మొనగాడు

Funday story of the week 28-04-2019 - Sakshi

 ఈ వారం కథ

వాడంతే.. కడలిలో అల తలెత్తిదంటే చాలు కాళీయకృష్ణుడై పోతాడు. అల తలపై ఎక్కే ప్రయత్నం మాత్రం ఏ రోజూ సఫలం కాలేదు. వాడు పరిగెత్తి అలల్లో అలగా పడిలేవటమూ ఆగిపోలేదు. అలతో పాటు అడుక్కి చేరటం మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత వాడు కనిపించడు ఎక్కడా. నిముషం, రెండు నిముషాలు, మూడు నాలుగు నిమిషాలు చూస్తూ చూస్తూనే గడచిపోతాయి. వాడుమాత్రం కనిపించడు.సముద్రంలో మరో అల గట్టున కొండలా ఎగిసి పడుతుంది. గట్టున వాళ్లమ్మ కొండంత ఆశతో ఎదురు చూస్తూ నిలుచుంటుంది. కాని వాడి జాడ మాత్రం కనిపించదు. పైకి లేచిన అల విరిగి తిరిగి సముద్రంలో లీనమైపోతుంది.  అలలాగే తల్లి గుండె కూడా ఛిద్రమై ఆగిపోతున్నంత పనౌతుంది. అప్పుడు కనిపిస్తాడు వాడు. అలచాటున మునిగి తేలుతూనో, నడుస్తూనో, ఈదుకుంటూనో గట్టుకు వస్తుంటాడు. పరిగెత్తుకుంటూ తల్లి వాడి రెండు చేతుల్ని వొడిసి పట్టుకొని గట్టుకు లాక్కొస్తుంది.

‘‘ఎహె.. వొదులొదులు..’’ అంటూ చేతులు విడిపించుకుంటాడు సముద్రంకేసి చూస్తూ.‘‘వొరే గంగులూ! నీ కెందుకురా ఈ పని.. వద్దురా మానుకోరా’’ ప్రాధేయపడుతుంది మునెమ్మ.‘‘ఆటనే.. ఆట.. సముద్రంతో ఆట. ఆడితే నీకే తెలుస్తది  ఎంత సమ్మగుంటదో’’ అంటూ తల్లి చేతుల్ని విడిపించుకొని ఎగుస్తున్న అలవైపు పరుగు తీస్తున్న గంగణ్ణి నిస్సహాయంగా చూస్తూ...‘‘వొరే! తొందరగా గుడిసెకి రా. సద్దిబువ్వ తిందువుగాని’’ అంటూ దూరంగా సర్వుచెట్ల మధ్యనున్న గుడిసెల వైపుకి వెళ్లిపోతుంది మునెమ్మ. గంగడు మాత్రం సముద్రం మీద సవాలన్నట్టు నీళ్లలోకి పరుగు తీస్తాడు.మునెమ్మకి, జానయ్యకి మనువైన పదేళ్ల తర్వాత పుట్టిన బిడ్డ గంగడు. ఆ గంగమ్మ తల్లి దయవల్ల పుట్టాడన్న నమ్మకంతోనే వాడికి గంగడు అని పేరెట్టుకున్నారు. నాలుగేళ్లు నీళ్లంటే భయపడి పరిగెత్తుకొచ్చి తల్లి కాళ్లను చుట్టేసుకునే వాడు గంగడు. ఐదో యేటనే మునెమ్మ వాణ్ణి అయ్యతోపాటు పడవ మీద వేటకి పంపింది. ఆ వయసు నుండే చేపల వేట నేర్వటం పట్టపోళ్ల ఆచారం. తండ్రి సొరచేపని భుజానేసుకెళ్తున్నట్టు తీసుకెళ్తుంటే ఏడుస్తూ ఎంత భయపడ్డాడో గంగడు. పడవలో నుండి దూకి పరిగెత్తుతూ వచ్చి తల్లిని వాటేసుకున్నాడు. వాడి వెనకే పరిగెత్తుకొచ్చిన జానయ్య వాణ్ణి మళ్లీ సొరచేపలా ఎత్తుకెళ్లి పడవలో పడేశాడు.సాయంత్రం వేటకి బయలుదేరిన పడవ దాదాపు మూడు కిలోమీటర్లు సముద్రంలో కెళ్లే సరికి సూర్యుడు ఓ వైపు పడమర ఆకాశంలో దిగిపోతున్నాడు. ఇటు తూరుపు ఆకాశంలో పున్నమి చంద్రుడు చందువా చేపలా తళతళ లాడుతూ పైకొస్తున్నాడు. పడవలో జానయ్యతో పాటు వున్న గంగడు అంత ప్రకాశవంతమైన చంద్రుణ్ణి చూడటం అదే మొదటి సారి. గంగడి ఆశ్చర్యం వాడి ముఖంలో వాడి కళ్లలో కనపడుతుంటే ‘‘ఏందిరో గంగులూ! అట్టా సూత్తున్నావ్‌. సముద్రంలో చంద్రుడు అట్టాగే వుంటాడు’’ అన్నాడు జానయ్య.

