విఠూ తాళంచెవి పోయింది

funday story to world - Sakshi

కథా ప్రపంచం

బండోడ్కర్‌ అన్నగారు గోవా ముఖ్యమంత్రి అయ్యారు చూడు, అప్పుడు విఠూ అన్నాడు, ‘ఇది మాత్రం మంచికి అవలేదు కదా!’. విఠూ తన తాళాల గురించి అన్నాడు. ముఖ్యమంత్రి సంగతి కాదు. అదే సమయంలో అతని తాళం చెవి పోయింది. విఠూ దగ్గర ముందు తలుపుది, బయట గదిది, లోపలి గదులవి, కబోర్డు సొరుగువి, మేజాబల్ల సొరుగువి, పెట్టెది, అల్మారాది, ట్రంకు పెట్టెలవి, భోషాణంది.. ఇలా అన్నీ కలిపి పద్నాలుగు తాళాలు ఉండేవి. వాటిలో అల్మారా తాళం తరచూ పోతుండేది. బయట గదిది, మేజాబల్ల సొరుగువి, ట్రంకుపెట్టెలవి వారం, పక్షం రోజులకొకసారి, కబోర్డు సొరుగు తాళాలు మూడు నెలలకి రెండుసార్లు (కనీసం) పోతూ ఉండేవి. ఎప్పుడూ పోనిది భోషాణంది. ఈసారి అదే పోయింది.నిజానికి విఠూని వెర్రిబాగుల వాడంటారు. కొద్దిగా మందమతి, చాదస్తం కూడా ఉంది. ఏ వస్తువైనా ఎక్కడ పెట్టాడో ఎప్పుడూ జ్ఞాపకం ఉండదు. అందులో ఈ తాళంచెవి ఎంతదని? చిటికిన వేలంత. అదిపోతే ఎలా దొరుకుతుంది? తాళంచెవి పోయిందని తెలిశాక విఠూ ఇల్లంతా వెతికాడు. ముందు బయట గదిలో వెతికాడు. గదిలో మేజాబల్ల, మేజా సొరుగు వెతికాడు. కుర్చీల మీద వెతికాడు. గోడమీద మేకులు, గోడమూలల్లో ఉన్న చిన్న షెల్ఫ్‌లు వెతికాడు. వసారా వెతికాడు. మూలమూలల్లోని అల్మారాల సొరుగులు వెతికాడు. అల్మరాలో బట్టలు వెతికాడు. ప్యాంటు, లాగు చొక్కాల జేబులు వెతికాడు. వంటగది వెతికాడు. గిన్నెలు, తపేలాలు, ఇత్తడి సామాను, కంచాలు, చెంచాలు, గరిటలూ, గంగాళాలూ అన్నీ క్షుణ్ణంగా వెతికాడు. వంటగదిలోని షెల్ఫ్‌ కూడా వెతికాడు. మేడమెట్లు వెతికాడు. పడకగది వెతికాడు. గదిలో దిండ్లు, దిండు కవర్లూ, గలీబులూ, దుప్పట్లు అన్నీ వెతికాడు. 

అన్నీ వెతికిన తర్వాత భార్యకు చెప్పాడు, తాళంచెవి పోయిందని. భార్యకు బాధగా అనిపించింది. విఠూ వెతికిన ప్రతిచోటా తను మళ్లీ వెతికింది. విఠూ ఆ తర్వాత తల్లితో చెప్పాడు, తాళంచెవి పోయిందని. ఆవిడ కూడా విఠూ, విఠూ భార్య వెతికిన ప్రతిచోటులోనూ మళ్లీ వెతికింది. విఠూకి తల్లి మీద జాలేసింది. తల్లికి విఠూ మీద జాలేసింది. విఠూ భార్యకి విఠూ మీద, విఠూ తల్లి మీద జాలేసింది. విఠూకి ఇద్దరు పిల్లలు. పాటూ, తీటూ. తాళంచెవి పోయిన సమయంలో పాటూ పాటలు పాడుతున్నాడు. తీటూ గెంతులేస్తున్నాడు. విఠూ పాటూతో అన్నాడు, ‘‘ఏం దరిద్రపు జాతిరా మీది’’. పాటూ అడిగాడు – ‘‘ఏం జరిగింది?’’‘‘తాళం చెవి పోయింది.’’‘‘నేనేం చేయను?’’‘‘ఏడువ్‌.’’‘‘ఏడిస్తే దొరుకుతుందా?’’‘‘అవును.’’ఇది తీటూ విన్నాడు. ఇద్దరూ ఏడుస్తూ కూర్చున్నారు. విఠూ హఠాత్తుగా లేచాడు. ‘‘అరే! పాట పాడుతున్నార్రా’’ అని అడిగాడు. పాటూ, తీటూ ఏడుస్తుంటే పాట పాడుతున్నారా అనిపిస్తుంది. విఠూ కోపంతో లేవడంతో వాళ్లు పాపం నోరు మూసుకున్నారు.

