డబ్బు మనిషి 

Seen is yours title is ours - Sakshi

సీన్‌ మాది – టైటిల్‌ మీది

ఒక క్లాసిక్‌ బ్లాక్‌ అండ్‌ వైట్‌ తెలుగు సినిమాలోని కొన్ని సన్నివేశాలివి. ఈ రోజుకీ తెలుగులో బెస్ట్‌ అనే జాబితాలో ఈ సినిమాకు చోటు ఉంటుంది. ఈ సినిమా పేరేంటో చెప్పుకోండి చూద్దాం.... 

చంగయ్య ఆ ఊర్లో పెద్ద షావుకారు. పొదుపుగా పైసా పైసా కూడబెట్టుకునే అలవాటున్న మనిషి. అతనికి తన పక్కింట్లోనే ఉండే కోడలు సుబ్బులంటే బాగా ఇష్టం. బస్తీలో ఉండి చదువుకునే తన కొడుకు సత్యానికి సుబ్బులునిచ్చి పెళ్లి చేస్తే ఇంక ఈ జీవితానికి అదే చాలు అన్నట్టుగా ఉంటాడు. ఇతరుల విషయాల్లో ఏమో గానీ, కోడలికి మాత్రం సందర్భం లేకున్నా చంగయ్య  నగలు చేయిస్తాడు. కొత్త బట్టలు కుట్టిస్తాడు. సుబ్బులు, సత్యానికి కూడా ఒకరంటే ఒకరికి అంతే ఇష్టం. చాలాకాలంపాటు బస్తీలో పెద్ద చదువులు చదువుకున్న సత్యం తిరిగొచ్చాడు. సుబ్బులు ఆనందానికి అవధుల్లేవు. బావ ఇంట్లోకి అడుగు పెట్టినప్పట్నుంచీ అతణ్ని తనివితీరా చూసుకుంటోంది. ‘‘ఏమంటున్నాడే మీ మావ? నాకోసం సంపాదించినా నీ చేతికే తాళాలిచ్చి పోతాడులే!’’ అన్నాడు సత్యం, సుబ్బులును ఆటపట్టిస్తూ. ‘‘మా సుబ్బులు తాళాలు ఏం చేసుకుంటుంది సత్యం! దానికిస్తే నీకే ఇచ్చేస్తుందిలే.’’ అంది సుబ్బులు వదిన నవ్వుతూ. 

‘‘అరే! ఎందుకురా ఈ తగాథా. మీకెవ్వరికీ అక్కరలేకుంటే నాకు పడేద్దువులే తాళాలు..’’ అన్నాడు సుబ్బులు అన్న గట్టిగా నవ్వుతూ. అందరూ మాట్లాడుతున్నారు కానీ, అక్కడ సుబ్బులు, సత్యం మాత్రమే మాట్లాడుకుంటున్నారు. రోజులు గడుస్తున్నాయి. సత్యం తిరిగొచ్చాక సుబ్బులు జీవితమంతా కొత్తగా ఉంది. సత్యాన్ని ఆట పట్టించనిదే ఆమె రోజు గడవడం లేదు.వీరి ఆటలు ఇలా ఉంటే, ఊర్లో చంగయ్య తండ్రి కట్టించిన ఒక ధర్మసత్రం ఎవరికి చెందుతునే గొడవ జరుగుతోంది. ఊరికోసం కట్టించినది అది. చంగయ్య మాత్రం దాని సర్వహక్కులూ తనవేనని చెప్పుకున్నాడు. గొడవ పెద్దదైంది. పోలీసుల వరకూ వెళ్లింది. సుబ్బులు తండ్రి రామయ్యను సాక్ష్యం చెప్పమన్నారు. సొంత బావే కదా తనకు అనుకూలంగానే సాక్ష్యం చెబుతాడనుకున్నాడు చంగయ్య. ‘‘చెప్పు బావా! సందేహిస్తావెందుకు? దీంట్లో నీకు తెలియనిది ఏముంది!’’ అన్నాడు చంగయ్య, పోలీసుల ముందు మౌనంగా నిలబడ్డ రామయ్యను కదిలిస్తూ. ‘‘ఇది ధర్మసత్రమేనండీ. చంగయ్య గారు దీనికి ధర్మకర్త మాత్రమే. దీన్ని విక్రయించడానికి కానీ, అద్దెకు ఇచ్చుకోవడానికి కానీ ఆయనకు ఎట్టి హక్కులూ లేవు.’’ అన్నాడు రామయ్య శూన్యంలోకి చూస్తూ. రామయ్య తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతాడని ఊహించని చంగయ్య, ఇంటికి వెళ్లీ వెళ్లగానే కోపంతో అనాల్సిన మాటలన్నీ అన్నాడు. రెండు కుటుంబాల మధ్య దూరం. కొన్నాళ్లు ఊర్లోనే ఉండాలనుకున్న సత్యం, చంగయ్యతో గొడవ పడి ఇంట్లోంచి బయటికొచ్చాడు. రామయ్యను కలిసి అట్నుంచటే బస్తీకి వెళ్లిపోయాడు. 

