పూల అందం నువ్వే నువ్వే!

Funday Interview With Sayesha Saigal - Sakshi

‘అఖిల్‌’ సినిమాతో వెండితెరకు పరిచయమైన సాయేషా సైగల్‌ బాలీవుడ్‌ నటదిగ్గజం దిలీప్‌కుమార్‌ ముద్దుల మనవరాలు. అజయ్‌దేవగణ్‌తో కలిసి నటించిన ‘శివాయ్‌’ ఆమెకు మంచి గుర్తింపు తీసుకువచ్చింది. తాజాగా ‘బందోబస్త్‌’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సాయేషా  అంతరంగాలు...

నేర్చుకుంటూనే..
స్కూల్‌ నుంచి రావడం, హోమ్‌వర్క్‌ చేసుకోవడం, తరువాత డ్యాన్స్‌ క్లాసో, ఆర్ట్‌ క్లాసో... ఏదో క్లాస్‌కు వెళుతుండేదాన్ని. ఇలా నేర్చుకోవడం అనేది తొమ్మిదో ఏట నుంచే మొదలైంది. అప్పుడే కాదు ఇప్పుడూ ఉంది. భవిష్యత్‌లో కూడా ఉండాలనుకుంటున్నాను. నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ డ్రామా ప్రొఫెసర్‌ అజయ్‌జోషి మా ఇంటికి తరచుగా వస్తుండేవారు. ఆయన నిర్వహించే యాక్టింగ్‌ వర్క్‌షాప్‌లలో చురుగ్గా  పాల్గొనేదాన్ని. మనం ఎక్స్‌ప్రెసివ్‌ అయితే ‘నటన’ గురించి ప్రత్యేకంగా కష్టపడనక్కర్లేదు. రెండు కళ్లతో కూడా బోలెడు భావాలు చెప్పవచ్చు.

ఓన్లీ మెరిట్‌
మాది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం అయినా ఇంట్లో సినిమాల గురించి మాట్లాడుకునేది చాలా తక్కువ. మా అందరికీ ఇష్టమైనది ‘ట్రావెలింగ్‌’. అందరం కలిసి మాట్లాడుకునే ఇష్టమైన టాపిక్‌ కూడా అదే. ‘శివాయ్‌’లో అవకాశం నా ప్రతిభ వల్లే తప్ప కుటుంబ నేపథ్యం వల్ల రాలేదు. ‘శివాయ్‌’లో అజయ్‌దేవ్‌గణ్‌లాంటి నటుడితో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. పదేపదే రిహార్సల్స్‌ చేసి కాకుండా చాలా స్పాంటేనియస్‌గా నటిస్తారు ఆయన. డైలాగులు చెబుతున్నప్పుడు పక్కవ్యక్తితో సంభాషిస్తున్నట్లుగా ఉంటుంది తప్ప ‘నటన’ అనిపించేలా ఉండదు. చాలా సహజంగా నటిస్తారు. ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయం ఇదే.

రామ్‌ లఖన్‌లో రాధ
పాత సినిమాల రీమేక్‌లో నటిస్తే, సంబంధిత పాత్రకు న్యాయం చేస్తానో లేదో తెలియదుగానీ ‘రామ్‌ లఖన్‌’ సినిమాలో మాధురి దీక్షిత్‌ పోషించిన ‘రాధ’ పాత్ర చేయాలని ఉంది. హుషారైన డ్యాన్స్‌లు చేయడానికి మంచి అవకాశం ఉంది. నేను ట్రైన్డ్‌ డ్యాన్సర్‌ని. సౌత్‌ ఆఫ్రికా, లండన్, బ్రెజిల్‌లలో లాటిన్‌ అమెరికన్‌ డ్యాన్స్‌ నేర్చుకున్నాను. ముంబైలో కథక్, ఒడిస్సీ నేర్చుకున్నాను.

పాఠాలు
ఫిల్మ్‌ కెమెరాలను సెట్‌ మీదే తొలిసారిగా చూశాను. ‘శివాయ్‌’కి ఆరు కెమెరాలు సెట్‌ చేశారు. ప్రతి యాంగిల్‌ను ఆ కెమెరాలు పట్టుకుంటాయి. ఇదొక బిగ్‌ లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌గా పనిచేసింది నాకు. సౌత్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీ సాంకేతిక విషయాలలో ఉన్నతంగా ఉంది. ‘అఖిల్‌’ చేస్తున్న సమయంలో లేటెస్ట్‌ ఫిల్మ్‌ టెక్నాలజీ గురించి తెలుసుకునే అవకాశం వచ్చింది. ప్రతి అనుభవం నుంచి ప్రతి వ్యక్తి నుంచి ఏదో ఒక పాఠం నేర్చుకోవచ్చు. 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top