పెట్టెలో ఏముంది? నీ మనసులో ఏముంది?

Funday Laughing story  09 dec 2018 - Sakshi

లాఫింగ్‌ గ్యాస్‌

ఎల్లుండే ఎలక్షన్‌ రిజల్ట్‌! మల్లప్పకు మహాటెన్షన్‌గా ఉంది. సస్పెన్స్‌ నవలలు చదవడం మల్లప్ప హాబీ. ఆ నవలల్లో ‘నరాలు తెగే ఉత్కంఠ’ అనే వాక్యాన్ని తరచుగా చదివేవాడు. ఇప్పుడది స్వయంగాఅనుభవంలోకి వచ్చింది. గోడ గడియారంలోని లోలకం తన గుండెలో పెద్దగా చప్పుడు చేస్తుంది.మల్లప్ప తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగాడు.‘ఇజ్జత్‌కా సవాల్‌’ అంటూ తన ప్రత్యర్థి పది రూపాయలు ఖర్చు చేస్తే తాను పాతిక ఖర్చు పెట్టాడు. ప్రత్యర్థి వంద ఖర్చు చేస్తే తాను అయిదొందలు ఖర్చు చేశాడు.ఈ దెబ్బకు ఆస్తంతా మే నెల ఎండల్లో ఆరుబయట ఐసుముక్క కరిగిపోయినట్లు కరిగిపోయింది.‘ఒకవేళ ఎలక్షన్‌లో గెలవకపోతే’ తనలో తాను ఎన్నిసార్లు అనుకున్నాడో!ఆదివారం పొద్దుట నుంచి మల్లప్పలో ఒకటే టెన్షన్‌.రోజూ నిద్ర లేవడంతోనే బెడ్‌ మీద నుండే...‘కాఫీ’ అని అరవడంమల్లప్ప అలవాటు. ఈరోజు మాత్రం... లేవడం లేవడంతోనే...‘‘గెలుస్తానా.... లేదా!’’ అని అరిచాడు.భార్య మల్లీశ్వరి నవ్వుకుంది.బాత్‌రూమ్‌లో పాటలు పాడుతూ స్నానం చేయడం మల్లప్ప అలవాటు. ట్యూన్‌ పాతదే. పాటే  కొత్తది. ‘గజిని’ సినిమాలోని ట్యూన్‌తో ఇలా పాట అందుకున్నాడు.‘గెలుపు ఎక్కడ ఉన్నాది?గెలుపు ఎక్కడ ఉన్నాది?నీ చుట్టూనే తిరుగూతున్నాది!’ఇప్పుడు కూడా భార్య మల్లీశ్వరి  చిన్నగా నవ్వుకుంది.స్నానం తరువాత దేవుడి పటం ముందు కూర్చొని ప్రార్థన చేస్తూ మంత్రాలు చదవడం మల్లప్ప అలవాటు.ఈరోజు కూడా అలాగే కూర్చున్నాడు. కానీ మనసు మాత్రం ఎక్కడికో వెళ్లింది. ‘ఓం... గెలుస్తానా లేదా  ఓం... ఓడిపోతానా  ఏమిటి కొంపదీసి?  ఓం... ఎలాగైనా గెలవాలి.  ఓం... గెలవకపోతే ఇంకేమైనా ఉందా!’ ఈసారి మాత్రం భార్య చిన్నగా నవ్వలేదు. పెద్దగా అరిచింది...‘‘ఏమైంది నీకు?’’ట్రాన్స్‌ నుంచి బయటికి వచ్చిన మల్లప్ప...‘‘నాకేమైంది!’’ అన్నాడు అమాయకంగా.‘‘మీ టెన్షన్‌ ముదిరి పాకాన పడింది. ఇలాగైతే మీకు పిచ్చిపట్టడం ఖాయం. మీరు గెలిచినా... అందరూ పిచ్చి  ఎంఎల్‌ఏ అంటారు. పిచ్చి వల్ల పదవికి అనర్హుడిగా ప్రకటిస్తారు’’ అని భయపెట్టింది మల్లీశ్వరి.‘‘నిజమే సుమీ! కానీ నేను ఎంత ప్రయత్నించినా టెన్షన్‌ కంట్రోల్‌ చేసుకోలేకపోతున్నాను.ఏంచేయమంటావు చెప్పు!’’ దీనంగా జుట్టు పీక్కోబోయాడు  మల్లప్ప.‘‘ఇంకా జుట్టు ఎక్కడ ఉంది నా బొంద... మొన్న ఎలక్షన్‌లో ప్రత్యర్థులు పీకిపాకాన పెట్టారు కదా’’ అని ఉన్నవిషయం చెప్పింది మల్లీశ్వరి.‘‘జుట్టు సంగతి సరే, టెన్షన్‌ నుంచి డైవర్ట్‌ కావడం ఎలా?’’ అడిగాడు మల్లప్ప.‘‘టీవీలో స్వామిసాగరానంద అనే ఆయన గొప్ప ప్రవచనలు చెబుతున్నాడు. ఆ ప్రవచనలు వింటే మీ మనసు శాంతిస్తుంది. టెన్షన్‌ మాయమవుతుంది. వెంటనే యూ ట్యూబ్‌ ఓపెన్‌ చేయండి’’ అని లాప్‌టాప్‌ చేతిలో పెట్టింది మల్లీశ్వరి.ఆరోజంతా  ఒంటరిగా ఒక గదిలో కూర్చొని ప్రవచనలు సీరియస్‌గా విన్నాడు మల్లప్ప. మరుసటిరోజు  ఆయన మనసు తేలికైంది. టెన్షన్‌ ధ్వంసమైంది. మనసు దూదిపింజలా తేలిపోయింది.తన గది దాటి బయటకు వచ్చాడు మల్లప్ప.

