ప్రొఫెసర్‌ సిన్హా

funday horror story - Sakshi

కిర్ర్‌..ర్‌..!

అబ్బాయి వైపు చూశాడు ప్రొఫెసర్‌ సిన్హా. వాడు ఏడ్వడం స్పష్టంగా కనిపిస్తోంది. సిన్హా గుండె తరుక్కుపోయింది.  ‘ఏ దేవుడు శపించాడో.. వీడు ప్రేమలో పడ్డాడు’ అనుకున్నాడు.

కళ్లకు ఉన్న అద్దాలు తీసి, కర్చీఫ్‌తో వాటిని ఒకసారి తుడుచుకుని మళ్లీ కళ్లకు పెట్టుకున్నాడు ప్రొఫెసర్‌ స్వరూప్‌ సిన్హా. ఆ అమ్మాయి, అబ్బాయి ఇంకా మసగ్గానే కనిపిస్తున్నారు! అప్పుడర్థమైంది.. ప్రొఫెసర్‌ సిన్హాకు, తను తుడుచుకోవలసింది కళ్లద్దాలను కాదని. కర్చీఫ్‌ తీసి ముఖం తుడుచుకుంటున్నట్లుగా కళ్లు తుడుచుకున్నాడు. ‘హెవెన్స్‌ రెస్టారెంట్‌’ అది. ప్రొఫెసర్‌ సిన్హా కొన్నాళ్లుగా అక్కడ ఆ జంటను చూస్తున్నాడు. ఆ జంట ఎప్పుడొచ్చినా అలవాటుగా ఒకే టేబుల్‌ మీద కూర్చుంటుంది. ఇద్దరు మాత్రమే కూర్చోడానికి రెండు కుర్చీలు వేసి ఉండే చిన్న టేబుల్‌ అది. ఆ టేబుల్‌ ప్రొఫెసర్‌ సిన్హా టేబుల్‌కు ఎదురుగా కాస్త దూరంలో ఉంటుంది. అతడూ అలవాటుగా ఒకే టేబుల్‌ మీద కూర్చుంటాడు. అతడు కూర్చొని ఉండే టేబుల్‌కి నాలుగు కుర్చీలు ఉంటాయి కానీ, ఎప్పుడూ అతడు మాత్రమే ఉంటాడు!అబ్బాయి వైపు చూశాడు ప్రొఫెసర్‌ సిన్హా. వాడు ఏడ్వడం స్పష్టంగా కనిపిస్తోంది. సిన్హా గుండె తరుక్కుపోయింది. ‘ఏ దేవుడు శపించాడో.. వీడు ప్రేమలో పడ్డాడు’ అనుకున్నాడు.‘‘ఇదే ఆఖరు’’ అన్నాడు అబ్బాయి. 

