మచ్చ తొలగితేనే మంచి పేరు!

Dilip Reddy Article On Plastic Causes For Environmental Damage - Sakshi

సమకాలీనం

‘మనిషి సాంఘిక జంతువు’ అని రెండు వేల సంవత్సరాల కింద ఆరిస్టాటిల్‌ అన్న మాటకీ, ‘ప్రతిచోట విధ్వంసం సృష్టిస్తున్న జంతువు మనిషి’ అన్న హైకోర్టు తాజా వ్యాఖ్యకి ఎంతో తేడా ఉంది. మొదటిది, బుద్ధికలిగి సకల జీవులతో పరస్పర సహజీవనం సాగిస్తున్న ఉన్నతుడిగా మనిషికి ప్రశంస అయితే, రెండోది, స్వార్థంతో బుద్ధి మందగించి బాధ్యత మరచిన మనిషి ఇతర జీవులకు హాని చేస్తున్నాడనే అభిశంస! ఇందులో వ్యక్తులుగా, సమూహాలుగా, జాతులుగా, సంస్థలుగా, ప్రభుత్వాలుగా అందరి బాధ్యతా ఉంది. ‘మనిషి విధ్వంసకారి’అనే మాటను చెరిపేయాలి. ‘బుద్ధిజీవి’అనే మాటను నిలబెట్టాలి. అప్పుడే పృథ్వికి రక్ష, భవితకు భరోసా!

‘మనిషన్న జంతువు ప్రతిచోటా విధ్వంసం సృష్టిస్తోంది’ అంటూ హైకోర్టు ధర్మాసనం వెలి బుచ్చిన ధర్మాగ్రహం ప్రతి మనిషికీ తగలా ల్సిన పోటు! ఎక్కడో తగిలే ఉంటుంది, ఎవరికి అది ఎంత వరకు తగి లింది అనేదానికి కొలతలు లేవు. కానీ, పర్యావరణం అన్నది ఇక ఏ మాత్రం న్యాయస్థానాలకో, పరిశోధనాలయాలకో, శాస్త్రజ్ఞులకో, హరిత కార్యకర్తలకో మాత్రమే పరిమితమైన పదం కాదు. ఇది సామాన్యుల నుంచి రాజకీయ పార్టీల మేనిఫెస్టోల వరకు అత్యంత కీలకమైన ఎజెం డాగా మారిందనేది సత్యం.

మన దేశ రాజధాని «ఢిల్లీలో ముప్పిరిగొం టున్న వాయు కాలుష్యం అత్యంత దుర్భరంగా తయారయింది. ఇది జీడీపీపై వ్యతిరేక ప్రభావం చూపడమే కాకుండా అక్కడ నివసించే ప్రతి మనిషి సగటు పదేళ్ల ఆయుర్ధాయాన్ని హరిస్తోందని అధ్యయనాలు చెబు తున్నాయి. ముఖ్యంగా భూతాపం, వాయుకాలుష్యం వంటివి అంచనా లకు మించిన వేగంతో దూసుకువస్తూ తెచ్చిన ‘వాతావరణ మార్పు’ల ప్రతికూల ప్రభావం ఇపుడు ప్రతి జీవినీ తడుముతోంది. ఇది విశ్వ పరి ణామం! ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ పర్యావరణం భూమ్మీది జీవుల న్నింటి బతుకునీ ప్రభావితం చేస్తోంది. పరిణామ క్రమంలో ఉత్కృష్ట జీవిగా అవతరించిన ‘మనిషి’తన చర్యలవల్లో, చర్యల లేమివల్లో పర్యా వరణ విధ్వంసానికి కారణమవుతున్నాడు. ఇతర జీవులనీ నానా యాత నకి గురిచేస్తున్నాడు. తాను నియంత్రించి, నివారించ గలిగిన వాటిని కూడా నిర్లక్ష్యం చేస్తూ జీవుల మనుగడకు ముప్పు తెస్తున్నాడు. సహజ వనరుల్ని సర్వనాశనం చేసి భవిష్యత్తరాలకు ఓ భగ్న పృథ్విని అందించ నున్నాడు. ఇదే విషయాన్ని హైకోర్టు నొక్కి చెప్పింది.

