
బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి రుణంపై మొబైల్ ఫోన్‌లు తీసుకుని ఆ రుణాన్ని తిరిగి చెల్లించడంలో డీఫాల్ట్ అయితే అలాంటి ఫోన్‌లను వినియోగించేందుకు వీలు లేకుండా ఆ బ్యాంకులు లేదా రుణ సంస్థలు రీమోట్‌గా లాక్ చేయబోతున్నాయి. ఎందుకంటే వాటికి ఆర్బీఐ ఆ మేరకు అనుమతి ఇవ్వబోతోందంటూ రాయిటర్స్ కథనం పేర్కొంది.
వినియోగదారుల వాస్తవ ప్రయోజనాలను కాపాడుతూనే మరోవైపు నిరర్థక రుణాలను తగ్గుంచుకునే ప్రయత్నంలో భాగంగా ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపింది. ఫోన్లతో సహా మూడింట ఒక వంతు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ భారతదేశంలో చిన్న-టికెట్ వ్యక్తిగత రుణాలపై కొనుగోలు చేస్తున్నట్లు హోమ్ క్రెడిట్ ఫైనాన్స్ 2024 అధ్యయనం చూపించింది.
గతేడాది కూడా బ్యాంకులు, రుణ సంస్థలు ఇలాగే రుణ గ్రహీతలు డీఫాల్ట్ అయితే రుణంపై కొనుగోలు చేసిన మొబైల్ ఫోన్‌లను లాక్ చేయడానికి ప్రయత్నించగా ఆ ప్రయత్నాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అడ్డుకుంది. అయితే ఇప్పుడు ఇలాంటి నిరర్థక రుణాలు పెరిగిపోతుండటంతో రికవరీ పెంచుకోవడంలో భాగంగా కస్టమర్ల ఫోన్‌లను లాక్ చేసేందుకు ఆర్బీఐ రుణ సంస్థలకు అనుమతి ఇచ్చే ఆస్కారం ఉందని రాయిటర్స్ వివరించింది.
బ్యాంకులు, రుణసంస్థలతో సంప్రదింపులు జరిపిన తరువాత, ఫోన్-లాకింగ్ మెకానిజమ్‌పై మార్గదర్శకాలను ప్రవేశపెడుతూ ఆర్బీఐ తన ఫెయిర్ ప్రాక్టీసెస్ కోడ్‌ను కొన్ని నెలల్లో అప్డేట్ చేస్తుందని భావిస్తున్నారు. ఫోన్ లాకింగ్‌కు సంబంధించి రుణగ్రహీతల నుండి ముందస్తు సమ్మతిని తప్పనిసరి చేయడంతోపాటు లాక్ చేసిన ఫోన్లలో వ్యక్తిగత డేటాను రుణ సంస్థలు యాక్సెస్ చేయకుండా కూడా నిషేధించేలా ఈ నిబంధనలు ఉంటాయని చెబుతున్నారు.
ఈ చర్య అమలైతే, బజాజ్ ఫైనాన్స్, డీఎంఐ ఫైనాన్స్, చోళమండలం ఫైనాన్స్ వంటి ప్రధాన కన్జూమర్ ఫైనాన్స్ సంస్థలకు రికవరీలు మెరుగవుతాయని భావిస్తున్నారు. క్రెడిట్ బ్యూరో సీఆర్‌ఐఎఫ్ హైమార్క్ ప్రకారం.. రూ.1 లక్ష లోపు రుణాలే ఎక్కువగా డిఫాల్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కన్స్యూమర్ డ్యూరబుల్ లోన్లలో 85% నాన్-బ్యాంక్ రుణ సంస్థల వద్దే ఉన్నాయి.