ఆరిపోయే దీపానికి వెలుతురు అధికం | Sakshi
Sakshi News home page

ఆరిపోయే దీపానికి వెలుతురు అధికం

Published Fri, Oct 25 2019 12:57 AM

AP Vittal Guest Column On Chandrababu And TDP - Sakshi

ఏమైనా చెప్పండి! మరీ ఇంత మంచితనం పనికిరాదండి అని మామూలు ‘హలో’తో పలకరింపులు అయిన తర్వాత సాక్షిలో నేను రాసిన వ్యాసం ప్రచురితమైన రోజు ఒక పాఠకుడు చెబుతున్నాడు. వివరించండి అన డిగాను. అదేనండి జగన్‌ గారు... ఏ పార్టీ శాసనసభ్యుడైనా మా పార్టీలోకి రావాలంటే తాను ఉన్న పార్టీకి, తన శాసనసభ్యత్వానికి రాజీనామా ఇచ్చి రావాలని షరతు పెట్టడం ఏమిటండి? పైగా దానికే కట్టుబడి ఉండాలా? రెండు రోజులు గడువు పెట్టి ఉన్నట్లయితే మీరంటుంటారే.. ఆ వెన్నుపోటు పార్టీ దాదాపు ఖాళీ అయ్యేదండీ! చంద్రబాబు కూడా ఇక దిక్కు తోచక బీజేపీలో చేరి ఉండేవాడు... పీడా ఒదిలిపోయేది! అని పూర్తిచేశాడు. నేన న్నాను.. మీరు చెప్పినట్లు నిజాయితీ లేని రాజకీయాలు, మాటతప్పి యూటర్న్‌ తీసుకోవడం చేస్తే జగన్‌కు ఆ వెన్నుపోటు పార్టీ నేతకు తేడా ఏమంటుంది? అన్నాను.  ‘నిజమేనండీ, మాట తప్పకపోవడం జగన్‌కి ఆయన తండ్రి వైఎస్సార్‌ నుండి సంక్రమించిన సద్గుణమే అనుకోండి. కాకుంటే ఆ చంద్రబాబు, ఆయన శిష్యులుగా నటిస్తున్న వాళ్లు ఏదో గిల్లికజ్జాలు పెట్టుకుని, జగన్‌ తాను ఎంచుకున్న ప్రజా సంక్షేమ బాటనుంచి దృష్టి, దారి మళ్లించాలని చేస్తున్న కుట్రలు చూస్తుంటే కడుపు రగిలిపోతున్నది’ అన్నాడా పాఠకుడు. ‘నువ్వొక్క డివేనా ఆలోచించగలిగింది? నీకొక్కడికేనా రగిలిపోయే కడుపు ఉన్నది’ అని ప్రశ్నించాను.

