స్త్రీశక్తిని చూపిన పాట...

Maanavajaathi Manugadake Pranam Posindhi Maguva - Sakshi

అమ్మ (సావిత్రి) దర్శకత్వంలో వచ్చిన ‘మాతృదేవత’ చిత్రంలో ‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ’ అనే పాట అంటే నాకు చాలా ఇష్టం. స్త్రీశక్తిని ప్రతిబింబించే పాట ఇది. ఈ పాటను డా. సి. నారాయణరెడ్డి ఎంతో అందంగా రాశారు. పదాలు వింటుంటేనే నాట్యం చేయాలనిపించేలా ఉంటాయి. పాటలో ‘మాత్రలు’ (సిలబుల్స్‌) అలా పరుగులు పెడుతుంటాయి. చిన్నప్పుడు ఈ పాటకు నేను డాన్స్‌ చేసేదాన్ని.

‘మానవజాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ...’ అంటూ పాట ఎత్తుగడలోనే మహిళ ఎంత శక్తివంతమైనదో వివరించారు సినారె. అనురాగాన్ని పంచడంలోను, అవసరమైతే త్యాగం చేయడంలోనూ మహిళలే ముందు ఉంటారు... అని స్త్రీ ఔన్నత్యాన్ని చూపారు పల్లవిలో.మొదటి చరణంలో స్త్రీ గురించి చాలా సింపుల్‌గా... స్త్రీ అంటే చెలి, చెల్లి అనేది అందరూ చెబుతారు. ‘తల్లి’ అని సాధారణంగా చెప్పకుండా ‘రామయ్యనే కన్న తల్లి’ అని చెబుతూనే, ఆమె సకల భూప్రపంచానికే కల్పవృక్షం వంటిది అని స్త్రీ స్థానాన్ని ఎంతో ఉన్నతంగా చూపారు సినారె.

 ‘దేశానికి ప్రధాని అయినా ఒక కన్నతల్లి బిడ్డే’ అనే మాట వాడుకలో ఉంది. ఇక్కడ ఆ మాట గుర్తుకు వస్తుంది.రెండవ చరణంలో... ఆమె సహనం గురించి, ఆమె ప్రణయం గురించి మధురంగా వివరించారు. సహనానికి మారుపేరు సీత. అనురాగానికి మారు పేరు రాధ, తెలుగులో రామాయణం రాసిన మహిళ మొల్ల. కదన రంగంలో కత్తి దూసింది ఝాన్సీరాణి. ఇంతమంది మహిళలను గమనిస్తే, ఎవరి కోణం వారిదే. ఒక పక్క కవిత్వం రాయగలదు, మరోపక్క కదనరంగంలోకి ఉరకగలదు... అని స్త్రీలోని వివిధ పార్శా్వలు చూపారు.

మూడవ చరణంలోకి ప్రవేశించేసరికి మహిళను అత్యున్నతస్థాయికి తీసుకువెళ్లారు. ముందు రెండు చరణాలకి మూడో చరణానికి ఎంతో తేడా ఉంటుంది. ‘‘తరుణి పెదవిపై చిరునగవొలికిన మెరయును ముత్యాల సరులు...’’ అంటూ స్త్రీ గొప్పతనాన్ని వివరించిన ఒక్కో పదం వింటుంటే ఒళ్లు పులకరిస్తుంది. ఈ చరణంలో ఆడవారి అనురాగాన్ని కళ్లకు కట్టినట్లు చూపారు రచయిత. స్త్రీలో సహనంతో పాటు శక్తి కూడా సమానంగా ఉంటుంది.  బలం ఉండటం స్త్రీకి చాలా అవసరం.

అవసరం ఏర్పడినప్పుడు తనకు తానుగా శారీరక బలం తెచ్చుకోగలదు స్త్రీ. ఆవిడ అబల కాదు సబల అని నిరూపించగలదు. సమస్యలను తట్టుకునే శక్తి కూడా మహిళలకే ఉంటుంది.... అనే అర్థం ఈ పాటలో చెప్పారు. ‘కన్న కడుపున చిచ్చు రగిలెనా కరవులపాలౌను దేశం / తల్లిని మించిన దైవం లేదని తరతరాల సందేశం’ ... తల్లి మనసుకి కష్టం కలిగించితే దేశమే సర్వనాశనమవుతుంది, ఆవిడను మించిన దైవమే లేదంటూ ఈ పాటను ముగించారు సినారె.

మొదటి చరణం చాలా సింపుల్‌గా ప్రారంభమై, రెండవ చరణంలో జనరలైజ్‌ చేసి, క్రమేపీ మూడవ చరణంలోకి వచ్చేసరికి స్త్రీశక్తిని చూపారు. మహిళా శక్తిని ఈ పాటలో చూపినంతగా మరే పాటలోనూ చూపలేదేమో అనిపిస్తుంది.

ఈ పాట చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతుంది. స్త్రీ ఔన్నత్యాన్ని పాట రూపంలో చెప్పడం చాలా బావుంది. ఈ పాటను పాఠ్యాంశంగా పెడితే బాగుంటుందనిపిస్తుంది. కవిత్వ పరంగా ఈ పాట మనసుకి హత్తుకుంటుంది.
– వైజయంతి

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top