తాళంచెవి పోయిన విషయం విఠూగాడి భార్య పక్కింటావిడకి చెప్పింది. ఆవిడ మరొకరికి చెప్పింది. ఆవిడ మూడో మనిషికి చెప్పింది. ఆవిడ నాల్గవ మనిషికి, ఆవిడ ఐదవ వ్యక్తికి చెప్పింది. పాటూ, తీటూ ఈ కబురు తబ్లు, గిబ్లూలకి చెప్పారు. ఆ తర్వాత వీళ్లు వాళ్లకి, వాళ్లు వీళ్లకి, వాళ్లు మరొకరికి, మరొకరు మరొకరికి చెప్పారు. క్రమేణా ఈ కబురు అందరికీ తెలిసింది.కొందరు విఠూని విచారించడానికి వచ్చారు. విఠూగాడి భార్యను పరామర్శించడానికి  కూడా చాలామంది వచ్చారు. ఆమె ఈ మధ్యనే నెల తప్పింది. గర్భవతి. ఎవరు తాళంచెవి విషయం కూపీ తీయడానికి వచ్చారో వాళ్లు తాళంచెవి ఎలా పోయిందిరా అని విఠూని అడిగారు. అప్పుడు విఠూ అది ఈ విధంగా పోయిందని వాళ్లకి చిలవలు పలవలుగా కథలల్లి చెప్పాడు. అందరికీ చెప్పేవాడు. ‘‘నిన్న నేను పొద్దున్న లేచాను సరే, టీ తాగాను సరే, భోజనం చేశాను సరే, స్నాన పానాలు పూర్తి చేశాను సరే, బయటికి వెళ్లాను సరే, ఇంటికి తిరిగొచ్చాను సరే, భోంచేసి నిద్రపోయాను సరే, ఈవేళ పగలు నిద్రలేచాను సరే, టీ తాగాను సరే, స్నానం చేశాను సరే, రేడియోలో బండోడ్కర్‌ ముఖ్యమంత్రి అయినట్లు విన్నాను సరేనా... అప్పుడు అకస్మాత్తుగా చూసినప్పుడు...’’విఠూగాడి బావ తన భార్యతో... అంటే విఠూ చెల్లెలితో విఠూ ఇంటికి వచ్చాడు చూడు, అప్పుడు విఠూ భార్య ఏడుస్తోంది, కడుపులో మండుతోందని. 

