వెంకన్న... అందరి దేవుడు | Lord venkateswara all people god | Sakshi
Sakshi News home page

వెంకన్న... అందరి దేవుడు

Oct 6 2013 2:40 AM | Updated on Aug 28 2018 5:55 PM

వెంకన్న... అందరి దేవుడు - Sakshi

వెంకన్న... అందరి దేవుడు

తిరుమల ఆలయంలో సామాన్యుల సంఖ్యతో సమానంగా... అందరూ అసామాన్యంగా భావించే చలనచిత్ర ప్రముఖులు, రాజకీయవేత్తలు, క్రీడాకారులు, న్యాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య వేత్తల సందడి రోజురోజుకీ పెరుగుతోంది.

తిరుమల ఆలయంలో సామాన్యుల సంఖ్యతో సమానంగా... అందరూ అసామాన్యంగా భావించే చలనచిత్ర ప్రముఖులు, రాజకీయవేత్తలు, క్రీడాకారులు, న్యాయ నిపుణులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య వేత్తల సందడి రోజురోజుకీ  పెరుగుతోంది. ఒక్క ఆంధ్రప్రదేశ్ లేదా దక్షిణ భారతదేశానికే చెందిన వారే కాకుండా యావత్ భారతదేశం నుంచి సెలెబ్రిటీ భక్తులు తరలి వస్తున్నారు. శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.
 
 శంకర్‌దయాళ్‌శర్మ తిరుమల వచ్చిన ప్రతిసారీ తలనీలాలు సమర్పించేవారు. ఎందరో నేతలు గుండు చేయించుకుని మొక్కు చెల్లించుకుంటారు. రజనీకాంత్, కేంద్ర మంత్రి పళ్లంరాజు అయితే తలనీలాలివ్వటంతో పాటు తులాభారం తూగుతుంటారు.
 ప్రముఖ పారిశ్రామికవేత్తలయిన రతన్‌టాటా, అంబానీ సోదరులు, హెచ్‌సీఎల్ కంప్యూటర్స్ అధినేత శివనాడార్, సుబ్రమణ్యం రాజా తదితరులు తర చూ తిరుమలను సందర్శిస్తుంటారు. సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, కృష్ణమాచార్య శ్రీకాంత్, రవిశాస్త్రి, సెహ్వాగ్, శ్రీశాంత్, వీవీఎస్ లక్ష్మణ్, హర్భజన్ సింగ్, పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్ వంటి క్రీడాకారులు తరచూ తిరుమలకు వస్తుంటారు. ఇస్రో, షార్ వంటి వైజ్ఞానిక సంస్థలకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు సైతం స్వామివారి కృపా కటాక్షాల కోసం క్యూ కడుతున్నారు. కొత్త ఉపగ్రహాన్ని ప్రయోగించే ముందు అంతరిక్ష శాస్త్రవేత్తలు నమూనా ఉపగ్రహాన్ని శ్రీవేంకటేశ్వర స్వామి పాదాల వద్ద ఉంచి, పూజలు చేసిన తర్వాతే తమ పని ప్రారంభిస్తారు. టీ 20 ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు మొదలయ్యే ముందు, విజయ్‌మాల్యా ముందుగా తిరుమలేశుని దర్శించుకుని, తమ జట్టును గెలిపించమంటూ పూజలు చేసి ఆశీస్సులందుకుంటారు.
 
 మరోవైపు ప్రధానమంత్రి నుంచి కేంద్రమంత్రుల వరకు, రాష్ట్ర ముఖ్యమంత్రుల నుంచి సాధారణ మంత్రుల వరకు అందరూ ఏడుకొండలవాడి భక్తులే. తొలి ప్రధాని నెహ్రూ, ఆయన వారసులంతా వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నవారే. రాష్ర్టపతులు బాబూ రాజేంద్రప్రసాద్, వీవీ గిరి, నీలం సంజీవరెడ్డి, జ్ఞానీ జైల్‌సింగ్, శంకర్ దయాళ్ శర్మ, కేఆర్ నారాయణన్, కలాం, ప్రతిభాపాటిల్, ప్రణబ్ ముఖర్జీ తిరుమలకు వచ్చినవారే. పీవీ నరసింహారావు, వాజ్‌పేయి మన్మోహన్‌సింగ్ వంటి ప్రధానులు... నీలం సంజీవరెడ్డి, అంజయ్య, ఎన్టీయార్, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, వైఎస్సార్, కిరణ్‌కుమార్‌రెడ్డి వంటి ముఖ్యమంత్రులంతా స్వామివారి ఆశీర్వచనాలు ముఖ్యమనుకున్నవారే. చివరకు తమిళనాడు సీఎం జయలలిత, బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాదేవి, రాజస్థాన్ మాజీ సీఎం వసుంధరరాజే సింధియా, అమర్‌సింగ్, కర్ణాటక , మహారాష్ట్ర, గోవా, ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతరత్రా నేతలు కూడా తిరుమలకు వస్తున్నారంటే... స్వామివారి పట్ల వీఐపీ భక్తుల విశ్వాసం ఎంతటితో అర్థమవుతుంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులు కూడా స్వామివారి దర్శనానికి వస్తుంటారు. మాజీ ఎన్నికల కమిషనర్లు టీఎన్ శేషన్, లింగ్డో, సంపత్ తదితరులు స్వామి దర్శనానికి వచ్చినవారే.
 అయితే ఎందరు ప్రముఖులు వచ్చినా, సినిమావాళ్ల సందడే వేరు. దివంగత నటుడు దేవానంద్‌కి ఏడుకొండలవాడంటే అమితమైన భక్తి. అలాగే అమితాబ్, రిషీకపూర్, శ్రీదేవి, శిల్పాశెట్టి, దీపికా పదుకొనే, హేమమాలిని, రామానాయుడు, దాసరి నారాయణరావు, నాగార్జున, బాలకృష్ణ, మోహన్‌బాబు, పవన్‌కల్యాణ్, మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీయార్, రామ్‌చరణ్, అల్లుఅర్జున్, శ్రీయ... స్వామిని వెతుక్కుంటూ వచ్చే సినిమావాళ్ల లిస్టుకు అంతమే లేదు.
 