‘‘చక్కని సలహా ఇచ్చావు మల్లీశ్వరి. ఇప్పుడు నాకు ఎలాంటి టెన్షనూ లేదు. నిండు కొండలా నిబ్బరంగా ఉన్నాను’’ అన్నాడు తన్మయంగా.‘‘అదిసరే... రేపు రిజల్ట్‌ పెట్టుకొని సంచిలో బట్టలు సర్దుకొని ఎక్కడికిబయలుదేరారు?’’ ఆశ్చర్యంగా అడిగింది శ్రీమతి మల్లీశ్వరి.అప్పుడు ఆయన ఇలా అందుకున్నాడు:‘మల్లీశ్వరీ!ఎలక్షనేమిటీ? రిజల్ట్‌  ఏమిటీ? ఈ చరాచరసృష్టిలో చెరుకుగడలో కూడా పరమార్థం ఉంది.తీపి గడను నిర్ణయిస్తుందా?గడ తీపిని నిర్ణయిస్తుందా?.... సమాధానం అంత తేలికా!ఎలక్షనేమిటీ దానితో నాకు ఉన్న కనెక్షనేమిటి?నువ్వు గెలిచాననుకున్నది గెలుపు కాదు. నువ్వు ఓడాననుకున్నది ఓటమి కాదు.గెలుపు ఓటములకు అతీతమైన సమ్యక్‌ దృష్టి నిన్ను గెలిపిస్తుంది.ఈ లోకంలో ఎవరికి ఎవరు శత్రువులు కాదు... విధి ఆడిస్తున్న వింత  బొమ్మలు. జయాపజయాలు దైవాధీనాలు కదా.... నాకు విజయం కానీ, పదవి కానీ, సుఖం కానీ వద్దు.నేను జయం కోరను. పదవి వలన కానీ, జీవించడం వలన కానీ ప్రయోజనం ఏమిటి?’‘‘ప్రయోజనం ఏమిటో  నేను చెబుతాను’’ అంటూ బకెట్‌ నీళ్లను అతడి నెత్తి మీద కుమ్మరించడంతో ఏదో లోకం నుంచి ఈలోకంలోకి వచ్చిపడ్డాడు మల్లప్ప!మల్లప్ప గురించి మాట్లాడుకున్నాం కదా.... ఇప్పుడు  రాజపక్షే  గురించి చెప్పుకుందాం. ఈయన  శ్రీలంకీయన్‌  కాదు మనోడే. అసలు పేరు పక్షి రాజా. ఇంటిపేరు తన పేరు పక్కన చేరడం వల్ల రాజా పక్షి అయ్యాడు.... కాలక్రమంలో రాజపక్షే అయ్యాడు. సరే ఈ పేరు గోల ఎందుకుగానీ బిడ్డ చచ్చినా పురిటి కంపు పోనట్లు... ఎలక్షన్‌లై పోయినా  ఎల్లుండి రిజల్ట్‌ అని తెలిసినా ఎలక్షన్‌ క్యాంపెయిన్‌ అలవాటునుమాత్రం మానుకోలేకపోతున్నాడు ఈ  రాజపక్షే.ఉదాహరణకు... పొద్దున్నే లేచి కెమెరామెన్‌ను వెంటదీసుకొని బయలుదేరుతాడు. పేపర్‌బాయ్‌ని సైకిల్‌ దింపి తాను సైకిల్‌ ఎక్కి  ఇంటింటికి వెళ్లి పేపర్‌ వేసి వస్తాడు. ఆ తరువాత కనిపించిన  హోటల్లోకి దూరి టీ కాస్తాడు. ఆ తరువాత వేడి వేడి  బజ్జీలు వేస్తాడు. కొద్దిసేపటి తరువాత సెలూన్‌లోకి దూరి గెడ్డాలు గీస్తాడు. మార్కెట్‌లోకి దూరి కూరగాయలు అమ్ముతాడు... ఒక్కటా రెండా!
– యాకుబ్‌ పాషా 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top