చంగయ్య సుబ్బులుకు ఎంతో ఇష్టంగా ఇచ్చిన నగలన్నీ వెనక్కి వచ్చేశాయి. రోజులు గడుస్తున్నాయి. సత్యం నుంచి ఉత్తరాలు రామయ్య ఇంటికే వస్తున్నాయి తప్ప చంగయ్యకు రావడం లేదు. ‘‘బాబుగారి ఎర్రిగానీ, చినబాబు ఎప్పుడో ఆళ్లల్లో చేరిపోయినాడు.’’ అన్నాడు చంగయ్య ఇంట్లో పని చేసే వ్యక్తి, రామయ్య ఇంటికి ఉత్తరం వచ్చిన వార్తను మోసుకొస్తూ. చంగయ్యకు కోపం పెరిగింది. ‘‘రామయ్య మనకేదో బాకీ ఉన్నట్టున్నాడు. కొంచెం చూసి సర్దమని చెప్పు..’’ అన్నాడు తన మనిషిని పురమాయిస్తూ. ఇంట్లో నగలు తాకట్టు పెట్టినా డబ్బు సరిపడలేదు. పొలం కూడా తాకట్టు పెట్టి చంగయ్యకు తిరిగివ్వాల్సినదంతా ఇచ్చేశాడు రామయ్య. అయినా చంగయ్యకు రామయ్య మీద కోపం ఇంకా తగ్గలేదు. రామయ్య పంటను నాశనం చేస్తే అప్పులు తీర్చలేక చస్తాడనుకున్నాడు. అదీ కుదరకపోతే తానే స్వయంగా దొంగతనం కేసులో రామయ్య కొడుకును జైల్లోకి తోయాలనుకున్నాడు చంగయ్య. అనుకున్నట్టే చేశాడు. రామయ్య కొడుకు నారాయణ ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అదే జైలుకు, అనుకోకుండా, కొన్ని విచిత్ర పరిస్థితుల్లో ఒక నేరంలో దోషిగా తేలి వచ్చాడు సత్యం. ‘‘నేను ఆనాడే అనుకున్నా ఏదో కొంప మీదకొస్తుందని. అలాగే జరిగింది.’’ అన్నాడు సత్యం బాధగా. ‘‘పోన్లేరా! జరిగిందేదో జరిగింది. మనం ఊర్లో ఉంటే ఇంత సరదాగా కలుసుకోగలమో లేదో. ఇక్కడైనా ఈ నాలుగు రోజులు హాయిగా కాలక్షేపం చేద్దాం.’’ అన్నాడు నారాయణ, సత్యాన్ని కాస్తంత నెమ్మదిపరుస్తూ. ‘‘అది కాదు నారాయణ! నా మనసు ఎంతగా బాధపడుతుందో నీకు తెలియదు. రేపు మన ఊర్లో తలెత్తుకొని ఎట్లా తిరిగేది?’’ నారాయణ, సత్యం మాట్లాడుకుంటున్నారు. సత్యాన్ని విడిపించడానికి వచ్చాడు చంగయ్య. కొన్ని కాగితాలు చూపించి సంతకం పెట్టమని కోరాడు. ‘‘నారాయణ దొంగతనం చేశాడా?’’ అడిగాడు సత్యం. 

‘‘అదెందుకురా ఇప్పుడు! దీనిమీద సంతకం పెట్టు.’’ సత్యం వినలేదు. గట్టిగా అరుస్తూ మళ్లీ అడిగాడు – ‘‘నారాయణ దొంగతనం చేశాడా?’’ ‘‘లేదురా నాయనా! లేదు. వాడేం చెయ్యలేదు. నేనే ఏదో ఉద్రేకంలో ఇదంతా చేశాను. జరిగిపోయిందేదో జరిగిపోయింది. నా మాట విని ఇక్కడ సంతకం పెట్టు.’’ ఏడ్చేస్తూ అన్నాడు చంగయ్య. ‘‘ఇన్నాళ్లూ ఈ కేసు నా మీదకు ఎందుకు వచ్చిందా అనుకున్నాను. మన మేలుకే వచ్చింది. మనం నారాయణకు చేసిన అన్యాయానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాం.’’ అంటూ తండ్రి తెచ్చిన కాగితాలను పక్కకు తోసి మళ్లీ లోపలికి వెళ్లిపోయాడు సత్యం. సత్యం, నారాయణ జైల్లోనే ఉన్నారు. వీళ్లిద్దరూ జైల్లో ఉన్న విషయం గురించే ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. చంగయ్యకు కొడుకు బెంగ పట్టుకుంది. తన జీవితంలో చాలా రోజులు ఎదురుచూసినట్టే, సుబ్బులు సత్యం కోసం ఎదురుచూస్తూనే ఉంది. 
 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top