breaking news
Online love
-
ఆన్లైన్ ప్రేమలు.. డేటింగ్ విత్ డిప్రెషన్!
ఆన్లైన్ ప్రపంచంలో ప్రేమలను వెతుక్కోవడం అంటే సముద్రంలో పారబోసుకున్న మంచినీళ్లను దోసిళ్లతో పట్టుకోవాలనుకోవడం లాంటిది. డిజిటల్ యుగంలో ప్రపంచం చిన్నదైనప్పటికీ మనుషుల మధ్య పెరుగుతున్న అంతరాలు ఒంటరితనం వైపుగా పయనిస్తున్నాయి. ఫలితంగా ఒంటరి మనసులు భావోద్వేగాల జడిని కనపడని వ్యక్తులతో పంచుకుంటున్నారు. డేటింగ్ యాప్‌లలో మహిళలు భాగస్వాముల కోసం వెతుకుతూ, వారితో మానసిక అనుబంధాలను పెంచుకొని, కొంతకాలానికి డిప్రెషన్‌కు గురవుతున్నారని, వారి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది అంటున్నారు మానసిక నిపుణులు. పెరుగుతున్న సమస్య... 35 ఏళ్లు దాటిన వసు (పేరుమార్చడమైనది) లక్షల వ్యాపారాన్ని సులువుగా నిర్వహించే స్టార్టప్‌ను రన్ చేస్తుంది. కానీ, మానసిక సంబంధాన్ని సరిగా నిర్వహించలేక డిప్రెషన్ బారిన పడింది. వసు తల్లి ఈ విషయాన్ని చెబుతూ ‘నా కూతురు సొంతంగా నిలదొక్కుకోవాలనే ఆలోచనతో పెళ్లి విషయంలో ఆలస్యం చేసింది. సెటిల్ అయ్యాక ఇక పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో డేటింగ్ యాప్‌లో ఒక అబ్బాయిని ఇష్టపడింది. అతను కూడా నా కూతురితో రోజూ ఆన్లైన్లో మాట్లాడుతుండేవాడు. ప్రేమిస్తున్నట్టు చెప్పాడు. కొన్నాళ్లు ఇద్దరూ చాటింగ్, వీడియో కాల్స్ చేసుకునేవారు. కానీ, కలవడానికి దూరంగా ఉండేవాడు. నా కూతురు అతనితో ఎమోషనల్‌గా అటాచ్ అయ్యింది. కానీ, ఆ అబ్బాయి సరైనవాడు అని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే, కలుద్దామంటే అతను చూడటానికి రావడం లేదు. నా కూతురిని అతని నుంచి దూరంగా ఉంచాలంటే ఏం చేయాలో తెలియట్లేదు’అనేది ఆమె ఆవేదన.‘వర్చువల్ ప్రపంచంలో ప్రేమలు వెతికేవారి సంఖ్య ఇటీవల బాగా పెరుగుతున్న ఈ సమయంలో కూతుళ్ల పట్ల తల్లుల ఆందోళన కూడా పెరుగుతోంది’ అంటున్నారు రిలేషన్షిప్ కౌన్సెలర్ డాక్టర్ మాధవీ సేథ్. ఈ విషయంలో కొన్ని సూచనలు చేస్తున్నారు. తెలివిగా వ్యవహరించాలి... ఈ రోజుల్లో తల్లులు చాలా తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే కూతుళ్లు బాగా చదువుకుంటూ, బిజినెస్ ఉమెన్‌గా నిలదొక్కుకుంటున్నవారున్నారు. వారికి తమ మంచి చెడులు బాగా తెలుసు. అందుకని, వాళ్లు చాటింగ్ చేయడాన్ని లేదా అబ్బాయితో మాట్లాడడాన్ని నిషేధిస్తే మీ మాట వినరు. నిఘా పెడితే మీ పై నమ్మకం కోల్పోతారు. నమ్మకాన్ని గెలుచుకోవడం ద్వారా మాత్రమే మీరు మీ కూతురిని అర్థం చేసుకోగలరు. సమయం ఇవ్వండి.. స్త్రీ ఎంతటి సమర్థత, విజయం