విఠూ తల్లి చెబుతోంది – ‘‘నేను విఠూకి చెప్పాను. దాని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని. కానీ ఈ పాపిష్టివాడు నా మాట వినలేదు. ఊరికే పనికిరాని హడావుడి చేయడం వీడికి అలవాటు’’.‘‘కానీ ఈవిడకి ఇలా బాధ కలగడం ఎప్పట్నుంచి ప్రారంభమైంది?’’ విఠూగాడి చెల్లెలు తల్లిని అడిగింది.‘‘అయ్యో! ఏమని చెప్పను నీకు. ఈవేళ పగలు లేచాం సరేనా, రేడియో వేశాం సరేనా, బండోడ్కర్‌ ముఖ్యమంత్రి అయ్యాడనే వార్త విన్నాం సరేనా, అప్పుడే విఠూ బయటికి వచ్చి నాతో అన్నాడు, ‘అమ్మా ఘోరం జరిగింది’ అని. నా గుండెల్లో రాయి పడింది. దీనికి ఇప్పుడిప్పుడే నెల తప్పింది కదూ? అరే పాపాత్ముడా ఏం జరిగిందిరా? అనడిగా. విఠూ చెప్పాడు తాళంచెవి పోయిందని. సరిగ్గా అప్పుడే దీని ఈ....’’బావగారూ, ఆయన భార్య ఈ విషయం అలాగే వదిలేసి తిరిగెళ్లిపోయారు. రోజంతా జనం వస్తున్నారు. మొగాళ్లు వచ్చినప్పుడు అదే విషయం, అదే పద్ధతిలో విఠూ వాళ్లకి చెప్పాడు. ఆడవాళ్లు వచ్చినప్పుడు అదే విషయం, అలాగే అతని తల్లి చెప్పింది. వచ్చిన వాళ్లందరికీ విఠూ భార్య తన కడుపునొప్పి గురించి చెప్పి ఏడుస్తూ కూర్చునేది. మూడురోజులు గడిచాయి. విఠూ దేవుడి గుడికి వెళ్లాడు. అక్కడ కీర్తన జరుగుతోంది. హరిదాసు వచ్చీరాని మరాఠీ భాషలో చెబుతున్నాడు – ‘‘ఏం చెప్పను దేవుడా! ఈ ప్రపంచమంతా పెద్ద పద్మవ్యూహం. క్లిష్ట సమస్య. ఏ రోజు ఎవరికి ఏం జరుగుతుందో చెప్పలేం. ఈ రోజు ఎవరిదో తాళంచెవి పోతుంది. రేపు వాడి పెళ్లాం పోతుంది. ఎల్లుండి వాడి పిల్ల పోతుంది. ఆ తర్వాత వాడే పోతాడు... అందుకనే ‘నేనెక్కడికి వెడితే అక్కడికి నువ్వు నీడలా వస్తావు’ అని భక్తతుకారాం అన్నాడు’’. విఠూకి బెంగ పట్టుకుంది.

ఈవేళ కేవలం తాళంచెవి పోయింది. రేపు నేనే పోతే? నా భార్య పోతే? విఠూ లేచి దేవుడికి నమస్కారం చేశాడు. పూజారి తన సమస్య ఏమిటని అడిగాడు. ఆ తర్వాత పూజారి దేవుణ్ణి ఉద్దేశించి అన్నాడు,   ‘‘భగవంతుడా! ఈవేళ ఈ విఠూ ప్రత్యేకంగా నీ దర్శనానికి నీ శరణుకోరుతూ వచ్చాడు. వాడికి ఆ పోయిన తాళంచెవి త్వరగా దొరికేలా చూడు. ఆ తర్వాత అతను నీకు పంచదారతో తులాభారం చేస్తాడు’’. విఠూ మనఃపూర్వకంగా మొక్కుబడి ఇస్తానని ప్రార్థించాడు. పూజారవిఠూకి చెప్పాడు, ‘‘దేవుడు నీ పని చేస్తాడు. దేవుడు చేయకపోతే ఆ పని నా సోదరుడు చేస్తాడు’’.పూజారి తమ్ముడు జ్యోతిష్యుడు. విఠూ అతడితో చెప్పాడు. అన్నీ విన్నాక అతడు విఠూని అడిగాడు ‘‘నక్షత్రం ఏమిటో తెచ్చావా?’’‘‘ఎవరిది?’’