అసెంబ్లీ సాక్షిగా బాబుకు శృంగభంగం

AP Vital Article On Chandrababu Naidu Character - Sakshi

విశ్లేషణ

ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ చరిత్రలో ఎన్నడూ లేనంత ఘోర పరాజయానికి గురై కేవలం 23 మంది ఎమ్మెల్యేలతో శాసనసభలో అడుగుపెట్టిన చంద్రబాబుకు అక్కడ ఎదురవుతున్న అవమానాలు చూస్తే చేసుకున్నవాళ్లకు చేసుకున్నంత అనిపించకమానదు. చివరకు అచ్చయ్య, బుచ్చయ్య, రామయ్య వంటి ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు మాత్రమే బాబు వాదనకు సమర్థనగా నిలబడుతున్న పరిస్థితి. సూటిగా బుగ్గన, అంబటి వంటి నేతలు వాగ్బాణాలు సంధిస్తే, వాటికీ చంద్రబాబే బదులివ్వాల్సి వస్తోంది. టీడీపీ నేతలెవ్వరూ బాబు తరపున నోరు విప్పరు. ప్రజల్లో, పార్టీలో కూడా అభాసుపాలై తేలముఖం వేస్తున్న బాబుకు ప్రస్తుత దీనస్థితి స్వయంకృతాపరాధమే.ఇటీవల ఏపీ శాసనసభలో, ప్రతిపక్ష నేతగా ఉంటున్న చంద్రబాబు గారిని చూస్తే నిజంగానే నాకు పాపం అనిపిస్తున్నది. 70 ఏళ్ల వయస్సులో ఎన్నికల్లో తన పార్టీ తరపున మరే నేతా పడనంత శ్రమ ఆయన అనుభవించాడు.

తన చూపుడు వేలు చూపించి ‘‘ఏం తమాషా అనుకుంటున్నారా? మీ అంతు చూస్తాను, అసలు మిమ్మల్ని ఇంత దూరం రానిచ్చిన వాళ్లెవరు?’’ అని ముఖం కందగడ్డ చేసుకుని...  తమ గోడు వెళ్లబోసుకునేందుకు వచ్చిన అంగన్‌వాడీ మహిళలను మత్స్య పరిశ్రమ కార్మికులను, నాయీ బ్రాహ్మణులను, ఇలా నోట్లో తడిలేని జనంపై హూంకారాలు, ఘీంకారాలు చేయడం చంద్రబాబు అధికార నైజం. కానీ గతంలో కేవలం రెండు వేళ్లు కదిలిస్తూ వేదికపై కదిలే చంద్రబాబు మొన్న ఎన్నికల ప్రచార సభల్లో వేదిక నాలుగు మూలలకు వెళ్లి, జపాన్‌ వారి మాదిరి వంగివంగి జనానికి దణ్ణాలు పెట్టడం చూస్తుంటే ఈయనకు ఏం ఖర్మం వచ్చింది అనిపించింది. అంతేనా? ‘‘నా మాటపై విశ్వా సంతో, అర్థరాత్రి దాటినా, అక్కచెల్లెమ్మలు ఓటింగులో పాల్గొన్నారు. కనుక మా పార్టీ గెలవడం నూటికి వెయ్యిపాళ్లు ఖాయం’’ అంటూ ప్రగల్బాలు పలికారు చంద్రబాబు. కానీ ఆ ఓటరు దేవుళ్లు మాత్రం ఆయన పార్టీకి చరిత్రలో గతంలో ఎన్నడూ ఎరుగనంతటి ఘోర పరాజయాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు ఆయనకూ ఆయన వెన్నుపోటు పార్టీ వారికి చివరకు పాతాళం కూడా పైనే ఉన్నట్లుగా ఉంది పరిస్థితి.