‘మనిషి సాంఘిక జంతువు’ అని రెండు వేల సంవత్సరాల కింద ఆరిస్టాటిల్‌ అన్న మాటకీ, ‘ప్రతిచోట విధ్వంసం సృష్టిస్తున్న జంతువు మనిషి’ అన్న హైకోర్టు తాజా వ్యాఖ్యకి ఎంతో తేడా ఉంది. మొదటిది, బుద్ధికలిగి సకల జీవులతో పర స్పర సహజీవనం సాగిస్తున్న ఉన్నతుడిగా మనిషికి ప్రశంస అయితే, రెండోది, స్వార్థంతో బుద్ధి మందగించి బాధ్యత మరచిన మనిషి ఇతర జీవులకు హాని చేస్తున్నాడనే అభిశంస! ఇందులో వ్యక్తులుగా, సమూహా లుగా, జాతులుగా, సంస్థలుగా, ప్రభుత్వాలుగా అందరి బాధ్యతా ఉంది. అన్ని స్థాయిల్లో ఎవరి బాధ్యత వారెరిగి, జవాబుదారీతనంతో వ్యవహరించాల్సిన అవసరం మనందరి పైనా ఉందనేది తిరుగులేని వాస్తవం.

ఇది ఓటర్లముందున్న సవాల్‌
సగటు మనిషి జీవితపు ప్రతి పార్శా్వన్నీ శాసించే అధికారాన్ని తెలిసో, తెలియకో మనం మన రాజకీయ వ్యవస్థకు ధారాదత్తం చేశాం. అన్నీ వారు చెప్పినట్టు నడవాల్సిందే! పాలకులుగా అవతరించే రాజకీయ పార్టీలను ప్రజలు నిలదీసే, ప్రశ్నించే ఒకే ఒక సందర్భం ఎన్నికలు. అయి దారు మాసాల వెనకా, ముందు... ఇప్పుడు తెలుగు రాష్ట్రాలు ఎన్నికల ముంగిట్లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలోనయితే పక్షం రోజుల్లోనే ఎన్ని కలు. ప్రధాన రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికను ప్రకటిస్తు న్నాయి. కానీ, వాటిల్లో నిర్దిష్టత లోపిస్తోంది. ఓట్లనాకర్షించే ఆర్థికాంశాల కిచ్చే ప్రాధాన్యత ఇతర ముఖ్య అంశాలకు ఇవ్వటం లేదు.

‘పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం’ అనే సాధారణ ప్రకటన ఇవ్వడం, ఇతరే తర అంశాల కింద ప్రకటించే విధానాల్లో అస్పష్టత అంతిమంగా పర్యా వరణానికి భంగం కలిగించే సందర్భాలెన్నో! ఉదాహరణకి, పర్యావ రణం గురించి సదరు పద్దు కింద సానుకూల ప్రకటన చేసినా, ‘పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో భూ వినియోగ విధానం’ లోని అస్పష్టత చివరకు పర్యావరణానికి హాని కలిగించేదిగా ఉంటోంది. పరిశ్రమల ఏర్పాటు, సాగునీటి ప్రాజెక్టుల కల్పన, రవాణా వ్యవస్థ, భూసేకరణ... ఇలా చాలా అంశాలూ పర్యావరణాన్ని ప్రభావితం చేస్తాయి. వీటిని నిశితంగా పరి శీలించి, విశాల జనహితంలో విపులంగా చర్చించాల్సిన అవసరం ఉంది. సామాజిక మాధ్యమాల విస్తృతి వల్ల వచ్చిన జనచేతన క్రమంగా వేర్వేరు అంశాల్లోకి వ్యాపించడమొక మంచి పరిణామం! పర్యావరణ విషయా ల్లోనూ ఆ జాగ్రత్త అవసరం.

