శ్వేతపత్రంలోనూ పాతపాటే

Bollikonda Phani Kumar Article On AP Government White Paper - Sakshi

నాలుగున్నరేళ్లలో జరిగిన వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచుతున్నానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం విడుదల చేసిన శ్వేతపత్రంలో రోజూ చెప్పే అబద్ధాలు, అసత్యాలే తప్ప కొత్త అంశాలు మచ్చుకైనా కనిపించలేదు. అవసరాన్ని బట్టి ఇన్నాళ్లూ రకరకాల యూటర్న్‌లు తీసుకుంటూ ముందుకెళ్లిన బాబు.. రానున్న ఎన్నికల నేపథ్యంలో తన వాదనను సమర్ధించుకునేందుకే ఈ పత్రాల వ్యూహం అమలు చేస్తున్నారని శ్వేత పత్రం చూస్తే సులభంగా అర్ధమవుతుంది. ఇందులో అంశాలు కొత్తవేమీ కాదని తెలుగుదేశం నాయకులు సైతం భావిస్తున్నారంటే ఈ శ్వేతపత్రం ఎంత డొల్లగా ఉందో అర్ధమవుతుంది.   

బీజేపీతో కాపురంపై దాటవేత  
నవనిర్మాణ దీక్షలు, ధర్మ పోరాట సభలు, పార్టీ, అధికారుల సమావేశాల్లో నిత్యం విసుగొచ్చేలా చెప్పే రాజకీయాంశాలే ఈ పత్రంలోనూ చోటుచేసుకున్నాయి. నాలుగున్నరేళ్లలో జరిగిన పరిణామాల గురించి వాస్తవాలు చెబుతున్నానంటూనే బీజేపీతో కేంద్రంలో నాలుగున్నరేళ్లు కలిసి కాపురం చేయడం, ప్రత్యేక హోదా వద్దని దాని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించడం, ప్యాకేజీ ఇచ్చినందుకు ప్రధానికి అభినందనలు, సన్మానాలు చేసిన విషయాలను చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా తెరమరుగు చేసే ప్రయత్నం చేశారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేసిన పోరాటాన్ని అణచివేసేందుకు ప్రయత్నించి కేసులు పెట్టిన చంద్రబాబు ఆ విష యాన్ని మరుగుపరిచి తానే మొదటి నుంచి హోదా కోసం పోరాటం చేశానని ఎలాంటి సంశయం లేకుండా శ్వేతపత్రంలో పేర్కొనడం విస్తుగొలుపుతోంది. తన తప్పుల్ని బీజేపీ ఖాతాలో వేసి చూపడం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, కేసీఆర్, జనసేన కలిసి తమపై కుట్ర చేస్తున్నారని చూపడం ఈ శ్వేతపత్రం సారాంశం.

పట్టని రాష్ట్ర ప్రయోజనాలు 
నాలుగేళ్లపాటు కేంద్రంలో బీజేపీతో కలిసి అధికారాన్ని పంచుకున్న సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను చంద్రబాబు కావాలని దాట వేశారు. ఆ సమయంలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ప్రయత్నించడం, హోదా పేరెత్తితే జైలే అని విద్యార్థులను బెదిరించడం, హోదా పోరాటంలో పాల్గొన్న వారిపై కేసులు పెట్టడం ఎవరూ ఇంకా మరిచిపోలేదు. ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి పదవులు తీసుకుని అధికారాన్ని అనుభవిస్తూ ఏనాడూ ప్రత్యేక హోదా గురించి కేంద్రాన్ని చంద్రబాబు అడగలేదు. తరచూ ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు ఎంతసేపూ నియోజకవర్గాల పెంపు, జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న కేసుల గురించి ప్రధాని, కేంద్ర మంత్రులపై ఒత్తిడి తెచ్చారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోలేదు.  

ప్యాకేజీకి పట్టం కట్టలేదా?  
ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా నినాదంతో పోరాటం చేస్తున్న సమయంలో హోదా వద్దని కేంద్రానికి చెప్పిన విషయాన్ని శ్వేతపత్రంలో మరుగుపరిచారు. ప్రత్యేక హోదా కంటే ఈ ప్యాకేజీయే గొప్పని, హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ సరిపోతుందని ప్రకటించిన సంగతి ప్రజలకు గుర్తుండదని ఆయన అనుకుంటున్నారు.  2016 సెప్టెంబర్‌ 7వ తేదీ అర్థరాత్రి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన వెంటనే చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి మరీ దాన్ని స్వాగతించారు. ప్రత్యేక హోదా అవసరమే లేదని, అది సంజీవని కాదని, దానివల్ల రాష్ట్రానికి ఒరిగేదేమీ లేదని, అది ఉన్న ఈశాన్య రాష్ట్రాలు ఏం బావుకున్నాయనే వాదనలను తెగ ప్రచారం చేశారు. ప్యాకేజీకి ఆమోదం తెలిపినందుకు 2017 మార్చి 16న అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలుపుతూ తీర్మానం చేశారు. అదే సమయంలో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని భుజానికెత్తుకుని తీసుకెళుతుండడంతో దాన్ని నీరుగార్చేందుకు అడుగడుగునా ప్రయత్నాలు చేశారు. 

