లగేజ్‌ ట్యాగ్‌

Special Story In Funday Magazine In Sakshi

కొత్త కథలోళ్లు

ఇండిగో కౌంటర్‌ మీద ఉన్న అమ్మాయి లగేజ్‌ ట్యాగ్‌ ఇవ్వలేదు రాజీవకు.
‘అక్కర్లేదు మామ్‌. మీ హ్యాండ్‌బ్యాగ్‌ను అది లేకుండానే తీసుకెళ్లవచ్చు’ అంది– చెక్‌ ఇన్‌ బ్యాగ్‌ను కన్వేయర్‌ బెల్ట్‌ మీదకు దొర్లిస్తూ. 
బోర్డింగ్‌ పాస్‌ తీసుకొని సెక్యూరిటీ వైపు నడిచింది రాజీవ.
ఇంతమునుపు ఎయిర్‌పోర్ట్‌కు వస్తే ఫ్లయిట్‌లో తీసుకెళ్లాల్సిన బ్యాగ్‌లకు లగేజ్‌ ట్యాగ్‌ ఇచ్చేవారు. అది ఉంటేనే ఫ్లయిట్‌ లోపలికి అనుమతి ఉండేది. ఇప్పుడు ఆ సిస్టమ్‌ లేదని ఆమెకు అర్థమయ్యింది.
చాలా ఏళ్లయ్యింది ఆమె విమాన ప్రయాణం చేసి. ఒంటరిగా ప్రయాణం చేసి కూడా.
హ్యాండ్‌బ్యాగ్‌లోని డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డ్, ఆధార్‌ కార్డ్, ఓటర్‌ కార్డ్, ఎంప్లాయి కార్డ్‌ అన్నీ ఒకసారి చెక్‌ చేసుకుంది రాజీవ. మామూలుగా అయితే ఇవన్నీ చెక్‌ చేసుకోవాల్సిన అవసరం ఉండదామెకు. భర్తో, కొడుకో వాటిని తమ దగ్గర పెట్టుకుని ఇటు నడువూ అటు నడువూ అంటూ తీసుకెళ్లి తీసుకొచ్చేస్తుంటారు. ఇవాళ తనే సొంతంగా చేసుకోవాలి.

సెక్యూరిటీ చెక్‌ అయ్యాక, ఫ్లయిట్‌కు టైమ్‌ చూసుకుంటే దాదాపు గంటన్నర ఉంది. కొంచెం ఆకలిగా కూడా అనిపిస్తూ ఉంది. ఎర్లీమార్నింగ్‌ ఏడున్నరకు ఫ్లయిట్‌ అంటే అయిదున్నరకు ఎయిర్‌పోర్ట్‌లో ఉండాలి. దాని బదులు ట్రైనే హాయి. కాని సెమినార్‌ కండక్ట్‌ చేస్తున్నవారు ఫ్లయిట్‌లోనే రమ్మని చెప్పారు. ఫ్లయిటే కరెక్ట్‌ కూడా. హైదరాబాద్‌ నుంచి కేరళకు ట్రైన్‌లో ఎప్పటికి చేరాలి.

‘నేను ఎవరినైనా తోడు తెచ్చుకుంటే మీకు అభ్యంతరమా?’ అని నిర్వాహకులను అడిగింది రాజీవ. భర్తనో, కొడుకునో పిలిస్తే కాదనరు. వాళ్లు లేకుండా ఎక్కడికీ కదలదు ఆమె.
‘అభ్యంతరం లేదు’ అన్నారు వాళ్లు.

ఇవాళ ప్రయాణం అంటే మూడు రోజుల క్రితం భర్తను అడిగిందామె– ‘టికెట్లు బుక్‌ చేశారా మనిద్దరికీ’ అని. 
అతను చాలా క్యాజువల్‌గా ‘నాకు కుదిరేలా లేదు బుజ్జీ’ అని పేపర్‌లో మునిగిపోయాడు.
‘అంటే?’
‘నేను లేకపోతే నువ్వూ వెళ్లవుగా. అందుకని చేయలేదు’
చేతి వేళ్ల నుంచి పాదాల వరకు ఏదో చురుకు పాకినట్టయ్యింది.
‘వాణ్ణి తీసుకెళ్లేదాన్నిగా’
‘వాడికేదో యూత్‌ ఫెస్టివల్‌ ఉందట కాలేజీలో’ అన్నాడు.
‘మీరూ మీరూ మాట్లాడుకున్నారు. నాకు మాట మాత్రం చెప్పలేదు’
‘ఏముంది చెప్పడానికి? టిఫిన్‌ రెడీనా?’ లేచి డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు నడిచాడు.

