
బొమ్మా... బొరుసూ
నలభై రోజుల అయ్యప్ప దీక్ష అనంతరం గురుస్వామితో కలిసి ఒక యువకుడు శబరిమలై బయలుదేరాడు. వారు పంబా నదిలో స్నానం చేసి కొండ ఎక్కే సమయంలో భోరున వర్షం ప్రారంభమయ్యింది. ‘‘ఈ వానకి నేను కొండ ఎక్కగలనా గురూజీ?’’ అని అడిగాడు ఆ యువకుడు.
గురుస్వామి నవ్వి ‘‘అంతా అయ్యప్ప చూసుకుంటాడు’’ అని బదులిచ్చాడు. మరికొంత దూరం నడిచిన యువకుడు ‘‘నావల్ల కావడం లేదు, డబ్బులిచ్చి డోలీలో వెళ్దాము’’ అన్నాడు. ‘‘వయసులో ఉన్నవాడివి. ఈ కొండ ఎక్కడం నీకు సాధ్యమవుతుంది. నువ్వు నడవడం కొనసాగిస్తే అంతా అయ్యప్ప చూసుకుంటాడు’’ అని ధైర్యం చెప్పాడు గురుస్వామి.
నడిచే ఓపికల్లేక ఆ యువకుడు ఓ చెట్టు కింద నిలబడి ‘‘దేవుడిని ఎవ్వరూ చూడలేదు కదా. అసలు దేవుడున్నాడా?’’ అని అడిగాడు యువకుడు. గురుస్వామి నవ్వి ‘‘కుడి కన్ను ఎడమ కన్నును చూడగలదా? ఎడమ కన్ను కుడి కన్నును చూడగలదా?’’ అని అడిగాడు. ‘‘అది సాధ్యం కాదు!’ అని గంట కొట్టినట్లు చెప్పాడు యువకుడు
.‘‘అలా చూడటం కుదరక, కుడి కన్ను లేదని ఎడమ కన్ను, ఎడమ కన్ను లేదని కుడి కన్ను అనుకోవడం సమంజసమా?’’ అని ప్రశ్నించాడు గురుస్వామి. ‘ఎలాంటి పరిస్థితుల్లోనూ కాదు!’’ అన్నాడు యువకుడు.
ఇంతలో వాన ఆగింది. సూర్యుడు ఆకాశంలోకి వచ్చాడు. ఆకాశంలో ఇంద్ర ధనుస్సు కనుల విందు చేసింది. మారు మాట్లాడకుండా యువకుడు గురుస్వామితో పాటు ‘స్వామీ శరణం, అయ్యప్ప శరణం’ అంటూ కొండ ఎక్కాడు. ఇద్దరూ పద్దెనిమిది మెట్లు ఎక్కి అయ్యప్ప దర్శనం చేసుకుని గుడి ముందరున్న రావిచెట్టు కింద చేరారు. ఇరుముడి సంచిలోని నెయ్యిని అయ్యప్ప అభిషేకానికి సమర్పించాలని సంచులు తెరిచారు. అందులోని బియ్యాన్ని, నెయ్యిని వేరు చేసే సమయంలో గురుస్వామి ‘‘అయ్యప్ప ఆదరణ దొరికిందా? అయ్యప్ప స్వామి నీకు కనిపించి తోడు వచ్చాడా?’’ అని అడిగాడు.
యువకుడు నవ్వి బియ్యంలో భక్తులు వేసి ఉన్న నాణేన్ని చూపిస్తూ ‘‘బొమ్మ లేదని బొరుసు, బొరుసు లేదని బొమ్మా అనుకుంటే కుదురుతుందా? రెండూ ఉంటేనే నాణెమవుతుంది. ఒక్కటే ఉంటే అది చెల్లని కాసు అవుతుంది. అలాగే, దైవం నీడ ఎల్లప్పుడూ మన వెంటే ఉంటుంది. కంటికి కనిపించకుండానే ఆపదల్లో సహాయం చేస్తుంది. అదేవిధంగా అయ్యప్ప నాతోనే ఉండి నన్ను కొండ ఎక్కించాడు’’ అని సమాధాన మిచ్చాడు. శిష్యుడు దారిలో పడ్డాడని గ్రహించి సంతోషించాడు గురుస్వామి. ఇద్దరూ అయ్యప్ప అభిషేకానికి నెయ్యి సమర్పించి శరణాలు పలుకుతూ కొండ దిగడం ప్రారంభించారు.
– ఆర్.సి.కృష్ణస్వామి రాజు