‘నిజమేనండి, మొన్న ఎన్నికల్లో బాబుకు ఓటేసిన వాళ్లలో చాలామంది కూడా ఆయన నయవంచక రూపం చూసి అసహ్యించుకుంటున్నారు. ఏదో రకంగా ఇంకా రాజకీయాల్లో తనకేదో ముఖ్యమైన పాత్ర ఉన్నట్లు కాలం నెట్టుకొస్తున్నాడు గానీ బాబుగారు, అది సాధ్యం కాదండి. ఉంటానండి. ‘అది సరేనండీ.. నాకు తెల్వక అడుగుతున్నాను.. చేతికి ఎముక లేనట్లు సామాన్య రైతాంగానికి, యువతీ యువకులకు, చేనేతవారికి, రైతు భరోసాలు, ఉపాధి ఉద్యోగాలు, వాహనమిత్ర.. ఇలా అడిగిన వాడికి, అడగని వాడికి సహాయంగా డబ్బులు ఇచ్చుకుంటూ పోతే... ఎట్టాగండి. ప్రభుత్వం దగ్గర డబ్బులెక్కడివి?’ అన్నాడు మరొక పాఠకుడు. ‘సరే.. గవర్నమెంటుకు, రాష్ట్రానికైనా, కేంద్రానికైనా డబ్బులు ఎక్కడినుంచి వస్తాయి? మన ప్రజలు చెల్లించే పన్నుల ద్వారానే కదా? అక్కడ మోదీగారు, ఇక్కడ జగన్‌మోహన్‌ రెడ్డి గారు తమ జేబులోంచి నేరుగా ఇవ్వరు కదా. మరి ఆ డబ్బును అదే ప్రజలకోసం ఖర్చుపెట్టడం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం విధ్యుక్త ధర్మం కదా! జగన్‌ తాను ప్రజల మనిషినని, ప్రజల కోసమే తాను తన ప్రభుత్వం నిరంతర కృషి చేస్తోందని ఆచరణలో నిరూ పిస్తున్నారు. బాబుగారి వెన్నుపోటు పార్టీ పాలనలో, తాను, తన తనయుడు, తన బంధుమిత్రులు, ఇంకా నారాయణ వంటి తమ మంత్రులు, ధనవంతులు అలాంటి ఆమాంబాపతు కోసమే పదవిలో ఉన్నారు కదా! దీపం ఉండగానే అన్నట్లు దొరికిన చోట దొరికిన కాడికి దోచుకుని దాచుకోవడమే.. ఆ ఎజెండా! దాన్ని ఆయన అమలు జరిపాడు’. జగన్‌ ఎజెండా ప్రజాసంక్షేమం. జగన్‌ ఎజెండా రాష్ట్ర అభివృద్ధి. జగన్‌ ఎజెండా నిజాయితీ మార్గం, పారదర్శకంగా పనిచేయడం... అని నేను ఫోన్‌లో చెబుతుండగానే.. అవతల వ్యక్తి.. అంతే కాదండీ, పేదలకు, కష్టజీవులకు, అణగారిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు గతంలో ఎన్నడూ ఎరగనట్లు పాలనలో 50 శాతం భాగస్వామ్యం కూడా ఇస్తున్నారండీ. ఈ సామాజిక న్యాయం గురించి కూడా జనం గొప్పగా చెప్పుకుంటున్నారండీ, ఈసారి ఎన్ని కలు వస్తే ఈ అణగారిన వర్గాల నుండి 10శాతం ఓట్లు కూడా చంద్ర బాబుకు పడటం డౌటేనండీ అన్నారు.

వీళ్లందరూ సాధారణ ప్రజలు. ఇలా మరో 10–15 ఫోన్‌ సంభా షణలు అయ్యాక, పత్రికలు అందులోనూ ఎడిట్‌ పేజీ వ్యాసాలు చదివే తీరిక, ఓపిక, జిజ్ఞాస ఉన్నవారు  చేసే మచ్చుకు ఒక ఫోను.. ‘మీరు రాష్ట్ర అభివృద్ధికి ఏం చేయాలో చెప్పరేమిటి?’ అన్నాడు. మరొకాయన.. నేనన్నాను.. ‘నాయనా నాకు అర్థ శాస్త్రం అర్థం కాదు. కానీ ఒకటి మాత్రం స్థూలంగా అర్థం అవుతోంది. మన ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది. ఆర్థిక మాంద్యానికి అదొక ప్రధాన కారణం. నిరుద్యోగం పెరిగిపోతోంది. వ్యవసాయరంగం బాగా ఇబ్బందుల్లో ఉంది. దేశ జనాభాలో 60 శాతం ప్రజలు వ్యవసా యంపై ఆధారపడుతున్నారు. కానీ ఈరంగంలో ప్రజలకు ఆదాయం లేక సాధారణ ప్రజానీకం తిండీబట్టా కూడా లేక ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచంలో కడుపునిండకుండా, అర్ధాకలితో ఉండే ప్రజల్లో 152 దేశాల్లో మన స్థానం 102వ స్థానం. మన కంటే శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, చివరకు పాకిస్తాన్‌లో సైతం పరిస్థితి ఇంతకంటే మెరుగ్గా ఉందని అంతర్జాతీయ గణాంకాలు తెలిపాయి. (ఈ మాట చెబితే, నన్ను పాకిస్తాన్‌ని పొగిడానని దేశ ద్రోహ నేరంతో నాపై కేసుకూడా పెడుతుందేమో మోదీ పాలన) ఇలాంటి నేపథ్యంలో తన సంక్షేమ పథకాల ద్వారా ఇలాంటివారికి లాభం చేకూర్చడమే ప్రజల సంక్షేమం’ అని నేను పూర్తి చేయకముందే అవతల ఫోన్లోనుంచి అందుకున్నారు.