కాలేజీలో చేసేది కాంట్రాక్ట్‌ ఉద్యోగమే కావచ్చు. ఎన్నాళ్లు చేసినా పద్దెనిమిది, ఇరవై వేల జీతమే వస్తుండవచ్చు. కాని దక్షిణాది భాషా సాహిత్యాల మధ్య ఉండే సామీప్యత, తులనాత్మకత పట్ల రాజీవకు అభిరుచి, లోతైన ప్రవేశం ఉన్నాయి. చాలా జర్నల్స్‌కు రాస్తూ ఉంటుంది. కాని ఇలా సెమినార్‌లకు పిలిచేవాళ్లు తక్కువ. వచ్చిన ఒకటి రెండు అవకాశాలు ఎవరో ఒకరి సెక్యూరిటీలో వెళ్లి రావాలి. వాళ్లకు కుదరకపోతే ఆ అవకాశం కూడా పోయినట్టే.

ఆ రోజంతా మనసు మనసులో లేదు. కాలేజ్‌లో ఒక లెక్చరర్‌కి ఇలా టికెట్లు గట్రా బుక్‌ చేయడం బాగా తెలుసు.
‘అయ్యో మేడమ్‌. డేట్స్‌ చెప్పండి. టూ మినిట్స్‌లో బుక్‌ చేస్తాను’ అని చేసి ఇచ్చాడు.
ఆ రాత్రి చెప్పింది ఇంట్లో ‘నేను ఒక్కదాన్నే వెళుతున్నాను’ అని.
‘ఎలా వెళ్తావ్‌?’
‘ఒక్కత్తే ఎలా వెళ్లి రాగలవ్‌?’
ఇద్దరూ ఒకే ప్రశ్నను అటు ఇటుగా వేశారు.

మౌనంగా కప్‌బోర్డ్‌లో ఉన్న బ్యాగ్‌ను బయటకు దించే పనిలో మునిగిపోయింది. తెల్లవారుజాము నాలుగూ నాలుగుంపావుకు క్యాబ్‌ ఎక్కుతుంటే భయం వేసింది. భర్త నిద్ర కళ్లతోనే కిందకు దిగి, క్యాబ్‌ నంబర్‌ను సెల్‌లో ఫొటో తీసుకొని, మొక్కుబడిగా జాగ్రత్త అని చెప్పి, క్యాబ్‌ కదలే లోపే లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాడు.
ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో హ్యాండ్‌ బ్యాగ్‌ భుజాన తగిలించుకుని తిరుగుతూ ఉంది. 

ఒకచోట చిట్టి ఇడ్లీల స్టాల్‌ ఉంది. పాలరంగులో ఉన్న, వేడివేడి ఇడ్లీలు అమ్ముతున్నారు. ‘ఒన్‌ ప్లేట్‌ ప్లీజ్‌’ అంది రాజీవ. టోకెన్‌ తీసుకుంటూ ఉంటే ఆమెకు ఏదోలా అనిపించింది.
ప్రయాణాల్లో ఇలా ఒన్‌ ప్లేట్‌ ఎప్పుడూ తీసుకోలేదు. ఆ టూ, త్రీ ప్లేట్ల హక్కుదారులు లేకుండా కేవలం ఒన్‌ ప్లేట్‌ తీసుకోవడం కొత్తగా కూడా అనిపించింది.
ఇడ్లీ, కారప్పొడి, చట్నీ, పొగలు గక్కే సాంబారు... ఒక్కతే తను.

అందరినీ చూస్తూ తింటూ ఉంది. చుట్టుపక్కల అనేకమంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఒంటరి మగ ప్రయాణికులు చాలా మందే ఉన్నారు. ఆడవాళ్లు మాత్రం పిల్లలతోటో, భర్తలతోటో, బంధువులతోటో ఏదో ఒక ముడితో ఉన్నారు. తనలా ఒంటరివాళ్లు చాలా తక్కువ.

