రంగస్థలం

funday Laughing fun story - Sakshi

లాఫింగ్‌ గ్యాస్‌

ఆ ఊరి పేరు ‘రణస్థలం’.  కానీ, కాదు. ‘‘ఇది పెన్ను అనుకుంటున్నావా? కాదు గన్ను’’ అని అదేదో సినిమాలో బ్రహ్మానందం అన్నట్లు... అది రణస్థలం అనుకుంటున్నారా? కానే కాదు రంగస్థలం. మరి ‘రంగస్థలం’ కాస్తా ‘రణస్థలం’ ఎలా అయిందంటే...తమ ఊరి పేరులోనే కళ ఉంది. ఆ కళను కళకళలాడించడానికి ‘రంగస్థలం’ పేరుతో ఒక నాటక సమాజాన్ని స్థాపించుకున్నారు ఊరి ప్రజలు. తమ ‘రంగస్థలం’ పృ«థ్వీరాజ్‌కపూర్‌ ‘పృ««థ్వీ «థియేటర్స్‌’లా చరిత్రలో నిలిచిపోవాలనుకున్నారు.నటుల ఎంపిక పూర్తయింది.కొద్ది రోజుల తరువాత ‘రంగస్థలం’ వారి తొలి ప్రదర్శన మొదలైంది. ఇప్పుడు మనం ప్రేక్షకుల్లో కూర్చొని ‘రంగస్థలం’ కళాకారుల నట, గాన విన్యాసాలను ఆసక్తిగా చూద్దాం...అదిగో రావణ పాత్రధారి రంగస్థలం మీదికి వస్తున్నట్లుగా ఉంది. వచ్చేలోపు అతడి గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. అతని  పేరు రాజేషం. ఈ రాజేషానికి మతిమరుపు ఒక రేంజ్‌లో ఉంటుంది. అలాంటి రాజేషానికి రావణుడి వేషం  ఎలా దక్కింది? 

‘రంగస్థలం’ స్పెషాలిటేమిటంటే నటుల ఎంపిక టాలెంట్‌ మీద  ఆధారపడి ఉండదు. వేలంపాట మీద ఆధారపడి ఉంటుంది. అంటే... ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి ఇష్టమైన వేషం దక్కుతుంది. మతిమరుపు ఉన్నా సరే... రాజేషానికి రావణుడి వేషం  దక్కడానికి కారణం వేలంలో ఎక్కువ మొత్తం డబ్బు ఇచ్చి ఆ వేషాన్ని  సొంతం చేసుకోవడమే. అలాగని తన పాత్రను లైట్‌గా తీసుకోలేదు రాజేషం.చాలా వెయిట్‌ పెరిగాడు. తన డైలాగులను రాత్రి పగలు అనే తేడా లేకుండా బట్టీ పట్టాడు.‘రంగస్థలం’ వేదిక దగ్గరకు బయలు దేరేముందు...తన భార్య ముందు నిల్చొని...‘‘ఇవ్వాళ మన పొగ్రాం ఉంది. అదరగొడతాను... నా డైలాగు విను’’ అన్నాడో లేదో ఆమెకు కోపం వచ్చింది.‘‘ కొత్తగా వినేదేమిటి నా బొంద? మీరు ఇల్లంతా అదిరిపోయేలా  ప్రాక్టీస్‌ చేస్తుంటే రోజూ ఇనలేక ఛస్తున్నాను. అవి నా నోటికి కూడా వచ్చాయి’’ అంటూ ఆమె నోరు  పెంచి డైలాగ్‌ అందుకుంది...‘హా హా హాహా హా హాటెక్కుల మారి టక్కులాడితంటాలతో తైతక్కలతోమా తాతలను మైమరిపించిఅమృతకలశం హరించారుకదూకామధేనువును,కల్పతరువును ఆకట్టుకొనిమాకు సున్నా చుట్టారు కదూహా హా హా’‘శబ్బాష్‌’ అని భార్యని మెచ్చుకుంటూ అక్కడి నుంచి ‘రంగస్థలం’ వేదిక దగ్గరకు వెళ్లాడు రాజేషం.‘‘వుప్పుడు మేకతోకల రాజేషం ప్రదర్శించు రావణుడి ఏకపాత్రాభినయం’’ అని ఎనౌన్స్‌మెంట్‌ వినిపించింది. రావణ పాత్రధారి రాజేషం స్టేజీ మీదకు వచ్చాడు.