 ‘అది సరే.. చెప్పనివ్వండి.. ఈ డబ్బంతా ప్రత్యక్షంగా ఎవరికి చేరుతోంది? గ్రామీణ రైతు, పేద, కష్ట జీవుల కుటుంబాలకే కదా. చేనేత కుటుంబానికి 25 వేలు సంవత్సరానికి ఇస్తే ఆ కుటుంబం ఏం చేస్తుంది? నోట్లను నమిలి మింగదు కదా. వారి అవసరాలకు గతంలో కంటే కొంచెం మెరుగైన జీవనం కోసం ఖర్చుపెడతారు. అలాగే ప్రజలకు చేరుతున్న ఈ ప్రత్యక్ష నగదుతో ఆ ప్రజానీకం తమకు అవసరమైన సరుకులను కొంటారు తప్ప ఆ డబ్బును ఇనప్పెట్టెల్లో దాచుకోరు కదా. అంటే గత పాలనల్లో కంటే వారి కొనుగోలు శక్తి ఇప్పుడు పెరుగుతుంది కదా. నిజానికి ఎన్ని లక్షల మందికి ఇలా కొనుగోలు శక్తి పెరిగితే అంత మంచిది కదా. అయినా ఎంత సుజనా చౌదరి అయినా, సీఎం రమేష్‌ అయినా, లోకేష్‌ అయినా, ఎంత ఖరీదైనవైనా ఒక్కొక్కరు ఎన్ని టీవీ సెట్లు కొంటారు.  మహా అయితే గదికి ఒకటికి లేదా మనిషికి ఒక్కొక్కటి. అంతే కదా. అదే 20 లక్షలమందికి కొత్తగా సాధారణమైన టీవీ కొనే స్థితి వస్తే దేశంలో ఎన్ని టీవీలు ఉత్పత్తి కావాలి? ఉదాహరణకు చెప్పాను. అంటే నిజానికి ఇది గ్రామీణ పేదల కొనుగోలు శక్తిని పెంచి సరుకుల ఉత్పత్తికి దోహదపడుతుందా లేదా?’ఇలాంటిదే మరో కాల్‌. ఏమండీ, అసలు పారిశ్రామికంగా డెవలప్‌ కాకుండా నిరుద్యోగం పోతుందా? నిరుద్యోగం పోకుండా, దేశ పురోభివృద్ధి సాధ్యమా.. చెప్పండి. పారిశ్రామిక అభివృద్ధి జర గాలి. నిజమే. అందుకే జగన్‌ నవోదయ పథకం పెట్టారు. ఇది చిన్న, మధ్యతరగతి పరిశ్రమల అభివృద్ధి కోసమే అని నేనంటూండగానే, ఎంతయినా పెట్టుబడులు రాకుండా మన అభివృద్ధి సాధ్యమా, పెద్ద పెద్ద కార్పొరేట్‌ పరిశ్రమలు అత్యంత అవసరం కదా? అన్నారు.. దానికి నేను.. మీకు తెలిసే ఉంటుంది.

