
జైపూర్: ప్రియుడిని పెళ్లికి ఒప్పించేందుకు 600 కిలోమీటర్లు ప్రయాణించిన ఓ మహిళ… చివరికి శవమై కనిపించింది. ఈ విషాద కథపై నెటిజన్లు ‘అయ్యో పాపం..ప్రేమ కోసం అంత దూరం ప్రయాణించి చివరికి ప్రాణం పోగొట్టుకుందా?’ అంటూ నిట్టూరుస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం..రాజస్థాన్‌లోని ఝుంఝునుకు చెందిన ముఖేష్ కుమారి అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహించేది. పదేళ్ల క్రితం తన భర్తతో మనస్పర్ధలు రావడంతో కుమారి ఆమె భర్త నుంచి విడిపోయింది. ఈ క్రమంలో గతేడాది నవంబర్‌లో అదే రాష్ట్రంలోని బర్మార్‌లో టీచర్‌గా విధులు నిర్వహించే మనారామ్‌తో మెటాలో పరిచయం పెంచుకుంది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. సోషల్ మీడియాలో చాటింగ్, వాట్సాప్‌లో వీడియో కాలింగ్‌లతో ఏడాదిపాటు మునిగిపోయారు. చివరికి ఆ ప్రేమను పెళ్లిగా మారుద్దామని అనుకున్నారు.
ఈ నేపథ్యంలో పెళ్లికి ఒప్పించేందుకు ఝుంఝును నుంచి 600కిలోమీటర్ల దూరంలో ఉన్న మనారామ్‌ను కలిసేందుకు కుమారి కారులో బయలుదేరింది. మనారామ్ ఇంటికి చేరుకుని, అతని కుటుంబ సభ్యులకు వారి సంబంధం గురించి వివరించింది. దీంతో కుమారిపై మనారామ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తమ సమస్యను పరిష్కరించమని కోరుతూ స్థానిక పోలీసుల సాయం తీసుకున్నాడు.
ఆ తర్వాత సాయంత్ర రోజు అలా మాట్లాడుకుందాం పదా అంటూ కుమారిని బయటకు తీసుకుకెళ్లాడు మనారామ్. ఇద్దరు ఏకాంతంగా ఉండగా.. మనరామ్ ఓ రాడ్డుతో కుమారి తలపై మోదీ ప్రాణాలు తీశాడు. ఆనవాళ్లన్నీ ధ్వంసం చేశాడు. హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడు. కుమారిని కారు డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి ప్రమాదం జరిగిందని నమ్మేలా కారును సైడ్ కాలువలోకి పోనిచ్చాడు. ఇంటికి వచ్చి హాయిగా నిద్రపోయాడు(ఈ విషయం పోలీసుల దర్యాప్తులో తెలిపాడు). మరుసటి రోజు ఉదయం కుమారి రోడ్డు ప్రమాదానికి గురైందని పోలీసులకు సమాచారం ఇవ్వాలని తన తరుఫు లాయర్‌ను పురమాయించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. తొలుత బాధితురాలు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుందని పోలీసులు భావించారు.
అన్నీ కోణాల్లో కేసును దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కుమారి ప్రాణం తీసింది మనారామ్ అని నిర్ధారించుకున్నారు. కుమారి హత్య జరిగే సమయంలో నిందితుడు మనరామ్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండటం అనుమానం పోలీసులకు అతనిపై అనుమానం మొదలైంది. ఆ అనుమానంతో మనారామ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా.. అసలు విషయం భయట పడింది. కుమారిని హత్య చేసింది మనారామ్‌నేనని తేల్చారు. కుమారి మృతదేహాన్ని ఆమె కుటుంబసభ్యులకు అప్పగించారు.