జానయ్య ఆ మాట ముగించేలోగానే కళ్లముందు ఆకాశమెత్తు అల అలా కదిలింది. ఆ క్షణాన్ని అర్ధం చేసుకొన్న జానయ్య ఎగిరి కొడుకుని గబుక్కున వాటేసుకున్నాడు. అల తాకిడికి పడవ అల్లంత పైకి లేచి దబ్బున నీళ్లలో పడింది. పడవతో పాటు అలకూడా పడవై పడటం, పడవ వొక్కసారి నీళ్లలో వొక గిరికీ తిరిగి నీళ్లపైన తేలటం జరిగిపోయాయి. కాని ఆ గిరికీ కొట్టడంలో జానయ్య చేతిల్లోంచి గంగడు ఎలా జారిపోయాడో తెలీనే లేదు. ఆ విషయం తెలుసుకొనే సరికి తండ్రి గుండె సముద్రంలో చెరువై పోయింది. నీళ్లలో మునకలేస్తూ దాదాపు గంటసేపు గంగడి జాడకోసం వెతుకుతూనే వున్నాడు.తెల్లారితే మునెమ్మకి చేపల్లోపెట్టి అప్పగించాల్సిన కొడుకు. ఎంత వెదికినా జాడ కనిపించని కొడుకు. జానయ్యలో శోకం కాస్త కోపంగా, కోపం మొండితనంగా మారిపోయింది. తెల్లారగట్టా పడవ చుట్టూ మునుగుతూ  తేలుతూ వెతుకుతునే వున్నాడు. కాని గంగడి జాడ మాత్రం చేతికి తగలనే లేదు. సముద్ర కెరటాల ముందు యింకా ఈదటానికి తన రెక్కల బలం చాలక పడవలోకి చేరుకున్నాడు.జానయ్యకి నమ్మకం కుదరలేదు. అసాధ్యం సాధ్యం కావటం మీద గురికూడ కుదరలేదు. రెండు చేతుల్తో తడిమి చూశాడు. తర్వాత రెండు చేతులెత్తి సముద్రుడికి చేతులు జోడిస్తూ  ‘‘గంగమ్మ తల్లీ! దండాలమ్మా!’’ అంటూ గట్టిగా అరిచాడు. ఆ క్షణం రాత్రంతా అలలలతో తను చేసిన యుద్ధం, తన రెక్కలు నీలుక్కుపోయిన కష్టం అన్నీ మరిచిపోయాడు. పడవలో ఆదమరచి నిద్రపోతున్న గంగణ్ణి చూసి వందసార్లు గంగమ్మకి దండాలు పెట్టుకున్నాడు. తీరా వొడ్డుకు చేరి మునెమ్మకి విషయం చెబితే ఆమె కూడా నమ్మలేకపోయింది. ‘‘రాత్రంతా అప్ప నీ కోసం నీళ్లల్లో పునుకులాడుతుంటే ఎందుకురా సెప్పలేదు?’’ అని అడిగింది.