ఇంత జరిగిన తర్వాతైనా చంద్రబాబు, తన బదులు అచ్చెన్నాయుడినో బుచ్చయ్య చౌదరినో ప్రతిపక్ష నేతగా ఎంపిక చేసి, తాను పక్కన కూర్చోవలసింది అనిపిస్తోంది. ‘‘కనీసం తన పుత్రరత్నం గెల్చి ఉన్నట్లయితే–అతణ్ణి అయినా నమ్మి ఆ ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేవారేమో గానీ, బాబుగారు తననీడను తానే నమ్మనివాడు కదా.. ఈ అచ్చయ్యగారిని, బుచ్చయ్యగారిని నమ్ముతాడటండీ మీ పిచ్చిగానీ!’’ అని పక్కన ఉన్న నా మిత్రుడొకరు అన్నారు. ‘‘ఏమయ్యా ఎన్నయినా చెప్పు, ఆయన అలా గుడ్లప్పగించి ప్రతిపక్ష నేత స్థానం నుంచి అలా జాలిగా, బేలగా, వక్రంగా  చూస్తుంటే నేను ఆయన్ని అసలు చూడలేకపోతున్నాను’’ అని అన్నాను. చివరకు నా రాజకీయ అనుభవం అంత లేదు నీ వయస్సు అని కూడా స్వయంగా తానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఉద్దేశించి, స్వోత్కర్షకు పరాకాష్టగా శాసనసభ సాక్షిగా బాబు చెప్పుకోవలసి వచ్చింది అంటే ఆ వెన్నుపోటు పార్టీ దీనావస్థ తేటతెల్లమవుతుంది. కనీసం, చంద్రబాబు బదులు మరో పార్టీ శాసనసభ్యుడెవరైనా తమ నేత రాజకీయ అనుభవాన్ని పొగిడేందుకు సిద్ధంగా లేరా? హతవిధీ! 

అయినా చంద్రబాబు గారిదేమి జాతకమో.. ఆయన హాయిగా నవ్వగా ఎప్పుడైనా చూశామా మనం! అశేష ప్రజల ప్రేమాభిమానాలు పొందిన దివంగత సీఎం వైఎస్సార్‌ కూడా చంద్రబాబుతో శాసనసభలోనే ‘కాస్త నవ్వవయ్యా అలా ముఖం మాడ్చుకు కూర్చోకుండా’ అని అంతటితో ఆగకుండా, ‘నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేక పోవడం ఒక రోగం’ అనే మాటను ఉటంకించారు. దాంతో చంద్రబాబుగారు ఉడుక్కున్నారు. ఇప్పుడు ఆ వైఎస్సార్‌ తనయుడు, అన్నింటా ఆయన అడుగుజాడల్లో నడుస్తున్న సామర్థ్యం, హృదయం గల యువ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అయినా బాబుగారి పరిస్థితి అదే! పైగా వైఎస్‌ జగన్‌ నిష్కల్మషంగా, నవ్వుతుంటే ఏమిటలా నవ్వడం, హుందా లేకుండా అని బాబుగారు ఉక్రోషం ప్రదర్శిస్తున్నారు. దానికి తోడు సూటిగా బుగ్గన, అంబటి వంటి నేతలు వాగ్బాణాలు సంధిస్తే, పాపం.. వాటికీ చంద్రబాబే బదులివ్వాల్సి వస్తోంది.

టీడీపీ నేతలెవ్వరూ బాబు తరపున నోరు విప్పరు. చివరకు ప్రతిపక్ష సభ్యులు ఎవరు కూడా చంద్రబాబు ఏదైనా అభ్యంతరం చెబుతూ సమాధానమిస్తూ ఉంటే ఆయనకు అండగా తమ తమ స్థానాల్లో కూర్చున్నవారు లేవలేదు. సహజంగా అలాంటి సందర్భాల్లో ప్రతిపక్ష సభ్యులు లేచి నిలబడి మాట్లాడతారు. ప్రతిపక్షనేత కూర్చుంటారు. బాబుగారూ కాస్త ఉక్రోషపడకుండా ఆలోచించండి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షనేత పదవిని మీరే ‘ఫెవికాల్‌’ అంటించుకుని కూర్చోవాలా? ప్రస్తుతం ఉన్న మీరు కాకుండా  22 మంది శాసనసభ్యుల్లో ఆ హోదాకు అర్హులెవరూ లేరని మీ అభిప్రాయమా? లేదా మీ 23 మందిలో ఎందరు మీ పార్టీని వదిలి వెళ్లిపోతారో అన్న భయమా? అనైతిక, రాజ్యాంగ వ్యతిరేక ఫిరాయింపులను ప్రోత్సహించి మా పార్టీలోకి మరోపార్టీ ప్రజాప్రతినిధి చేరాలనుకుంటే, తానప్పుడు ఉన్న పార్టీకే కాదు.. తన చట్ట సభ సభ్యత్వానికి కూడా రాజీనామాలు ఇచ్చి రావాల్సి ఉంది అని స్పష్టంగా వైఎస్‌ జగన్‌ శాసనసభ తొలి సమావేశంలోనే చెప్పారు. లేకుంటే గత శాసనసభలో మీరు నైతికతను, రాజ్యాంగ సూత్రాలను తుంగలో తొక్కినట్లు చేసి ఉంటే.. మీరు, మీ పుత్రరత్నం, మీ వియ్యంకుడితోపాటు ఇంకెవరైనా ఒకరిద్దరు మీ వెన్నుపోటు పార్టీలో మిగిలేవారేమో!