జైల్లో పెడతానని బెదిరింపులు 
జగన్‌మోహన్‌రెడ్డి యువభేరి సదస్సుకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో వెళుతుండడంతో వారిని ఆపేందుకు ఆ సదస్సుల్లో పాల్గొంటే జైళ్లలో పెడతామని హెచ్చరించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ బంద్‌కు పిలుపు ఇస్తే అరాచకాలు సృష్టించడానికి బంద్‌ చేస్తున్నారని, దానికి ఎవరూ సహకరించవద్దని సాక్షాత్తూ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. అన్ని స్థాయిల్లోనూ హోదా ఉద్యమాన్ని అణచివేతకు యత్నించడం, కేసులు పెట్టారు. గృహ నిర్బంధాలు, దౌర్జన్యాలతో రాష్ట్రంలో భయానక వాతావరణాన్ని సృష్టించారు. 2017 జనవరి 26న విశాఖపట్నంలో హోదా కోసం జరిగే ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లిన ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని ఎయిర్‌పోర్టులోనే అడ్డుకుని నిర్బంధించారు. సీపీఐ, సీపీఎం నాయకులు హోదా కోసం పోరాడుతుంటే వారిపైనా కేసులు నమోదు చేసి జైళ్లలో పెట్టారు. హోదా ఉద్యమాన్ని రాష్ట్రానికి వ్యతిరేకంగా జరిగే అల్లర్లుగా చిత్రీకరించారు. ఇంత చేసిన చంద్రబాబు హోదా కోసం ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి, జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యమంలో చురుగ్గా ముందుకెళ్లడంతో రూటుమార్చి వద్దన్న ప్రత్యేక హోదాయే కావాలని ఏడు నెలల క్రితం స్వరం మార్చారు. ఇప్పుడు హోదా కోసం తానే పోరాడినట్లు శ్వేతపత్రంలో ప్రకటించుకోవడం ఎవరికైనా దిగ్భ్రాంతి కలిగిస్తుంది.

నాలుగేళ్ల క్రితం విడుదల చేసిన పలు శ్వేతపత్రాలకు, ఇప్పటి శ్వేతపత్రానికి పెద్ద తేడా లేదని సాధా రణ పౌరులకు కూడా అర్ధమవుతుంది. అధికారులు సైతం ఒప్పుకోకతప్పదు. అప్పట్లో విభజన చట్టంలో ఇచ్చిన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కాంగ్రెస్‌ మోసం చేసిన తీరు గురించి వివరించగా ఇప్పుడు అవే హామీలు, రావాల్సిన నిధుల గురించి ఏకరువు పెట్టారు. అప్పుడు కాంగ్రెస్‌ మోసం చేసిందని చెప్పగా ఇప్పుడు బీజేపీ మోసం చేసిందని అన్నారు.  

కేసీఆర్‌తో లింకు 
మరోవైపు ప్రత్యేక హోదా ఇవ్వొద్దని చెప్పిన టీఆర్‌ఎస్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్ధతు తెలుపుతున్నదనే ప్రచారాన్ని బాబు వ్యూహాత్మకంగా లేవనెత్తడం గమనార్హం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వ వద్దని చెప్పిన కేసీఆర్‌తో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధాలు అంటగడుతూ విమర్శలు చేస్తున్న బాబు తాను టీఆర్‌ఎస్‌తో పొత్తుకోసం ప్రయత్నించానని, వారు అందుకు నిరాకరించాకే కాంగ్రెస్‌తో కలిశానని ఈమధ్యవరకూ చెబుతూనే ఉన్నారు. ఇలా పూటకో మాట మాట్లాడుతూ, విపక్షాలపై నిందలేసే బాబు నైజం చూసి ఎవరైనా విస్తుపోక తప్పదు.
-బొల్లికొండ ఫణికుమార్, సాక్షి ప్రతినిధి 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top