
అలయ్ బలయ్.. ఒక ఆలింగన వేడుక.. అందరం బాగుండాలనే ఆకాంక్ష.. కులమతాలకు అతీతంగా, పారీ్టలు, సిద్ధాంతాలు, భావజాల సంఘర్షణలను పక్కన పెట్టి ‘మనమంతా ఒక్కటే’ననే సమైక్యత భావన స్ఫూర్తిని అందజేసే పండుగ.. ఆనందోత్సాహాలతో చేసుకొనే దసరా ఉత్సవాలకు ముగింపు వేడుక.. సద్దుల బతుకమ్మ, దసరా వేడుకల మాదిరే అలయ్ బలయ్ కూడా తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచింది. తెలంగాణకే ప్రత్యేకమైన వంటకాలతో, సంస్కృతి, సంప్రదాయాలతో పాటు తెలంగాణ జన జీవితాన్ని ప్రతిబింబించే కళారూపాలకు వేదికగా నిలుస్తోంది. రెండు దశాబ్దాలుగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నారు.
ఈనెల 3వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 20వ సంవత్సర అలయ్‌బలయ్ ఉత్సవాలు జరుగుతాయి. ప్రస్తుత హర్యానా మాజీ గవర్నర్, బీజేపీ నేత బండారు దత్తాత్రేయ ఈ వేడుకలను 2005లో ప్రారంభించారు. ప్రతి సంవత్సరం దసరా మరుసటి రోజు ఘనంగా నిర్వహించే అలయ్ బలయ్ ఉత్సవాలకు ఆయన కూతురు బండారు విజయలక్ష్మి ఆరేళ్లుగా సారథ్యం వహిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది..
ఈ ఉత్సవం ‘మాయమైపోతున్న మనిషిని’ నిలబెట్టింది. ఆ మనిషి చుట్టూ అల్లుకున్న సామాజిక బంధాలకు, అనుబంధాలకు విలువనిచ్చింది. తెలంగాణ ఆత్మగౌరవానికి పట్టం కట్టింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు, ఉద్యమకారులు, రాజకీయ పారీ్టలు, నాయకులందరినీ ఒక్కతాటి మీదకు తెచ్చేందుకు అలయ్‌బలయ్ ఎంతో దోహదం చేసింది.
ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా, భారతీయ జనతా పార్టీ క్రియాశీలమైన నేతగా సుదీర్ఘమైన అనుభవం ఉన్న బండారు దత్తాత్రేయ పారీ్టలకు, సిద్ధాంతాలకు అతీతంగా అందరికీ ‘దత్తన్న’గా చేరువయ్యారు. ఆ సమైక్యతాభావాన్ని సంఘటితం చేయాలనేదే దత్తన్న ఆకాంక్ష కూడా.. అందుకే ప్రతి సంవత్సరం అలయ్ బలయ్ వేడుకల్లో పాల్గొనాలని ఆహ్వానిస్తూ కనీసం 10 వేల మందిని ఆయన సాధరంగా ఆహ్వానిస్తారు. మాన్యుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరినీ ఆయన స్వయంగా స్వాగతిస్తారు.
600 మందికి పైగా కళాకారులు..
అలయ్‌బలయ్ 20 ఏళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు బండారు విజయలక్ష్మి తెలిపారు. ఎనిమిది మంది సభ్యులతో కూడిన ఆలయ్‌బలయ్ కార్యనిర్వాహక కమిటీ నెల రోజులుగా ఈ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ఈ వేడుకలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన సుమారు 600 మందికి పైగా కళాకారులు తరలి వస్తారు. బతుకమ్మ, బోనాలు, పోతరాజులు, సదర్ ఉత్సవాలతో పాటు ఆదివాసీ, గిరిజన సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించనున్నారు.
ఈసారి వేడుకల్లో అతిథులకు వడ్డించేందుకు 85 రకాల తెలంగాణ ప్రత్యేక వంటకాలను సిద్ధం చేశాం. వెజ్, నాన్ వెజ్ వంటలతో పాటు వివిధ రకాల పిండివంటలు, స్వీట్లు వడ్డించనున్నాం. తెలంగాణకే ప్రత్యేకమైన అంబలి, జొన్న గట్క, సర్వపిండి, మలీదముద్దలు, తలకాయ, బోటి, మటన్, చికెన్‌లలో రకరకాల వెరైటీలతో పాటు పచ్చిపులుసు, రకరకాల ఆకుకూరలు, కూరగాయలతో చేసిన శాఖాహార వంటలను కూడా వడ్డించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
– బండారు విజయలక్ష్మి