దీపావళి టపాసులు పండుగరోజు రాత్రి 8–10 గంటల మధ్యే కాల్చాలన్న సుప్రీం ఇటీవలి తీర్పు పదేళ్లకింద అయితే ఎలా ఉండేదో! అన్న సందేహం కలుగుతుంది. తెలంగాణలో కూటమికట్టి ఎన్నికల్ని ఎదుర్కొంటున్న కాంగ్రెస్, రేపో మాపో ప్రకటించ నున్న తన ఎన్నికల ప్రణాళికలో పర్యావరణాన్ని ఒక అంశంగా చేర్చింది. జీహెచ్‌ఎంసీ పరిధి ప్రతి కొత్త నిర్మాణాలకూ ‘ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌’ ప్రమాణాల్ని తప్పనిసరి చేస్తామని, కొత్తగా నిర్మించే ప్రతి వాణిజ్య, గృహ నిర్మాణాల్లో ఇంకుడు గుంతల్ని నిర్బంధం చేస్తామని, సోలార్‌ రూఫ్‌టాప్‌ రాయితీ పథకాన్ని కొనసాగిస్తామని, షెంజెన్‌ తర హాలో ఎలక్ట్రిక్‌ బస్సులు, ఎలక్ట్రిక్‌ క్యాబులు, ఎలక్ట్రిక్‌ ఆటోల విధానం తీసుకువస్తామని, ప్లాస్టిక్‌ను నియంత్రించి జూట్, బట్ట సంచుల వాడ  కాన్ని తప్పనిసరి చేస్తూ సంబంధిత పరిశ్రమల్ని అభివృద్ధి పరుస్తామని... ఇలా ప్రకటించారు. పాలక తెరాస 2014 ఎన్నికల ప్రణాళికలో ప్రకటించ నప్పటికీ ‘హరితహారం’ ద్వారా విస్తృతంగా మొక్కలు నాటే పెద్ద కార్య క్రమాన్ని గత నాలుగేళ్లుగా అమలుపరచింది. హైదరాబాద్‌ను విశ్వనగ రంగా తీర్చిదిద్దుతామనే హామీలో భాగంగా మూసీనది, హుస్సేన్‌సాగర్‌ జలశుద్ది గురించి ఎంతో చెప్పింది. నగరంలోని చెరువుల పునరుద్ధరణ చేస్తామనీ ప్రకటించింది.

కానీ, అవేవీ జరగలేదు. అప్పుడు జరిగిన ఉమ్మడి ఎన్నికలకు తమ ప్రణాళికను విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ పలు పర్యావరణ హామీలతో పాటు ప్లాస్టిక్‌ పైనా నిర్దిష్ట హామీ ఇచ్చింది. ప్లాస్టిక్‌ బ్యాగుల వినియోగంపై నిషేధం విధిస్తాం, భూగర్భ మురుగు నీటి వ్యవస్థను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. శిలాజ ఇంధనాల బదులు పునర్వినియోగ యోగ్యమైన శుద్ధ ఇంధనాల వినియోగాన్నే అభివృద్ధి పరుస్తామని బీజేపీ తన జాతీయ ఎన్నికల విధాన ప్రకటనలో తెలిపింది. సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా పర్యావరణ విధాన ప్రకటన చేశాయి. ఎవరెన్ని మాటలు చెప్పినా అమలులో చిత్తశుద్ధి అంతంతే! సమాజ శ్రేయస్సుకు పాలకులను నిలదీసి ఫలితాలు సాధించుకోవాల్సిన బాధ్యత పౌరులదే!

ప్లాస్టిక్‌ వినియోగంపై నిర్దిష్ట చర్యలేవి?
ప్రపంచ పర్యావరణాన్ని ఈ రోజు ప్లాస్టిక్‌ గడగడలాడిస్తోంది. వాడి విసిరి పారేశాక మట్టిపొరల్లోకి జారిపోయీ, వెయ్యేళ్లయినా నశించని దాని లక్షణం పెనుసవాల్‌ విసురుతోంది. నేల పైన, భూమి పొరల్లోనే కాకుండా అటు ఇటు తిరిగి సముద్రంలోనూ కోట్ల టన్నుల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు పేరుకుపోతున్నాయి. ఎన్నెన్నో జీవుల మనుగడనే ఈ ప్లాస్టిక్‌ కల్లోల పరుస్తోంది. ప్రాణాలనూ హరిస్తోంది. ఇండోనేషియాలోని ఓ దీవి తీరానికి ప్రాణాలు కోల్పోయి ఇటీవల కొట్టుకొచ్చిన తిమింగలం సంచ లనం సృష్టించింది. తీరం నుంచి తొలగించేందుకు యత్నించినపుడు దాని పొట్టపగిలి ఎన్నెన్నో ప్లాస్టిక్‌ వ్యర్థాలు బయటపడ్డాయి.

బాటిల్స్, కప్పులు, చెప్పులు, స్ప్రింగులు.. ఇలా లెక్కలేనంత ప్లాస్టిక్‌ కడుపులో పేరుకుపోయింది. అదే దాని చావుకు కారణమయిందని అధికారులు తేల్చారు. ఆసియా ఖండంలో ఉన్న 60 శాతం ప్లాస్టిక్‌ వ్యర్థాలు చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, థాయ్‌లాండ్‌ దేశాల్లోనే నిక్షిప్తమ య్యాయని ‘మెక్‌నెసీ సెంటర్‌ ఫర్‌ బిజినెస్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ అనే సంస్థ అధ్యయనం చేసి నివేదించింది. ‘ప్లాస్టిక్‌ నియంత్రణ, నివారణకు మీరెలాంటి నిర్దిష్ట చర్యలు తీసుకుంటున్నారో తెలుపండ’ని రెండు తెలుగు రాష్ట్రాలను హైకోర్టు అడిగింది. తదుపరి విచారణ లోపు ఆయా ప్రభుత్వాలు ఏం చెబుతాయో చూడాలి. దేశంలో ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వ హణ సంక్లిష్టమవుతూ వస్తోంది. రోజూ సగటున 15000 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు జమ అవుతున్నాయి.