రావణుడి వేషంలో ఉన్న రాజేషాన్ని చూసి ప్రేక్షకులు ఈలలు, కేకలు వేస్తున్నారు. దీంతో రాజేషానికి మరింత హుషారు వచ్చింది.మీసం తిప్పాడు.గద పైకెత్తి ఠీవిగా భుజాల మీద పెట్టుకున్నాడు.గొంతు సవరించాడు.గొంతులో పచ్చి వెలక్కాయపడ్డట్లయింది. డైలాగ్‌ గుర్తుకు రావడం లేదు. డైలాగు గుర్తు లేదుగానీ... డైలాగుకు ముందు వచ్చే పెద్ద నవ్వు మాత్రం గుర్తుంది.డైలాగ్‌ గుర్తు వచ్చేవరకు నవ్వుతో మానేజ్‌ చేద్దామనుకొని ‘హా హా హా’ అని పెద్దగా నవ్వడం మొదలు పెట్టాడు. అలా పదినిమిషాల పాటు నాన్‌స్టాప్‌గా నవ్వుతూనే ఉన్నాడు.‘‘నవ్వింది చాలుగాని.... డైలాగ్‌ కొట్టు బే’’ అని ప్రేక్షకుల నుంచి ఒక గొంతు వినిపించింది. ఈలోపే పాత చెప్పొక్కటి వచ్చి రాజేషం మూతిని తాకింది. తాకితే తాకిందిగానీ... అది రాజేషం పెట్టుడు మీసాన్ని తాకింది. దాంతో అది   ఊడి కిందపడిపోయింది.ఈసారి నవ్వడం ప్రేక్షకుల వంతయింది! దీంతో రెండు వర్గాల మధ్య(రాజేషం మిత్రవర్గం, శత్రువర్గం) ఘర్షణ మొదలైంది.‘‘వుప్పుడు పీకల వెంకటేషం ఇంద్రధనస్సు సినిమాలోని పాటను తన మధురకంఠంతో వినిపించి మిమ్మల్ని మైమరపింపజేస్తాడు’’ అని ఎనౌన్స్‌మెంట్‌ వినిపించడంతో గొడవ సద్దుమణిగి అందరూ సైలెంటైపోయారు.

ఏమాటకామాటే చెప్పుకోవాలి... రాజేషంలా వెంకటేషం మతిమరుపు మైండ్‌ కాదు. మాంచి  గాయకుడు. కానీ అప్పుడప్పుడూ మందుకొడుతుంటాడు. అతను స్టేజీ ఎక్కే ముందు ఎవడో అభిమాని క్వార్టర్‌ సీసా చేతిలో పెట్టాడు. మనవాడికి ఆత్రం ఎక్కువ. అదేదో పాట పూర్తయినాక తాగవచ్చుకదా... స్టేజీ ఎక్కే ముందు చాటుకు వెళ్లి సగం లాగించాడు. ఆ తరువాత...మైక్‌ ముందుకు వెళ్లి గొంతెత్తాడు.‘నేనొక ప్రేమ పిశాచిని.నువ్వుక  ఆస్థమవాసివి.నా దాహం తీరనిది’ అని పాడుతూ జేబులో మిగిలి ఉన్న క్వార్టర్‌ సీసాను స్టేజీ మీదనే ఖాళీ చేశాడు వెంకటేషం. జనంలో హాహాకారాలు. కారాలు మిరియాలు. లొల్లి లొల్లి.... ఎవరు ఎవర్ని తిడుతున్నారో తెలియడం లేదు. ఎవరు ఎందుకు గొడవ పడుతున్నారో తెలియదు. ఒకడు ఇంకొకడి కాలరు పట్టుకున్నాడు... ఎందుకో తెలియదు. ఒకడు ఇంకొకడి జుట్టు పట్టుకున్నాడు... ఎందుకో తెలియదు. రంగస్థలం కాస్త రణస్థలం అయింది. పట్నం నుంచి పోలిసు వ్యాన్‌ దిగింది. దొరికినవాడిని దొరికినట్లు చావబాదారు పోలీసులు. ఇక అప్పటి నుంచి కళ అనే మాట వినబడితే కలరా సోకినట్లుగా గజగజా వణికిపోతారు రణస్థలం గ్రామస్తులు!
– యాకుబ్‌ పాషా  

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top