అయినా తస్మాత్‌ జాగ్రత్త! తెలుగుదేశం ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. ఈ దీనావస్థ నుంచి కూడా తేరుకుంటాం.. అని మీకు  మీరు థూ.. థా.. అంటూ వెన్నుమీద చరుచుకుని ధైర్యం చెప్పుకోవాలనుకుంటున్నారేమో? బాబుగారూ అప్పటి పరిస్థితి వేరు. ఇప్పుడు గుంట కాడ నక్కలాగా మీ పార్టీ సభ్యులను ఎగరేసుకుపోయేందుకు మోదీ అమిత్‌ షాల మతతత్వ, కుతంత్రాల పార్టీ బీజేపీ కాచుకుని ఉన్నది. ఆగస్టు నెల మీ పార్టీకి అచ్చిరాదని, అనుకుంటూ ఉంటారు కదా! సెప్టెంబరులో మీ శాసనసభ్యులలో మూడింట రెండువంతుల మందిని అంటే ఒక 16 మందిని తమ వైపు లాక్కుని వారిచే తమ వెన్నుపోటు పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నామని బీజేపీ సభ్యులుగా తమకు గుర్తింపు ఇవ్వాలని, ప్రకటింప చేస్తే ఎలాగూ ప్రస్తుతం ఉన్న మీ ప్రతిపక్ష నేత పదవి కూడా పోతుంది.

ఆ పరిస్థితి రాకముందే, మీ వెన్నుపోటు పార్టీలో మరొకరికి ప్రతిపక్ష హోదా ఇప్పిస్తే, మరొక్కరైనా మీతో కలిసి ఉండే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అధికారాంతమునందు జూడవలెరా ఆ అయ్య సౌభాగ్యముల్‌! అన్నట్లు మీ పరిస్థితి చూసి నిజంగా బాధపడుతూ మీ పట్ల సానుభూతితోనే మీకిస్తున్న నా సలహాను, వాస్తవ స్ఫూర్తితో గ్రహించగోరుతాను. పైగా, పోలవరం, రాజధాని నిర్మాణం, అక్రమ భూదందాలు, సదావర్తి సత్రం భూములు, రాష్ట్రంలో వివిధ చోట్ల ప్రత్యేకించి రాజధాని ప్రాంతంలో రియల్‌ ఎస్టేట్‌ కోసం మీ భూ సమీకరణాల భాగోతం, స్వరాష్ట్ర, స్వదేశీ, సింగపూర్‌ వంటి పారిశ్రామిక దొంగల ముఠాల గుట్టు, మీ మిత్రుడు సుజనా చౌదరి రట్టు అంతా ఇవ్వాళ గాకున్నా, ఇంకో నాలుగైదు నెలల్లో బయటపడనున్నదని అంటున్నారు. ఆ ప్రభావ తీవ్రత ఎంత ప్రమాదకరంగా ఉంటుందో! 