‘‘తాళం చెవిది’’‘‘లేదు. దాని నక్షత్రం నేను చేయించలేదు.’’‘‘అయితే అది ఎక్కడికి చేరిందో ఎలా చెప్పను?’’విఠూ నోరెత్తలేదు.‘‘తాళం ఎప్పుడు చేయించావు?’’‘‘అయిదేళ్లు గడిచాయి’’‘‘నెల?’’‘‘మార్గశిర మాసంలో!’’‘‘తిథి?’’‘‘ఏకాదశి’’‘‘రోజు?’’‘‘సోమవారం’’‘‘సమయం?’’‘‘తాళాలు చేసేవాడు ఆ తాళం నాకు పగలు పది గంటలకి ఇచ్చాడు.’’తాళం సమగ్ర ఆకారం, రంగు రూపాలూ వగైరా వివరాలు విఠూ దగ్గర వివరంగా అతను అడిగాడు. ఆ తర్వాత ఆ తాళంచెవి నక్షత్రం ప్రకారం లెక్కలు వేశాడు. కళ్లు చిన్నవి చేసి, తదేక దృష్టితో సూక్ష్మంగాఆలోచించాడు. వేళ్లతో ఏవో లెక్కలు వేశాడు. ఆ తర్వాత అంతరాళంలోకి దృష్టి కేంద్రీకరించాడు, ఆకాశంలో నక్షత్రాలు చూస్తున్నట్టు. అప్పుడన్నాడు, ‘‘నీ తాళం చెవి దక్షిణ దిక్కుగా పోతోంది’’.‘‘కానీ దానికి కాళ్లు లేవు. అది ఎలా నడుస్తుంది?’’ విఠూ ఆత్రుతగా అతణ్ని అడిగాడు.‘‘చొప్పదంటు ప్రశ్నలు అడగవద్దు’’‘‘అడగనులే. కానీ నాకొక సంగతి చెప్పు. నా ఈ తాళం చెవి దొడ్డిదారిలోని తోటలో ఉందా? ఊరి ఏటి ఒడ్డున ఉందా? కణ్‌కోణాలోని మూడుదార్ల కూడలి దగ్గర ఉందా? లేక కన్యాకుమారిలో వివేకానందుకి స్మారక స్థలంలో ఉందా?’’‘‘నాకు నీ ప్రశ్నలకి అర్థం తెలియడంలేదు’’‘‘నువ్వు నా తాళం చెవి దక్షిణ దిక్కులో పోతోందన్నావు. ఆ దక్షిణం ఎక్కడిది? ఇంటిదా? ఊరుదా? గోవాదా? లేక భారతదేశందా?’’‘‘ఈ వివరాలన్నీ నేను నీకు చెబితే నా జ్యోతిష్యంలో మిగిలేదేముంది?’’అప్పుడే గుడిలోంచి పూజారి అక్కడికి వచ్చాడు. అతను విఠూతో అన్నాడు, ‘‘మా తమ్ముడు పది రూపాయలకి ఇంతకంటే ఎక్కువ జ్యోతిష్యం చెప్పడు’’.విఠూ తిట్టుకుంటూ అతనికి పదిరూపాయలిచ్చి ఇంటికి తిరిగి వచ్చేశాడు. భోజనానికి కూర్చుంటుండగా, బయట తలుపు చప్పుడయింది. ఒక పోలీసువాడు లోపలికి ప్రవేశించాడు.

‘‘నీ తాళం చెవి పోయిందంటగా?’’ విఠూని అతనడిగాడు.‘‘అవును, నీకెవరు చెప్పారు?’’‘‘నీ పక్కింటి వాళ్లు’’‘‘అందుకని నువ్వు ఇక్కడికి వచ్చావా?’’‘‘ఈ పని మేం చేయకపోతే, మరెవ్వరు చేస్తారు? పోలీసులంటే లోకులసేవ చేసేవాళ్లు..’’విఠూ రెండు నిమిషాలు ఆ పోలీసుని చూస్తూ నిలబడ్డాడు. అలనాటి రామరాజ్యంలోని భటుడు పోలీసు రూపంలో పొరబాటున ఇక్కడికి వచ్చాడా అనుకున్నాడు. ‘‘సరే ఆ తాళంచెవి ఇప్పుడు నాకెలా లభిస్తుంది?’’ విఠూ అడిగాడు.‘‘కంప్లెయింట్‌ రాసివ్వు.’’‘‘ఏమని?’’‘‘తాళంచెవి ఎవరో దొంగిలించారని. నీకెవ్వరి మీదైనా అనుమానం ఉంటే వాళ్ల పేరు రాయి.’’‘‘కానీ నా తాళం పోయింది. దాన్ని ఎవరో దొంగిలించారని నాకు అనిపించడంలేదు.’’