వేనవేల దర్శన ఫలాల  వాహన సేవలు

Special story to srivari sevalu - Sakshi

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలకు మూలపురుషుడు బ్రహ్మదేవుడు. దేవదేవుని బ్రçహ్మోత్సవాలు ఈనాటివి కాదు... యుగయుగాల నుంచి ఆచరిస్తున్నవే. ఆ ఉత్సవాల గురించి ‘వరాహపురాణం’ మొదటి భాగంలో చక్కగా వివరించారు.  కృతయుగ ప్రారంభంలో తిరుమల క్షేత్రంలో రాక్షసుల అరాచకాలను తట్టుకోలేక బ్రహ్మాది దేవతలు శ్రీమహావిష్ణువును శరణు కోరారు. ముక్కోటిదేవతల మొర ఆలకించి శ్రీమహావిష్ణువు తన పంచాయుధాలలో ఒకటైన ‘సుదర్శన చక్రాన్ని పంపించారు. వేయి చేతులు కలిగిన మానవాకృతిలో సుదర్శన చక్రం రాక్షస సంహారం చేస్తుంది. శత్రుపీడ వదలడంతో ఆనందోత్సాహంతో స్వామివారి జన్మనక్షత్రమైన శ్రవణ నక్షత్రం నాడు బ్రహ్మదేవుడు స్వయంగా శ్రీమహావిష్ణువుకి తొమ్మిది రోజులపాటు ఉత్సవాలు జరిపించాడు. బ్రహ్మ జరిపించిన ఉత్సవాలు కావడంతో అవి బ్రహ్మోత్సవాలుగా వాసికెక్కాయి. ఈ ఉత్సవాల అనంతరం ముక్కోటి దేవతల కోరికను మన్నించి భూలోకంలో దుష్టశిక్షణ, శిష్టరక్షణకు మహావిష్ణువు స్వయంభువుగా తిరుమలలో వెలిశారు.దీంతో సమాధిస్థితిలో ఉండే యోగులకు సైతం కనిపించని స్వామివారు వేంకటాద్రిపై ‘శ్రీనివాసుని’గా నిలచి అందరికీ తన దర్శనభాగ్యాన్ని కల్పించారు స్వామి.వేంకటాద్రిపై ఉత్సవాలను తిలకించేందుకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే సమస్త భక్తులకు కావలసిన వసతి, ఆహారపానీయాది సౌకర్యాలను కల్పించే బాధ్యతను దేవతా వాస్తుశిల్పిౖయెన విశ్వకర్మకు అప్పగించాడు. విశ్వకర్మ స్వామివారికి దివ్య విమానాన్ని ఆలయం పైభాగంలో నిర్మించాడు.

∙బ్రçహ్మోత్సవ సమయంలో బ్రహ్మదేవుడు స్వామివారికి రకరకాలైన రుచులలో ఆహార ‡పదార్థాలను నివేదిస్తూ స్వామివారిని అశ్వం, ఏనుగు, శేషుడు, గరుడుడు... ఇలా వివిధ వాహనాలలో ఊరేగిస్తూ, ఇరుపక్కల కళాకారులతో సంగీతం, వేదఘోష, నాట్యాలు, మేలు జాతి గుర్రాలు, ఏనుగులు, ఎద్దులు ముందు, వెనుక, పక్కల నడుస్తుండగా స్వామివారు తేజోవంతంగా తమ దివ్య భవ్య దర్శనాన్ని ప్రసాదిస్తుంటారు. ఈ బ్రహ్మోత్సవాలలో ప్రత్యేకంగా బ్రహ్మదేవుడు యాగశాలను నిర్మించి యజ్ఞాలను కూడా నిర్వహించాడు. ఈ ఉత్సవాలలో ఎనిమిదవరోజు వేంకటేశ్వర స్వామి రత్నఖచిత మణిమయ భూషిత అలంకారాదులతో, శ్రీదేవి, భూదేవి సమేతుడై సకల ఆభరణ ధారుడై నాలుగు పార్శా్వలు కలిగిన దారు (కొయ్య) రథంపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్త జన సంద్రానికి దర్శన భాగ్యాన్ని కల్గించి తిరిగి దేవాలయంలోని స్వర్ణమయమైన ఆస్థాన మండపానికి వేంచేస్తాడు. ఆస్థాన మండపంలో స్వామివారు బ్రహ్మను పిలిచి భక్తితో, అత్యంత ప్రేమానురాగాలతో, వినమ్రతతో నిర్వహించిన ఈ ఉత్సవాలు మమ్ములను మంత్రముగ్ధులను చేశాయని, ఎవరైతే ఈ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం కన్యామాసంలో నిర్వహిస్తారో వారు ప్రాపంచిక ఆనందాన్ని పొంది బ్రహ్మలోక సాయుజ్యాన్ని పొందుతారని సెలవిచ్చారు. వేంకటాద్రికి వేంచేసి ఎవరైతే ఈ మహోత్సవాలను కనులవిందుగా తిలకిస్తారో వారికి సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని పలికారు. ఉత్సవాలను తిలకించేందుకు విచ్చేసే భక్తజనావళికి రాజులు (పరిపాలకులు) సకల సౌకర్యాలను కల్పిసారని సెలవిచ్చారు. భక్తులకు ఎవరైతే అన్నప్రసాదాలను అందిస్తారో వారికి సంతానప్రాప్తి కలిగి స్వర్గప్రాప్తి పొంది పరమపదాన్ని చేరుకొంటారని చెప్పారు. ఎవరైతే బ్రçహ్మోత్సవాలకు వచ్చే మూగ, చెవిటి, కనుచూపులేని భక్తులకు సహాయసహకారాలను అందిస్తారో వారికి నా కరుణాకటాక్షాలు కలకాలం ఉంటాయని, ఎవరైతే నా పర్వత సానువుల్లో నివసిస్తారో వారికి వైకుంఠప్రాప్తి కలుగుతుందని ప్రబోధించారు. అలాగే ఎవరైతే ఈ ఏడుకొండలమీద దానధర్మాలను నిర్వహిస్తారో వారు ముల్లోకాలలో కీర్తి పొందటమేకాక, దివ్యత్వం కలిగి స్వర్గం ప్రాప్తిస్తుందని బ్రహ్మాదిదేవతలకు తెలియజేశారు. అనంతరం ఆనందనిలయంలోనికి శ్రీదేవి, భూదేవి సమేతంగా వేంచేశారు. 