‘‘నాకేం ఎరుక. అప్ప చేపలు పడతూ వున్నాడనుకున్నా..’’ అన్నాడు తేలిగ్గా తీసిపారేస్తూ.అసలు అప్పుడే గంగడిలో ఆ కొత్త వింతని గమనించారు అప్ప, అమ్మ.‘‘మునిమాపనంగా ఏటకెల్లినోడివి, తెల్లారగట్ట వుత్తి సేతుల్తో తిరిగొత్తే దినమెట్టా గడిసేది మామా?’’ అని జానయ్యని నిలదీసింది మునెమ్మ.‘‘నానేం జేసేది బుడ్డోడికిట్టా అయితదని నా కెరుకనా?’’ జానయ్య బాధంతా అదే. వాళ్లిద్దరి తగువు చూస్తూ నిలబడలేదు గంగడు. వెంటనే సముద్రంలోకి పరుగు తీసాడు. అమ్మా  నాన్న చూస్తుండగానే పైకెగసిన అలపైకి పరిగెత్తి మునిగిపోయాడు. మునెమ్మ గుండె ఝల్లుమంది.జానయ్య సముద్రంలోకి పరుగుపెట్టాడు.నిముషాలు గడుస్తున్నాయి. జానయ్య అలల మధ్యలో అప్పుడప్పుడూ కనిపిస్తున్నాడు. కాని గంగడి జాడ మాత్రం లేదు.తనకే తెలియకుండా మునెమ్మ కళ్లు రెండు నదులైపోయాయి. దబ్బున యిసుక అలలో కూలబడి పోయింది. రెండు పిడికిళ్లలో యిసుకను పట్టి పిసికేస్తూ వుంది. నాలుగైదు నిముషాలు నిముషాలు గడిచేసరికి మునెమ్మ ఆశ అడుగంటి పోయింది. ఇసుక పిడికిళ్లు వదిలేసి సముద్రానికి రెండు చేతులు జోడించి దండం పెట్టింది.జానయ్య తిరిగి వచ్చేస్తున్నాడు. రాత్రంతా నీళ్లలో ఈదిన అలసట మీద వున్నాడు. ఈ సారి ఎక్కువ సేపు అలల్ని ఎదుర్కోలేకపోయాడు.సరిగ్గా అప్పుడు లేచింది సముద్రంలో ఓ అల. కొండంత ఎత్తుగా. గట్టును దాటి గుడిసెల్ని మింగేస్తుందేమో అనిపించింది. ఆ లేచిన అల కింద నుండి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు గంగడు. రెండు చేతుల్లో రెండు పొడవాటి పండుగప్పలున్నాయి. మునెమ్మ పరుగున వెళ్లి వాటేసుకుంది గంగణ్ణి.‘‘అయ్యయ్యో! వదిలే.. వదిలే.. యివి జారిపోతయి’’ అన్నాడు తల్లితో.