‘‘దేనికి ఆఖరు విక్కీ. నాతో మాట్లాడ్డమా, నన్ను కలవడమా?’’ అంది అమ్మాయి. ‘‘ఎప్పుడూ నేను మాట్లాడ్డమేనా స్విగ్గీ. నీకు మాట్లాడాలని ఉండదా? నీకు కలవాలని ఉండదా?’’ అన్నాడు. అమ్మాయి పేరు శ్రీగంధ. తనను చూస్తే చాలు కడుపు నిండిపోతుందని ‘స్విగ్గీ’ అని పేరు పెట్టుకున్నాడు. ఎప్పుడూ గంటలు గంటలు మాట్లాడుకునేవాళ్లు విక్కీ, శ్రీగంధ. కాలేజ్‌లో, కాలేజ్‌ బయట, వాళ్లింట్లో,వీళ్లింట్లో గంటలు గంటలు. ఆకలి తెలిసేదే కాదు. అప్పటికి స్విగ్గీ అన్న పేరుకు కూడా విక్కీ జీవితంలో ఏ ప్రామినెన్సూ లేదు. శ్రీగంధ పరిచయం అయ్యాక రోజుకు ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఉంటాయని, ఆ ఇరవై నాలుగ్గంటల్లోనూ సగం రేయి, సగం పగలు ఉంటాయని విక్కీ మర్చిపోయాడు. శ్రీగంధకు ఇవి మరుపుకు రాలేదు కానీ, గుర్తు చేయడానికి విక్కీ ఉన్నాడు కదా అని తను కావాలనే మర్చిపోయింది. అలా ఇద్దరూ లోకాన్ని మర్చిపోయి, కబుర్ల లోకంలో మునిగిపోయి ఉన్నప్పుడు ఓ రోజు శ్రీగంధ సడన్‌గా కడుపు పట్టుకుని ‘అబ్బా’ అంది!‘‘ఏమైంది శ్రీగంధా?’’ అన్నాడు విక్కీ. ‘‘ఆకలి’’ అంది!‘‘నిజమే.. నాక్కూడా’’అన్నాడు. అన్నాక, ఉలిక్కిపడ్డాడు. ‘శ్రీగంధకు తన మీద గానీ, తనకు శ్రీగంధ మీద గానీ ప్రేమ తగ్గలేదు కదా’ అని తొలిసారి అతడికి సందేహం వచ్చింది. ప్రేమ తగ్గితేనే మనసుకు నానా చెత్తా గుర్తుకొస్తుంది! అయినా ఇప్పుడు గుర్తుకొచ్చింది కడుపుకు గానీ, మనసుకు కాదు కదా అని తనకు తాను సర్దిచెప్పుకున్నాడు. ‘మనసుకు గుర్తుకొస్తే అది చెత్త అవుతుంది. కడుపుకు గుర్తుకొస్తే అది ఆకలి అవుతుంది’ అని అనుకున్నాడు. ‘ఆకలి.. చెత్త కాదు, అదొక సహజమైన భౌతిక ఆలోచన’ అని కూడా తనని తను కన్విన్స్‌ చేసుకున్నాడు.‘‘ఏం చేద్దాం?’’ అంది శ్రీగంధ. ‘‘తెప్పించుకుందాం’’ అన్నాడు విక్కీ.  ప్రేమలో పడిన కొన్ని యుగాల తర్వాత ఇద్దరూ కలిసి చేసిన తొలి భోజనం అది. ఉన్నచోటికే తెప్పించుకున్నారు. స్విగ్గీ నుంచి డెలివరీ అయింది. అప్పట్నుంచి శ్రీగంధ అతడికి ఆకలి తీర్చిన దేవతై.. ‘స్విగ్గీ’గా అవతరించింది. 