ఈ తరహా చిన్న పరిశ్రమలు దేశంలో 12 కోట్లమంది జనాలకు ఉపాధి కల్పిస్తున్నాయి. ఎవరైనా పెట్టుబడి పెట్టేందుకు అది అత్యంత భారీస్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరైనా మన దేశానికో, రాష్ట్రానికో ఎందుకు వస్తారు? వాళ్లు మన మేనత్త, మేనమామ పిల్లలు కాదు.. లాభార్జన లక్ష్యంతోనే వస్తారు. తాను తయారు చేసే సరుకులకు మన దేశ మార్కెట్లో  డిమాండ్‌ ఉంటుందని, ప్రజలకు కొనుగోలు శక్తి ఉంటుందనుకుం టేనే వస్తారు.  ఏదో మన వల్ల వాడికి లాభం ప్రత్యేకించి ఉండాలి. ఉదాహరణకు చౌకగా వనరులు, మానవ వనరులు (కూలీలు, కార్మి కులు) వారి దేశాలలోని శ్రామికుల కంటే బాగా పేదవారు కనుక, కుడుము ఇస్తే పండగ అనుకుంటారు గనుక, వారి శ్రమశక్తికి చాలా తక్కువ చెల్లించవచ్చునని!  అయినా నేటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అన్నీ మనమే తయారు చేసుకోలేం. కనుక అలాంటి పరిశ్రమలు అవసరమౌతాయి కావున ఆ బడా పారిశ్రామికవేత్తలు, విదేశీ పెట్టుబడిదారులపై ఆధారపడటం గత్యంతరం లేకుంటే అలా చేయక తప్పకపోవచ్చు. కానీ మోదీ ప్రభుత్వం చేస్తున్నట్లు అదే ఏకైక మార్గం కాదు. లక్షల కోట్లు ఆ విదేశీ, స్వదేశీ గుత్తాధిపతులకు సబ్సిడీల రూపంలో కట్టబెట్టి, మన సాధా రణ ప్రజానీకాన్ని గ్రామీణ వ్యవసాయ, తత్సంబంధ వృత్తులవారికి మొండి చేయి చూపిస్తే మళ్లీ వలసభారతం వచ్చినా ఆశ్చర్యం లేదు. అందుకే జగన్‌ ఒక ప్రత్యామ్నాయ అభివృద్ధి పంథాకై తపన పడు తున్నారు. అయినా విదేశీ పెట్టుబడులకు అవసరాన్ని బట్టి ఆహ్వాని స్తూనే ఉంటున్నారు కదా.

ఇలా మరికొన్ని అభినందన ఫోన్ల తర్వాత  ఇంకొకాయన అడి గారు. ‘జగన్‌ రైతు భరోసా మంచిదేనండి. కానీ ఒకటిన్నర ఎకరం రైతుకు, అయిదెకరాల రైతుకు తేడా చూడడం లేదండి. ఇలా సంక్షే మాలు ఇస్తూ పోతుంటే, సోమరిపోతులు కూడా పెరుగుతారు’ అన్నారాయన. నేనన్నాను... స్థూలంగా చూస్తే ఇప్పుడు లక్షల కోట్ల ఆస్తిపరులందరూ చెమటలు పట్టేట్లు కష్టపడి సంపాయించినవా రేనా? నిజానికి వారికంటే సోమరులెవరండీ, వాళ్లు తెలివిగలవాళ్లు అంటారు. మీకు గుర్తుందా, చంద్రబాబు అనేవారు. మనం తెలివి తేటలు ఉపయోగించి సంపదలు సృష్టిద్దాం. ఆ సంపద ప్రజలకు పంచిపెడదాం అని.. కాని అది అంతా వట్టి హుళక్కే. ఆస్తి మూరెడు, ఆశ బారెడు. చివరకు అప్పులు, చేతికి చిప్పలు అన్నట్లు రాష్ట్రాన్ని గత అయిదేళ్లుగా అధోగతికి నడిపించాడు చంద్రబాబు. ఆయన అయి దేళ్లలో కట్టిన రెండు మూడు తాత్కాలిక ప్రభుత్వ కార్యాలయాలు కూడా వాసిలో నాసి. జగన్‌మోహన్‌ రెడ్డి ఎంతో వినమ్రంగా ఇంతవరకు ఏ నేతా చేయనట్లుగా ప్రజల మధ్యలో పాదయాత్రలో ప్రజలనుండి తాను తెలుసుకున్న విషయాల ద్వారా ఆ అనుభవం ద్వారా నేర్చుకుని తన పాలనలో అమలు జరిపేందుకు నిజాయితీగా తీవ్ర కృషి చేస్తున్నారు. మావో చెప్పినట్లు ప్రజలను మించిన గురువులు ఉండరు, ప్రజాజీవితాన్ని మించిన పాఠశాలా ఉండదు.

డాక్టర్‌ ఏపీ విఠల్‌ 
వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు ‘ మొబైల్‌ : 98480 69720 

 
Advertisement
 
Advertisement