60 శాతం పునర్వినియోగం(రీసైకిల్‌) అవుతుండగా 40 శాతం వ్యర్థాల్ని అభద్ర విధానంలో పారవేస్తున్నారు. అది ప్రమాదకరంగా పరిణమిస్తోంది. సరైన సేకరణ, నిర్వహణ పద్ధ తులు లేకపోవడం, విధానాల అమలు లోపాల వల్లే ఈ దుస్థితి! అభి వృద్ధి చెందిన దేశాల తలసరి ప్లాస్టిక్‌ వినియోగంతో పోల్చి చూస్తే మనది నామమాత్రమే! ప్రపంచ సగటు తలసరి ప్లాస్టిక్‌ వినియోగం 28 కిలోలు కాగా అమెరికా (109), ఐరోపా (65), చైనా (38), బ్రెజిల్‌ (32)ల ముందు భారత్‌ (11కిలోలు) వినియోగం ఎంతో తక్కువ. అయినా, పద్ధతిగా వాడటం, వ్యర్థాల్ని పోగుచేయడం, నిర్వహణ ఘోరంగా ఉండ టం వల్లే ఇబ్బందులు.

2022 నాటికి మనదేశంలోనూ తలసరి విని యోగం 20 కిలోలకు చేరవచ్చని ఇంధన శాఖ అంచనా. ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016, ప్లాస్టిక్‌ వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2016లో కొన్ని మార్పులు చేయాలని, కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటయిన ఓ ఉన్నతస్థాయి కమిటీ కొన్ని సిఫార సులు చేసింది. ప్లాస్టిక్‌ వ్యర్థాల సేకరణ, నిర్వహణ స్థానిక సంస్థలకు అప్పగించాలని, ఉత్పత్తి–వినియోగం చేసే వారి నుంచి సదరు ఫీజు వసూలు చేయాలనీ ఈ కమిటీ సిఫారసు చేసింది. మన దేశంలో అత్యధి కంగా ప్యాకేజింగ్‌ (35 శాతం), బిల్డింగ్స్‌–నిర్మాణం (23), రవాణా (8), ఎలక్ట్రానిక్స్‌ (8), వ్యవసాయ (7), ఇతర (19శాతం) రంగాల్లో ప్లాస్టిక్‌ వినియోగమవుతోంది.

పాలనా వ్యవస్థను జవాబుదారీ చేయాలి
పర్యావరణ పరిరక్షణకు మూడేళ్ల కింద సరిగ్గా ఇవే రోజుల్లో ‘ప్యారిస్‌ ఒప్పందం’ జరిగింది. మనదేశం కూడా పలు వాగ్దానాలు చేసింది. ఆ దిశలో గొప్పగా అడుగులు పడటం లేదు. వచ్చేనెల క్యాటోవైస్‌ (పోలాం డ్‌)లో భాగస్వాముల సదస్సు (కాప్‌) జరుగనుంది. ప్యారిస్‌ ఒప్పందం అమలుకు అక్కడ బ్లూప్రింట్‌ తయారు చేస్తారు. ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేరుస్తున్నారో 2020 నుంచి లెక్కలు మొదలవుతాయి. జాతీయ స్థాయిలో విధానాల పరంగా, స్థానిక స్థాయి ఆచరణ పరంగా చర్యలుండాలి. ప్రజలు నిబద్ధత చూపాలి. అప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యమౌతుంది. న్యాయస్థానం పేర్కొన్నట్టు ప్రభుత్వాలు బాధ్యత తీసు కోవాలి. ఖచ్చితత్వం పాటించాలి. ఎక్కడికక్కడ స్వచ్ఛంద సేవా సంస్థల భాగస్వామ్యంలో చర్యలు చేపట్టాలి. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ వంటి విషయాల్లో వ్యక్తులుగా పౌరులూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ‘మనిషి విధ్వంసకారి’అనే మాటను చెరిపేయాలి. ‘బుద్ధిజీవి’అనే మాటను నిలబెట్టాలి. అప్పుడే పృథ్వికి రక్ష, భవితకు భరోసా!                  

దిలీప్‌ రెడ్డి, ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top