 అందరూ సమానులే!
 నడకదారుల్లో సామాన్య భక్తులు మాత్రమే వెళతారని అనుకుంటారంతా. కానీ అది నిజం కాదు. కోట్లకు పడగలెత్తిన ధనవంతులు, నేతలు, సినీ తారలు కూడా కాలినడకన స్వామిని దర్శించుకుంటారు. 2004లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తిరుమలకు నడిచి వచ్చి తన పాదయాత్రను పరిపూర్ణం చేసుకున్నారు. మాజీ సీఎం చంద్రబాబు, ప్రస్తుత స్పీకర్ నాదెండ్ల మనోహర్, కార్పొరేట్ దిగ్గజమైన అనిల్ అంబానీ, అందాల భామలు ఐశ్వర్యరాయ్, శిల్పాశెట్టి, నటుడు పవన్‌కల్యాణ్, ఆర్‌బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, గాలి జనార్దన్‌రెడ్డి వంటి వారంతా నడిచి వచ్చి శ్రీవారికి మొక్కులు చెల్లించినవారే. ఇక జయప్రద కుటుంబంతో సహా వచ్చి తిరుమలలో పుట్టినరోజును జరుపుకుంటారు.
 
 తారల పెళ్లి వేదిక!
 తిరుమల క్షేత్రంలో అనేకమంది సినీ తారలు, ప్రముఖుల వివాహాలు జరిగాయి. జమున-రమణరావు, బాలకృష్ణ-వసుంధర,  శ్రీకాంత్-ఊహ, శ్రీహరి-శాంతి, కృష్ణ కుమార్తె మంజుల-సంజయ్ స్వరూప్, మహేశ్వరి-జయకృష్ణ, మీనా-విద్యాసాగర్, రంభ-ఇంద్రకుమార్ వంటి వారందరికీ వెంకన్న సన్నిధే పెళ్లి వేదిక అయ్యింది. ఇక జూనియర్ ఎన్టీయార్-లక్ష్మీ ప్రణతి, అల్లు అర్జున్-స్నేహారెడ్డి, చరణ్-ఉపాసన, బాలకృష్ణ పెద్దకుమార్తె బ్రహ్మణీ-నారా లోకేష్, చిన్నకుమార్తె తేజశ్వి-శ్రీభరత్‌ల పెళ్లిళ్లు హైదరాబాద్‌లో జరిగినా... వేడుకలు ముగియగానే తిరుమలకు వచ్చి స్వామి దర్శనం చేసుకున్నారు. రజనీకాంత్ కూడా కుమార్తె ఐశ్వర్యతో తమిళ హీరో ధనుష్, మరో కుమార్తె సౌందర్యతో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అశ్విన్ వివాహం జరిగిన తర్వాత తిరుమలకు తీసుకొచ్చి శ్రీవారి ఆశీస్సులందుకున్నారు.
 
 అభిషేక్ వివాహం ఐశ్వర్యరాయ్‌తో జరిగిన తర్వాత వారిని స్వామి సన్నిధికి తీసుకువచ్చారు బిగ్‌బీ. శిల్పాశెట్టి, రాజ్ కుంద్రాలు కూడా వివాహం జరిగాక తిరుమలకు వచ్చి స్వామిని దర్శించుకున్నారు. సెలెబ్రిటీలు వస్తే సందడిగానే ఉంటుంది. అయితే వారిని  చూసేందుకు, వారితో కరచాలనం చేసేందుకు ఎగబడే  అభిమానులను నియంత్రించటం తిరుమల పోలీసులకు కత్తిమీద సాముగా మారింది. అందుకే అతి ముఖ్యమైన వీఐపీలు, సినీ లెజెండ్స్, క్రీడాకారులు వేకువజామున 2.30 గంటలకు సుప్రభాత సేవలో స్వామిని దర్శించుకుని తిరిగి వెళుతుంటారు. మరో విశేషమేమిటంటే... తిరుమలకు వచ్చే సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడాకారులు, అధికారులు, న్యాయ నిపుణుల్ని భక్తుల సేవలో కూడా భాగస్వాముల్ని చేస్తోంది దేవస్థానం. దర్శనం తర్వాత నిత్యాన్నప్రసాద భవనంలో భక్తులకు భోజనం వడ్డించటం, భుజించిన విస్తర్లు ఎత్తటం వంటి దైవ సేవా కార్యక్రమాలు చేస్తూ సెలెబ్రిటీలు ఇతర భక్తులకు ఆదర్శంగా నిలుస్తున్నారు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement