
ఈశ్వరుడు అంటే ప్రభువు. పాలకుడు. ఎవరి ఆజ్ఞ ప్రకారం అన్నీ జరుగుతాయో, అందరూ నడుచుకొంటారో, అతడు ఈశ్వరుడు. మనుజేశ్వరుడు అంటే మనుషులకు రాజు. అలాగే లంకే శ్వరుడు, గణేశ్వరుడు, యక్షేశ్వరుడు ఇత్యాది ప్రయోగాలు. ఈశ్వరుడు అంటే శ్రేష్ఠత్వాన్ని సూచించే శ్రేష్ఠ వాచక పదం కూడా! మునీశ్వరుడు. యోగీశ్వరుడు. కవీశ్వరుడు.
ఒక ప్రాంతానికి ఒక మనుజేశ్వరుడున్నట్టే, ఈ జగత్తుకంతటికీ కూడా జగదీశ్వరుడైన ప్రభువు ఉంటాడని ఆస్తికుల విశ్వాసం. ‘ఎవ్వనిచే జనించు జగము, ఎవ్వని లోపల నుండు లీనమై, ఎవ్వనియందు డిందు, పరమేశ్వరు డెవ్వడు, మూలకారణం బెవ్వడు, ... వానిని... నే శరణంబు వేడెదన్’ అని భాగవతంలో గజేంద్రుడు అభివర్ణించి, ప్రార్థించిన పరమ ఈశ్వరుడు ఆయన. పౌరాణిక కథా సందర్భాలలో త్రిమూర్తులలో లయ కారకుడైన శివుడిని, ఈశ్వరుడు, మహేశ్వరుడు, పరమేశ్వరుడు (‘పార్వతీ పరమేశ్వరులు’) అని ప్రస్తావించటం చాలాచోట్ల కనిపిస్తుంది.
వేదాంతుల దృష్టిలో అయితే, ఈ బ్రహ్మాండంలో ఉన్న ఒకే ఒక్క సత్యమైన, శాశ్వతమైన, అనాద్యంతమైన ‘వస్తువు’ పరమాత్మ, లేక ‘పరబ్రహ్మ’. అది నిరాకారం, నిర్గుణం. కేవలం ‘సత్–చిత్–ఆనందం’. అయితే ఒక కళా కారుడిలో అంతర్లీనంగా అతడి సృజనశక్తి ఉన్నట్టు, పరమాత్మలో లీనమై ఆయన ‘మాయాశక్తి’ అనే సృజనశక్తిఉంది. కళాకారుడి సృజనశక్తి ప్రకటితమైతే, అది కళాకృతి అవుతుంది. పరమాత్మ మాయాశక్తి ప్రకటితమైతే, అదే అనేక వైవిధ్యాలూ, వైచిత్య్రాలూ, చరాచర ప్రాణులూ, అప్రాణులతో కూడిన సృష్టి. ఆ సృష్టిలో అణువణువులోనూ ఆయన సర్వవ్యాపిగా ఉంటాడు. ‘ఈశా వాస్యం ఇదం సర్వం’ అని ఉపనిషత్తు. ఆయనే ప్రతి ప్రాణిలోనూ అంతర్యా మిగా ఉండి, నడిపిస్తాడు. ‘ఈశ్వరః సర్వభూతానాం హృత్–దేశే, అర్జున!, తిష్ఠతి’ అని గీత. మాయాశక్తిని తన వశంలో ఉంచుకొని నడిపే పరమాత్మ ఈశ్వరుడు. ఈశ్వర మాయ వశంలో తను నడిచేవాడు జీవుడు. పరమేశ్వరుడి మాయాశక్తి ఆవిష్కృతమైతే, సృష్టి. అది మళ్ళీ ఆయనలోనే లీనమైపోతే, లయం!
– ఎం. మారుతి శాస్త్రి
చదవండి: World Rose Day.. నేపథ్యం ఇదీ!