ఎదురుగా వున్న గోడకేసి చూసింది. వెలిగిపోయే రంగులతో  రైన్‌బో అనే అక్షరాలతో ఏదో అడ్వర్‌టైజ్‌మెంట్‌. గతుక్కుమంది. అది ఒక కండోమ్‌ అడ్వర్టయిజ్‌మెంట్‌.  కొంచెం దూరంగా కూర్చున్న బిజినెస్‌ ఎగ్జెక్యూటివ్‌ విచిత్రంగా చూడబోయి తల దించుకుని కప్పులో కాఫీ వెతుక్కున్నాడు. ఒక్క క్షణం ఆగి మళ్లీ యాడ్‌ వైపు చూసింది. ఏం..కండోమ్‌ యాడ్‌ చూడకూడదా? అనుకుంది. అది కూడా ఒక హెల్త్‌ ప్రాడక్ట్‌. ప్రివెంటివ్‌ డివైజ్‌. పెళ్లయిన కొత్తలో పిల్లలు అప్పుడే వద్దనుకుని భర్తను కండోమ్‌ వాడమని సిగ్గు విడిచి అడిగింది. ‘ఛీఛీ నేను వాడను’ అన్నాడతను. ‘నువ్వే పిల్స్‌వాడు’ అని ఫోర్స్‌ చేశాడు. భర్త ఆర్డర్‌. పిల్స్‌ తినడం భార్య వంతు. భార్య బాధ్యత. భార్య ధర్మం. ఈమారు మరీ తీక్షణంగా ఆ యాడ్‌ను చూసింది. గమనిస్తున్న బిజినెస్‌ ఎగ్జిక్యూటివ్‌ ఏముంది అందులో అలా చూస్తోంది అని చూసి లేచి వెళ్లిపోయాడు.

ప్లేట్‌ ఖాళీ అయ్యింది. కపుచ్చినో గటగటా తాగేసింది. బ్యాగ్‌ను డ్రాగ్‌ చేస్కుంటూ గేట్‌ నంబర్‌ ఇరవై మూడు ఎక్కడా అని వెతుక్కుటుంటే షాపింగ్‌ చేద్దామన్న ఆలోచన వచ్చింది. వెళ్ళేది కొచ్చికి కనుక గాగుల్స్‌ తీస్కోవడం కరెక్ట్‌ అనుకుంది. ఇంట్లో రెండు జతల గాగుల్స్‌ ఉన్నాయి. ఒకటి భర్తది. ఒకటి పుత్రరత్నానిది. ఆడవాళ్లకు కూడా కళ్లు ఉంటాయి...వాళ్లకూ గాగుల్స్‌ పెట్టుకోవాలని ఉంటుంది...అని వాళ్లకు ఉండదు. అప్పటికీ ఒకసారి అడిగింది– ‘కాలేజీకి వెళ్లేటప్పుడు కళ్ల మీద ఎండ పడకుండా కావాలని’. 

‘నువ్వేమైనా త్రిషావా?’ అని నవ్వేశాడు భర్త.
‘నీకు బాగుండవులే మదర్‌ ఇండియా’ అన్నాడు కొడుకు. నిలబడి, ఒక్క క్షణం కూడా బేరం చేయకుండా రెండు వేల ఐదువందలు పెట్టి గాగుల్స్‌ కొంది రాజీవ. ఆ తర్వాత వాటిని పెట్టుకుని చాలాసేపు చూసుకుంది. దారిన ఎవరో టీనేజీ అమ్మాయి వెళుతుంటే రిక్వెస్ట్‌ చేసి యాంబియెన్స్‌ అంతా వచ్చేలా ఒక ఫొటో దిగింది. చలో.. ఇదీ మజా అనుకుని గేట్‌ నెంబర్‌ 26 దగ్గర తీరుబడిగా సెటిల్‌ అయ్యింది.

ఆరేడు నెలలుగా కాలేజీలో బాగా వొత్తిడిగా ఉంది రాజీవకు. పగలూ రాత్రీ తేడా లేకుండా ఊపిరి సలపని పనులు మీద పడ్డాయి. ఇన్సె్పక్షన్‌ అంటూ రిపోర్టులు అంటూ మేనేజ్‌మెంట్‌ పీక్కు తినిందనే చెప్పాలి. ఒళ్లు హూనం అయ్యింది. ఎప్పుడైనా నలతగా అనిపించి ఒక గంట పడుకుంటే ‘మానేయ్‌మని అన్నాను కదా’ అంటాడు భర్త. 

ఉద్యోగం మానేయగలదా తను? మానేస్తే పది, ఇరవై రూపాయలకు కూడా భర్తకు లెక్క చెప్పాలి. జాకెట్‌ కుట్టించుకోవాలన్నా ముందూ వెనుకా ఆడాలి. కొడుక్కు డబ్బులివ్వడానికి వచ్చే చేతులు భార్యకు ఇవ్వడానికి రావు. అమ్మలక్కలతో కాలక్షేపం కబుర్లు చెప్తే బంగారం, నగలు అని విసిగిస్తుందని పుస్తకాలు చదువుకుంటుంటే ఊరుకున్నాడు భర్త. రెండుమూడు సార్లు పెద్ద పత్రికలలో రాజీవ పేరు వచ్చింది. అప్పుడు మాత్రం ‘ఇది నీకు అవసరమా?’ అన్నాడు.