ఒకవేళ ఖర్మం చాలక, బీజేపీ మీ పార్టీని దాదాపు ఖాళీ చేసి తన ఖాతాలో వేసుకుంటే, అది మీకు ఆ బీజేపీ వారికే కాకుండా, యావత్‌ రాష్ట్రానికే ప్రమాదం. అదే జరిగితే, మీ వెన్నుపోటు పార్టీ ఉనికే లేనంతటి తీవ్ర పరిస్థితి ఏర్పడవచ్చు. అయినా నా పిచ్చిగానీ, ఆ పార్టీ ఆ పదవి మీరు మీ కృషితో నిర్మించుకున్నవి కావు గదా. అవన్నీ పాపం, అమాయక చక్రవర్తి నట సార్వభౌమ ఎన్టీఆర్‌ నుంచి కపట మాయోపాయాలతో కాజేసినవే కదా! అవి మీవి కావు కనుక పోతే పాతాయ్‌. ఎవడు గన్న బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తున్నాడన్నట్లు, మీకేమీ బాధ ఉండకపోవచ్చు! కానీ మీకు ఈ సిరిసంపదలు, స్వదేశీ విదేశాల్లో ఆస్తులు సంపాదించిపెట్టిన పార్టీ అన్న భావంతో అయినా కనీస కృతజ్ఞతాపూర్వకంగా, ఒకవేళ మీ వెన్నుపోటు పార్టీ కనుమరుగే అయితే, రెండు కన్నీటి బొట్లు అయినా రాలుస్తారో లేదో? ఎందుకంటే కృతజ్ఞత అనేది మీ నిఘంటువులో లేదు కదా! బీజేపీ వారికీ మీ పార్టీవాళ్లు తమతో చేరినందువల్ల వచ్చే అదనపు ప్రయోజనం లేదు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజల దృష్టిలో భ్రష్టుపట్టిన సుజనా చౌదరి, సీఎం రమేష్‌ వంటి అన్ని విలువలూ లుప్తమైనవారు ఎంతమంది చేరితే మాత్రం బీజేపీకి ఒరిగేది ఏముంటుంది? పైగా అలా వచ్చిన టీడీపీ నేతలు చంద్రబాబు పాఠశాలలో వెన్నుపోటు పాఠాలు బాగా నేర్చుకుని, ఆరితేరినవారే కదా! తమకు అవసరం అనుకుంటే ఈ బాపతు నేతలు అవకాశం వస్తే అదే వెన్నుపోటు విద్య బీజేపీ వారిపై ప్రయోగించరనీ చెప్పలేము. 

అలాంటి బీజేపీకి ఆంధ్రప్రజానీకం గత ఎన్నికల్లో నోటా కంటే తక్కువ ఓట్లిచ్చి, వారి స్థానం ఏమిటో వారికి బాగా తెలియజెప్పారు. అయినా సరే 2024లో ఏపీలో తామే ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్లు ఒక మహాస్వప్నం కంటున్నారు బీజేపీ పార్టీ మహిళా నేత ఒకరు.. కానీ మతోన్మాదం, జాతీయోన్మాదం, కుహనా దేశభక్తి తెలుగు జాతి స్వభావం కాదు. మా తెలుగుతల్లికి మల్లెపూదండ అని మా తెలుగు జాతి మాతృమూర్తిని నిత్యం స్మరించుకుంటూనే ఈ నేలపై కులమతోన్మాదాలకు, హింసాపూరిత జాతీయోన్మాదానికి తావులేదు. ఈ విషయాన్ని మా సీఎం వైఎస్‌ జగన్‌ తన మంత్రివర్గ కూర్పులోనే నిరూపించారు. మా ప్రజలు 2019 ఎన్నికల్లోనూ కుల, మత ఉన్మాదాన్ని తోసిరాజన్నారు. కనుక ఈ రాష్ట్రంలో 2024లో తాము అధికారంలో రానున్నట్లు, ఇప్పుడు శాసనసభలో ఒక్క సభ్యుడు లేకున్నా, గోడలు దూకిన వారితో కలిసి ఇప్పుడే తాము ప్రధాన ప్రతిపక్షం అన్నట్లు వ్యవహరిస్తున్న బీజేపీ, వెన్నుపోటు పార్టీలోని వెన్నుపోటు దార్ల అండ చూసుకుని కలలు కనడం ఎండమావిలో దాహం తీర్చుకోవడమే! ఏమైనా వైఎస్‌ జగన్‌ తానిచ్చిన నవరత్నాల కార్యక్రమాన్ని సాగిస్తున్నంత వరకు ఆయన రైతు, మహిళా, యువత, దళిత, గిరిజన మైనారిటీలు, కష్టజీవుల ఆకాంక్షలకు అనువుగా పాలన సాగిస్తున్నంతవరకు అవినీతిరహిత పారిశ్రామికాభివృద్ధి వైపుగా, కమీషన్ల కోసం కక్కుర్తి పడకుండా రాష్ట్రాన్ని నిరంతరం సస్యశ్యామలం చేసే ప్రస్తుత దీక్షా, పట్టుదల, కృషి సాగిస్తున్నంతవరకు, వైఎస్సార్‌సీపీకీ, వైఎస్‌ జగన్‌కి ఓటమి ఉండదు. ఇది తథ్యం.

డాక్టర్‌ ఏపీ విఠల్‌ 
వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు
మొబైల్‌ : 98480 69720

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top