‘‘ఆ తాళం ఎక్కడోపోతే దాన్ని వెతకడం మా పనికాదు. ఎవరైనా దొంగిలిస్తే పట్టుకోవడం మా విధి.’’‘‘సరే, ఫిర్యాదు రాసిస్తే అది దొరుకుతుందా?’’‘‘ప్రయత్నించడం మా కర్తవ్యం. దొరుకుతుందో, లేదో మేమెలా చెప్పగలం? రేపు ఎవరైనా వచ్చి మంత్రిగారిని ఎత్తుకుపోయినా, ఆయన మాకు తప్పక దొరుకుతాడని చెప్పలేం’’ ఆ పోలీసువాడు నిక్కచ్చిగా చెప్పాడు. విఠూ అతను చెప్పిన ప్రకారం ఫిర్యాదు రాసిచ్చాడు. మళ్లీ అతణ్ని అడిగాడు – ‘‘నీకెవరు చెప్పారు? నా తాళం చెవి పోయిందని?’’‘‘ఆ విషయం అంత ముఖ్యం కాదు. పోయిన తాళం వెతకడం ముఖ్యమైన విషయం.’’ అంటూ వాడు బయటికి వెళ్లిపోయాడు. ఇదంతా జరిగిన తర్వాత విఠూ విసిగెత్తిపోయాడు. వెళ్లి పక్కమీద విశ్రాంతి తీసుకున్నాడు.ప్రపంచమంతా నరకం. కానీ, నాకేం పట్టిందని గాఢ నిద్రలో మునిగిపోయాడు. పొద్దున్న లేచి బయట వసారాలోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చున్నాడు. అప్పుడతనికి రోడ్డుమీద ఎవరో కనిపించారు. అతను శుక్రనక్షత్రంలాగా కనబడ్డాడు. బ్రహ్మదేవుడిలా మాట్లాడుతున్నాడు. అతను విఠూని చూసిన వెంటనే అడిగాడు, ‘‘నీ తాళం చెవి పోయింది కదూ?’’‘‘అవును.’’‘‘అది దొరుకుతుంది.’’‘ఎలా దొరుకుతుంది?’’‘‘సరిగ్గా వెతికితే దొరుకుతుంది.’’‘ఎలా?’’‘‘తాళం చెవి పోవడం అన్నది ఒక క్రియ. అంటే ఒక సంఘటన. ఏదైనా సంఘటనకి, అది జరగడానికి ముందు ఒక కారణం ఉంటుంది. ఆ కారణం లేకుండా ఆ సంఘటన జరగదు. ఒక సంఘటనకి ఒకే కారణం ఉంటుందని చెప్పలేం. ఎన్నో కారణాలు ఉండొచ్చు.’’‘‘అంటే అర్థం?’’‘‘ఈ కారణాలు వెదకాలి’’‘‘ఆ తర్వాత తాళం చెవి దొరుకుతుందా?’’‘‘ఎలా పోయిందో తెలుస్తుంది.’’‘‘తెలిసి ఉపయోగం ఏమిటి?’’‘‘తెలియడంతో వెతకడం సులువవుతుంది.’’‘‘కానీ ఈ రెట్టింపు పని ఎందుకు? కారణాలు వెతికే బదులు నేను తాళం చెవినే వెతుకుతాను.’’‘‘దొరకదు.’’‘‘ఎందుకు దొరకదు?’’‘‘దొరికితే నువ్వు నన్ను ఇబ్బందిలో పెడ్తావు.’’‘‘ఎలా?’’‘‘కారణాలు వెతక్కుండానే నీకు తాళం చెవి లభ్యమైతే, అదెలా జరిగిందా అని నేను కారణాలు వెతకాల్సి వస్తుంది.’’‘‘సరే. కారణాలు ఎలా వెతకాలో మీరే నాకు కాస్త చెప్పి చూడండి బాబూ.’’‘‘తాళం చెవి పోయింది అంటే ఏమయింది అన్నమాట ముందు నాకు చెప్పు చూద్దాం.’’‘‘నాకు తెలియదు. మీరే చెప్పండి’’‘‘తాళం పోయింది అంటే ఉన్న తాళం అదృశ్యం అయిపోయింది. అది దొరక్కపోవడానికి ఎన్నైనా కారణాలు ఉండొచ్చు. ఊదాహరణకి: నువ్వు తాళం ఎక్కడ పెట్టావో నీకు జ్ఞాపకం లేదు గనుక అది నీకు దొరకలేదు.

