ కంటే ఈ పోలింగ్‌ ప్రక్రియే అపభ్రంశమయ్యే ప్రమాదం ఎంతగానో ఉంది. బాబు ఇంట్లో పిల్లి ఈనింది కనుక శాంతిభద్రతలు కాపాడాలన్న చందంగా చీటికీ మాటికీ ప్రతిపక్ష నేతలను ముందస్తు నిర్బంధం చేయడం, ప్రతిపక్షాల సభలు, ప్రచారం జరుగకుండా క్షణాల మీద నిషేధం,144వ సెక్షన్‌ విధించడం సాధారణమైంది.

ప్రతిపక్షనేతలపై బాబు ప్రభుత్వ దాడులు, ముందస్తు గృహనిర్బంధాలు, భౌతిక దాడులు చూస్తుంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని మాత్రమే విశ్వసించి పైపంచలు భుజాన వేసుకుని తీరిగ్గా నిర్భయంగా ఓటు వేయవచ్చనుకోవడం అమాయకత్వమే అవుతుందన్న భయం కూడా ఉంది. నిన్నటికి మొన్న కొండవీడు ఉత్సవాల కోసం బాబు హెలి కాప్టర్‌ దిగేందుకు పొలాలను ధ్వంసం చేసి, దాన్ని అడ్డుకున్న కౌలు రైతు కోటయ్యను టీడీపీ కార్యకర్తలు, పోలీసులు చితకబాది చంపేసిన ఘట నలో చంద్రబాబు కనీస మానవత్వంతో వ్యవహరించలేదు. 

బాబు నేతృత్వంలోని టీడీపీ ప్రభుత్వం బరితెగింపునకు వ్యతిరేకంగా పోలింగులో ప్రతి వ్యక్తీ నిర్భయంగా పాల్గొని తన ఓటుహక్కును వినియోగించుకునే విధంగా ఎన్నికల కమిషన్‌ పటిష్ట చర్యలు చేపట్టాలి. పాలకపక్షాల దౌర్జన్యాన్ని ఎదుర్కొని మీ హక్కులు కాపాడతాం అనే భరోసా ప్రజలకు కలగాలి.  ప్రజల నిరంతర వాస్తవిక జాగరూకతే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష. మన దేశ రక్షణకోసం, మన ప్రజల రక్షణ కోసం ప్రాణాలర్పిస్తున్న వీర జవాన్లను మనం సహజంగానే కీర్తిస్తాం. అదేసమయంలో ప్రభుత్వాలను ఎన్నుకునే ఈ మొత్తం ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా స్వేచ్ఛగా జరిగేలా చూస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణా కర్తవ్యం నిర్వహించే స్వచ్ఛంద ప్రజా దళాలు కూడా కృతజ్ఞతకు, అభినందనలకు అన్నివిధాలుగా అర్హులవుతారు.


డాక్టర్‌ ఏపీ విఠల్‌, వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు
మొబైల్‌ : 98480 69720

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top