
అన్వేషణం: ప్రేమ సొరంగం...
రైలు వేగంగా వెళ్లిపోతున్నప్పుడు హఠాత్తుగా చీకటి కమ్ముకుంటుంది. ఏమయ్యిందా అని కంగారుపడి చూసేలోపు మళ్లీ వెలుగు వచ్చి పరుచుకుంటుంది. ఎందుకలా అయ్యిందా అని చూస్తే అర్థమవుతుంది...
రైలు వేగంగా వెళ్లిపోతున్నప్పుడు హఠాత్తుగా చీకటి కమ్ముకుంటుంది. ఏమయ్యిందా అని కంగారుపడి చూసేలోపు మళ్లీ వెలుగు వచ్చి పరుచుకుంటుంది. ఎందుకలా అయ్యిందా అని చూస్తే అర్థమవుతుంది... రైలు ఓ సొరంగంలోకి వెళ్లి బయటికొచ్చిందని. అయితే ఉక్రెయిన్‌లోని ఓ సొరంగంలోకి వెళ్తే చీకటి కమ్ముకోదు. పచ్చదనం అలముకుంటుంది. కళ్లనిండా ఆహ్లాదం వచ్చి చేరుతుంది. ఆనందంతో మనసు పరవళ్లు తొక్కుతుంది. ఆ అనుభూతి... కేవలం ‘లవ్ టన్నెల్’ వల్ల మాత్రమే దక్కుతుంది!
ఉక్రెయిన్‌లోని క్లెవాన్ ప్రాంతం అంత అభివృద్ధి చెందినదేమీ కాదు. అయినా ఆ ఊరి గురించి అందరికీ తెలుసు. ఎందుకంటే, అక్కడ ‘లవ్ టన్నెల్’ ఉంది. ఏడు కిలోమీటర్ల మేర ఉండే ఆ సొరంగాన్ని చూడ్డానికి వంద కళ్లున్నా చాలవు. ఇరువైపులా ఏపుగా పెరిగిన పచ్చని చెట్లతో ఆ ప్రదేశమంతా పచ్చలైట్ల కాంతి నిండినట్టుగా అనిపిస్తుంది. చెట్ల నుంచి వీచే చల్లని గాలి, ఎండే సోకని కారణంగా ఆహ్లాదంగా ఉండే వాతావరణం అక్కడి నుంచి కదలనివ్వవు. అయితే ఇది మామూలు రైలు టన్నెల్ కాదు. క్లెవెన్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ ఫ్యాక్టరీకి కలపను తరలించేందుకు ఏర్పాటు చేసింది. రోజుకు మూడే మూడు సార్లు గూడ్సు రైలు దీనిగుండా కలపను మోసుకుపోతుంది. మిగిలిన సమయమంతా సందర్శకులు, ముఖ్యంగా ప్రేమికులతో సందడిగా ఉంటుంది.
ఈ సొరంగాన్ని లవ్ టన్నెల్ అని పేరు రావడం గురించి ఓ కథ చెబుతుంటారు స్థానికులు. ఓసారి ప్రేమ దాదాపు విఫలమైపోయే పరిస్థితుల్లో ఉన్న ప్రేమజంట ఇక్కడికి వచ్చిందట. ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నప్పుడు వారి సమస్యకు ఒక అద్భుతమైన పరిష్కారం తట్టిందట. ఆ తర్వాత వారి ప్రేమ సఫలమైందట. అప్పట్నుంచీ ఈ సొరంగంలో ప్రేమికులు ఏం కోరుకున్నా జరుగుతుందనే నమ్మకం ఏర్పడింది. అలాగే దీనికి లవ్ టన్నెల్ అనే పేరు స్థిరపడిపోయింది!
పిల్లులు లేకుంటే ఆ ఊరే లేదు!
ఇంటి చుట్టు పక్కల ఒక్క పిల్లి ఉంటేనే నానా రభసా చేస్తుంది. పాలు తాగేసి, అన్నీ ఒంపేసి, ఇల్లంతా గత్తర చేసి పారేస్తుంది. అలాంటిది వందలాది పిల్లులు ఉంటే? అమ్మో అనిపిస్తోంది కదా! కానీ తైవాన్‌లోని హోటాంగ్ గ్రామస్తులు అలా అనరు. ఎందుకంటే, వారి ఊరికి పేరొచ్చిందే పిల్లుల వల్ల.
హోటాంగ్‌లో ఒకప్పుడు బొగ్గు గనులు బాగా ఉండేవి. వాటి మీద ఆధారపడి ప్రజలు జీవించేవారు. ఉండేకొద్దీ అవి తరిగిపోయాయి. జీవనాధారం కరువై ప్రజలు వలసలు వెళ్లిపోయారు. దాంతో ఊరు ఖాళీ అయిపోయింది. ఆ సమయంలో ఎక్కడి నుంచి వచ్చాయో తెలీదు కానీ, వందలాది పిల్లులు వచ్చి ఆ ఊరిలో చేరాయి. ఓ ఫొటోగ్రాఫర్ ఏదో షూటింగ్ కోసం ఆ ఊరికి వెళ్లినప్పుడు, ఊరినిండా పిల్లులే ఉండటం చూశాడు. అన్ని పిల్లులు ఎలా వచ్చాయో అర్థం కాలేదతడికి. వాటిని ఫొటోలు తీసి నెట్‌లో పెట్టాడు. అవి చూసి కొందరు పనిగట్టుకుని ఆ ఊరికి వెళ్లసాగారు పిల్లుల్ని చూడ్డానికి.
సందర్శకుల తాకిడి పెరిగేసరికి హోటళ్లు వెలిశాయి. దుకాణాలు వచ్చాయి. వాటి యజమానులు ఆ ఊరిలో నివాసముండటం ప్రారంభించారు. ఓ ఎన్జీవో వారు పిల్లులకు అవసరమైన ఆహారాన్ని, మందుల్ని అందిస్తున్నారు. అవి లేకుంటే తమ ఊరే లేదంటారు హోటాంగ్ గ్రామస్తులు! ఊరివారంతా కలసి ఆ పిల్లులను సంరక్షిస్తూ ఉంటారు.