సాధించినా ప్రేమ విషయంలో చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. కాబట్టి ఆమె అవతలి వ్యక్తి లోపాలను చూడలేదు. కానీ, తెలివిగా ఆమెకు నిజం చెప్పాలి. దీని కోసం మీరు మీ కుమార్తెతో సమయం గడపడం అవసరం. మొదట ఆమె ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటుందో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అవును అయితే ఆ విషయం గురించి ప్రేమగానే మాట్లాడాలి. అబ్బాయిని ఇంటికి పిలవమని, అతని తల్లిదండ్రులను కలవడానికి ప్లాన్ చేయమని చెప్పాలి. తర్వాత నెమ్మదిగా సాక్ష్యాధారాలతో ఆ అబ్బాయి గురించి నిజాలను కూతురికి చెప్పాలి. నిజానికి ఈ విషయాలు చెప్పాలంటే కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ‘ఆమె’ ఒంటరితనం ఫీలవుతుంది. ఆమెకు మీ ప్రేమపూర్వక మద్దతు అవసరం. ప్రతి పరిస్థితిలో మీరు ఆమెతో ఉన్నారని మీ కుమార్తెకు భరోసా ఇవ్వండి. వీలైతే మీ కూతురిని కొంతకాలం దూరంగా ఎక్కడికైనా తీసుకువెళ్లండి. దీనివల్ల ఆమె మానసిక స్థితిలో సానుకూలమైన మార్పులు చోటు చేసుకోవచ్చు. వర్చువల్ ప్రపంచం నుండి బయటకు రండి... ఆన్లైన్ ప్రేమ కోసం వెతుకుతున్న యువత వర్చువల్ ప్రపంచం నుండి బయటపడి జనంతో కలిసి΄ోవాలి. ఒకటి లేదా రెండు రోజులు ఆన్లైన్ చాటింగ్ అవతలి వ్యక్తి గురించి ఎక్కువ సమాచారాన్ని అందివ్వవు. డేటింగ్‌యాప్‌లలో మోసం జరిగే అవకాశాలు ఎక్కువ కాబట్టి వాస్తవ ప్రపంచంలో నిజమైన ప్రేమలను వెతుక్కోవాలి. ఒకరికొకరు పరస్పరం కలిసి మాట్లాడుకోవడంలో సాంత్వన ΄÷ందుతారు. ఇటువంటి వాటిలో మోసం, భయం ఉండవు. ప్రేమ సంబంధాలలో నమ్మకం ముఖ్యం. వర్చువల్... నిజాలు... లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ పరిశోధన ప్రకారం దాదాపు 70 శాతం మంది డేటింగ్ యాప్‌లలో భాగస్వాముల కోసం వెతుకుతున్న వ్యక్తులు డిప్రెషన్‌కు గురవుతున్నారనీ, అది వారి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతోందని తేలింది. ఈ రోజుల్లో వ్యక్తులు తరచుగా సంబంధాలను వదులుకోవడానికి చాలా త్వరపడుతుంటారు. ఎందుకంటే, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ ఆ దిశగా అన్వేషణ చేయడం కూడా ఇందుకు కారణం అవుతుంటుంది. కోవిడ్ లాక్డౌన్ మార్పులు కూడా ఈ స్థితికి బాగా కారణమైంది. ఇంటి నుండి పని మొదలు డేటింగ్ యాప్‌లో రొమాన్స్ చేయడానికి ఓ కొత్తమార్గాన్ని ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది. మరికొన్ని సూచనలు.. ∙ఒంటరిగా ఉండటం వల్ల కలిగే ప్రతికూలతలపై దృష్టి సారించే బదులు మీరు ఆనందించే