నువ్వు తాళం ఎక్కడ పెట్టానని అనుకుంటున్నావో అక్కడ నిజానికి పెట్టలేదు. అందుకని అది నీకు దొరకలేదు.నువ్వు తాళం పెట్టినచోటు నీకు జ్ఙాపకం ఉంది. కానీ అది అక్కడలేదు అందువల్ల దొరకలేదు.నువ్వు తాళం ఎక్కడ పెట్టావో, అక్కడే ఉంది. అయితే ఆ చోటు నీకు జ్ఞాపకం రావడంలేదు. అందువల్ల అది దొరకడంలేదు....’’విఠూకి అనిపించింది, మంత్రిగారు తన ప్రసంగంలో ప్రతి విషయాన్నిఎలా తిమ్మిని బమ్మిని చేసి విశ్లేషించి జనపనారలా అల్లుతాడో అలా వీడెవడో జ్ఞాని.విఠూ అతనితో నిష్టూరంగా అన్నాడు, ‘‘మిగిలిన కారణాలు నేను వెతికి తీస్తాను. మీరిక్కడ మరికొంతసేపు ఉంటే నాకు తలనొప్పి వస్తుంది. ఆ తర్వాత ఆ తలనొప్పి ఎందుకొచ్చిందా అని కారణాలు వెతకాల్సి వస్తుంది.’’అతను వెళ్లిపోయిన తర్వాత విఠూ స్నానం చేశాడు. ఆ తర్వాత పది, పదిన్నర ప్రాంతాలకి గోవా సచివాలయానికి వెళ్లాడు. ముఖ్యమంత్రి పీఏని కలిసి విషయం పూర్తిగా చెప్పి, తను ముఖ్యమంత్రిగారిని కలవాలని కోరాడు. మరో నెలన్నర వరకు ముఖ్యమంత్రిని కలిసే అవకాశం లేదని, అన్ని అపాయింట్‌మెంట్లు ఆయన ముఖ్యమంత్రి అయ్యారని తెలియగానే పూర్తయ్యాయని చెప్పాడు పీఏ.‘‘ఇప్పుడు నేనేం చెయ్యను?’’ విఠూ అతణ్ని అడిగాడు.‘‘అన్నగారింటికి వెళ్లు’’ అతనన్నాడు.మర్నాడు పొద్దున్న విఠూ, బండోడ్కర్‌ అన్నగారింటికి వెళ్లాడు. అక్కడ ఎంతోమంది జనం ఉన్నారు. అయినా విఠూని అంతమందిలోనూ గుర్తుపట్టి అన్నగారు అందరికంటే ముందు ఇంట్లోకి పిలిచి ఏంపనిమీదవచ్చాడో విచారించారు. విఠూ ఆయనకి పోయిన తాళం చెవి గురించి చెప్పాడు. తాళం చెవి పోయినట్లు పోలీసులకి ఫిర్యాదు చేసినట్లు, వాళ్లు ఈ విషయం లక్ష్యపెట్టనట్టు కూడా చెప్పాడు.‘‘అంటే నీ పోయిన తాళం చెవి వెతకమని పోలీసులకి నేను చెప్పనా? వాళ్లకి వేరే పనేం లేదా?’’ బండోడ్కర్‌ అన్నగారు మండిపడ్డాడు.‘‘అలా కాదు.. నా ఆ.. తాళం... చాలా...’’ విఠూ భయంతో తడబడుతూ ఏదో అంటున్నాడు.‘‘సరేగానీ దాని వెల ఎంత ఉంటుంది?’’‘‘నాకు తెలియదు.’’అన్నగారు లేచి లోపలికి వెళ్లారు. ‘ఆయనకి కోపం రాలేదు కదా!’ అనుకున్నాడు విఠూ. కొంతసేపటికి ఆయన బయటకొచ్చి, ‘‘ఇదిగో తీసుకో డబ్బు’’ అంటూవిఠూ చేతిలో కరెన్సీ నోట్లదొంతర్లు ఉంచి, ‘‘కొత్త తాళం చెవి చేయించుకో’’ అంటూ సాగనంపాడు.విఠూ ఇంటికి వచ్చి అన్నగారిచ్చిన నోట్లు లెక్కపెడుతూ కూర్చున్నాడు.చూస్తే, అన్నగారిచ్చిన ఆ డబ్బు ఎంత ఉందంటే దానితో బంగారపు తాళం చెవి కూడా చేయించుకోవచ్చు.
కొంకణీ మూలం : ఆనా మహాంబ్రె
 అనువాదం: శిష్టా జగన్నాథరావు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top