‘‘నా తండ్రీ! అవి పోతే పోనీయ్‌. నువ్వొస్తివి. సాలురా తండ్రి!’’ మరింతగట్టిగా వాటేసుకుంది మునెమ్మ. ‘‘ఇయ్యాల్టికి యివి సరిపోతయి గదా!’’ గర్వంగా పండుగప్పల్ని చేతులెత్తి చూపుతూ గంగడు తల్లిని అడుగుతుంటే అంత పెద్ద చేపల్ని ఎలా మోస్తున్నాడో అర్ధం కాలేదు జానయ్యకి....రాత్రంతా కంటి మీదకి కునుకు రాలేదు. పడమటోళ్ల నాటుసారా తాగి జానయ్య గురక పెడుతున్నాడు. ఆ పక్కనే ముఖంలో ఏ భావమూ లేకుండా గంగులు పడుకున్నాడు.బక్క మునెమ్మనే నిద్ర బహిష్కరించింది. మునెమ్మ ఆలోచిస్తూ గుడ్డిదీపంవెలుతుర్లో నిట్టాణి వైపే చూస్తుంది.మనసును ఆలోచన కలచివేస్తుంది. ఒకవైపు అత్తపోరు. మరోవైపు కాయలేని కన్నెచెట్టు. తనకి తల్లికి మధ్య సర్దిచెప్పలేని పెనిమిటి. అమ్మలక్కల సలహా విని తను గంగమ్మ గుడిలో ఆ తల్లికి సారె పెట్టడం. బిడ్డ పుడితే తనపేరే పెట్టుకుంటానని మొక్కుకోవటం. ఆ రోజు రాత్రి కల లో ఆకాశం నుండి జలపాతంలా గంగమ్మ నేలకి దిగివచ్చింది. దివ్య తేజస్సుతో తన గుమ్మంలో ప్రత్యక్షమైంది. బంగరు గజ్జెలు మోగుతుంటే నిద్రిస్తున్న తనని వచ్చి తట్టి మరీ లేపింది. తన పొత్తి కడుపుని సుతారంగా తడిమింది. ఆ తల్లి తనని చూసి నవ్విన చల్లని నవ్వు యిప్పటికీ తలచుకుంటే వొళ్లంతా గగుర్పొడుస్తుంది.ఆ రోజు ఉదయం లేవగానే తను వాంతి చేసుకొంది. అత్త వచ్చి చూసి కళ్లతోనే నవ్వి, కొడుకు చేతిలో మంచుకొండలాంటి చల్లటి మాట చెప్పింది. చెప్పిందే కాని తనకు గంగడు పుట్టేనాటికి లేకుండా పోయింది. కాని వెళ్తూ వెళ్తూ పుట్టబోయే బిడ్డకి గంగమ్మ పేరే పెట్టాలని వొట్టేయించుకుని వెళ్లింది.ఆ బిడ్డే గంగడు.. అవునా? తనకే ఆశ్చర్యంగా వుంది. ఆ గంగడే గంగమ్మతల్లి వొడిలో గంటల సేపు హాయిగా నిద్రించి ఆనక నవ్వుతూ లేచి వస్తున్నాడు. రాజన్నదొర తన బుర్రకథలో చెప్పిన దుర్యోధనుని జలస్తంభన విద్య వీడికెలా అబ్బిందో? కొంపదీసి దుర్యోధనుడే తన కడుపున పుట్టలేదు కదా!అప్పుడే గుడిసె బైట రంగమ్మవ్వ కేక పెట్టింది ‘‘ఒసే మునెమ్మా! నీ గుంటడు ఆల్సిప్పలేరటానికి సముద్రంలోకెళ్లిపోయిండే.. ఎల్లే తల్లీ! ఆడు ముందే ఏబ్రాసోడు’’ అంటూ.తలతిప్పి చూస్తే గంగడు చాపమీద లేడు. తలుపుకేసి చూస్తే అప్పుడే తెల్లారిపోయింది.