∙ఉత్సవాలలో శ్రవణా నక్షత్రయుక్తమైన  తొమ్మిదోరోజు ఉదయం శ్రీభూదేవి సమేత శ్రీమలయప్పస్వామి వారిని శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్‌తో కూడా శ్రీవరాహస్వామి వారి ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేయించి, ‘పంచామృత స్నపన తిరుమంజనం’ నిర్వహిస్తారు.తర్వాత సుదర్శన చక్రాన్ని శ్రీస్వామి పుష్కరిణిలో ముంచి పవిత్ర స్నానం చేయిస్తారు. శ్రీ సుదర్శన చక్రస్నానం వల్ల అత్యంత పవిత్రతనొందిన శ్రీస్వామి పుష్కరిణీ జలాలలో అదే సమయంలో లక్షలమంది భక్తులు కూడా శ్రద్ధాభక్తులతో శిరస్నానం చేస్తారు. ఆ సమయంలో శ్రీవారి ద్విమూర్తుల శక్తీ, శ్రీవారి పంచాయుధాల్లో ప్రముఖమైన శ్రీసుదర్శనాయుధ శక్తి పుష్కరిణీ జలంలో సూక్ష్మరూపంతో మిళితమై ఉంటాయి. కనుక అవభృత స్నానమనేది తెలిసీ తెలియకచేసే దోషపరిహారం కోసమై చేసే విశిష్ట ప్రక్రియ. అవభృత కార్యక్రమానంతరం యావత్‌ దేవతాగణం సుగంధ పరిమళాలు వెదజల్లే వివిధరకాల పుష్పాలతో, మంత్రపఠనం గావిస్తూ భక్తిశ్రద్ధలతో పుష్పయాగాన్ని నిర్వహిస్తారు. ఈ విధంగా బ్రహ్మ చేసిన మహోత్సవాలకు మంత్రముగ్ధుడైన శ్రీవారు బ్రహ్మతో–
‘‘బ్రహ్మా! నేను నీకు ఏవిధంగా ప్రతిఫలాన్ని ఇవ్వగలను! నేను నీకు ఒకటే చెల్లించగలను. అది... ‘‘నేనే నీవు నీవే నేను’’ అని పలుకగా, బ్రహ్మ మహానందాన్ని పొందినవాడై ‘‘స్వామీ మీ కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మాపై, మానవాళిపై ఉండాలంటే మీరు ఈ విమాన గోపురంలో శాశ్వతంగా ఉండాలి’’ అని కోరగా శ్రీమన్నారాయణుడు ‘తథాస్తు’ అని పలికాడు. బ్రహ్మ సత్యలోకానికి వెళ్లి, తన నియత కార్యక్రమాలను నిర్వహించుకునేందుకు అనుమతించాడు.   కలియుగ ప్రత్యక్షదైవంగా పేర్కొనే శ్రీనివాసుడు యుగయుగాలకు భగవంతుడు. వారికి బ్రçహ్మోత్సవ క్రతువును నిర్వహించిన యజ్ఞకర్త సాక్షాత్తూ చతుర్ముఖ బ్రహ్మయే. అందుకే స్వామికి జరిగే బ్రçహ్మోత్సవ సమయంలో వివిధ వాహనాలకు ముందుగా బ్రహ్మరథం తిరగడం సాక్షాత్తు... విధాత, సృష్టికర్త అయిన బ్రహ్మకు సంకేతమే.
– పోగూరి చంద్రబాబు  తిరుపతి 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top