‘చదువుకో. రాయకు’ అని కూడా అన్నాడు. ఆమె రాయడం మానలేదు కానీ పెన్‌నేమ్‌తో రాస్తోంది.  రాత్రి గదిలో జరిగిన రాద్ధాంతం గుర్తుకొచ్చింది.
‘నేను రాకపోతే నువ్వు వెళ్లవనుకున్నాను. ఇప్పుడు ఏడుస్తూ కూచుంటావని సరేనంటున్నాను’
‘అది కాదు.. మాట పోతుంది కదా. వెళ్లకపోతే నన్ను మళ్లీ పిలువరు’
‘అసలు ఇదంతా ఏమిటి? నేను నా పనులు చూసుకోవాలా... నువ్వు ఎక్కడ తిరుగుతావో వాటికి అరేంజ్‌మెంట్స్‌ ఎలా చేయాలో అనుకుంటూ టెన్షన్‌ పడాలా?’
‘ఏమిటి అలా అంటారు? మీకు నా మీద ప్రేమ లేదా?’
‘ఉంది. చాలా ఉంది. ప్రమాణం చేసి చెబుతున్నాను ఉంది. నేను ఇంటికొచ్చినప్పుడు ఇంట్లో కనిపిస్తూ, నేను ఇంట్లో లేనప్పుడు ఇంటిని చక్కదిద్దుకుంటూ, నేను ఇల్లు దాటిస్తే దాటేలా ఉంటే చాలు అనుకునేంత ప్రేమ ఉంది. ఇలా నేను అనుకుంటున్నది నీ కోసమే. నీ సుఖం కోసమే. నీకు అర్థం కాదు’...
తెలియకుండానే కళ్లల్లో నీళ్లు నిండాయి.
‘ఊరుకో. నాకు నిజంగా కుదరకే రావడం లేదు. లేకుంటే తీసుకెళ్లుండేవాణ్ణి. పోనీ ఈసారికి ఒక్కదానివే వెళ్లు. కాని వీడియోకాల్స్‌ చేస్తుంటాను. నువ్వు నాకు కనపడుతుండాలి. సరేనా?’
‘ఊ’...
ఎందుకైనా మంచిదని పక్క మీద అతడు సంతోషపడేలా వ్యవహరించింది.
అప్పటికిగాని శాంతించలేదు.
అనౌన్స్‌మెంట్‌ వినిపించింది. ఒక్కొక్కరుగా ఫ్లయిట్‌లోకి ఎక్కుతుంటే సీట్‌ నంబర్‌ సరిగ్గా చెక్‌ చేసుకోకుండానే కూచుంది.
‘ఎక్స్‌క్యూజ్‌మీ. మీరు నా సీట్‌లో కూచున్నారు’ అంటున్నాడతను చిరునవ్వుతో.
‘ఓ.. సారీ’ సీటు మార్చుకుంది. 
అరసెంటీ మీటర్‌ కన్నా పొడుగు లేని జుత్తు, ఆరడుగుల ఎత్తు, పలచని చెంపలు, టాన్‌ అయినట్టున్న స్కిన్‌... 
ఏదో గెస్‌ క్వశ్చన్‌ లా  ‘మీరు ఆర్మీలోగానీ ఎయిర్‌ ఫోర్స్‌లోగానీ చేస్తారా’ అడిగిందామె. 
అతడు ఆశ్చర్యంతో ‘అవును. అయితే మీరన్న రెంటిలోనూ కాదు.. నేవీలో. నా పేరు బాబీ’ అన్నాడు. కొంచెం సిగ్గుపడ్డాడు కూడా. 
‘అది అమ్మాయి పేరు కదా’ నవ్వింది.
‘మా పేరెంట్స్‌కి ఆ సినిమా బాగా నచ్చి నాకు పెట్టేశారు’ అంటూ నవ్వేశాడు. 
సంభాషణ అంతా ఇంగ్లీష్‌లోనే జరుగుతోంది. అతడు పదాలు పలికే తీరులో మళయాళీ అని అర్థం అవుతూనే వుంది. 
‘చిన్నప్పుడు మిలట్రీవాళ్లను చూడటం థ్రిల్లింగ్‌గా ఉండేది. మా ఊరి మీదుగా అప్పుడప్పుడు మిలట్రీ వెహికల్స్‌ వరుసగా వెళుతుంటే నోరు తెరుచుకుని చూసేవాళ్లం. ఇలా యూనిఫామ్‌ లేని మిలట్రీ మనిషిని చూడటం బాగుంది’ అంది.
అతడు తలాడించి అన్నాడు.