ప్రొఫెసర్‌ స్వరూప్‌ సిన్హా ఆ అమ్మాయి వైపు చూస్తున్నాడు. ‘‘ఏంటి విక్కీ ఇలా అయిపోతున్నావ్‌! నాకు ధైర్యం చెప్పాల్సిందిపోయి..’’ అంటోంది అతడి చెంపను తన చేతి నిండా నింపుకుని.‘‘ఏం చెప్పాలి స్విగ్గీ? నేనేమైపోతే నీకేం, ధైర్యంగా వెళ్లి మీ అమ్మానాన్న చూసిన అబ్బాయినే చేస్కో అని ధైర్యం చెప్పాలా?’’ అన్నాడు విక్కీ. ‘‘నన్నేం చెయ్యమంటావ్‌?’’ అంది శ్రీగంధ.‘‘ఈ ప్రశ్న నన్నడిగావా? ‘శ్రీగంధా నేన్నిన్ను ప్రేమిస్తున్నాను..’ అని మూడేళ్ల క్రితం ఫస్ట్‌ టైమ్‌ నేను నీకు చెప్పినప్పుడు.. ‘నన్నేం చెయ్యమంటావ్‌ విక్కీ?’ అని అప్పడు నన్ను అడిగావా! కళ్లతోనే నువ్వు నాకు ఐ లవ్యూ చెప్పలేదూ? అప్పుడు నువ్వు నాకు ‘ఎస్‌’ చెప్పావంటే.. ఇప్పుడు నువ్వు మీ వాళ్లకు ‘నో’ చెప్పాలనే కదా అర్థం?’’‘‘కానీ విక్కీ... నేను భయపడిపోయాను. అమ్మానాన్నకు ‘ఎస్‌’ చెప్పలేదు, ‘నో’ చెప్పలేదు. నా జీవితంలో నువ్వున్నావని కూడా చెప్పలేకపోయాను విక్కీ. అందుకే అడుగుతున్నా.. ఏం చెయ్యమంటావని!’’ అంది శ్రీగంధ. ఇప్పుడు శ్రీగంధ కూడా ఏడ్వడాన్ని ప్రొఫెసర్‌ సిన్హా తన టేబుల్‌ మీద నుంచి గమనించాడు. ‘ఏ దేవుడు వరం ఇవ్వకపోతేనో అమ్మాయిలు ప్రేమలో పడతారు’ అనుకున్నాడు. అమ్మాయి చేతిలోని శుభలేఖను చూస్తూ భోరుమంటున్నాడు అబ్బాయి. సిన్హా భారంగా ఒక నిట్టూర్పు విడిచాడు. నేనేం చేయగలను అనుకున్నాడు. అబ్బాయి ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. అమ్మాయి ఏడుపును ఆపుకుంటోంది. సిన్హా కళ్లు కూడా వర్షించడానికి సిద్ధం అవుతున్నాయి. మళ్లొకసారి కర్చీఫ్‌ తియ్యబోతుండగా.. పెద్ద అరుపు వినిపించింది.

అబ్బాయి ఏడుపు అకస్మాత్తుగా.. కోపంగా మారిపోయింది! ‘‘వెళ్లిపో ఇక్కణ్ణుంచి. జీవితంలో మళ్లీ నాకు కనిపించకు స్విగ్గీ. కనిపించకు’’ అని ఊగిపోతున్నాడు అబ్బాయి. శ్రీగంధ కళ్లు తుడుచుకుంటూ కుర్చీలోంచి పైకి లేచింది. అతడి భుజాలను ప్రేమగా తాకింది. గట్టిగా విదిలించుకున్నాడు. ‘నన్ను క్షమించు విక్కీ’ అంది. అతడు పట్టించుకోలేదు. ప్రొఫెసర్‌ సిన్హా ఇదంతా మౌనంగా గమనిస్తున్నాడు. ‘నన్ను డిస్ట్రర్బ్‌ చెయ్యకు.. వెళ్లిపో’ అన్నట్లు అబ్బాయి టేబుల్‌పై తల వాల్చుకున్నాడు. అమ్మాయి మెల్లిగా డోర్‌ తెరుచుకుని బయటికి వెళ్లిపోయింది. డోర్‌ అద్దాల్లోంచి ఆ అమ్మాయినే చూస్తున్నాడు ప్రొఫెసర్‌ సిన్హా.చూస్తూ.. చూస్తూ ఒక్కసారిగా హతాశుడయ్యాడు సిన్హా.‘రేయ్‌.. గాడిదా! లేవరా.. అమ్మాయి నీకోసమే వచ్చిందిరా.. లేవరా..’’ అని అబ్బాయి వైపు చూసి పెద్దగా అరుస్తున్నాడు. వాడికి వినపడినట్లు లేదు! ‘‘రేయ్‌.. నిన్నొదిలి వెళ్లలేకేరా తను వెళ్లిపోయిందీ’’ అంటున్నాడు. అయినా వాడు వినడం లేదు. సిన్హా మళ్లీ అద్దాల్లోంచి ఆ అమ్మాయి వైపు చూశాడు. వెనక్కు తిరిగైనా చూడకుండా వెళ్లిపోతోంది. ‘పాపం.. ఎంత క్షోభ పడుతోందో’ అనుకున్నాడు ప్రొఫెసర్‌ సిన్హా. ఆమెను కాళ్లు నడిపించడం లేదు. ఆమె కాళ్లసలు భూమినే తాకడం లేదు. 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Tags: 
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top