అంశాలు, అది తెచ్చే స్వేచ్ఛపై దృష్టి పెట్టాలి ∙జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యం, అభిరుచులవైపు మనసును మళ్లించాలి. కుటుంబం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సామాజికంగా కలవాలి... ► ఆన్లైన్ డేటింగ్లో మరొక వ్యక్తి జీవితాన్ని, సంబంధాలను, వివరాలను ఎప్పటికీ తెలుసుకోలేరు. సోషల్ మీడియా ΄ోస్ట్‌లో సంతృప్తికరమైన సంబంధంలా కనిపించేది నిజ జీవితంలో చాలా భిన్నంగా కనిపించవచ్చు ► ఒంటరిగా ఉన్నప్పుడు వర్చువల్ మీట్–అప్‌లను కూడా స్నేహితులతోప్లాన్ చేయడం మంచిది ►వారానికి కొన్నిసార్లు మీ ప్రియమైన వారితో ఫోన్లో చాట్ చేసినా, ఆన్లైన్లో ఇంటరాక్ట్ అవుతున్నా మీ ఒంటరితనం అనే భావన దూరం అవుతుంటుంది ►స్వచ్ఛంద సేవ, స్థానిక స్పోర్ట్స్ క్లబ్‌లలో పాల్గొనడం, రీడర్స్ క్లబ్.. వంటివి ఏర్పాటు చేయడం వల్ల ఒంటరితనం దూరం అవడమే కాదు, మనసులో ఉన్న వ్యక్తులను కలుసుకునే అవకాశం కూడా దొరకవచ్చు ► జీవితం ఒక రేస్ కాదు. ఒక నిర్దిష్ట వేగంతో జీవితంలోని మైలురాళ్లను చేరుకోవాల్సిన అవసరం లేదు. అన్నింటికన్నా ముందు మీకు మీరే ప్రియమైనవారని గుర్తుచేసుకోండి. డేటింగ్ యాప్‌లలోనే కాదు మీ ఆసక్తులు, లక్ష్యాలు, విలువలు పంచుకునే ఒంటరి వ్యక్తులు మీ చుట్టూ పుష్కలంగా ఉన్నారనే విషయం గ్రహించాలి. – డాక్టర్ మాధవీ సేథ్, రిలేషన్షిప్ కౌన్సెలర్ -
ఆన్లైన్ ప్రేమలు అర్థం కావు
‘‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్టే ఉండదు. అదంతా పెద్ద ట్రాష్. ఈ ఆన్లైన్ ప్రేమలు ఎలా వర్కౌట్ అవుతాయో అస్సలు అర్థమే కాదు’’ అంటున్నారు కంగనా రనౌత్. ప్రేమలో తన అనుభవాల గురించి, ఆన్లైన్ ప్రేమల గురించి కంగనా మాట్లాడుతూ – ‘‘లైఫ్‌లో ఏం జరిగినా అదంతా మన మంచికే జరిగిందని భావిస్తాను. నేను పెళ్లి చేసుకుందాం అనుకున్న ప్రతిసారి అనుకోని కారణాల వల్ల అది జరగలేదు. ఇప్పుడనుకుంటాను.. ‘దేవుడా! థ్యాంక్యూ నన్ను ఆ సంఘటన నుంచి కాపాడినందుకు’. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఏంటో అర్థం కాదు. మనది ప్రేమ లేఖలు రాసే జనరేషన్ కాదు.. యూ ట్యూబ్ జనరేషన్. కానీ ఒక మనిషి గురించి తెలియకుండా, అతన్ని కలవకుండా ఆన్లైన్లో ఎలా ప్రేమించుకుంటారు? మన లైఫ్‌లో రిలేషన్షిప్స్ మీద కూడా ఇంటర్నెట్ ప్రభావం చూపించడం బాధగా ఉంది. మనందరం రోబోటిక్‌గా మారిపోయామేమో అనిపిస్తోంది. ఫ్యూచర్లో మనం కూడా మెకానికల్ అయిపోయి మెషిన్స్‌లా బిహేవ్ చేస్తామేమో అనిపిస్తోంది’’ అని పేర్కొన్నారామె. నిజమే.. కంగనా అన్నట్లు ఇంటర్నెట్ ప్రభావం ఈ జనరేషన్ మీద చాలా పడుతోంది. ఆన్ లైన్ ద్వారా మోసపోయిన వాళ్ల సంఖ్య ఎక్కువ అవుతోంది. ముఖ్యంగా ఇంటర్నెట్ ద్వారా ప్రేమలో పడేవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. -