‘యూనిఫామ్‌ లేని, డ్యూటీ లేని, సుపీరియర్‌ల కమాండ్‌లు లేని ఒక మనిషి నాలో ఉంటాడు కదా. ఆ మనిషిని ఊపిరి తిప్పుకోనివ్వడానికే ఇలా అవకాశం రాగానే ఊరికి వచ్చేస్తుంటాను. నాకు నేను మిగిలే ఈ నాలుగు రోజులే మళ్లీ నాకు ఊపిరిపోస్తూ ఉంటాయి’ 
‘ఇన్‌ఫాక్ట్‌.. ప్రతి ఒక్కరూ తమ లోపలి ఒక మనిషిని బతికించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి’ అన్నాడు మళ్లీ.
సాలోచనగా తల ఊపింది.
ప్లేన్‌ లాండ్‌ అయ్యింది. 
‘కొచ్చి ఏర్‌పోర్ట్‌లో రెస్ట్‌రూమ్స్‌ చాలా బాగుంటాయి. హావ్‌ ఏ ట్రయల్‌’ రిసీవ్‌ చేసుకోవడానికి వచ్చిన ఆర్గనైజర్‌ కమ్‌ స్నేహితురాలు బయటి నుంచి మెసేజ్‌ పెట్టింది.
‘అటు నుంచే స్ట్రయిట్‌గా ముందుకి వచ్చేస్తే డిపార్చర్‌ అన్న బోర్డ్‌ కనిపిస్తుంది. ఆ కారిడార్‌ చివరికి వచ్చెయ్యి. అక్కడే వున్నాను’ అని కూడా మెసేజ్‌. ఫ్రెష్‌ అయ్యి తల దువ్వుకుంటూ ఉంటే మొక్కల సంగతి గుర్తుకు వచ్చింది. పని మనిషిని రావద్దని ముందే చెప్పేసింది. వీళ్లిద్దరూ వాటికి నీళ్లు పోయరు. పక్క ఫ్లాట్‌లో ఉండే ఆమెకు కాల్‌ చేసింది.
‘సునందా.. కొంచెం బయట ఉన్న మొక్కలకు నీళ్లు పోయవా?’
‘అయ్యో. పోస్తానులే. మీ ఆయనా, కొడుకు వెళ్లిపోయాక పోస్తాను’
‘అదేమిటి? వాళ్లు బయటకు వెళ్లలేదా?’ టైమ్‌ చూసుకుంది. తొమ్మిదిన్నర అవుతోంది.
కొడుకు ఎనిమిదికంతా వెళ్లిపోతాడు. భర్త తొమ్మిదీ తొమ్మిందింబావుకే.
‘అసలు ఇంకా బ్రష్షులే చేసినట్టు లేరు. ఇద్దరూ కాఫీ కప్పులు పట్టుకొని తలుపు తెరిచి పెట్టి పెద్ద సౌండ్‌తో టీవీ చూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ కాబోలు’ మౌనంగా ఫోన్‌ కట్‌ చేసింది.బయట కేరళ. ఆకుపచ్చగా. చినుకులు చినుకులుగా. చేతులు సాచి పిలుస్తున్నట్టుగా. ఎగ్జిట్‌లో నుంచి బయటకు వస్తుంటే వుత్సాహంగా చేతులు ఊపుతున్న స్నేహితురాలు.
ఒక్క నిమిషం ఆగి భర్తకు మెసేజ్‌ చేసింది.

‘కేరళ వెదర్‌ అద్భుతంగా ఉంది. వాన చాలా అందంగా ఉంది. మీరు లేరన్న వెలితి డిస్ట్రబ్‌ చేస్తోంది. మీ కోసం ఈ కేరళ అంతటినీ నా కళ్లల్లో అనుక్షణం నింపుకోవాలనుకుంటున్నాను. మీ ఫోన్‌ వస్తే మీరు గుర్తుకొచ్చి డిస్ట్రబ్‌ అవుతాను. ఫోన్‌ ఆఫ్‌ చేసేస్తున్నాను. వచ్చాక ప్రతిక్షణం మీ సన్నిధిలో ఉండి ఆ విశేషాలు చెబుతాను. బై’ ఫోన్‌ ఆఫ్‌ చేసింది. మైండ్‌లో ముడిపడి ఊగులాడుతున్న లగేజ్‌ట్యాగ్‌ను కత్తిరించి పడేసినట్టయ్యింది. ఈ రెండు రోజులు ఆమెవి. అచ్చంగా ఆమెవే.
- జయశ్రీ నాయుడు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top