
క్యాన్సర్‌కు ఆధునిక సేవలు
వ్యాధిని ముందుగా గుర్తిస్తేనే మేలు
నేడు వరల్డ్ రోజ్ డే
రాయవరం: క్యాన్సర్... ఈ వ్యాధి పేరు చెబితే చాలా మందికి ఒంట్లో వణుకు పుడుతోంది. ఈ వ్యాధి వస్తే చనిపోవడమే అనే అపోహ ప్రజల్లో ఉంది. గతంలో రాచపుండుగా పిలుచే ఈ క్యాన్సర్‌కు చికిత్స ఉండేది కాదు. వ్యాధిగ్రస్తులు మరణానికి రోజులు లెక్క బెట్టుకుంటూ గడిపేవారు. ప్రస్తుతం పరిస్థితి మారింది. ఆధునిక వైద్యం అందుబాటులోకి రావడంతో వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. క్యాన్సర్ ఉన్నవారిలో వ్యాధిపై ఉన్న భయాన్ని పోగొట్టి వారిలో మానసిక ధైర్యాన్ని నింపేందుకు ప్రతి ఏడాది ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబర్ 22న రోజ్ డే నిర్వహిస్తున్నారు.
వ్యాధికి కారణాలెన్నో..
ఓరల్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం పొగాకు ఉత్పుత్తుల వినియోగమే. సిగరెట్, బీడీ, చుట్ట, పాన్ పరాగ్, ఖైనీ, గుట్కా ఇలా ఏ రూపంలో పొగాకు తీసుకున్నా క్యాన్సర్ వస్తుంది. మద్యం తాగడం, వ్యాయామం చేయకపోవడం, ఆకు కూరలు తినకపోవడం, ఊరగాయ పచ్చళ్లు, కొవ్వు ఎక్కువగా ఉన్న మాంసాహారం తినడం, అధిక బరువు ఉండటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. సంతానం కలగని వారికి, అలాగే జీన్స్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశముంది. గర్భాశయ ముఖ క్యాన్సర్ వ్యాధి సుఖ వ్యాధుల వల్ల రావొచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే గర్భాశయ ముఖ వ్యాధి క్యాన్సర్‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది.
రోగులకు భరోసా..
ఎన్నడూ లేని విధంగా గత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాన్సర్ రోగులకు భరోసా కల్పించేలా సంస్కరణలు చేపట్టారు. క్యాన్సర్ రోగులకు భరోసా కల్పిస్తూ క్యాన్సర్ ప్రొసీజర్లు పెంచారు. ఆరోగ్యశ్రీ పథకంలో 2019 వరకూ క్యాన్సర్ రోగులకు 223 ప్రొసీజర్లు మాత్రమే చికిత్స అందిస్తుండగా, గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 648 క్యాన్సర్ ప్రొసీజర్లకు ఉచితంగా చికిత్స అందించడం ద్వారా రోగులకు ఊరట కల్పించింది.
అందుబాటులో వైద్య సేవలు : క్యాన్సర్‌కు ఆధునిక వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. కుటుంబంలో ఒకరికి వ్యాధి ఉంటే ఇతర సభ్యులకు వ్యాధి వచ్చే అవకాశం ఉందా లేదా నిర్ధారించేందుకు బీఆర్ సీఏ–1, 2 పరీక్షలు ఉన్నాయి. క్యాన్సర్ చికిత్సకు కీమో థెరఫీ, రేడియేషన్ థెరఫీ వంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. భయపడాల్సిన పనిలేదు. –పి.శ్రీనివాసన్, ప్రొఫెసర్ అండ్ హెచ్‌ఓడీ,రేడియేషన్ ఆంకాలజీ విభాగం,రంగరాయ వైద్య కళాశాల,కాకినాడ
స్క్రీనింగ్ పరీక్షలతో క్యాన్సర్‌కు చెక్
స్క్రీనింగ్ పరీక్షల ద్వారా క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చు. ముఖ్యంగా మహిళలు 45 ఏళ్లు దాటాక ప్రతి ఏడాది మెమో గ్రామ్ పరీక్ష చేయించుకోవాలి. 55 ఏళ్లు దాటిన వారు సీటీ స్కాన్, కొలనో స్కోపి చేయించుకోవాలి. తొమ్మిదేళ్ల నుంచి 11 ఏళ్లలోపు బాలికలకు, 45 ఏళ్లలోపు మహిళలకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ వేయించడం ద్వారా క్యాన్సర్‌ను నివారించవచ్చు. –సుమలత,నాన్ కమ్యూనికల్ డిసీజెస్‌కోనసీమ జిల్లా కోఆర్డినేటర్
వరల్డ్ రోజ్ డే నేపథ్యమిదీ
కెనడా దేశానికి చెందిన 12 ఏళ్ల మెలిండా రోజ్ అనే బాలిక 1994లో క్యాన్సర్ బారిన పడింది. అది కూడా చాలా అరుదైన బ్లడ్ క్యాన్సర్ కావడంతో, కొన్ని వారాల్లోనే బాలిక చనిపోతుందని వైద్యులు తెలిపారు. దీంతో రోజ్ తల్లిదండ్రులు చాలా బాధపడ్డారు. కానీ రోజ్ ఎటువంటి బాధ లేకుండా, భయపడకుండా ఆసుపత్రిలో ఉన్న రోగులకు గులాబీలు అందిస్తూ, వారికి కవితలు వినిపించి రోగుల్లో మానసిక ఉల్లాసాన్ని కలిగించింది. ఈ విధంగా ఆరు నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే రోగులను చిరునవ్వుతో పలుకరిస్తూ.. ఉత్తరాలు రాస్తూ వారిని ఆనందింపజేసి సెప్టెంబర్ 22న మరణించింది. రోజ్ జ్ఞాపకార్థం ఏటా రోజ్ డే నిర్వహిస్తున్నారు.