ఫేస్ బుక్‌లో ఫేక్ లుక్ ! అమ్మాయిలూ జాగ్రత్త
ఆన్లైన్ ప్రేమలు, పెళ్లిళ్లు, మోసాలు, ఆత్మహత్యలు... ఇవన్నీ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విపరీతంగా పెరిగిపోయాయని సర్వేలు చెబుతున్నాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తితో పరిచయం, తరువాత కబుర్లు, ఆ పైన స్నేహం, అది కూడా అయ్యాక ప్రేమ మొదలు. అది ఏ కొందరినో పెళ్లి దాకా చేరుస్తుంటే, ఎందరినో మోసపోయేలా చేసి జీవితాలను చాలించేందుకు ప్రేరేపిస్తోంది. ఇలాంటి సంఘటనలను నివారించాలని, సైబర్ క్రైమ్రేట్ని తగ్గించాలని పోలీసులు ఎంతగా ప్రయత్నించినా జరగాల్సినవి జరిగిపోతూనే ఉన్నాయి. ఇటీవల అలహాబాద్‌కు చెందిన ఓ అమ్మాయి. భర్తను కోల్పోయి, బిడ్డతో బతుకుతోంది. ఆమెకు ఫేస్బుక్లో ఒక యువకుడితో స్నేహం ఏర్పడింది. అతడామెని ప్రేమిస్తున్నానన్నాడు. నమ్మింది. పెళ్లి చేసుకుంటానన్నాడు. వెళ్లింది. పెళ్లయితే చేసుకున్నాడు. కానీ ఓ రాత్రి ఆమె నగలు, డబ్బు తీసుకుని పరారయ్యాడు. పోలీసులు ఆరా తీస్తే తెలిసింది... అతగాడు అప్పటికి అలా ఎనిమిదిమంది మహిళలను మోసగించాడని. మంగుళూరుకు చెందిన మరో అమ్మాయి ఆన్లైన్లో ప్రేమించి, రిజిస్టరాఫీసులో పెళ్లాడి, అతడితో అమెరికా వెళ్లిపోయింది. కానీ అక్కడికెళ్లాక అతడు చిత్రహింసలు పెడితే పారిపోయింది. అక్కడి ఎంబసీ వారి సాయంతో స్వదేశానికి తిరిగొచ్చి పుట్టింటికి చేరింది. ఇలాంటివన్నీ చూశాకయినా జాగ్రత్తగా ఉండకపోతే ఎలా! ఎవరితోనూ మాట్లాడవద్దని చెప్పడం లేదు. స్నేహం చేయవద్దనీ అనడం లేదు. కానీ ఆ పరిచయానికి, స్నేహానికి హద్దులు ఏర్పరచాల్సిన అవసరం ఉంది. అందరూ చెడ్డవాళ్లే ఉంటారని కాదు. చెడ్డవాళ్లు కూడా ఉంటారని చెప్పడం. నిజంగా అతడి తోడు మీకు అవసరం అనుకుంటే... అసలతడు మీకు తోడవుతాడా, అందుకు తగిన అర్హతలు ఉన్నాయా అనేది ముందు తెలుసుకోండి. తరచు అతడిని కలవండి. మాట దగ్గర్నుంచి అన్నిటినీ పరిశీలించండి. మీ పెద్దవాళ్లకు, బంధువులకు అతడి గురించి చెప్పండి. ఎంక్వయిరీ చేయించండి. ఇంత చదివాను అంటే సర్టిఫికెట్స్ చూడండి. ఫలానా చోట చదివాను అంటే అక్కడ ఆరా తీయండి. అతడి తరఫు వాళ్లందరినీ కలిసి, మాట్లాడి, అన్నీ సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకున్నాకే నిర్ణయం తీసుకోండి. అతడేమనుకుంటాడో అని వెనకడుగు వేశారో... జీవితంలో మీరు ముందడుగు వేయలేరు.