అసలే మైపాడు సముద్రం. ఏ అడుగులో ఎంతలోతుందో ఎవరికీ తెలీని వైనం. ఒక అడుగు మోకాటిలోతైతే రెండో అడుగు తాటి చెట్టంత లోతు.సముద్రం చూడటానికి వచ్చిన జనమెవ్వరూ నీళ్లలో అడుగు పెట్టే సాహసం చెయ్యరు. అలా సాహసించిన శవాలెన్నో పట్టపోళ్లకి కూడ దొరకనంత లోతుకు వెళ్లిపోయాయి. ఎన్ని పడవలు వెతికినా దొరకని శవాలెన్నో. వెతక్కుండానే వొడ్డుకి కొట్టుకొచ్చిన శరీరాలెన్నో. ఆ కారణంతోటే మునెమ్మ గంగడిని కాపలా కాస్తుంది.ఆ కారణంతోటే జానయ్య గంగణ్ణి వేటకి దూరంగా వుంచాడు. ఆ రోజు తర్వాత మళ్లీ వేటకి తీసుకెళ్తే వొట్టు. కాని అల ఎవరిమాట వింటుందని? గంగడు అలలాంటి వాడు. వాడికిష్టమైతే కొండంత ఎదుగుతాడు. అదే యిష్టంలేకపోతే యిసకంత వొదుగుతాడు.ఆ రోజు కూడా అంతే.వళ్లంతా యిసక పూసుకొని యిసకలో ఆడుకుంటున్నాడు గంగడు.సముద్రం చూడటానికి కాలేజీ విద్యార్ధులు ఓ పాతిక మంది వచ్చారు. వాళ్లకి మాస్టారు చెపుతుంటే వినీ విననట్టు కూచున్నాడుగంగడు.‘‘ఇదిగో యిక్కడ మోకాలే. అక్కడ మాత్రం పాతాళమంత లోతు. అడుగు పడితే పాతాళానికే’’.నలుగురు కుర్రాళ్లు సముద్రం వొడ్డున కాళ్లు కడుక్కుంటున్నారు. సముద్రం ముందు నుండి వచ్చిందో, వెనక నుంచి వచ్చిందో ఆ అల అలా ఆ నలుగుర్నీ లోపలికి లాక్కెళ్లిపోయింది. చూస్తున్న విద్యార్ధులంతా గగ్గోలు పెట్టారు. మాస్టారు బెస్త గుడిసెలకేసి పరుగు పెట్టాడు. క్షణాల్లో నలుగురు గజ ఈతగాళ్లు రంగంలో దిగారు. విద్యార్థుల జాడ మాత్రం కనిపించడం లేదు. సెల్‌ఫోన్లలో సమాచారం కాలేజీకిచేరిపోయింది.కాలేజీ విద్యార్ధులంతా సముద్రం చేరుకొనే సరికి గజ ఈతగాళ్లు ముగ్గురు కుర్రాళ్ల ప్రాణాలు నిలబెట్టారు. నాలుగో వాడి జాడమాత్రం లేదు. ఈ లోగా నెల్లూరు నుండి ఫైరింజన్‌ స్టాఫ్‌ దిగింది. కాలేజీ ప్రిన్సిపాల్‌ ముఖం కళ తప్పింది.మాస్టారైతే కన్నీరు మున్నీరౌతున్నాడు. విద్యార్ధులంతా గుండె దగ్గర షర్ట్‌ బటన్లను తడుముకుంటున్నారు. అంతా అయిపోయింది. బతికి బయటపడ్డ ముగ్గురూ ఆకాశం కేసి చూసి థాంక్స్‌ చెప్తున్నట్టుచూపులు బిగించారు. మిగతా వాళ్లందరి చూపులు సముద్రం వైపు, సముద్రంలోని అలలవైపు.సరిగ్గా అప్పుడే ఆ అద్భుతం జరిగింది.

కొండెత్తు అల వొకటి లేచి వొడ్డుకేసి వచ్చిపడింది. ఆ అల మధ్యలోంచి విదార్థ్ధి కాలర్‌ పట్టుకొని శరీరాన్ని ఈడ్చుకొస్తున్నాడు గంగడు. అందరూ గంగడి వైపు పరిగెత్తారు.గంగడు మాత్రం ఆ విద్యార్థిని యిసక తిన్నెపైకి చేర్చి బోర్లా పడుకోబెట్టాడు. మెల్లగా అతడి వీపుని వత్తడం ప్రారంభించాడు. వత్తిడికి కడుపులోని నీళ్లు చెంబెడు చెంబెడుగా నోటి గుండా బైటికొస్తున్నాయి.ఆ తర్వాత అతణ్ణి వెల్లికిలా తిప్పాడు గంగడు. అతడి నోట్లో నోరుపెట్టి వేణువులా  ఊదాడు. మెల్లగా కళ్లు తెరిచిన విద్యార్ధిని చూసి కాలేజీ కుర్రాళ్లంతా ఆనందంతో కేరింతలు కొట్టారు. చప్పట్లు కొట్టారు.ఇంత పెద్ద ప్రమాదం నుండి తమ కాలేజీని బైట పడేసినందుకు ఆనందంతో పర్సు తీసి గంగడికోసం చూశాడు.కాని యివేవీ పట్టనట్టు బెస్తగుడిసెల వైపు నడచి వెళ్తున్నాడు గంగడు. తనకు దండం పెడుతున్న తల్లిని కూడ పట్టించుకోకుండా. ‘‘నిజమే. వీడు గంగమ్మ ప్రసాదమే’’ అనుకుంది మనసులో మునెమ్మ. 
- ఈతకోట సుబ్బారావు 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top